ప్రశ్నలు - జవాబులు
1. పట్టక వక్రీభవన గుణకం కనుక్కోవడానికి కావాల్సిన పరికరాల జాబితాను రాయండి. చిత్తుపటం గీసి ప్రయోగ విధానాన్ని వివరించండి. (AS 3) 4 మార్కులు
జ: ఉద్దేశం: పట్టక వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడం.
కావాల్సిన వస్తువులు: పట్టకం, తెల్లటి డ్రాయింగ్‌చార్ట్, పెన్సిల్, గుండు సూదులు, స్కేలు, కోణమాని.
నిర్వహణ పద్ధతి:
*» ఒక పట్టకాన్ని తీసుకుని దాని త్రిభుజాకార ఆధారం డ్రాయింగ్ చార్ట్‌పై ఉండే విధంగా అమర్చి, పట్టక ఆధారం చుట్టూ పెన్సిల్‌తో గీత గీసి పట్టకాన్ని తీసేయాలి.
»* త్రిభుజ భుజం PQ పై ఒక బిందువు Mను గుర్తించాలి. M వద్ద PQకు ఒక లంబాన్ని గీయాలి.
»* M నుంచి 30° కోణాన్ని గుర్తించి పరావర్తన కిరణాన్ని గీయాలి. ఆ కోణాన్ని పతన కోణం (i1) అంటారు.
»* పట్టకాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచి పతన కిరణం ABపై రెండు గుండు సూదులను గుచ్ఛాలి.
»* పట్టకం రెండో వైపు నుంచి గుండు సూదుల ప్రతిబింబాలతో C, D బిందువుల వద్ద రెండు గుండు సూదులను గుచ్ఛాలి.
»* రెండోసారి గుచ్ఛిన రెండు సూదుల గుర్తులను కలుపుతూ ఒక రేఖను గీయాలి. ఇది బహిర్గత కిరణం (i2) అవుతుంది.
»* పతన కిరణం, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగిస్తే అవి రెండు 'O' వద్ద ఖండించుకుంటాయి.
»* 'O' వద్ద ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని కొలిచి దాన్ని విచలన కోణం 'd'గా గుర్తించాలి.
»* పతన కోణాన్ని మార్చినప్పుడల్లా విచలన కోణం కూడా మారుతూ ఉంటుంది. 40°, 50°, 60°...పతనకోణాలతో ప్రయోగాన్ని తిరిగిచేసి ఆ విలువలను కింది పట్టికలో నమోదు చేయాలి.
»* పతన కోణాన్ని పెంచుతూ ఉంటే విచలన కోణం తగ్గుతూ ఒక కనిష్ఠ విలువను చేరి తిరిగి పెరుగుతుంది.
»* పతనకోణం(i1) ని X - అక్షం మీద, విచలన కోణం (d)ని Y - అక్షం మీద తీసుకుని పై విలువలతో గ్రాఫ్ గీసి దాని నుంచి కనిష్ఠ విచలన కోణం 'D' ను కనుక్కోవాలి.
* పతన కోణాన్ని పెంచుతూ ఉంటే విచలన కోణం తగ్గుతూ ఒక కనిష్ఠ విలువను చేరి తిరిగి పెరుగుతుంది.
* పతనకోణం(i1) ని X - అక్షం మీద, విచలన కోణం (d)ని Y - అక్షం మీద తీసుకుని పై విలువలతో గ్రాఫ్ గీసి దాని నుంచి కనిష్ఠ విచలన కోణం 'D' ను కనుక్కోవాలి.
* PQ, QRల మధ్య కోణాన్ని కొలిచి దాని పట్టక కోణం 'A'ను గుర్తించాలి.
* పట్టక కోణం 'A', కనిష్ఠ విచలన కోణం 'D' అయితే పట్టక వక్రీభవన గుణకం
2.
పై పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. (AS 4) 4 మార్కులు
i) పతన, బహిర్గత కిరణాలను గుర్తించండి.
జ: పతన కిరణం - AB
బహిర్గత కిరణం - CD
i) విచలన కోణం ఏది? విచలన కోణాన్ని ఏ విధంగా గుర్తిస్తారు?
జ: విచలన కోణం - d
పతన, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగిస్తే అవి రెండూ 'O' వద్ద ఖండించుకుంటాయి. 'O' బిందువు వద్ద ఈ రెండు కిరణాల మధ్య కోణం విచలన కోణం 'd' అవుతుంది.
iii) ఈ పట్టకం సమబాహు పట్టకం అయితే పట్టక కోణం ఎంత?
జ: ౬0o
iv) ABMNCD రేఖ దేన్ని సూచిస్తుంది?
జ: కాంతి కిరణ ప్రసార దిశను
3. సాధారణంగా దృష్టి దోషాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడతాయి? పట సహాయంతో వివరించండి. కటకాలను ఉపయోగించి దృష్టి దోషాలను ఎలా సవరిస్తారో వివరించండి. (AS1) 4 మార్కులు
జ: సాధారణంగా దృష్టి దోషాలు మూడు రకాలు. అవి:
1) హ్రస్వదృష్టి
2) దీర్ఘదృష్టి
3) చత్వారం
* కన్ను తన సర్దుబాటు సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోవడం వల్ల పై దృష్టి దోషాలు ఏర్పడతాయి.
హ్రస్వదృష్టి:
* కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇలాంటి దృష్టి దోషాన్ని హ్రస్వదృష్టి అంటారు.
* ఈ దోషం ఉన్న వ్యక్తులకు కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ. కంటే తక్కువ ఉంటుంది.
* దూరంగా ఉన్న వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది రెటీనాకు ముందు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
* హ్రస్వదృష్టి ఉన్నవారికి కొంతదూరం వరకు మాత్రమే వస్తువులు కనిపిస్తాయి. ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు (M) అంటారు.
సవరణ:
* గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు (M) కు స్పష్ట దృష్టి కనీస దూరం (L) మధ్యకు తీసుకురాగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువుగా పని చేస్తుంది.
* హ్రస్వదృష్టి లోపాన్ని తగిన నాభ్యంతరం ఉన్న పుటాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు.
దీర్ఘదృష్టి:»
* దీర్ఘ దృష్టి ఉన్న వ్యక్తులు దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. దగ్గర వస్తువులను చూడలేరు.
* దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తులకు కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
* దగ్గరి వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెందినప్పుడు రెటీనాకు ఆవల ప్రతిబింబం ఏర్పడుతుంది.
* దీర్ఘదృష్టి ఉన్న వ్యక్తులు కనిష్ఠ దూర బిందువు (H) దాటి ఉన్న వస్తువులను మాత్రమే చూడగలరు.
సవరణ:
* వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు. కాబట్టి కనిష్ఠ దూరబిందువు (H)కు, స్పష్టదృష్టి కనీస దూర బిందువు (L)కు మధ్య ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఏర్పరిస్తే ఆ వస్తువు కనిపిస్తుంది.
* దీర్ఘ దృష్టి లోపాన్ని తగిన నాభ్యంతరం ఉన్న ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి నివారించవచ్చు.
చత్వారం:
* సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గి కనిష్ఠ దూర బిందువు క్రమంగా దూరమై దగ్గర వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడాన్ని చత్వారం అంటారు. ఈ చత్వారాన్ని కుంభాకార కటకాన్ని వాడి నివారించవచ్చు.
* వయసు మళ్లడం వల్ల ఒక్కోసారి దూర వస్తువులు, దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవచ్చు.
సవరణ:
* చత్వారాన్ని సవరించడానికి ద్వినాభ్యంతరం ఉన్న కటకాలను ఉపయోగించాలి.
4. కిషోర్ కళ్లద్దాలు ధరించాడు. అతడిని మీరు చూసినప్పుడు అతడి కళ్ల పరిమాణం అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించింది.
i) అతడు వాడిన కటకం ఏ రకం? ii) ఆ దృష్టి దోషం ఏమిటి? (AS 1) 4 మార్కులు
జ: i) కళ్లద్దాలు ధరించిన కిషోర్‌ను చూసినప్పుడు అతడి కళ్లు, అసలు పరిమాణం కంటే పెద్దవిగా కనిపించాయి. కాబట్టి అతడు ఉపయోగించిన కటకం కుంభాకార కటకం. ఎందుకంటే కుంభాకార కటకం ద్వారా చూసినప్పుడు వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి.
ii) కిషోర్‌కు ఉన్న దృష్టిదోషం దీర్ఘ దృష్టి. ఈ దృష్టి దోషం ఉన్నవారు దూరపు వస్తువులను మాత్రమే చూడగలరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. దీనికి కారణం వస్తువుల ప్రతిబింబం రెటీనాకు వెనుక భాగంలో కేంద్రీకృతమవుతుంది. తగిన నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకాన్ని ఉపయోగించి ప్రతిబింబం రెటీనాపై పడేలా చేయవచ్చు.
5. పుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వదృష్టిని నివారించడాన్ని చూపే పటాన్ని గీయండి. (AS 5) 2 మార్కులు
జ:
6. తరగతి గదిలో ఇంద్రధనస్సు ఏర్పడే విధానాన్ని సూచించే ప్రయోగాన్ని వివరించండి. (AS 3) 4 మార్కులు
జ: ఉద్దేశం: ఇంద్రధనస్సును ఏర్పరచడం.
కావాల్సిన వస్తువులు: లోహపు ట్రే, సమతల దర్పణం, నీరు.
నిర్వహణ పద్ధతి: * ఒక లోహపు పళ్లాన్ని తీసుకుని దాన్ని నీటితో నింపాలి.
»* నీటి ఉపరితలంతో కొంత కోణం చేసే విధంగా ఒక సమతల దర్పణాన్ని నీటిలో ఉంచాలి.
»* ఈ అమరికకు కొంతఎత్తులో తెల్లటి కార్డుబోర్డును అమర్చాలి.
»* నీటి ద్వారా అద్దంపై పడేవిధంగా తెల్లని కాంతిని ప్రసరింపజేయాలి. ఇప్పుడు కార్డుబోర్డు మీద వేర్వేరు రంగులతో కూడిన ఇంద్రధనస్సు ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు.
7. ఆకాశం కొన్ని సందర్భాల్లో తెలుపు, మరికొన్ని సమయాల్లో నీలిరంగులో కనిపిస్తుంది. అలాగే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనికి కారణాలు వివరించండి. (AS1, AS6) 4 మార్కులు
జ: i) ఆకాశం కొన్ని సందర్భాల్లో తెలుపు రంగులో కనిపిస్తుంది: వేసవిలో అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నప్పుడు ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తుంది.
దీనికి కారణం.... వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలోకి నీటిఆవిరి చేరుతుంది. తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధికస్థాయిలో ఉంటాయి. ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలి రంగుకానివి) ఉన్న కాంతులను పరిక్షేపణం చేస్తాయి. N2, O2ల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనిపిస్తుంది.
ii) ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది: మన భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో వివిధ రకాల అణువులు, పరమాణువులు ఉంటాయి. వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే ఆకాశపు నీలి రంగుకు కారణం. ఈ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
iii) సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు: సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడి నుంచి వెలువడే కాంతి మన కంటికి చేరడానికి భూవాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది, కాంతి కంటికి చేరేలోపే కనుమరుగవుతాయి. ఎరుపు రంగు కాంతి తక్కువ పరిక్షేపణ చెందడం వల్ల అది మన కంటిని చేరుతుంది. ఫలితంగా సూర్యుడు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఎరుపుగా కనిపిస్తాడు. మధ్యాహ్న వేళలో కాంతి ప్రయాణించే దూరం తక్కువ కాబట్టి కాంతి పరిక్షేపణ తక్కువగా ఉండి అన్ని రంగులు మన కంటిని చేరతాయి. దాంతో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు.
8. ఆకాశంలో ఇంద్రధనస్సుని చూసినప్పుడు చాలా సందర్భాల్లో అది అర్ధ వృత్తాకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకో వివరించండి. (AS 1) 4 మార్కులు
జ:
ఇంద్రధనస్సు అనేది మనకు కనిపించే విధంగా ఉండే పలుచని ద్విమితీయ చాపం కాదు. ఇంద్రధనుస్సు అనేది మన కంటి వద్ద తన కొనభాగాన్ని కలిగి ఉన్న త్రిమితీయ శంకువు. మీ వైపుగా కాంతిని విక్షేపణం చేసే అన్ని నీటి బిందువులు, వివిధ పొరలతో శంకువు ఆకారంలో అమరి ఉంటాయి. కంటికి ఎరుపు రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు శంకువు బాహ్య పొరపై ఉంటాయి. దాని కింది పొరలో ఉన్న శంకువు ఉపరితలంపై నారింజ రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు ఉంటాయి. అదేవిధంగా పసుపు రంగును చేరవేసే శంకువు నారింజ రంగు కాంతిని చేరవేసే శంకువుకు కింద ఉండే పొరలో ఉంటుంది. ఇలా ఈ క్రమం అన్నింటి కంటే అంతరంలో ఉండే ఊదా రంగును చేరవేసే శంకువు వరకు కొనసాగుతుంది.
ఇంద్రధనస్సులో నీటి బిందువుల నుంచి వచ్చే కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తాయి. ఈ కోణం 60∘ కంటే తక్కువగా ఉంటే ఇంద్రధనుస్సును మొత్తం మనం చూడగలం కాని ఈ దృష్టి కోణం 60∘ కంటే ఎక్కువగా ఉంటే దానిలో కొంత భాగం మాత్రమే మనం చూడగలం. కాబట్టి చాలా సందర్భాల్లో అది అర్ధ వృత్తాకారంలో ఉన్నట్లు కనిపిస్తుంది.
9. కంటి ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్నా ప్రతిబింబం కంటిలోని రెటీనా పైనే ఏర్పడుతుంది. వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండటం ఎలా సాధ్యం? కటకాల వక్రీభవనం గురించి మీకున్న అవగాహనతో సమాధానం తెలపండి. (AS 1) 4 మార్కులు
జ: వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండాలంటే నాభ్యంతరం విలువ మారాల్సి ఉంటుంది. కంటి కటక నాభ్యంతరం మారితేనే వివిధ దూరాల్లో ఉన్న వస్తువులకు ప్రతిబింబ దూరం ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇది కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోగలిగితేనే సాధ్యమవుతుంది. కంటిలోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చు కోవడానికి దోహదపడతాయి. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది. అంటే కటకం నుంచి రెటీనాకు ఉన్న దూరానికి నాభ్యంతరం విలువ సమానమవుతుంది. అప్పుడు కంటిలోకి వచ్చే సమాంతర కిరణాలు రెటీనా పై కేంద్రీకృతమవడం వల్ల వస్తువును మనం చూడగలుగుతాం. దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది. రెటీనా పై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరి కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి.
10. మానవుడి కంటిలో ఐరిస్ విధి ఏమిటి? (AS 1) ఒక మార్కు
జ: కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతిని ఐరిస్ అదుపు చేస్తుంది.
11. మానవుడి కన్నులో దండాలకు, శంకువులకు మధ్య తేడాలు రాయండి. (AS 1) 2 మార్కులు
జ: దండాలు:
i) కాంతి తీవ్రతకు ప్రతి స్పందిస్తాయి.
ii) కాంతి తక్కువగా ఉన్నప్పుడు చూడలేం.
iii) విభిన్న రంగులను గుర్తించలేం.
శంకువులు:
i) రంగులకు స్పందిస్తాయి.
ii) కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు బాగా స్పందిస్తాయి.
iii) విభిన్న రంగులను గుర్తిస్తాయి.
12. రెటీనా మీద ఏర్పడే ప్రతిబింబ స్వభావాన్ని తెలపండి. (AS 1) ఒక మార్కు
జ: రెటీనా మీద ఏర్పడే ప్రతిబింబం తలకిందులుగా ఉంటుంది. ఇది అతి చిన్న, నిజ ప్రతిబింబం.
13. మన కంటిలో కటకం ఏ రకమైంది? (AS 1) ఒక మార్కు
జ: మన కంటిలోని కటకం కుంభాకార కటకం.
14. మధ్యాహ్న వేళలో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపించడు? (AS 6) ఒక మార్కు
జ: ఉదయం, సాయంత్రం వేళల కంటే మధ్యాహ్న సమయంలో వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ, కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందక పోవడం వల్ల అన్ని రంగులూ మన కంటిని చేరి, సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు.
15. కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం.. దృగ్విషయాలను వివరించండి. (AS 1) 2 మార్కులు
జ: i) కాంతి విక్షేపణం: తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని కాంతివిక్షేపణం అంటారు.
ఉదా: ఇంద్రధనస్సు ఏర్పడటం
ii) కాంతి పరిక్షేపణం: ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.
ఉదా: ఆకాశం నీలం రంగులో కనిపించడం.
సమస్యలు - సాధనలు
1. -50 సెం.మీ. నాభ్యంతరం ఉన్న కటకాన్ని ఒక బాలుడు ఉపయోగిస్తే అతడి దోషం, కటక సామర్థ్యం కనుక్కోండి. (AS 1) 2 మార్కులు
సాధన: నాభ్యంతరం -ve కాబట్టి కటకం పుటాకార కటకం. బాలుడు హ్రస్వదృష్టి దోషంతో బాధపడుతున్నాడు.
2. వైద్యుడు ఒక వ్యక్తికి 2D సామర్థ్యం ఉన్న కటకం వాడాల్సిందిగా సూచించాడు. అయితే నాభ్యంతరం ఎంత?(AS 1) 2 మార్కులు
సాధన: P = 2D
3. హ్రస్వదృష్టి ఉన్న వ్యక్తి కంటి ముందు దూరపు బిందువు 100 సెం.మీ. వద్ద ఉంది. ఈ దృష్టి దోషాన్ని సవరించడానికి వాడే కటకాన్ని, దాని సామర్థ్యాన్ని కనుక్కోండి. (AS1) 4 మార్కులు
సాధన: హ్రస్వదృష్టి దోషాన్ని సవరించడానికి వాడే కటకం పుటాకార కటకం.
u = ∞
v = - 100 సెం.మీ.
f = ?
4. ఒక కటక సామర్థ్యం + 1.5 D అయితే ఆ కటకం ఏ రకానికి చెందింది? దాని నాభ్యంతరాన్ని కనుక్కోండి. (AS1) 2 మార్కులు
సాధన: P = +1.5 D
కటక సామర్థ్యం ధనాత్మకం కాబట్టి కుంభాకార కటకం
5. కంటి కటకం కనిష్ఠ, గరిష్ఠ నాభ్యంతరాలు ఎంత? వాటిని ఎలా కనుక్కుంటారు?(AS1) 4 మార్కులు
సాధన: కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం 2.5 సెం.మీ., కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ.
i) వస్తువు అనంతదూరంలో ఉన్నప్పుడు
u = -∞
v = 2.5 సెం.మీ.
ii) కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకుందాం. అప్పుడు
u = -25 సెం.మీ.
v = 2.5 సెం.మీ.
6. ఒక వ్యక్తి -2.5 D సామర్థ్యం ఉన్న కటకాన్ని ఉపయోగిస్తే అతడి దృష్టి దోషం ఏమిటి? గరిష్ఠ దూర బిందువును కనుక్కోండి. (AS1) 4 మార్కులు
సాధన: P = -2.5 D
-ve గుర్తు హ్రస్వదృష్టిని తెలియచేస్తుంది.
7. దీర్ఘదృష్టి దోషంతో బాధపడుతున్న వ్యక్తి కనిష్ఠ దూరం 75 సెం.మీ. అతడు 25 సెం.మీ. దూరంలోని పేపరు చదవడానికి ఎంత సామర్థ్యం ఉన్న కటకాన్ని ఉపయోగించాలి?(AS 1) 2 మార్కులు
సాధన: u = - 25 సెం.మీ.
v= -75 సెం.మీ.
8. పట్టక కోణం A = 60°, కనిష్ఠాతిక్రమణ కోణం 30° అయితే పట్టకం వక్రీభవన కోణం ఎంత?(AS 1) 2 మార్కులు
సాధన: A = 60°
D = 30°
మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు
1. మానవుడి కన్ను ఏ నియమంపై ఆధారపడి పని చేస్తుంది? (AS1) ఒక మార్కు
జ: దృష్టి ప్రతిస్పందన
2. సాధారణ మానవుల స్పష్టదృష్టి కనీస దూరం ఎంత?(AS1) ఒక మార్కు
జ: 25 సెం.మీ.
3. 10 ఏళ్లలోపు పిల్లల స్పష్టదృష్టి కనీస దూరం ఎంత?(AS1) ఒక మార్కు
జ: 7 నుంచి 8 సెం.మీ.
4. వృద్ధుల స్పష్టదృష్టి కనీస దూరం ఎంత?(AS1) ఒక మార్కు
జ: ఒకటి నుంచి రెండు మీటర్లు
5. ఆరోగ్యవంతుడి దృష్టి కోణం ఎంత?(AS1 ) ఒక మార్కు
జ: 60º
దృష్టి కోణం ఆధారంగా పటంలోని పరిశీలనలను తెలపండి. (AS4) ఒక మార్కు
జ: i) A' B' అసంపూర్తిగా కనిపిస్తాయి.
ii) AB, CDలు పూర్తిగా కనిపిస్తాయి.
7. దృష్టికోణం విలువ 60ºల కంటే తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?(AS2) ఒక మార్కు
జ: ఆ వస్తువు మొత్తాన్ని మనం చూడగలం.
8. దృష్టికోణం విలువ 60ºల కంటే ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?(AS2) ఒక మార్కు
జ: ఆ వస్తువులో కొంత భాగాన్ని మాత్రమే మనం చూడగలం.
9. కనుగుడ్డుకు ఉండే రక్షణ పొర ఏది?(AS1) ఒక మార్కు
జ: కార్నియా
10. కంటిలోకి చేరే కాంతిని నియంత్రించే భాగం ఏది?(AS1) ఒక మార్కు
జ: ఐరిస్
11. మనకు కంటిలో కనిపించే రంగు ప్రాంతం ఏది?(AS1) ఒక మార్కు
జ: ఐరిస్
12. కనుపాప నలుపు రంగులో ఎందుకు కనిపిస్తుంది? (AS1) ఒక మార్కు
జ: కనుపాపపై పడిన కాంతి కంటి లోపలికి వెళ్లి దాదాపు ఎలాంటి మార్పు లేకుండా బయటకు వస్తుంది. అందువల్ల కనుపాప నలుపు రంగులో కనిపిస్తుంది.
13. కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్య దూరం ఎంత? (AS1) ఒక మార్కు
జ: 2.5 సెం.మీ.
14. కంటిలోని కటక నాభ్యంతరాన్ని మార్చేందుకు దోహదపడే భాగం ఏది? (AS1) ఒక మార్కు
జ: సిలియరి కండరాలు
15. కంటి కటక నాభ్యంతరాన్ని తగిన విధంగా మార్పు చేసుకునే పద్ధతిని ఏమంటారు? (AS1) ఒక మార్కు
జ: సర్దుబాటు
16. కంటిలోని రెటీనాపై ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: నిజ, తలకిందుల ప్రతిబింబం
17. రెటీనా తెరలోని దండాలు, శంకువుల విధులు ఏమిటి? (AS1) ఒక మార్కు
జ: దండాలు కాంతితీవ్రతను, శంకువులు రంగులను గుర్తిస్తాయి.
18. మానవుడి కంటి కటక గరిష్ఠ, కనిష్ఠ నాభ్యంతరాలను తెలపండి. (AS1) ఒక మార్కు
జ: fగరిష్ఠ = 2.5 సెం.మీ.
fకనిష్ఠ = 2.27 సెం.మీ.
19. కంటి కటక గరిష్ఠ నాభ్యంతరం విలువ 2.5 సెం.మీ. కంటే తక్కువైతే ఏం జరుగుతుంది? (AS2) ఒక మార్కు
జ: హ్రస్వ దృష్టి దోషం ఏర్పడుతుంది.
20. కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం విలువ 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది? (AS2) ఒక మార్కు
జ: దీర్ఘ దృష్టి దోషం ఏర్పడుతుంది.
21. ఒక వ్యక్తికి వయసు పెరగడం వల్ల కలిగే దృష్టి దోషం ఏమిటి?(AS1) ఒక మార్కు
జ: చత్వారం
22. చత్వారాన్ని ఎలా సవరిస్తారు? (AS1) ఒక మార్కు
జ: ద్వినాభ్యంతర కటకాన్ని వాడటం ద్వారా సవరిస్తారు.
23. పట్టక వక్రీభవన గుణకాన్ని కనుక్కునే ప్రయోగంలో ఏ సందర్భంలో ∠i1, ∠i2 లు సమానమవుతాయి? (AS1) ఒక మార్కు
జ: కనిష్ఠ విచలన కోణం ఏర్పడే సందర్భంలో.
24. పట్టక వక్రీభవన గుణకాన్ని కనుక్కునే ప్రయోగంలో ఏ జాగ్రత్తలను తీసుకోవాలి? (AS3) ఒక మార్కు
జ: i) గుండు పిన్నులన్నీ ఒకే ఎత్తులో ఉండాలి.
ii) గుండు పిన్నులను పరిశీలించేటప్పుడు పారాలాక్స్ దోషం లేకుండా జాగ్రత్త వహించాలి.
iii) ప్రయోగం చేసేటప్పుడు పట్టకం కదలకుండా చూడాలి.
25. తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? (AS1) ఒక మార్కు
జ: కాంతి విక్షేపణం
26. 'కాంతి కిరణం ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎన్నుకుంటుంది' అని తెలిపే నియమం ఏది?(AS1) ఒక మార్కు
జ: ఫెర్మాట్ సూత్రం
27. VIBGYORలో తక్కువ వక్రీభవన గుణకం ఉన్న రంగు ఏది? (AS1) ఒక మార్కు
జ: ఎరుపు
28. నీటి బిందువుల ద్వారా ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?(AS1) ఒక మార్కు
జ: వక్రీభవనం, కాంతి విక్షేపణం చెందడం, సంపూర్ణాంతర పరావర్తనం.
29. నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకి వెళ్లే కిరణాల మధ్య కోణం ఎంత ఉన్నప్పుడు ఊదా రంగు ఏర్పడుతుంది?(AS1) ఒక మార్కు
జ: 40º
30. నీటి బిందువులోకి ప్రవేశించే, బయటకు వెళ్లే కిరణాల మధ్య కోణం 42º ఉన్నప్పుడు మనకు కనిపించే రంగు ఏది? (AS1) ఒక మార్కు
జ: ఎరుపు
31.
పై పటం దేన్ని సూచిస్తుంది? (AS5) ఒక మార్కు
జ: కాంతి పరిక్షేపణం
32. వాతావరణంలోని ఏ అణువుల కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది? (AS6) ఒక మార్కు
జ: N2, O2
33. పట్టక వక్రీభవనాన్ని కనుక్కునే ప్రయోగంలో పతన కోణం, విచలన కోణంల మధ్య సంబంధాన్ని సూచించే గ్రాఫ్‌ను గీయండి. (AS5) 2 మార్కులు
34. కాంతి పరిక్షేపణంను సూచించే పటాన్ని గీయండి. (AS5) 2 మార్కులు
35. ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యుడికి అభిముఖంగానే ఏర్పడుతుందా? ఎందుకు?(AS1) 2 మార్కులు
జ: ఇంద్రధనస్సు ఎల్లప్పుడూ సూర్యుడికి అభిముఖంగానే ఏర్పడుతుంది. ఎందుకంటే నీటి బిందువుల్లోకి సూర్య కిరణాలు ప్రవేశించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.
36. కంటి నుంచి వస్తు దూరాన్ని పెంచినప్పుడు కంటిలోని ప్రతిబింబ దూరం ఏమవుతుంది? (AS2) 2 మార్కులు
జ: కంటి లోపల ప్రతిబింబ దూరం (కంటి కటకం, రెటీనాల మధ్య దూరం) స్థిరంగా ఉంటుంది. కాబట్టి కంటి నుంచి వస్తు దూరం పెరిగినా ప్రతిబింబ దూరం మారదు.
37. పట్టకం ద్వారా ఒకే రంగు ఉన్న కాంతిని పంపినప్పుడు అది విక్షేపణం చెందుతుందా? (AS2) 2 మార్కులు
జ: పట్టకం ద్వారా ఒకే రంగు ఉన్న కాంతిని పంపినప్పుడు అది విక్షేపణం చెందదు, కానీ విచలనం చెందుతుంది.
38. 'హ్రస్వ దృష్టి దోషం ఉన్న ఒక వ్యక్తి కళ్లజోడు లేకుండా దినపత్రికను చదివాడు' వ్యాఖ్యానించండి. (AS1) 2 మార్కులు
జ: పై వాక్యం సరైంది. ఎందుకంటే హ్రస్వ దృష్టి దోషం ఉన్న వ్యక్తులు కేవలం దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడలేరు.
39. హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టిల మధ్య ఉన్న భేదాన్ని తెలపండి. (AS1) 2 మార్కులు
జ: i) కొందరు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు కానీ దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇలాంటి దృష్టి దోషాన్ని హ్రస్వ దృష్టి అంటారు.
ii) కొందరు దూరంగా వస్తువులను చూడగలరు కానీ దగ్గరి వస్తువులను చూడలేరు. ఇలాంటి దృష్టి దోషాన్ని దీర్ఘ దృష్టి అంటారు.
40. ఒక వేళ వాతావరణం లేనట్లయితే ఆకాశం ఏ రంగులో కనిపించేది?(AS2) 2 మార్కులు
జ: వాతావరణం లేనట్లయితే సూర్యకాంతి పరిక్షేపణం జరగదు. కాబట్టి ఆకాశం నల్లగా (చీకటిగా) కనిపించేది.
41. సముద్రంలోని నీరు నీలి రంగులో కనిపించడానికి కారణం ఏమిటి?(AS1) 2 మార్కులు
జ: సముద్రంలోని నీటి అణువులు ఇతర రంగుల కాంతితో పోల్చినప్పుడు నీలం రంగు కాంతిని ఎక్కువగా పరిక్షేపణం చెందిస్తాయి. అందువల్ల సముద్రంలోని నీరు నీలిరంగులో కనిపిస్తుంది.