• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మానవుడి కన్ను - రంగుల ప్రపంచం

* మానవుడి కన్ను కాంతిని ఉపయోగించి మన చుట్టుపక్కల వస్తువులను చూసే సామర్థ్యాన్ని ఇస్తుంది.
* మానవ శరీరంలో అత్యంత విలువైన, సున్నితమైన భాగం కన్ను.
* దృష్టి ప్రతిస్పందన అనే నియమంపై ఆధారపడి మన కన్ను పనిచేస్తుంది.
* వస్తువులపై పడిన కాంతి పరిక్షేపనం చెంది మన కంటిని చేరడం వల్ల మనం వస్తువులను చూడగలుగుతాం. కంటిలో ఒక కటకం ఉంటుంది.
* మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా స్పష్టంగా ఒక వస్తువును చూడాలంటే ఆ వస్తువు కంటి నుంచి ఉండాల్సిన    కనీస దూరాన్ని స్పష్ట దృష్టి కనీస దూరం అంటారు. దీని విలువ సాధారణ కంటికి 25 సెం.మీ. ఉంటుంది.
* ఏ గరిష్ఠ కోణం వద్ద మనం వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని దృష్టికోణం అంటారు. ఆరోగ్యవంతుడి దృష్టి కోణం సుమారుగా 60º ఉంటుంది. ఇది వ్యక్తుల్లో వయసుకు అనుగుణంగా మారుతుంది.


మానవుడి కంటి నిర్మాణం

                 
*
 కనుగుడ్డు, కార్నియా, కటకం, నల్లగుడ్డు, ఐరిస్, నేత్రోదక ద్రవం, కనుపాప, సిలియారి కండరాలు కంటిలోని ముఖ్య భాగాలు.
కార్నియా: ఇది పారదర్శకత గల కనుగుడ్డు ముందు ఉండే కంటి భాగం. దీని ద్వారా కాంతి కంటి లోపలికి ప్రవేశిస్తుంది.
కటకం: ఇది కంటి మధ్యస్థ భాగం. దీనికి ప్రతిబింబాన్ని ఏర్పరిచే లక్షణం ఉంది.
ఐరిస్: నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య నల్ల గుడ్డు (ఐరిస్) అనే కండర పొర ఉంటుంది. ఇది కనుపాపను అదుపు చేస్తుంది.
క‌నుపాప: ఐరిస్ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు. కాంతి ప్రకాశం తక్కువ ఉన్నప్పుడు ఐరిస్ కనుపాపను పెద్దదిగా చేసి ఎక్కువ పరిమాణంలో కాంతి లోపలికి పోయే విధంగా చేస్తుంది. కాంతి ప్రకాశవంతంగా ఉన్న సందర్భాల్లో ఐరిస్ కనుపాపను సంకోచింపజేసి కాంతి ఎక్కువ పరిమాణంలో కంటి లోపలికి పోనివ్వకుండా అదుపు చేస్తుంది. ఈ విధంగా కంటి లోపలికి వెళ్లే కాంతిని నియంత్రించే ద్వారంలా పనిచేయడానికి కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది.
రెటీనా: ఇది ఒక పలుచని, సున్నితమైన పొర. ఇది కనుగుడ్డుకు వెనుకవైపున గోడకు ఆనుకుని ఉన్న పొర. దీనిపై వస్తు ప్రతిబింబాలు ఏర్పరిచి వాటిని మెదడకు సమాచారం అందిస్తుంది.
దృక్ నాడులు: ఇవి రెటీనా వద్ద ఉన్న సమాచారాన్ని మెదడుకు చేరవేసే నాడులు.
దండాలు: రెటీనాలో దండం ఆకారంలో ఉండే సున్నితమైన కణాలు. ఇవి రంగును గుర్తిస్తాయి.
శంకువులు: ఇవి రెటీనాలో శంకువు ఆకారంలో ఉండే సున్నిత కణాలు. ఇవి కాంతి సంకేతాలను గుర్తిస్తాయి.
సిలియారి కండరాలు: కంటి కటకాన్ని సరైన స్థానంలో ఉంచడానికి, కటక వక్రతా వ్యాసార్థాన్ని మార్చడానికి సిలియారి కండరాలు ఉపయోగపడతాయి.
సర్దుబాటు: రెటీనాపై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియారి కండరాలు కటక నాభ్యంతరాన్ని మారుస్తాయి. దీన్ని సర్దుబాటు అంటారు.
సాధారణ దృష్టి వ్యాప్తి: స్పష్ట దృష్టి కనీస దూరం (25 సెం.మీ.) నుంచి అనంతం వరకు ఉన్న దూరం.
కనిష్ఠ దూర బిందువు (H): ఏ కనిష్ఠ దూరం వద్ద ఉండే బిందువుకు అవతల గల వస్తువులను మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.
గరిష్ఠ దూర బిందువు (M): ఏ గరిష్ఠ దూరం వద్ద ఉన్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో, ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు అంటారు.
సర్దుబాటు సామర్థ్యం: కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని కటక సర్దుబాటు సామర్థ్యం అంటారు. సాధారణ కంటికి సర్దుబాటు సామర్థ్యం 4 డయాప్టర్లు ఉంటుంది.
సాధారణంగా దృష్టి దోషాలు మూడు రకాలు. అవి
(i) హ్రస్వ దృష్టి
(ii) దీర్ఘ దృష్టి
(iii) చత్వారం
హ్రస్వ దృష్టి: ఈ దృష్టి దోషం ఉండే వ్యక్తులు దగ్గరి వస్తువులను చూడగలరు. కానీ దూరంలో ఉండే వస్తువులను స్పష్టంగా చూడలేరు.
కారణం: ఈ లోపం ఏర్పడటానికి కారణం కటక నాభ్యంతరం తగ్గడం.
సవరణ: హ్రస్వ దృష్టి దోషాన్ని సవరించడానికి సరైన నాభ్యంతరం గల పుటాకార కటకాన్ని వాడాలి.
దీర్ఘదృష్టి: ఈ దృష్టి దోషం గల వ్యక్తులు దూరంలో ఉండే వస్తువులను స్పష్టంగా చూడగలరు. కానీ దగ్గరి వస్తువులను చూడలేరు.
కారణం: ఈ లోపం ఏర్పడటానికి కారణం కటక నాభ్యంతరం పెరగడమే.
సవరణ: దీర్ఘదృష్టి దోషాన్ని సవరించడానికి సరైన నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని వాడాలి.
చత్వారం: వయసుతో పాటు కంటి సర్దుబాటు సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టి దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపించవు.
కారణాలు: సిలియరి కండరాల బలహీనత, కంటి కటకాలు గట్టి పడటం లాంటి కారణాల వల్ల ఈ దోషం వస్తుంది.
సవరణ: ఈ దోషాన్ని సవరించడానికి ద్వినాభ్యాంతర కటకాన్ని ఉపయోగిస్తారు. దీనిలో పైభాగాన పుటాకార, కింది భాగాన కుంభాకార కటకాలు ఉంటాయి.
పట్టకం: ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుంచి వేరుచేసి ఉన్న పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు. కాంతి కిరణం పట్టకం ద్వారా వక్రీభవనం చెందిన తర్వాత పట్టకం భూమి వైపుకు వంగుతుంది.

                      

కాంతి విక్షేపణం: తెల్లని కాంతి వివిధ రంగులు (VIBGYOR)గా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. వేర్వేరు రంగులకు పట్టక వక్రీభవన గుణకం వేర్వేరుగా ఉండటం వల్ల ఇది ఏర్పడుతుంది.
 పతన కోణం, బహిర్గత కోణం, విచలన కోణం, పట్టక కోణం మధ్య సంబంధం
     A + d = i1 + i2
   
    
* నీలి రంగుకు తరంగదైర్ఘ్యం కనిష్ఠం, వక్రీభవన గుణకం గరిష్ఠం.
* ఎరుపు రంగుకు తరంగదైర్ఘ్యం గరిష్ఠం, వక్రీభవన గుణకం కనిష్ఠం.


ఇంద్రధనస్సు: వర్షం తుంపరల తర్వాత ఆకాశంలో కనిపించే సహజ వర్ణ పటాన్నే ఇంద్రధనస్సు అంటారు. కాంతి గోళాకార నీటి బిందువులపై పడినప్పుడు వక్రీభవనం, కాంతి విక్షేపం, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఏర్పడుతుంది. పరిశీలకుడు తన వెనుక సూర్యుడు ఉన్నప్పుడు ఇంద్రధనస్సును చూడగలడు.

          


* ఎరుపు రంగు కాంతిని చూడాలంటే ఆకాశంలో ఉన్న నీటి బిందువుల్లో ఎత్తులో ఉన్న వాటిని చూడాలి.
* సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువు వెనక్కి పంపించిన కాంతికి మధ్య కోణం 42º ఉన్నప్పుడు మనకు ఎరుపు రంగు కనిపిస్తుంది.
* ఆ కోణం 40º ఉంటే మనకు ఊదారంగు కాంతి కనిపిస్తుంది.
* ఆ కోణం 40º నుంచి 42º మధ్యలో ఉన్నప్పుడు VIBGYOR మిగిలిన రంగులు కనిపిస్తాయి.
* ఇంద్రధనస్సులో ఎరుపు రంగు పైన, ఊదారంగు కింద ఉంటాయి.
 

కాంతి పరిక్షేపణం: ఒక వస్తువు నుంచి కాంతి పరావర్తనం అన్ని వైపులా జరిగే దృగ్విషయాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.
* వాతావరణంలోని కణాలతో కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమ‌య సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
* దృగ్గోచర కాంతిలో ఎరుపు రంగు ఎక్కువ తరంగదైర్ఘ్యం, తక్కువ పరిక్షేపణం కలిగి ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్ సిగ్నళ్లలో ఎరుపు రంగును ఉపయోగిస్తారు.
* సముద్రంలో నీటి కణాలు నీలి రంగును పరిక్షేపణం చెందించడం వల్ల సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం