• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక

1) ఒకే రకమైన పరమాణువులతో నిర్మితమైన పదార్థాన్ని మూలకం అంటారు.


2) మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా అర్థం చేసుకోవడానికి వర్గీకరణ అవసరం.


3) పురాతన కాలంలో మూలకాలను లోహాలు, అలోహాలుగా వర్గీకరించారు.


4) భౌతిక, రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని మరింత సూక్ష్మంగా విభజించడానికి వీలు లేనట్లయితే దాన్ని మూలకం అంటామని రాబర్ట్ బోయిల్ (1661) నిర్వచించారు.


5) 18వ శతాబ్దం చివరి నాటికి లెవోయిజర్ కాలంలో 11 మూలకాలను కనుక్కున్నారు.


6) 1865 నాటికి దాదాపు 63 మూలకాలను కనుక్కున్నారు. 1940 నాటికి సహజ వనరుల నుంచి 91 మూలకాలను కనుక్కోగా, మరో 17 మూలకాలు కృత్రిమంగా తయారు చేశారు.


7) కృత్రిమ మూలకాలతోసహా ప్రస్తుతం 115కు పైగా మూలకాలను కనుక్కున్నారు.


8) మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ మూలకాలు, వాటి సమ్మేళనాలు, రసాయన సమీకరణాన్ని గుర్తుంచుకోవడం చాలా కష్టంగా మారింది. అందువల్ల శాస్త్రీయంగా మూలకాలను వర్గీకరించాల్సిన అవసరం ఏర్పడింది.


9) జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ హైడ్రోజన్ పరమాణువు ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, మిగిలిన మూలక పరమాణువులన్నీ హైడ్రోజన్ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడతాయని తెలిపాడు.


10) మూలకాల వర్గీకరణకు డాబరీనర్ త్రికసిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.


11) ఒకే ధర్మాలున్న 3 మూలకాల సముహాన్ని త్రికం అంటారు.


12) ప్రతి త్రికంలో మధ్య మూలకపు పరమాణు భారం, మొదటి, మూడో మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపుగా సమానం.


13) డాబరీనర్ త్రికాలు
          (i) Li(7), Na(23) K(39)
          (ii) Ca(40), Sr(87.5), Ba(137)
          (iii) Cl(35.5), Br(80), I(127)
          (iv) S(32), Se(78), Te(125)
          (v) Mn(55), Cr(52), Fe(56)


14) డాబరీనర్ త్రిక సిద్ధాంతం పరిమితులు
(i) మూలకాలన్నింటినీ డాబరీనర్ త్రికాలుగా అమర్చలేక పోయాడు.
(ii) ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులున్న మూలకాలకు వర్తించదు.
(iii) పరమాణు ద్రవ్యరాశిని కచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం నిలువలేక పోయింది.


15) మూలకాల వర్గీకరణకు న్యూలాండ్స్ అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు.


16) మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదటి, ఎనిమిదో మూలకాల ధర్మాలు ఒకే విధంగా ఉన్నాయని, ఇది సంగీతంలోని స్వరాలతో పోలి ఉందని న్యూలాండ్స్ ప్రతిపాదించాడు. దీన్నే న్యూలాండ్స్ అష్టక నియమం అంటారు.


17) న్యూలాండ్స్ మొదటి సారిగా మూలకాలకు పరమాణు సంఖ్యలను కేటాయించాడు.


18) న్యూలాండ్స్ మూలకాల పట్టికలోని లోపాలు
(i) న్యూలాండ్స్ ఒకే గడిలో రెండు మూలకాలను పొందుపరిచాడు.
ఉదా: కోబాల్ట్, నికెల్
(ii) పూర్తిగా భిన్నమైన ధర్మాలున్న కొన్ని మూలకాలను ఒకే గ్రూపులో అమర్చాడు.
ఉదా: Co, Ni, Pd, Pt, Ir లను వాటి ధర్మాలకు భిన్నంగా ఉన్న హాలోజన్ మూలకాలైన F, Cl, Br, I లతో పాటుగా అమర్చాడు.
(iii) న్యూలాండ్స్ పట్టిక 56 మూలకాలకు మాత్రమే పరిమితమైంది. కొత్తగా కనుక్కునే మూలకాలకు ఎలాంటి ఖాళీలను విడిచిపెట్టలేదు.


19) మెండలీవ్, లూథర్ మేయర్‌లు పరమాణు భారం ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశారు.


20) మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీన్నే మెండలీవ్ ఆవర్తన నియమం అంటారు.


21) మెండలీవ్ ఒకే గ్రూపులో ఉన్న మూలకాల సారూప్యతలను, వాటి ఉమ్మడి సంయోజకతల ఆధారంగా వివరించడానికి ప్రయత్నించాడు.


22) మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఉన్న 8 నిలువు వరుసలను గ్రూపులు అంటారు. వీటిని I నుంచి VIII వరకు రోమన్ సంఖ్యలతో సూచిస్తారు.


23) ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి.


24) ప్రతి గ్రూపును A, B అనే రెండు ఉప గ్రూపులుగా విభజించారు.


25) ఏదైనా ఉపగ్రూపులోని మూలకాలకు ఒకదానికొకటి రసాయన ధర్మాల్లో దగ్గరి సంబంధం ఉంటుంది.


26) IA గ్రూపు మూలకాలను (Li, Na, K, Rb, Cs) క్షార లోహాలు అంటారు.


27) IIA గ్రూపు మూలకాలను (Be, Mg, Ca, Sr, Ba) క్షార మృత్తిక లోహాలు అంటారు.


28) మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఉన్న అడ్డు వరుసలను పీరియడ్‌లు అంటారు.


29) మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఏడు పీరియడ్‌లు ఉన్నాయి. వీటిని 1 నుంచి 7 వరకు ఉండే అరబిక్ సంఖ్యలతో సూచిస్తారు.


30) ఒక పీరియడ్‌లో ఉన్న మూలకాలకు వాటి ధర్మాలు ఒకదానికొకటి తేడాగా ఉంటాయి.


31) మెండలీవ్ ఆవర్తన పట్టిక బెరీలియం, ఇండియం, గోల్డ్ లాంటి మూలకాల పరమాణు భారాలను సవరించడానికి ఉపయోగపడింది.


32) మెండలీవ్ ఆవర్తన పట్టికలో, విభిన్న ధర్మాలున్న మూలకాలను ఒకే గ్రూపులో ఉపగ్రూపు A, B లలో ఉంచారు.


33) మెండలీవ్ ఆవర్తన పట్టికలో 3 జతల మూలకాల క్రమాన్ని మార్చారు. వీటిని అసాధారణ జంటలు అంటారు.
     (i) టెల్లూరియం, అయోడిన్
     (ii) కోబాల్ట్, నికెల్
     (iii) ఆర్గాన్, పొటాషియం


34) మెండలీవ్ ఆవర్తన పట్టిక కొన్ని మూలకాల ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడింది.

ఊహించిన మూలకం తర్వాత కనుక్కున్న మూలకం
ఎకా - బోరాన్ స్కాండియం
ఎకా - అల్యూమినియం గాలియం
ఎకా - సిలికాన్ జెర్మేనియం

35) మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. దీన్నే ఆధునిక ఆవర్తన నియమం అంటారు.


36) ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాలను అమరిస్తే దాన్ని విస్తృత ఆవర్తన పట్టిక లేదా ఆధునిక ఆవర్తన పట్టిక అంటారు.


37) ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను గ్రూపులు, అడ్డు వరుసలను పీరియడ్‌లు అంటారు.


38) విస్తృత ఆవర్తన పట్టికలో 7 పీరియడ్‌లు, 18 గ్రూపులు ఉంటాయి.


39) మూలకం పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్‌ను భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దాని ఆధారంగా మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు.


40) 1, 2, 13, 14, 15, 16, 17 గ్రూపుల మూలకాల్లో బాహ్య కక్ష్య మాత్రమే అసంపూర్తిగా నిండి ఉంటుంది. వీటిని సాధారణ మూలకాలు అంటారు.


41) 18వ గ్రూపు మూలకాల్లో అన్ని కక్ష్యలు పూర్తిగా నిండి ఉంటాయి. వీటిని జడవాయువులు అంటారు.


42) 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గ్రూపుల మూలకాల్లో రెండు కక్ష్యలు అసంపూర్తిగా నిండి ఉంటాయి. వీటిని పరివర్తన మూలకాలు అంటారు.


43) మొదటి పీరియడ్‌లో 2 మూలకాలు; రెండో, మూడో పీరియడ్‌లో 8 మూలకాలు, నాలుగో, అయిదో పీరియడ్‌లో 18 మూలకాలు; ఆరో పీరియడ్‌లో 32 మూలకాలు, ఏడో పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది.


44) పరమాణు సంఖ్య 57(La) నుంచి 71(Lu) వరకు ఉన్న మూలకాలను లాంథనైడ్‌లు అంటారు.


45) పరమాణు సంఖ్య 89(Ac) నుంచి 103(Lw) వరకు ఉన్న మూలకాలను ఆక్టినైడ్‌లు అంటారు.


46) లాంథనైడ్‌లు, ఆక్టినైడ్‌లను ఆవర్తన పట్టికలో కింది భాగంలో ప్రత్యేకంగా సూచించారు.


47) ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాలను నాలుగు రకాలుగా విభజించారు.
        i) జడవాయువులు
        ii) ప్రాతినిధ్యమూలకాలు
        iii) పరివర్తన మూలకాలు
        iv) అంతర పరివర్తన మూలకాలు


48) He, Ne, Ar, Kr, Xe, Rnలు ఎలాంటి రసాయన చర్యలో పాల్గొనవు. కాబట్టి వీటిని జడవాయువులు అంటారు. జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం ns2np6. He ఎలక్ట్రాన్ విన్యాసం 1s2.


49) వేలెన్సీ కర్పరం అసంపూర్తిగా నిండి ఉన్న మూలకాలను ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ప్రాతినిధ్య మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ns1 నుంచి ns2np5 వరకు ఉంటుంది.


50) ns1, ns2 విన్యాసం ఉన్న మూలకాలను s - బ్లాక్ మూలకాలు అంటారు. ఇవి IA, IIA గ్రూపులో ఉంటాయి.


51) ns2np1 నుంచి ns2np5 వరకు ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకాలను p - బ్లాక్ మూలకాలు అంటారు. ఇవి IIIA, IVA, VA, VIA, VIIA గ్రూపులకు చెందుతాయి.


52) ns2(n - 1) d1 - 10ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకాలను పరివర్తన మూలకాలు అంటారు. వీటినే d - బ్లాకు మూలకాలు అంటారు.


53) ns2(n - 1) d0 లేదా 1 (n - 2) f1 - 14ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న మూలకాలను అంతర పరివర్తన మూలకాలు అంటారు. వీటినే f - బ్లాక్ మూలకాలు అంటారు.


54) బాహ్య కక్ష్యలో మూడు లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్‌లున్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తారు. బాహ్య కక్ష్యలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే మూలకాలను అలోహాలుగా పరిగణిస్తారు.


55) లోహాల, అలోహాల ధర్మాలకు మధ్యస్థ ధర్మాలున్న మూలకాలను అర్ధలోహలు అంటారు.


56) B, Si, As, Ge మూలకాలు అర్ధలోహలు.


57) s - బ్లాక్ మూలకాలన్నీ లోహాలు, కానీ p - బ్లాక్ మూలకాల్లో లోహాలు, అలోహాలు, అర్ధలోహలు ఉన్నాయి.


58) ఒక మూలకం సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటారు. దీన్ని హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి మూలకాల ఆధారంగా వివరిస్తారు.


59) సాధారణంగా హైడ్రోజన్ పరంగా మూలకం సంయోజకత, దాని సంప్రదాయ గ్రూపు సంఖ్యను తెలియజేస్తుంది. మూలకం ఉండే గ్రూపు సంఖ్య V లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మూలక సంయోజకతను లెక్కించడానికి 8 నుంచి గ్రూపు సంఖ్యను తీసివేయాలి. (రోమన్ సంఖ్యలనే పరిగణనలోకి తీసుకోవాలి).


60) సాధారణంగా ప్రతీ పీరియడ్ సంయోజకత 1తో ప్రారంభమై '0'తో అంతమవుతుంది.


61) బాహ్య కక్ష్యకు, కేంద్రకానికి మధ్య ఉండే దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు.


62) పరమాణు వ్వాసార్థాన్ని పైకో మీటర్లలో (pm) కొలుస్తారు.
      1 pm = 10-12 మీ.


63) గ్రూపులో పై నుంచి కిందకు పరమాణు పరిమాణం పెరుగుతుంది. దీనికి కారణం కొత్త కర్పరాల సంఖ్య పెరగడం.


64) పీరియడ్‌లో ఎడమవైపు నుంచి కిందకు పరమాణు పరిమాణం తగ్గుతుంది. దీనికి కారణం బాహ్య ఎలక్ట్రాన్‌లపై కేంద్రక ఆకర్షణ పెరగడం.


65) తటస్థ వాయు పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన కనీసపు శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం అంటారు.


66) ఒక పరమాణువు బాహ్య కక్ష్య నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి అంటారు.
         M(g) + IE1 M+(g) + e- (IE1 = మొదటి అయనీకరణ శక్తి)

 

67) ఏకమాత్ర ధనావేశం ఉన్న అయాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని ద్వితీయ అయనీకరణ శక్తి అంటారు.
      M+(g) + IE2
 M+2(g) + e- (IE2 = రెండో అయనీకరణ శక్తి)


68) అయనీకరణ శక్తిని కిలో జౌల్/మోల్ ప్రమాణాల్లో కొలుస్తారు.


69) మూలకం అయనీకరణ శక్తి కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
      (i) కేంద్రక ఆవేశం
      (ii) స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం
      (iii) ఆర్బిటాళ్ల చొచ్చుకు పోయే స్వభావం
      (iv) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం
      (v) పరమాణువు వ్యాసార్థం


70) కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ.


71) కేంద్రకానికి, వేలెన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్ష్యల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వేలెన్సీ ఎలక్ట్రాన్‌లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీన్నే స్క్రీనింగ్ ఫలితం లేదా పరివేశక (షీల్డింగ్) ప్రభావం అంటారు.


72) పరివేశక ప్రభావం పెరిగితే, అయనీకరణ శక్తి తగ్గుతుంది.


73) ఆర్బిటాళ్లు కేంద్రకం వైపుకు చొచ్చుకు పోయే వరుస క్రమం s > p > d > f


74) ఆర్బిటాళ్ల చొచ్చుకుపోయే స్వభావం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి పెరుగుతుంది.


75) ఏదైనా పరమాణువులో ఆర్బిటాళ్లు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. అలాంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న పరమాణువులకు అధిక అయొనైజేషన్ పొటెన్షియల్ విలువలు ఉంటాయి.


76) నైట్రోజన్‌కు సగం నిండిన p ఆర్బిటాళ్లు ఉండటం వల్ల దానికి అధిక స్థిరత్వం లభిస్తుంది. కాబట్టి నైట్రోజన్‌కు ఆక్సిజన్ కంటే అయనీకరణ శక్తి ఎక్కువ.


77) గ్రూపులో పై నుంచి కిందకు వెళ్లే కొద్దీ అయనీకరణ శక్మం తగ్గుతుంది. దీనికి కారణం పరమాణు పరిమాణం పెరగడం, బాహ్య ఎలక్ట్రాన్‌ల మీద కేంద్రక ఆకర్షణ తగ్గడం.


78) పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.


79) పీరియడ్‌లో ఎడమవైపు నుంచి కుడివైపుకు అయనీకరణ శక్మం పెరుగుతుంది. దీనికి కారణం పరమాణు పరిమాణం తగ్గడం, బాహ్య ఎలక్ట్రాన్‌లపై కేంద్రక ఆకర్షణ పెరగడం.


80) ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. మొదటి ఎలక్ట్రాన్‌ను చేర్చడం వల్ల విడుదలైన శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.

        M(g) + e- M-(g) + E1
       (M = మూలక పరమాణువు, E1 = మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ)

 

81) ఏక మాత్ర రుణావేశమున్న అయాన్‌కు రెండో ఎలక్ట్రాన్‌ను చేర్చినప్పుడు విడుదలైన శక్తిని రెండో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.
      M-(g) + e- M-2 + E2 (E2 = రెండో ఎలక్ట్రాన్ ఎఫినిటీ)


82) అయనీకరణ శక్తిపై ప్రభావం చూపే అంశాలన్నీ ఎలక్ట్రాన్ ఎఫినిటీపై కూడా ప్రభావం చూపుతాయి.


83) ఒక గ్రూపులో పై నుంచి కిందకు పరమాణు పరిమాణం పెరగడం, కేంద్రక ఆవేశం తగ్గడం వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది.


84) ఒక పీరియడ్‌లో ఎడమవైపు నుంచి కుడివైపుకు పరమాణు పరిమాణం తగ్గడం, కేంద్రక ఆవేశం పెరగడం వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరుగుతుంది.


85) క్లోరిన్ మూలకానికి అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది.


86) ఒక అణువులో ఒక పరమాణువు మరొక పరమాణువుతో సమష్టిగా పంచుకున్న ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షించే స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు.


87) మిల్లికాన్ అనే శాస్త్రవేత్త ఒక మూలకం రుణ విద్యుదాత్మకతను దాని అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల సగటుగా ప్రతిపాదించారు.


88) లైనస్ పౌలింగ్ రుణ విద్యుదాత్మకత విలువను బంధ శక్తుల ఆధారంగా లెక్కగట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు. హైడ్రోజన్ రుణ విద్యుదాత్మకత విలువను 2.20గా తీసుకుని, దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలను నిర్ణయించారు.


89) గ్రూపులో పై నుంచి కిందకు వెళ్లే కొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా తగ్గుతాయి. పీరియడ్‌లో ఎడమ నుంచి కుడికి పోయేకొద్దీ మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా పెరుగుతాయి.


90) అత్యధిక రుణ విద్యుదాత్మకత విలువలున్న మూలకం ఫ్లోరిన్ (F) కాగా, అత్యల్ప రుణ విద్యుదాత్మకత విలువలున్న స్థిర మూలకం సీజియం (Cs).


91) ఒక పరమాణువు ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ధన అయాన్‌గా మారే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత స్వభావం అంటారు.


92) లోహాలు ధన విద్యుదాత్మకత ఉన్న మూలకాలు.


93) లోహాలకు తక్కువ రుణ విద్యుదాత్మకత స్వభావం ఉంటుంది.


94) అలోహాలకు తక్కువ పరమాణు వ్యాసార్థాలు ఉండటం వల్ల వాటికి అధిక రుణ విద్యుదాత్మకత విలువలు ఉంటాయి.


95) ఒక గ్రూపులో పై నుంచి కిందకు లోహ స్వభావం పెరుగుతుంది, అలోహ స్వభావం తగ్గుతుంది.


96) ఒక పీరియడ్‌లో ఎడమవైపు నుంచి కుడివైపుకు లోహ స్వభావం తగ్గుతుంది, అలోహ స్వభావం పెరుగుతుంది.


97) Al, Si, Ge మూలకాలు అర్ధలోహలు.


98) మూలకాల ఆవర్తన ధర్మాలు పీరియడ్, గ్రూపులో మార్పు సరళి.

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం