• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కార్బన్ - దాని సమ్మేళనాలు

1. కార్బన్ ఒక అలోహం. ఇది ఆధునిక ఆవర్తన పట్టికలోని 14వ గ్రూపు లేదా IV A గ్రూపునకు చెందిన మూలకం. ఈ గ్రూపులోని మూలకాలు వాటి బాహ్య కర్పరంలో 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి.


2. కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2


3. కార్బన్ రుణ విద్యుదాత్మకత 2.5


4. ప్రతి కార్బన్ పరమాణువు ఉద్రిక్తస్థితిలో నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల అది నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది.


5. కార్బన్ పరమాణువు ఏర్పరచగలిగే బంధాలు కింది విధంగా ఉంటాయి.
i) హైడ్రోజన్,క్లోరిన్ లాంటి ఒకే మూలక పరమాణువులతో నాలుగుఏక సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది.

ii) వేర్వేరు మూలక పరమాణువులతో 4 ఏక బంధాలను ఏర్పరుస్తుంది.

iii) కార్బన్ పరమాణువు ఒక ద్విబంధం, రెండు ఏక బంధాలను కూడా ఏర్పరుస్తుంది.

iv) కార్బన్ పరమాణువు ఒక ఏక బంధం, ఒక త్రిబంధాన్ని కూడా ఏర్పరుస్తుంది.


v) CH2 = C = CH2 లో మాదిరి రెండు ద్విబంధాలను కూడా ఏర్పరుస్తుంది.
 

6. సంకరీకరణం అనే భావనను మొదట ప్రవేశపెట్టింది లైనస్ పౌలింగ్ (1931). ఒక పరమాణువులో దాదాపు సమాన శక్తి ఉన్న ఆర్బిటాళ్లు పునరేకీకరణం చెందడం ద్వారా అదే సంఖ్యలో శక్తి, ఆకృతి లాంటి ధర్మాల్లో సారూప్యత కలిగిన నూతన ఆర్బిటాళ్లు ఏర్పడటాన్నే సంకరీకరణం అంటారు.
 

7. కొత్తగా ఏర్పడిన ఆర్బిటాళ్లను సంకర ఆర్బిటాళ్లు అంటారు.


8. ఒక పరమాణువులోని ఒక s ఆర్బిటాల్, మూడు p ఆర్బిటాళ్లు కలిసి నాలుగు సర్వసమానమైన ఆర్బిటాళ్లు ఏర్పడటాన్ని sp3 సంకరీకరణం అంటారు. sp3 సంకర ఆర్బిటాళ్లు చతుర్ముఖి నాలుగు మూలల వైపు విస్తరించి ఉంటాయి. ప్రతి రెండు ఆర్బిటాళ్ల మధ్య కోణం 10928' గా ఉంటుంది.


9. మీథేన్‌లో ఉద్రిక్త స్థితిలో కార్బన్ పరమాణువు sp3 సంకరీకరణంలో పాల్గొంటుంది. కార్బన్ నాలుగు spసంకర ఆర్బిటాళ్లు నాలుగు హైడ్రోజన్ పరమాణువుల్లోని s- ఆర్బిటాళ్లతో అతిపాతం చెంది నాలుగు sp3 - s సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది.


10. మీథేన్ అణువుకు చతుర్ముఖి లేదా టెట్రాహైడ్రల్ ఆకృతి ఉంటుంది. బంధకోణం 109028' గా ఉంటుంది.

11. ఇథిలీన్ లేదా ఇథీన్ అణువులో ఉద్రిక్త స్థితిలో కార్బన్ పరమాణువులు sp సంకరీకరణంలో పాల్గొంటాయి. ప్రతి కార్బన్ పరమాణువులో మూడు sp2 సంకర ఆర్బిటాళ్లు, ఒంటరి ఎలక్ట్రాన్ ఉండే ఒక p ఆర్బిటాల్ ఉంటుంది.


12. ఇథిలీన్ అణువులో ఒక కార్బన్ పరమాణువులోని ఒక sp2ఆర్బిటాల్ మరొక కార్బన్ పరమాణువులోని ఒక sp2 ఆర్బిటాల్‌తో నేరుగా అతిపాతం చెంది sp- spసిగ్మా బంధం ఏర్పడుతుంది. మిగిలిన sp2 ఆర్బిటాళ్లు నాలుగు హైడ్రోజన్ పరమాణువుల్లోని s - ఆర్బిటాళ్లతో అతిపాతం చెంది నాలుగు sp2 - s సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. రెండు కార్బన్ పరమాణువుల్లోని ఒంటరి ఎలక్ట్రాన్ ఉండే రెండు p - ఆర్బిటాళ్లు పక్కగా అతిపాతం చెంది π బంధాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక ద్విబంధం ఏర్పడుతుంది. ఇథిలీన్ అణువుకు సమతల త్రికోణీయ ఆకారం, బంధకోణం 120గా ఉంటుంది.


13. ఒక పరమాణువులోని ఒక s  -ఆర్బిటాల్, ఒక p - ఆర్బిటాల్ కలిసి రెండు సర్వసమానమైన రెండు ఆర్బిటాళ్లు ఏర్పడే పద్ధతిని sp సంకరీకరణం అంటారు. sp సంకర ఆర్బిటాళ్లు ఒకే తలంలో ఉండి వాటి మధ్య కోణం 1800 గా ఉంటుంది.

14. ఎసిటిలీన్ లేదా ఇథైన్ అణువులో ఉద్రిక్త స్థితిలో కార్బన్ పరమాణువులు sp సంకరీకరణంలో పాల్గొంటాయి. ప్రతి కార్బన్ పరమాణువులో రెండు sp సంకర ఆర్బిటాళ్లు, ఒంటరి ఎలక్ట్రాన్‌లున్న రెండు p ఆర్బిటాళ్లు ఉంటాయి.


15. ఎసిటిలీన్ అణువులో ఒక కార్బన్ పరమాణువులోని ఒక sp ఆర్బిటాల్ మరొక కార్బన్ పరమాణువులోని ఒక sp ఆర్బిటాల్‌తో నేరుగా అతిపాతం చెంది sp - sp సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తుంది. కార్బన్ పరమాణువుల్లో మిగిలిన sp ఆర్బిటాళ్లు రెండు హైడ్రోజన్ పరమాణువుల్లోని s - ఆర్బిటాళ్లతో నేరుగా అతిపాతం చెంది రెండు sp - s సిగ్మా బంధాలను ఏర్పరుస్తాయి. సంకరీకరణం చెందని p - ఆర్బిటాళ్లు పక్కగా అతిపాతం చెంది కార్బన్ పరమాణువుల మధ్య రెండు π బంధాలు ఏర్పడతాయి. కాబట్టి రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక త్రికబంధం ఏర్పడుతుంది. ఎసిటిలీన్ అణువుకు రేఖీయ ఆకారం, బంధకోణం 1800 గా ఉంటుంది.


16. ఏదైనా ఒక మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తూ, రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యతను కలిగి ఉండి, భౌతిక ధర్మాల్లో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అంటారు. ఒక అణువులో పరమాణువుల అమరికలో తేడా వల్ల రూపాంతరాలు ఏర్పడతాయి.

17. కార్బన్ రూపాంతరాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
i) అస్ఫటిక రూపాలు ii) స్ఫటిక రూపాలు


18. బొగ్గు, కోక్, కలప చార్‌కోల్, జంతు చార్‌కోల్, నల్లని మసి, వాయురూప కార్బన్, పెట్రోలియం కోక్, చక్కెర చార్‌కోల్ లాంటివి కార్బన్ వేర్వేరు అస్ఫటిక రూపాంతరాలు.


19. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు మూడు. అవి:
i) వజ్రం
ii) గ్రాఫైట్
iii) బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్

 

20. వజ్రం, గ్రాఫైట్‌లు సంయోజక నిర్మాణాలు కాగా,నిర్ణీత దూరల్లో వేరు చేయబడి ఉన్న బక్‌మిన్‌స్టర్ ఫుల్లరిన్ అనేది C60 పరమాణువులతో ఏర్పడిన ఘన నిర్మాణం.


21. వజ్రంలోని ప్రతి కార్బన్ పరమాణువు ఉత్తేజిత స్థితిలో sp3 సంకరీకరణం ఏర్పడిన ఘన నిర్మాణం.

22. గ్రాఫైట్‌లో ప్రతి కార్బన్ పరమాణువు ఉద్రిక్త స్థితిలో sp2 సంకరీకరణంలో పాల్గొంటుంది.గ్రాఫైట్‌లో ద్విమితీయ నిర్మాణం ఉండే పొరలను కలిగి ఉంటుంది. గ్రాఫైట్‌లో పొరలు 3.35A దూరంలో వేరు చేయబడి ఉంటాయి.

23. ఫుల్లరిన్, C60 అణువు ఉపరితలంపై 12 పంచముఖ ఆకృతి, 20 షణ్ముఖ ఆకృతి ఉన్న ముఖాలను కలిగి ఉంటుంది. దీనిలో ప్రతి కార్బన్ పరమాణువు spసంకరీకరణంలో పాల్గొంటుంది.


24. కార్బన్ మరో రూపాంతరం నానోట్యూబులు లేదా నానో నాళాలు. వీటిని 1991లో సుమియోలీజిమ కనుక్కున్నారు.


25. సంయోజనీయ బంధాల్లో పాల్గొనే కర్బన పరమాణువుల షట్ముఖీయ అమరికల వల్ల నానోట్యూబులు ఏర్పడతాయి.


26. వోలర్ శాస్త్రవేత్త ప్రయోగశాలలో అకర్బనిక లవణమైన అమ్మోనియం సయనేట్‌ను వేడి చేయడం వల్ల యూరియా అనే కర్బన సమ్మేళనాన్ని తయారుచేశారు.


27. ఏదైనా మూలకం దానికి చెందిన పరమాణువుల మధ్య బంధాలను ఏర్పరచుకోవడం ద్వారా అతిపెద్దదైన అణువులను ఏర్పరిచే ధర్మాన్ని కాటనేషన్ లేదా శృంఖల ధర్మం అంటారు. కార్బన్‌కు C - C బంధశక్తి అధికంగా ఉండటం వల్ల కార్బన్ అత్యధిక కాటనేషన్ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది.


 28. కార్బన్ తన పరమాణువులతో పొడవైన శృంఖలాలను ఏర్పరుస్తుంది.
 

29. కార్బన్ i) ఎక్కువ సమ్మేళనాలను ఏర్పరుస్తుంది.
ii) కాటనేషన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
iii) వేర్వేరు రకాల బంధాలను ఏర్పరుస్తూ ఒక వైవిధ్యమైన మూలకంగా పరిగణించబడుతుంది.

 

30. కార్బన్, హైడ్రోజన్‌లను మాత్రమే కలిగి ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్‌లు అంటారు.


31. హైడ్రో కార్బన్‌లను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
i) వివృత శృంఖల హైడ్రో కార్బన్‌లు
ii) సంవృత శృంఖల హైడ్రో కార్బన్‌లు


32. కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలున్న హైడ్రోకార్బన్‌లను ఆల్కేన్‌లు అంటారు.


33. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం ఉన్న హైడ్రో కార్బన్‌లను ఆల్కీన్‌లు అంటారు.


34. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రిబంధం ఉన్న హైడ్రో కార్బన్‌లను ఆల్కేన్‌లు అంటారు.


35. కార్బన్ పరమాణువుల మధ్య ఏక బంధాలున్న హైడ్రో కార్బన్‌లను సంతృప్త హైడ్రో కార్బన్‌లు అంటారు.
ఉదా: ఆల్కేన్‌లు


36. కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం లేదా త్రిబంధం ఉన్న హైడ్రోకార్బన్‌లను అసంతృప్త హైడ్రోకార్బన్‌లు అంటారు.
ఉదా: ఆల్కీన్‌లు, ఆల్కైన్‌లు.


37. కర్బన పదార్థాల్లో కొన్ని ప్రత్యేక ధర్మాలను ప్రదర్శించే పరమాణువుల సమూహాన్ని ప్రమేయ సమూహం అంటారు.
 

38. కొన్ని ప్రమేయ సమూహాలు - వాటి సంకేతాలు


39. కర్బన సమ్మేళనాల శ్రేణుల్లోని వరుసగా ఉండే రెండు సమ్మేళనాలు -CH2 భేదంతో ఉంటే వాటిని సమజాత శ్రేణులు అంటారు.

ఉదా: CH4, C2H6, C3H...
 

40. సమజాత శ్రేణులకు కింది ప్రత్యేక ధర్మాలు ఉంటాయి.
i) ఇవి ఒక సాధారణ ఫార్ములాను కలిగి ఉంటాయి.
ii) వీటి శ్రేణుల్లో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య భేదం -CH2 ఉంటుంది.
iii) ఒక శ్రేణిలో ఒకే రకమైన ప్రమేయ సమూహం ఉండటం వల్ల వాటికి ఒకే రకమైన రసాయన ధర్మాలు ఉంటాయి.
iv) ఒకే శ్రేణిలో భౌతిక ధర్మాలు క్రమేపి మార్పు చెందుతాయి.


41. ఒక సమజాత శ్రేణికి చెందిన సమ్మేళనాలను సమజాతాలు లేదా సంగతాలు అంటారు.


42. ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములా CnH2n+2


ఉదా: మీథేన్ (CH4)
          ఈథేన్ (C2H6)
          ప్రోపేన్ (C3H8)
          బ్యూటేన్ (C4H10)
          పెంటేన్ (C5H12)

43. ఆల్కీన్‌ల సాధారణ ఫార్ములా CnH2n


ఉదా: ఈథీన్ (C2H4)
           ప్రోపీన్ (C3H6)
          బ్యూటీన్ (C4H8)
          పెంటీన్ (C5H10)


44. ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములా CnH2n-2 
ఉదా: ఈథైన్ (C2H2)
          ప్రొపైన్ (C3H4)
          బ్యూటైన్ (C4H6)
          పెంటైన్ (C5H8)


45. ఒకే అణు ఫార్ములా ఉన్న సమ్మేళనాలు వేర్వేరుధర్మాలను కలిగిఉండే దృగ్విషయాన్ని అణు సాదృశ్యం అంటారు.అణుసాదృశ్యాన్నిప్రదర్శించే సమ్మేళనాలను సాదృశ్యకాలు అంటారు.


46. నిర్మాణంలోని భేదం వల్ల ఏర్పడే అణుసాదృశ్యాన్ని నిర్మాణాత్మక అణుసాదృశ్యం అంటారు.


ఉదా: n - బ్యూటేన్, ఐసో బ్యూటేన్‌లు నిర్మాణాత్మక సాదృశ్యాలు.


47. IUPAC నామీకరణ విధానం ప్రకారం ఒక కర్బన సమ్మేళనం పేరులో మూడు భాగాలు ఉంటాయి.
అవి: 1) మూలపదం
        2) పూర్వపదం
        3) పరపదం


48. మూలపదం (Word root): ఒక అణువులోని కర్బన పరమాణువుల సంఖ్యను తెలిపే భాగాన్ని మూలపదం అని పిలుస్తారు.

 

49. పూర్వపదం (Prefix)అణువులో ప్రతిక్షేపించే సమూహాలను పూర్వపదం సూచిస్తుంది. పూర్వపదంలో ప్రాథమిక పూర్వపదం, ద్వితీయ పూర్వపదం, సంజ్ఞాత్మక పూర్వపదం, సంఖ్యాత్మక పూర్వపదం అనే భాగాలు ఉంటాయి.


50. ప్రాథమిక పూర్వపదం: ఇది చక్రీయ/వలయ/సైక్లిక్ సమ్మేళనాలను మాత్రమే సూచిస్తుంది.


51. ద్వితీయ పూర్వపదం: ఇది ప్రతిక్షేపకంగా పిలిచే రెండో స్థాయి ప్రమేయ సమూహాల గురించి తెలియజేస్తుంది.


52. సంజ్ఞాత్మక పూర్వపదం: ఒకే ప్రతిక్షేపకం లేదా బహుబంధాలు లేదా ప్రమేయ సమూహం రెండు సార్లు లేదా మూడు సార్లు పునరావృతమైతే దాన్ని తెలియజేయడానికి రాసే డై, ట్రై, టెట్రా....లను సంజ్ఞాత్మక పూర్వపదాలు అంటారు.


53. సంఖ్యాత్మక పూర్వపదం: ప్రతిక్షేపక సమూహాలు, బహుబంధాలు లేదా ప్రమేయ సమూహాలు ఏ కార్బన్‌కు జతచేసి ఉన్నాయో అనే విషయాన్ని సంఖ్యాత్మక పూర్వపదం సూచిస్తుంది.


54. పరపదం (Suffix): ఇది అణువులోని ప్రమేయ సమూహాలను సూచిస్తుంది. పరపదంలో ప్రాథమిక పరపదం, ద్వితీయ పరపదం; సంఖ్యాత్మక, సంజ్ఞాత్మక పరపదం అనే నాలుగు భాగాలు ఉంటాయి.


55. ప్రాథమిక పరపదం: ఇది సమ్మేళనం సంతృప్త స్వభావాన్ని తెలియజేస్తుంది. ఏక బంధం (C - C ) ఉన్న సంతృప్త సమ్మేళనాలైతే పరపదం 'ఏన్', ద్విబంధం ఉండే (C = C) అసంతృప్త సమ్మేళనాలైతే 'ఈన్', త్రిబంధం ఉండే (C  C) అసంతృప్త సమ్మేళనాలైతే 'ఐన్' అనే పరపదాలు ఉంటాయి.


56. ద్వితీయ పరపదం: ఇది ప్రమేయ సమూహాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రతి ప్రమేయ సమూహానికి ఒక ప్రత్యేకమైన ద్వితీయ పరపదం ఉంటుంది.


57. ఒక కర్బన సమ్మేళనానికి పేరును సూచించడానికి ఒక క్రమ పద్ధతిని పాటించాల్సి ఉంటుంది.

58. కొన్ని ముఖ్యమైన ప్రమేయ సమూహాలకు వాడే పూర్వపదాలు, పరపదాలు

59. ఒకే రకమైన రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు ప్రథమ పరపదంలో (-e) 'ఈ' అక్షరాన్ని తొలగించాల్సిన అవసరం లేదు.


60. సంఖ్యలను కామా ( , ), సంఖ్యల సంజ్ఞలను హైఫన్ (-)తో వేరు చేయాలి.


61. ఒక వేళ నిర్మాణంలో ఒకటి కంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నట్లయితే వాటి పేర్లను రాసేటప్పుడు అక్షర క్రమాన్ని పాటించాలి. కానీ సంజ్ఞాత్మక పూర్వపదం విషయంలో ఇలా చేయకూడదు.


62. ప్రమేయ సమూహాల ప్రాధాన్యతా అవరోహణ క్రమం
-COOH > -COOR > -COX > -CHO > > C = O > -OH > -NH2 > -OR > C = C > -C  C - 


63. నామీకరణం - సూత్రాలు
*కార్బన్ పరమాణువులను ఎడమ నుంచి కుడికి లేదా కుడి నుంచి ఎడమకు ఏ విధంగానైనా లెక్క పెట్టవచ్చు.
అయితే ప్రతిక్షేపకం, ప్రమేయ సమూహన్ని కలిగి ఉన్న స్థానాలను సూచించే సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండేలా గుర్తించాలి.
* ప్రమేయ సమూహం ఉన్న కార్బన్‌కు అతి తక్కువ సంఖ్యను ఇవ్వాలి.
* ఒక వేళ గొలుసు చివరలో ప్రమేయ సమూహం ఉన్నప్పుడు ఉదాహరణకు -CHO లేదా -COOH లాంటి సమూహాలున్నపుడు వాటికి ఎప్పుడూ 1వ సంఖ్యనే ఇవ్వాలి.


64. పొడవైన శృంఖల నియమం: కర్బన సమ్మేళనంలో పొడవైన కర్బన అణువుల శృంఖలాన్ని గుర్తించాలి. దీన్ని మాతృ శృంఖలం లేదా ప్రధాన శృంఖలం అంటారు. మిగిలిన వాటిని శాఖా శృంఖలాలు అంటారు.


65. కనిష్ఠ సంఖ్యా నియమం: కర్బన సమ్మేళనంలో ఒకే ప్రతిక్షేపకం ఉన్నప్పుడు కర్బన అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ప్రతిక్షేపకం ఉన్న కర్బన అణువుకు కనిష్ఠ సంఖ్య వచ్చే విధంగా ఇవ్వాలి.


66. కనిష్ఠ మొత్తం నియమం: కర్బన సమ్మేళనంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉన్నప్పుడు, కర్బన అణువులకు సంఖ్యలను కేటాయించేటప్పుడు ఎక్కువ ప్రతిక్షేపకాలు ఉండే కర్బన అణువుకు కనిష్ఠ మొత్తం వచ్చే విధంగా సంఖ్యలను ఇవ్వాలి.


67. ఆకారాదిక్రమ నియమం: కర్బన సమ్మేళనంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రతిక్షేపకాలు లేదా శాఖా శృంఖలాలు ఉన్నప్పుడు వాటిని ఆంగ్ల అక్షరాల క్రమంలో అమర్చాలి.
 

68. కర్బన సమ్మేళనాల నామీకరణం

69. సమ్మేళనాల నిర్మాణాలను రాయడం
i) పేరులోని మూలపదాన్ని బట్టి కార్బన్ పరమాణువులు ఎన్ని ఉన్నాయో రాయాలి.
ii) కార్బన్ పరమాణువులను లెక్కించడం కుడి నుంచి ఎడమవైపుకా లేదా ఎడమ నుంచి కుడివైపుకా అనేది సరిగ్గా గుర్తించాలి.
iii) ప్రతిక్షేపకాలను వాటి సంఖ్యల, సంజ్ఞల ఆధారంగా సరైన కార్బన్ పరమాణవుకు జతపరచాలి.
iv) ఏ కార్బన్ పరమాణవుపై ప్రమేయ సమూహాన్ని సూచిస్తారో అక్కడే రాయాలి.
v) ప్రతి కార్బన్ పరమాణువు చతుర్ సంయోజకత సంతృప్తి పడే విషయాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.


70. కార్బన్ సమ్మేళనాల్లో జరిగే కొన్ని ముఖ్యమైన చర్యలు
i) దహన చర్యలు
ii) ఆక్సీకరణ చర్యలు
iii) సంకలన చర్యలు
iv) ప్రతిక్షేపణ చర్యలు


71. కార్బన్ లేదా కర్బన సమ్మేళనం అధికమైన ఆక్సిజన్‌తో మండి వేడి, కాంతిని ఇచ్చే ప్రక్రియనే దహన చర్య అంటారు. దహన చర్యలు ఆక్సీకరణ చర్యలు.
ఉదా: C + O2 CO2 + శక్తి
2 C2H6+ 7 O2  4 CO2 + 6 H20 + శక్తి

72. సాధారణంగా సంతృప్త హైడ్రో కార్బన్‌లు ప్రకాశమంతమైన నీలి మంటతో మండుతాయి. కానీ అసంతృప్త హైడ్రోకార్బన్‌లు పసుపు మంటతో నల్లని మసినిస్తూ మండుతాయి.


73. బొగ్గు, పెట్రోలియం లాంటివి గాలిలో మండితే CO2 , నీటితోపాటు సల్ఫర్ ఆక్సైడ్‌లు, నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఏర్పడతాయి.


74. సాధారణంగా దహన చర్యలన్నీ ఆక్సీకరణ చర్యలే కానీ ఆక్సీకరణ చర్యలన్నీ దహన చర్యలు కావు.


75. ఆక్సీకారిణుల వల్ల ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి. ఆక్సీకారిణులు ఆక్సీకరణకు తోడ్పడే పదార్థాలు. ఇవి దహనంలో క్షయకరణానికి గురవుతాయి.


76. ఇథైల్ ఆల్కహాల్‌ను క్షారీకృత KMnO4 ద్రావణంతో ఆక్సీకరణం చేసినప్పుడు ఎసిటాల్డిహైడ్, చివరకు ఎసిటిక్ ఆమ్లం ఏర్పడతాయి.

77. సంకలన చర్యలో భాగంగా ద్వి లేదా త్రిబంధాలుగా ఉండే కార్బన్‌లపై చర్యాకారకాలు చేరతాయి. ఆల్కీన్, ఆల్కైన్ లాంటి అసంతృప్త హైడ్రో కార్బన్‌లు, సంతృప్త హైడ్రోకార్బన్‌లుగా మారడానికి సంకలన చర్యల్లో పాల్గొంటాయి.


78. ఒక రసాయనిక చర్య వేగాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి తోడ్పడుతూ అది ఎలాంటి రసాయనిక మార్పుకు చెందకుండా ఉండే పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు.


79. ఏదైనా రసాయన చర్యలో ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం, మరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపిస్తే ఆ చర్యలను ప్రతిక్షేపణ చర్యలు అంటారు.


80. మీథేన్ (CH4) సూర్యకాంతి సమక్షంలో క్లోరిన్‌తో చర్యనొందినప్పుడు, మీథేన్‌లోని హైడ్రోజన్ పరమాణువులు క్లోరిన్ పరమాణువులతో ప్రతిక్షేపితమవుతాయి.


81. మొక్కజొన్న, గోధుమ, బార్లీ లాంటి తృణ ధాన్యాల నుంచి ఇథైల్ ఆల్కహాల్ (ఇథనోల్)ను తయారు చేస్తారు. కాబట్టి దీన్ని తృణ ధాన్య ఆల్కహాల్ అని కూడా అంటారు.

82. పిండి పదార్థాలు, చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్‌గా మార్చే ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు.


83. శుద్ధ ఇథనోల్‌నే పరమ ఆల్కహాల్ (100%) అంటారు.


84. మిథనాల్, మిథైల్ ఐసో బ్యుటైల్ కీటోన్, ఏవియేషన్ గాసోలిన్ లాంటి మలినాలు ఉన్న ఇథైల్ ఆల్కహాల్‌ను డీనేచర్డ్ ఆల్కహాల్ అంటారు.


85. ఒక వ్యక్తికి 200 మి.లీ. డీనేచర్డ్ ఆల్కహాల్‌ను ప్రాణాంతకమైన మోతాదుగా భావిస్తారు.


86. గాసోలిన్ (గాసోహాల్) యొక్క 10% ఇథనోల్ ద్రావణం వాహనాలకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది.


87. టింక్చర్ అయోడిన్, దగ్గు మందు, టానిక్ లాంటి ఔషధాల్లో ఇథైల్ ఆల్కహాల్‌ను ఉపయోగిస్తారు.


88. ఇథనోయిక్ ఆమ్లాన్ని సాధారణంగా ఎసిటిక్ ఆమ్లం అంటారు. 5 - 8% ఎసిటికామ్ల ద్రావణాన్ని నీటిలో కలిపితే దాన్ని వెనిగర్ అంటారు. వెనిగర్‌ను ఎక్కువగా పచ్చళ్లు నిల్వచేయడానికి ఉపయోగిస్తారు.


89. ఎస్టర్‌ల సాధారణ ఫార్ములా R - COOR' . దీనిలో R, R' ఆల్కైల్ గ్రూపులు.


90. గాఢ H2SO4 సమక్షంలో కార్బాక్సిలిక్ ఆమ్లం ఆల్కహాల్‌తో చర్య జరిపి తియ్యటి వాసన ఉండే ఎస్టర్‌ను ఏర్పరుస్తుంది. ఈచర్యనే ఎస్టరీకరణం అంటారు.

91. గ్లిజరాల్ అని పిలిచే ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్స్, ఉన్నత ఫాటీ ఆమ్లాలు ఉండే ఎస్టర్‌లనే కొవ్వులు అంటారు.


92. పామిటిక్ ఆమ్లం(C15H31COOH), స్టియరిక్ ఆమ్లం(C17H33COOH), ఓలియిక్ ఆమ్లం(C17H33COOH) లాంటి ఉన్నత ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని సబ్బు అంటారు.


93. సబ్బు సాధారణ ఫార్ములా RCOONa లేదా RCOOK (దీనిలో R అంటే C15H31; C17H35).


94. ఉన్నత ఫాటీ ఆమ్లాల ట్రై ఎస్టర్‌లను క్షారీకృత జలవిశ్లేషణం చేసినప్పుడు సబ్బు ఏర్పడటాన్ని సపోనిఫికేషన్ అంటారు.


95. సబ్బులు శుభ్రం చేసే కారకాలు.


96. సబ్బు నీటిలో గోళాకారంలో దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహాన్నే మిసిలి అంటారు.


97. సబ్బు నీటిలో కరిగినప్పుడు ఒక కాజికాభ అవలంబన ద్రావణం ఏర్పడుతుంది. దానిలో సబ్బు కణాలు గుంపుగా ఏర్పడి గోళాకృతిలో ఉండే మిసిలీని ఏర్పరుస్తాయి.

98.


99. ధృవాంతం హైడ్రోఫిలిక్ స్వభావంతో ఉంటుంది. నీటి వైపు ఆకర్షితమవుతుంది. అధృవాంతం హైడ్రోఫోబిక్ స్వభావంతో ఉంటుంది. అది జిడ్డు లేదా మురికి వైపు మాత్రమే ఆకర్షితం అవుతుంది. నీటి వైపు ఆకర్షితం కాదు.


100. నీటిలో సబ్బు కరిగినప్పుడు సబ్బు కణాల హైడ్రోఫోబిక్ కొనలు మురికికి అతక్కుంటాయి. తర్వాత అవి దుస్తుల నుంచి మురికిని వేరు చేస్తాయి.

కార్బన్, దాని సమ్మేళనాలు

నామీకరణ

ఆల్కేన్‌లు:

ఆల్కీన్‌లు:

ఆల్కైన్‌లు:
1) CH3 - C  C - CH3         2 - బ్యూటైన్

2) CH  C - CH2 - CH3     1 - బ్యూటైన్


ఆల్డిహైడ్‌లు (R - CHO ఆల్కనాల్):


కీటోన్‌లు (R - CO - R ఆల్కనోన్):


అమైన్‌లు
a) ప్రాథమిక అమైన్‌లు (ఎమైనో ఆల్కేన్స్ లేదా ఆల్కనామైన్)


సమ్మేళనాలు -IUPAC నామాలు

సమ్మేళనాలు - నిర్మాణాలు

Posted Date : 18-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం