ప్రశ్నలు - జవాబులు
విషయావగాహన
1. కిందివాటి మధ్య తేడాలు రాయండి.
ఎ) ఉచ్ఛ్వాసం - నిశ్వాసం బి) వాయుసహిత - అవాయు శ్వాసక్రియ
సి) శ్వాసక్రియ - దహనం డి) కిరణజన్యసంయోగ క్రియ - శ్వాసక్రియ
జ: ఎ) ఉచ్ఛ్వాసం - నిశ్వాసం
ఉచ్ఛ్వాసం | నిశ్వాసం |
1. ఇది గాలిని లోపలికి పీల్చే ప్రక్రియ | 1. ఇది గాలిని బయటకు పంపే క్రియ |
2. బాహ్య శ్వాసక్రియలో మొదటి దశ | 2. ఇది రెండో దశ |
3. ఈ దశలో ఉరఃకుహర పరిమాణం పెరుగుతుంది | 3. ఉరఃకుహర పరిమాణం తగ్గుతుంది |
4. వెలుపలి గాలి లోనికి ప్రవేశిస్తుంది | 4. ఊపిరితిత్తుల గాలి బయటకు వెళ్తుంది |
5. ఉచ్ఛ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ | 5. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువ. |
6. CO2, నీటి ఆవిరి తక్కువ | 6. CO2, నీటి ఆవిరి ఎక్కువ. |
బి) వాయుసహిత శ్వాసక్రియ - అవాయు శ్వాసక్రియ
జ:
సి) శ్వాసక్రియ - దహనక్రియ
జ:
డి) కిరణజన్య సంయోగక్రియ - శ్వాసక్రియ
జ:
కిరణజన్య సంయోగక్రియ | శ్వాసక్రియ |
1. వృక్షాలు, కొన్ని ఫొటోసింథటిక్ బ్యాక్టీరియాల్లో జరుగుతుంది | 1. అన్ని జీవుల్లో జరుగుతుంది. |
2. పగటిపూట మాత్రమే జరుగుతుంది. | 2. అన్ని వేళల్లో (పగలు - రాత్రి) జరుగుతుంది. |
3. మొక్క దీన్ని జరపకుండా కొన్ని రోజులు జీవించగలదు. | 3. ఈ క్రియ లేకుండా ఏ జీవి కొద్ది నిమిషాలు కూడా జీవించదు. |
4. మొక్కల్లో కొన్ని కణాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. | 4. సజీవి శరీరంలో అన్ని కణాలు శ్వాసక్రియను జరుపుతాయి. |
5. హరితరేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం. | 5. ఇది జీవ పదార్థం, మైటోకాండ్రియాల్లో జరుగుతుంది. సూర్యకాంతి అవసరం లేదు |
6. దీనిలో కాంతిశక్తి బంధితమై ఉంటుంది. | 6. దీనిలో శక్తి విడుదల అవుతుంది. |
7. CO2, నీరు మూల పదార్థాలు | 7. CO2, నీరు అంత్య పదార్థాలు |
8. CO2,వినియోగం చెంది, O2 విడుదల అవుతుంది. | 8. O2 వినియోగం చెంది, CO2 విడుదల అవుతుంది. |
9. కాంతి శక్తిని ఉపయోగించి, ATP ని ఉత్పత్తి చేస్తుంది. (కాంతి భాస్వీకరణం) | 9. గ్లూకోజ్‌ను ఆక్సీకరణం చేసి, ATP ని ఉత్పత్తి చేస్తుంది. (ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్) |
10. నీటి అణువులోని హైడ్రోజన్‌ని ఉపయోగించుకుని NADPH2 ఏర్పడుతుంది. | 10. పిండి పదార్థంలోని హైడ్రోజన్‌ను ఉపయోగించుకుని, NADPH2 ఏర్పడుతుంది. |
11. ఇది నిర్మాణాత్మక చర్య | 11. ఇది విచ్ఛిన్న క్రియ. |
12. ఇది ఉష్ణగ్రాహక చర్య | 12. ఇది ఉష్ణమోచక చర్య |
13. జీవి బరువును పెంచుతుంది. | 13. జీవి బరువును తగ్గిస్తుంది. |
14. |
14. C6H12O6 + 6O2 --> 6CO2 + 6 H2O + 680 k.Cal |
2. వాయుసహిత, అవాయు శ్వాసక్రియల్లో ఏవైనా రెండు పోలికలు రాయండి.
జ: వాయుసహిత, అవాయుశ్వాసక్రియలో రెండింటిలోనూ
1. శక్తి వెలువడుతుంది.
2. గ్లైకాలిసిస్ ఉమ్మడి దశ.
3. పదార్థం వినియోగించబడుతుంది.
4. ఎంజైమ్స్ పాల్గొంటాయి.
5. ఇవి జీవనియంత్రణ చర్యలు
3. ఒక్కోసారి ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకు?
జ: గ్రసని ఆహార, శ్వాస మార్గాల కూడలి.
* ఈ ప్రాంతంలో ఉపజిహ్విక ఉండి, ఆహార - వాయు కదలికలను నియంత్రిస్తుంది.
* ఇది మనం ఆహారం తినేటప్పుడు వాయునాళాన్ని మూసివేస్తుంది.
* మనం మాట్లాడుతూ లేదా ఆలోచిస్తూ భోజనం చేస్తున్నప్పుడు ఈ ఉపజిహ్విక వాయునాళాన్ని సరిగా మూయదు.
* అందువల్ల ఆహారం శ్వాసనాళంలోకి చేరి సరానా (కొర) పడుతుంది.
4. కొండలు, గుట్టల లాంటి ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ, శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి.
జ: కొండలు, గుట్టల లాంటి ఎత్తయిన ప్రదేశాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి సరిపడేలా ఆక్సిజన్ అందించడానికి ఎక్కువసార్లు శ్వాసించాల్సి ఉంటుంది. అందువల్ల శ్వాసక్రియా రేటు పెరుగుతుంది.
5. గాలి రక్తకేశ నాళికలోకి చేరడానికి వీలుగా వాయుగోణుల్లో నిల్వ ఉంటుంది. ఈ వాక్యంలో సరిచేయాల్సిన అంశాలు ఏవి?
జ: గాలి రక్తకేశ నాళికలో వాయువినిమయం జరగడానికి వీలుగా వాయుగోణుల్లో నిల్వ ఉంటుంది అని సరిచేయాలి. ఎందుకంటే రక్తకేశ నాళికలోకి గాలి అంతా చేరదు. గాలిలోని ఆక్సిజన్ మాత్రమే రక్తంలోకి విసరణ చెంది, దాని నుంచి CO2 గాలిలోకి విసరణ చెందుతుంది. దీన్నే వాయువినిమయం అంటారు.
6. మొక్కలు పగలు కిరణజన్యసంయోగ క్రియను, రాత్రి శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. మీరు ఈ అంశాన్ని అంగీకరిస్తారా? ఎందుకు?
జ: అంగీకరించను. ఎందుకంటే కిరణజన్యసంయోగ క్రియకు కాంతి అవసరం కాబట్టి అది పగలు మాత్రమే జరుగుతుంది. శ్వాసక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది శక్తిని విడుదల చేసే క్రియ. కాబట్టి మొక్కలు పగలు కిరణజన్యసంయోగ క్రియను, పగలు - రాత్రి (నిరంతరం) శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి.
7. సముద్రాల్లో ఈతకొట్టేవారు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్‌లను తీసుకువెళతారు. ఎందుకు?
జ: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్దీ వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇది సముద్ర మట్టానికి 13 కి.మీ. ఎత్తున, కేవలం 5 వంతుల ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ ఆక్సిజన్ శ్వాసించడానికి సరిపోదు కాబట్టి పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్‌లను తీసుకువెళతారు. సముద్రాల్లోకి వెళ్లేవారు నీటి నుంచి ఆక్సిజన్‌ను గ్రహించలేరు. కాబట్టి తమ వెంట ఆక్సిజన్ సిలిండర్‌లను తీసుకువెళతారు.
8. గరిష్ఠ స్థాయిలో వాయువినిమయం జరగడానికి వీలుగా వాయుగోణులు ఎలా మార్పు చెందాయో రాయండి.
జ: వాయుగోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. విధి: వాయువినిమయం.
* అధిక సంఖ్యలో రక్తనాళాలు ఉండటం వల్ల, రక్తం ఎక్కువ మొత్తంలో వాయువినిమయానికి అందుబాటులో ఉంటుంది.
* గోళాకార నిర్మాణాలు ఉండటం వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది.
* గాలిని నిల్వచేసుకుంటూ రక్తకేశ నాళికలు పలుచగా ఉంటాయి. కాబట్టి వాయువినిమయం రేటు పెరుగుతుంది.
9. 'శ్వాసక్రియలో చక్కెరల నుంచి శక్తి ఎక్కడ విడుదలవుతుంది' అనే ప్రశ్నకు సీత ఊపిరితిత్తులని, రజియా కండరాలు అని సమాధానం రాశారు. ఎవరి సమాధానం సరైంది? ఎందుకు?
జ: రజియా రాసింది సరైన సమాధానం. ఎందుకంటే శ్వాసక్రియలో శక్తివిడుదల కణస్థాయిలో జరుగుతుంది. దీన్ని కణశ్వాసక్రియ/అంతర శ్వాసక్రియ అంటారు. ఊపిరితిత్తుల్లో కేవలం వాయువినిమయం జరుగుతుంది. ఎలాంటి శక్తి ఉత్పత్తి కాదు. దీన్ని బాహ్య శ్వాసక్రియ అంటారు.
10. శ్వాసక్రియలో ఎపిగ్లాటిస్, డయాఫ్రమ్‌ల పాత్ర ఏమిటి?
జ: ఎపిగ్లాటిస్: ఇది గ్రసనిలో స్వరపేటికను కప్పుతూ, మూతలా ఉండే నిర్మాణం.
* ఇది శ్వాస మార్గం, ఆహార మార్గాలను నియంత్రిస్తుంది.
* వాయునాళంలోకి ఆహారం వెళ్లకుండా నియంత్రించడం దీని విధి.
* డయాఫ్రమ్: ఉరఃకుహరాన్ని, ఉదరకుహరాన్ని వేరుచేస్తూ ఉన్న పొరను విభాజక పటలం లేదా డయాఫ్రమ్ అంటారు.
* దీని సంకోచ, సడలికల వల్ల బయటిగాలి లోపలికి, లోపలిగాలి బయటకు వెళ్తుంది. పురుషుల శ్వాసక్రియలో ప్రముఖపాత్ర వహిస్తుంది.
11. కణస్థాయిలో వాయువినిమయం ఎలా జరుగుతుంది?
జ: కణజాలాలు ఆక్సిజన్‌ను వినియోగించుకుని తక్కువ గాఢతతో ఉన్నప్పుడు, ఆమ్లజని సహిత రక్తం కణజాలాల్లోకి ప్రవేశించగానే ఆక్సిజన్ రక్తం నుంచి కణజాలంలోకి ప్రవేశిస్తుంది.
కణశ్వాసక్రియ వల్ల ఏర్పడిన CO2 గాఢత పెరిగి కణజాలం నుంచి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా గాఢత ఆధారంగా రక్తం - కణజాలం మధ్య పరస్పరం వాయువినిమయం జరుగుతుంది.
12. బ్రాంకియోల్ వాయువినిమయం ఎలా జరుగుతుంది?
జ: ఊపిరితిత్తుల్లోని బ్రాంకియోల్ అంటే శ్వాస నాళికలు. ఇవి గాలితో నిండినప్పుడు, గాలి నుంచి ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇదే సమయంలో కణజాలం నుంచి CO2 రక్తంలోకి చేరడం వల్ల దాని గాఢత అధికంగా ఉన్న రక్తం నుంచి CO2 బ్రాంకియోల్‌లోనికి విసరణ చెందుతుంది. ఈ ప్రక్రియను వాయువినిమయం అంటారు.
13. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండారాల్లో నొప్పి కలుగుతుంది. కండరాల నొప్పికి, శ్వాసక్రియకు సంబంధం ఏమిటి?
జ: వ్యాయామం చేసినప్పుడు కండరాల్లో శక్తిలోటు ఏర్పడి అవాయు శ్వాసక్రియ జరుగుతుంది.
* దీని వల్ల కండరాల్లో లాక్టికామ్లం ఏర్పడి కండరాలు అలసి, నొప్పి కలుగుతుంది.
* అధిక ఆక్సిజన్ లభించిన తర్వాత లాక్టికామ్లం తొలగిపోయి కండరాలు సాధారణ స్థాయికి చేరుతాయి. కాబట్టి కండరాల నొప్పికి, శ్వాసక్రియకు సంబంధం ఉందని చెప్పవచ్చు.
14. ఆకులతోపాటు కాండం కూడా శ్వాసిస్తుందని రాజు చెప్పాడు. మీరు అతడిని సమర్థిస్తారా? ఎలా?
జ: సమర్థిస్తాను.
* శ్వాసక్రియలో O2 గ్రహించబడి, CO2 విడుదలవుతుంది. ఈ ప్రక్రియను వాయువినిమయం అంటారు.
* వాయువినిమయం కోసం పత్రాలు - పత్రరంధ్రాలను కలిగి ఉంటే, కాండాలు లెంటిసెల్స్ అనే నిర్మాణాలతో ఉంటాయి.
* లెంటిసెల్స్ కాండ కణజాలంతో సంబంధాన్ని కలిగి వాయువినిమయానికి తోడ్పడతాయి. కాబట్టి ఆకులతోపాటు కాండం కూడా శ్వాసిస్తుందని చెప్పవచ్చు.
ప్రశ్నించడం - పరికల్పన చేయడం
15. శరీరంలో డయాఫ్రం లేకపోతే ఏమవుతుంది?
జ: పురుషుల శ్వాసక్రియలో డయాఫ్రం కీలక పాత్ర వహిస్తుంది. డయాఫ్రం లేకపోతే ఉచ్ఛ్వాస - నిశ్వాసాలు సక్రమంగా జరగవు. శ్వాసక్రియ కష్టమై, శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక వ్యక్తి మరణించవచ్చు.
16. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే, ఊపిరితిత్తుల శ్వాసక్రియ గురించి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
జ: 1. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఏయే జాగ్రత్తలు పాటించాలి?
2. ఊపిరితిత్తులకు ఆస్తమా వ్యాధి ఎందుకు వస్తుంది?
3. నికోటిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
4. యోగాసనాలతో శ్వాసక్రియ వ్యాధులను తగ్గించుకోవచ్చా?
5. క్రీడాకారులు శ్వాస విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి?
ప్రయోగాలు - క్షేత్రపరిశీలనలు
17. మీ పాఠశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియను గుర్తించడానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించిన విధానం ఏమిటి?
జ: ఉద్దేశం: అవాయు శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఆల్కహాల్ ఏర్పడుతుందని నిరూపించడం.
* కావాల్సిన పరికరాలు: గాజుసీసా, గ్లూకోజ్ ద్రావణం, ఈస్ట్‌కణాలు, చిన్న బీకరు.
* ప్రయోగ విధానం: వెడల్పు మూతి ఉన్న ఒక గాజుసీసా తీసుకోవాలి.
* దీనిలోకి 200 మి.లీ. వేడిచేసి చల్లార్చిన గ్లూకోజ్ ద్రావణాన్ని తీసుకుని, దీనికి కొంచెం ఈస్ట్‌ను కలపాలి.
* గాజుసీసాకు సున్నపుతేట నింపిన చిన్న బీకరును కలపాలి.
* గ్లూకోజ్ ద్రావణంపై నూనె పోసి కప్పాలి. దీనివల్ల గాలి గ్లూకోజ్‌లోకి ప్రవేశించదు.
* గాజు సీసాకు గట్టి బిరడాను బిగించి, పటంలో చూపిన విధంగా అమర్చాలి.
* ఒకటి లేదా రెండు రోజుల తర్వాత సీసా మూతను తీసి వాసన చూస్తే, అది ఆల్కహాల్ వాసన ఉండటం గమనించవచ్చు. సున్నపుతేట తెల్లనిపాలలా మారుతుంది.
అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం CO2 నిర్ధారణ పరీక్ష.
* పరిశీలన: 1) అవాయు పరిస్థితుల్లో శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజ్ ద్రావణం ఆల్కహాల్‌గా మారింది.
2) CO2 విడుదలవడం వల్ల సున్నపుతేట పాలలా మారింది.
* నిర్ధారణ: దీన్ని బట్టి అవాయు పరిస్థితుల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుందని తెలుస్తుంది.
18. చక్కెరను మండించే ప్రయోగంలో మీరు గమనించే అంశాలు ఏమిటి?
జ: చక్కెరను మండించడం
1. చక్కెరను మండించినప్పుడు అది కరిగి ద్రవస్థితికి మారింది.
2. అధిక ఉష్ణోగ్రత వద్ద CO2ను విడుదల చేసింది.
3. ఇది ఒక భౌతిక చర్య. నియంత్రణ కష్టమైంది.
4. శక్తి అంతా ఒకేసారి ఉష్ణరూపంలో విడుదల అవుతుంది.
5. చక్కెర నల్లని కార్బన్ (మసి)గా మిగిలిపోయింది.
6. ఇది ఒక ఆక్సీకరణ చర్య.
సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు
19. కప్పల్లో జరిగే చర్మీయ శ్వాసక్రియ గురించి సమాచారాన్ని సేకరించండి. నివేదికను తయారు చేసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జ: 1. కప్ప ఉభయజీవి. ఇది నీటిలో, నేలమీద నివసిస్తుంది.
2. కప్ప తీసుకునే మొత్తం ఆక్సిజన్ పరిమాణంలో 3వ వంతు చర్మం ద్వారా తీసుకుంటుంది.
3. చర్మం ఉపరితలం మీద శ్లేష్మాన్ని స్రవించే అనేక గ్రంథులు కప్ప చర్మంలో ఉంటాయి. కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచుకుంటుంది.
4. వేడిగా, పొడిగా ఉండే వేసవిలో కప్పలు భూమిలో లోతుగా బొరియలు చేసుకుని నివసిస్తాయి. దీన్ని గ్రీష్మకాల సుప్తావస్థ/వేసవి నిద్ర అంటారు.
5. శీతాకాలంలో కూడా బొరయల్లో నివసిస్తాయి. దీన్ని శీతాకాల సుప్తావస్థ (శీతాకాల నిద్ర) అంటారు.
6. ఈ కాలాల్లో కప్పలు చర్మం ద్వారా శ్వాసిస్తాయి.
20. పొగాకు వినియోగం, కాలుష్యం లాంటి వాటివల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారాన్ని సేకరించండి. దీనిపై మీ తరగతిలో చర్చించండి.
జ: పొగాకు, సిగరెట్ వినియోగం వల్ల ఏటా ఒక్క అమెరికాలోనే 4,38,000 మంది మరణిస్తున్నట్లు అంచనా. పొగాకు వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 87% అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. * ప్రతిరోజు 1100 మంది యువకులు పొగాకు, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు.
* పొగాకు వినియోగం వల్ల శ్వాసకోశ వ్యాధులే కాకుండా, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి.
పొగాకు వినియోగం వల్ల కలిగే వ్యాధులు:
* క్రానిక్ బ్రాంకెటిస్: ఇది దీర్ఘకాలిక వ్యాధి. వాయునాళంలో శ్లేష్మం పేరుకుపోవడం, విపరీతమైన దగ్గు దీని లక్షణాలు. దగ్గు దీర్ఘకాలం ఉంటే శ్వాసనాళం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
* ఎంఫిసెమా: ఈ వ్యాధిలో ప్రధానంగా వాయుగోణులు దెబ్బతింటాయి.
* వ్యాధి లక్షణాలు: ఆయాసం, శ్వాసలో ఇబ్బంది, దగ్గు, అలసట, బరువుకోల్పోవడం, ఒత్తిడి.
* లంగ్‌క్యాన్సర్: వాయు మార్గంలోని కణజాలం నికోటిన్ ప్రభావం వల్ల అదుపులేని కణవిభజన జరుపుతూ కణితిలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల మార్గాల్లో గడ్డలు ఏర్పడతాయి.
* వ్యాధి లక్షణాలు: దగ్గు, రక్తస్రావం, చాతినొప్పి, ఆయాసం.
* శ్వాస వ్యాధులు పొగతాగేవారిలోనే కాకుండా, పక్కన ఉండే వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు.
* లక్షణాలు: విసుగు, కళ్లు మండటం, గొంతుమంట, దగ్గు.
బొమ్మలు గీయడం, నమూనాలు తయారుచేయడం
21. శ్వాసక్రియా మార్గాన్ని తెలియజేసే పటాన్ని గీసి, భాగాలు గుర్తించండి.
జ:
మానవుడిలో శ్వాస వ్యవస్థ
22. శ్వాసక్రియలో జరిగే దశలను తెలిపే రేఖాచిత్రాన్ని గీయండి.
కణ శ్వాసక్రియ గురించి మీరేం తెలుసుకున్నారో రాయండి.
జ: శ్వాసక్రియ అనేక జీవ, రసాయనిక, భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. దీనిలో కింది దశలు ఉంటాయి.
కణ శ్వాసక్రియ:
* ఇది కణస్థాయిలో జరుగుతుంది. దీన్నే అంతర శ్వాసక్రియ అని కూడా అంటారు.
* ఈ ప్రక్రియలో పరిసరాల నుంచి గ్రహించిన O2 వినియోగించబడి, పదార్థం (గ్లూకోజ్) ఆక్సీకరణం చెందుతుంది.
* ఈ ప్రక్రియలో కొంత శక్తితోపాటు CO2, నీటి ఆవిరి వెలువడతాయి.
దీనిలో రెండు దశలు...
* గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది.
* క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది.
* మైటోకాండ్రియాలో శక్తి (ATP) ఉత్పత్తి అవుతుంది, కాబట్టి వీటిని కణశక్త్యెగారాలు లేదా శక్తి ఉత్పాదక కేంద్రాలు (The power houses of the cell) అంటారు.
అభినందించడం: సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం
23. మన శరీరంలో జరిగే శ్వాసక్రియ యంత్రాంగాన్ని మీరెలా అభినందిస్తారు?
జ: * మన శరీరంలో శ్వాసక్రియ ఒక అద్భుత జీవక్రియ.
* జీవక్రియలకు కావాల్సిన శక్తిని అందించే ఏకైక వనరు శ్వాసక్రియ.
* శ్వాసక్రియ ఆహారాన్ని ఆక్సీకరణం చేసి శక్తి (ATP)గా మారుస్తుంది.
* ఇది దహనంలా ఉన్నప్పటికీ, చాలా వైవిధ్యాన్ని చూపుతుంది.
* ఇది జీవద్రవ్యంలో ఎంజైమ్‌ల సమక్షంలో నియంత్రిత చర్యగా జరుగుతుంది.
* శక్తి అంచలంచెలుగా శరీర అవసరాలకు తగినట్లుగా ఉష్ణరూపంలో వెలువడటం అద్భుతం.
* వ్యాయామ సమయంలో పెరగడం, సుప్తావస్థలో తగ్గడం కూడా అద్భుతమైన శరీర జీవక్రియ.
నిజజీవిత వినియోగం, జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం
24. మీ పాఠశాల సింపోజియంలో చర్చించడానికి అవాయు శ్వాసక్రియపై ఒక వ్యాసాన్ని తయారు చేయండి.
జ: * ఆక్సిజన్ లోటు ఉన్న పరిస్థితుల్లో జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు.
* ఇది బ్యాక్టీరియా, కండరాల్లో జరుగుతుంది.
C6H12O6 → 2 C2H5OH + 2 CO2 + 54 k. cal.(తక్కువ శక్తి)
* అవాయు శ్వాసక్రియ 2 దశలు
» ప్రక్రియ కొన్ని రకాల బాక్టీరియాల్లోనూ, ఈస్ట్ లాంటి శిలీంధ్రాల్లోనూ కనిపిస్తుంది.
25. హీమోగ్లోబిన్, క్లోరోఫిల్‌లు శ్వాసక్రియ గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఒక కార్టూన్‌ను గీయండి.
జ:
కృత్యాలు
కృత్యం - 1
మీ చేతిని నాసికా రంధ్రాలకు ఎదురుగా ఒక అంగుళం దూరంలో ఉంచండి. మీ శ్వాస బయటకు వచ్చి, చేతిని తాకడాన్ని గమనించండి. ఈ కృత్యం పూర్తయ్యే వరకు చేతిని అక్కడ నుంచి తీయకండి. 1 - 2 నిమిషాలు నిలకడగా శ్వాసించండి. ఏదైనా ఆహార పదార్థాన్ని కొరికి బాగా నమిలి, మింగేముందు రెండో చేతిని గొంతుపై ఉంచిన తర్వాత ఆహారాన్ని మింగండి.
1. మీరేం గమనించారు?
జ: ఆహారాన్ని మింగుతున్నప్పుడు, గొంతులో కదలికను గమనించాను. అదే సమయంలో శ్వాస చేతికి తగలలేదు.
2. ఆహారాన్ని మింగే సమయంలో మీ శ్వాసలో ఏమైనా తేడా గమనించారా?
జ: ఆహారాన్ని మింగుతున్నప్పుడు శ్వాస ఆగినట్లు గమనించాను.
3. ఆహారాన్ని మింగే సమయంలో, ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా సహాయపడేది ఏది?
జ: గ్రసనిలోని ఉపజిహ్విక (కొండనాలుక) సహాయపడుతుంది.
కృత్యం - 2
చక్కెరను మండించినప్పుడు ఏం జరుగుతుంది?
పటంలో చూపిన విధంగా పరికరాలను అమర్చండి. ఒక పరీక్షనాళికలో చక్కెరను తీసుకుని మంట సహాయంతో వేడిచేయండి. కొంత సమయం తర్వాత ఏం జరుగుతుందో గమనించండి?
శక్తి విడుదలలో అదనపు ఉత్పన్నం
1. చక్కెర కరిగిందా?
జ: వేడిచేసినప్పుడు చక్కెర కరిగింది.
2. ఇంకా ఎక్కువసేపు వేడిచేస్తే ఏం జరుగుతుంది?
జ: CO2, నీటితోపాటు శక్తి వేడిరూపంలో వెలువడుతుంది.
కృత్యం - 3
3. పిడికెడు మొలకెత్తిన శనగ గింజలను తీసుకుని గాజుసీసాలో వేయండి. ఒక చిన్న బీకరును తీసుకుని దానిలో 3 వంతుల వరకు సున్నపుతేట నింపండి. బీకరుకు దారం కట్టి జాగ్రత్తగా గాజుజాడీలో ఉంచండి. జాడీ మూత బిగించండి. ఇలాగే పొడివిత్తనాలతో మరొక అమరికను సిద్ధం చేసుకోండి. ఈ రెండింటిని రెండు రోజులు కదపకుండా ఉంచి, వాటిని పరిశీలించండి. మీ పరిశీలనలు నమోదు చేయండి.
1. ఏ జాడీలో ఉంచిన సీసాలో సున్నపు నీరు రంగు మారింది?
జ: మొలకెత్తిన శనగ గింజలున్న సీసాలోని సున్నపు నీరు తెల్లటిపాలలా మారింది.
2. మొలకెత్తిన శనగ గింజలున్న సీసాలోని సున్నపు నీరు ఎందుకు తెల్లటిపాలలా మారింది?
జ: పొడి శనగ గింజల కంటే, మొలకెత్తిన శనగ గింజలు ఎక్కువ శ్వాసక్రియ జరిపి, ఎక్కువ CO2ను విడుదలచేయడం వల్ల సున్నపునీరు తెల్లటిపాలలా మారింది.
శ్వాసక్రియలో CO2 విడుదల
కృత్యం - 4
కొన్ని మొలకెత్తిన గింజలను ఒక థర్మాస్ ప్లాస్కులో తీసుకోండి. ఒక బిరడాను తీసుకుని, రంధ్రం చేసి దాని ద్వారా థర్మామీటరును అమర్చండి. ఈ థర్మామీటరు నొక్కు మొలకెత్తిన గింజల్లో మునిగి ఉండేలా జాగ్రత్తపడండి. ప్రతిరెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయండి. మంచి ఫలితాల కోసం 24 గంటలపాటు పరిశీలించండి.
మీ పరిశీలనల ఆధారంగా కాలం ఉష్ణోగ్రతలపై గ్రాఫ్ గీయండి.
1. ఉష్ణోగ్రతల్లో పెరుగుదలను ఏమైనా గుర్తించారా?
జ: అవును. సీసాలో ఉష్ణోగ్రత పెరిగింది.
2. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందా? లేదా ఒకానొక సమయంలో అకస్మాత్తుగా పెరిగినట్లు ఉందా?
జ: ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.
3. ఈ ఉష్ణం ఎక్కడ నుంచి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
జ: మొలకెత్తిన శనగ గింజల శ్వాసక్రియ రేటు అధికం. కాబట్టి శ్వాసక్రియలో కొంతశక్తి ఉష్ణరూపంలో విడుదల అవుతుంది. ఫలితంగా థర్మాస్‌లో ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు భావిస్తున్నాం.
శ్వాసక్రియలో ఉష్ణం విడుదల
ప్రయోగశాల కృత్యం:
అవాయు శ్వాసక్రియలో వెలువడే ఉష్ణం, CO2 నిర్ధారణ పరీక్ష.
ప్రయోగదశలు:
1. గ్లూకోజ్ ద్రావణాన్ని (గంజి) ఒక నిమిషం పాటు వేడిచేసి, కదలించకుండా చల్లార్చడం ద్వారా ద్రావణంలోని ఆక్సిజన్‌ను తొలగించాలి. ఇప్పుడు దానిలో ఈస్ట్‌ను కలిపి దానిపై ఒక సెం.మీ. మందంలో పారాఫిన్ ద్రవాన్ని పోయాలి. ఇలా చేయడం ద్వారా బయట నుంచి గ్లూకోజ్ ద్రావణానికి ఆక్సిజన్ సరఫరా కాకుండా నిరోధించవచ్చు.
2. పారాఫిన్ ద్రవాన్ని పోసే ముందు గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉందో, లేదో తెలుసుకోవడానికి కొన్ని చుక్కలు డయాజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ - B ద్రావణాన్ని వేసి చూడండి. ఈ నీలిరంగు ద్రావణం ఆక్సిజన్ లభ్యత తక్కువైనప్పుడు గులాబి రంగుకు మారుతుంది.
3. పటంలో చూపిన విధంగా ఈస్ట్ ఉత్పత్తి చేసే వాయువులు బయటకు వెళ్లి సున్నపుతేట ఉండే పరీక్షనాళికలోనికి చేరేవిధంగా పరికరాలు అమర్చాలి.
అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, CO2 నిర్ధారణ పరీక్ష
1. ఈ ప్రయోగం ద్వారా మీరు ఏ విషయాలు నిరూపించగలరు?
జ: అవాయు శ్వాసక్రియను నిరూపించగలం.
అవాయు శ్వాసక్రియలో ఉష్ణం, CO2 వెలువడుతుందని నిరూపించవచ్చు.
2. ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని ఎందుకు వేడి చేస్తారు?
జ: గ్లూకోజ్‌ను వేడిచేయడం ద్వారా ఆక్సిజన్‌ను తొలగించి, అవాయు శ్వాసక్రియ పరిస్థితులు కల్పించవచ్చు.
3. గ్లూకోజ్ ద్రావణంపై పారాఫిన్ మైనం ఎందుకు పోశారు?
జ: బయటిగాలిలోని ఆక్సిజన్ గ్లూకోజ్ ద్రావణంలోకి ప్రవేశించకుండా చేయడానికి పారాఫిన్ మైనం పోశాం.
4. ఈ ప్రయోగంలో సున్నపుతేటలో ఏ మార్పు గమనించారు?
జ: సున్నపునీరు పాలలా మారడాన్ని గమనించాం. ఇది CO2 విడుదలను నిర్ధారించింది.
5. ఈ ప్రయోగంలో ఏ జీవులు అవాయు శ్వాసక్రియను నిర్వహిస్తాయి?
జ: గ్లూకోజ్ ద్రావణంలో కలిపిన ఈస్ట్ కణాలు అవాయు శ్వాసక్రియను జరిపాయి.
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటి మధ్య తేడాలు రాయండి. (AS1)
ఎ) వాయుసహిత - అవాయు శ్వాసక్రియ
బి) శ్వాసక్రియ - దహనం
2. కొండలు, గుట్టలు లాంటి ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ, శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి. (AS1)
3. శరీరంలో డయాఫ్రం లేకపోతే ఏమవుతుంది? (AS2)
4. మీ పాఠశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవడానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించిన విధానాన్ని తెలపండి. (AS3)
5. పొగాకు వినియోగం, కాలుష్యం లాంటి వాటి వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారాన్ని సేకరించండి. (AS4)
6. శ్వాసక్రియలో జరిగే దశలను తెలిపే రేఖాచిత్రాన్ని గీయండి. కణ శ్వాసక్రియ గురించి మీరేం తెలుసుకున్నారో రాయండి. (AS5)
ఒక మార్కు ప్రశ్నలు
1. స్వరతంత్రులు ఉండే ప్రదేశం ఏది?
జ: స్వర పేటిక
2. ఊపిరితిత్తుల్లో ఉండే గాలితిత్తుల లాంటి నిర్మాణాలను ఏమంటారు?
జ: వాయుకోశ గోణులు (ఆల్వియోలై)
3. ఉదరవితానం సంకోచించినప్పుడు ఏం జరుగుతుంది?
జ: చాతి పరిమాణం పెరిగి, బయటిగాలి లోపలికి ప్రవేశిస్తుంది.
4. శ్వాసక్రియను విచ్ఛిన్నక్రియ అని ఎందుకు అంటారు?
జ: సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.
5. కణాల్లో శక్తి నిల్వ ఉండే ప్రదేశం?
జ: మైటోకాండ్రియా
6. మనం వదిలే గాలిలో ఉండే పదర్థాలు ఏవి?
జ: CO2, నీటిఆవిరి
7. గాలి, ఆహారం శరీరం లోపలికి వెళ్లడానికి వీలుగా పనిచేసే మూత లాంటి భాగం ఏది?
జ: కొండనాలుక (ఉపజిహ్విక)
8. కణాల్లో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ఏమంటారు?
జ: ATP (ఆడినోసిన్ ట్రైఫాస్ఫేట్)
9. మొక్కల్లో లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయి? వాటి విధి ఏమిటి?
జ: కాండంలో ఉంటాయి. వాటి విధి వాయు వినిమయం.
10. మంగ్రూవ్‌లలో శ్వాసక్రియ జరిగే భాగం ఏది?
జ: శ్వాసవేర్లు
ముఖ్యమైన ప్రశ్నలు
1. శ్వాసక్రియను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులు ఏమిటి?
జ: * ఆక్సిజన్ లభ్యత
* ఉష్ణోగ్రత
* ఆక్సీకరణం చెందే పదార్థ స్వభావం
* ఎంజైమ్‌ల క్రియాశీలత
* పరిసరాలు
* జీవి ఆరోగ్య పరిస్థితి
2. మొదడు నుంచి శ్వాస అవయవాలకు వెళ్లే నాడులను కత్తిరించినట్లయితే, శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీని వల్ల మనకు ఏం అర్థమవుతుంది?
జ: శ్వాసక్రియకు మెదడుకు సంబంధం ఉందని అర్థమవుతుంది. ఇంకా శ్వాసక్రియను నియంత్రించే శ్వాస కేంద్రం మెదడులో ఉన్నట్లు తెలుస్తుంది.
3. వాయు మార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది?
జ: * దుమ్మూ - ధూళి కణాలు గాలి నుంచి తొలగిపోవు.
* వేసవి కాలంలో గాలి చల్లారకుండానే ఊపిరితిత్తులను చేరుతుంది. దీని వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
* శీతాకాలంలోని చల్లని గాలి శరీర ఉష్ణోగ్రతకు క్రమపరచక పోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
4. రెండు ఊపిరితిత్తులు ఒకే పరిమాణంలో ఉంటాయా?
జ: ఉండవు. కుడి ఊపిరితిత్తి పెద్దగా 3 తమ్మెలు, ఎడమ ఊపిరితిత్తి చిన్నగా 2 తమ్మెలు కలిగి ఉంటాయి.
5. వాయుకోశ గోణులు అసంఖ్యాకంగా, అతిచిన్నగా ఎందుకు ఉంటాయి?
జ: * వాయుకోశ గోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం.
* ఇవి అణుస్థాయిలో వాయువినిమయం జరపడానికి అతిచిన్నగా ఉంటాయి.
* పరిమాణంలో పెద్దగా ఉండే ఊపిరితిత్తులను నిర్మించడం కోసం ఇవి అసంఖ్యాకంగా ఉంటాయి.
* ఇవి ఊపిరితిత్తుల వైశాల్యం పెంచడంలో కీలకపాత్ర వహిస్తాయి.