• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పోషణ - ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్నలు - జ‌వాబులు

I. విషయావగాహన

ఒక మార్కు ప్రశ్నలు

1. శక్తి గ్రాహకాలు అని వేటిని అంటారు?

జ: కిరణజన్య సంయోగక్రియలో కాంతిచర్య అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడిన ATP, NADPH లను ‘శక్తి గ్రాహకాలు’ అంటారు.

2. ఎమల్సిఫికేషన్‌ అంటే ఏమిటి?

జ: కాలేయం ద్వారా స్రవించబడే పైత్యరసం, కొవ్వు పదార్థాలను చిన్న అణువులుగా విడగొట్టడాన్ని ‘ఎమల్సిఫికేషన్‌’ అంటారు.

3. సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా మార్చే క్రియను తెలిపి, సమీకరణాన్ని రాయండి.

జ: కిరణజన్య సంయోగక్రియ సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా మారుస్తుంది.

4. బంగారు తీగలో హస్టోరియాల ఉపయోగం ఏమిటి?

జ: కస్కూట (బంగారు తీగ)లో ఆహార సేకరణకు హస్టోరియాలు ఉపయోగపడతాయి.

5. మోల్స్‌ అర్ధపత్ర ప్రయోగంలో KOH పాత్ర ఏమిటి?

జ: CO2 ను పీల్చుకునేందుకు KOH ను సీసాలో వాడతారు.

6. హరితరేణువు - పత్రహరితం అని వేటిని అంటారు?

జ: హరితరేణువు అనేది మొక్కల కణంలోని ఒక కణాంగం. హరితరేణువులోని ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని ‘పత్రహరితం’ అంటారు.

7. గ్రానా - స్ట్రోమాలు అని వేటిని అంటారు?

జ: హరితరేణువులోని థైలకాయిడ్‌ దొంతరలను ‘గ్రానా’ అంటారు. ఈ దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ‘స్ట్రోమా’ అంటారు.

8. కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలని వేటిని అంటారు?

జ: హరితరేణువులోని గ్రానాలో కొన్ని వర్ణ అణువులు కలిసి కాంతిశోషణ సముదాయంగా ఏర్పడతాయి. వీటిని ‘కిరణజన్య సంయోగక్రియ ప్రమాణాలు’ అంటారు.

9. కిరణజన్య సంయోగక్రియలోని ముఖ్య దశలను తెలపండి.

జ: ¤ కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారడం.

    ¤ నీటి అణువు విచ్ఛిత్తి చెందడం.

    ¤ CO2 కార్బోహైడ్రేట్స్‌గా క్షయకరణ చెందడం.

10. నీటి కాంతి విశ్లేషణ అంటే ఏమిటి?

జ: కాంతి సమక్షంలో నీటి అణువు హైడ్రోజన్‌ (H), హైడ్రాక్సిల్‌ (OH) అయాన్‌లుగా విడిపోవడాన్ని ‘నీటి కాంతి విశ్లేషణ’ అంటారు.

       H2O  H + OH

11. అమీబాలో ఆహారసేకరణ విధానాన్ని తెలపండి.

జ: అమీబా ఆహారసేకరణ కోసం శరీర ఉపరితలం నుంచి వేళ్ల లాంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. వీటిని ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహారపు రిక్తికగా మారుస్తుంది. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొట్టిన తర్వాత కణద్రవ్యంలోకి వ్యాపనం చెందుతాయి.

12. తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండటం వల్ల ఉపయోగం ఏమిటో ఊహించి రాయండి.

జ: పీచు పదార్థాలు జీర్ణం కావు. ఇవి జీర్ణనాళంలోని ఆహారానికి బరువును చేకూర్చడం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. పేగులో ఆహార కదలికలు సులువుగా ఉండటంతో మలబద్ధకం నివారించబడుతుంది.

13. బోలస్‌ ఎలా ఏర్పడుతుంది?

జ: ఆహారం నోటిలోని దంతాల ద్వారా ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి తడిగా, మెత్తగా జారే స్వభావాన్ని పొందుతుంది. దీన్నే ‘బోలస్‌’ అంటారు.

14. ‘కైమ్‌’ అని దేన్ని అంటారు? దాని స్వభావం ఏమిటి?

జ: జీర్ణాశయంలోని ఆహారం జఠరరసం హైడ్రోక్లోరికామ్లంతో కలిసి కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి, మెత్తగా చిక్కటి ద్రవరూపంలోకి మారుతుంది. దీన్నే ‘కైమ్‌’ అంటారు. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.

15. మానవుడి జీర్ణవ్యవస్థను తెలియజేసే ఫ్లోచార్టును గీయండి.

II. ప్రశ్నించడం - పరికల్పన చేయడం

1. కాలుష్యం వల్ల గాలిలో CO2 పెరిగితే మొక్కల పెరుగుదల ఏవిధంగా ఉంటుంది? (రెండు మార్కులు)

జ: గాలిలో CO2 పెరిగితే కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది.

¤FACE ప్రయోగాల ప్రకారం గాలిలో CO2 475 PPM నుంచి 600 PPM కు పెరిగితే కిరణజన్య సంయోగక్రియ రేటు 40% పెరుగుతుంది. CO2 ఇంతకు మించి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు 40% కంటే తక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధిక CO2 గాఢతలో పత్రరంధ్రాలు మూసుకుపోవడం.

III. ప్రయోగాలు - క్షేత్ర పరిశీలన

నాలుగు మార్కుల ప్రశ్నలు  

1. మొక్కల పత్రాల్లో పిండిపదార్థాన్ని గుర్తించడానికి మీరు చేసిన ప్రయోగ విధానాన్ని తెలపండి.

జ: విధానం: ¤ కుండీలో పెరుగుతున్న మొక్క నుంచి పలుచగా ఉన్న ఒక ఆకును తీసుకోవాలి.

ఒక పరీక్షనాళికలో మిథైలేట్‌ స్పిరిట్‌ తీసుకొని ఆకును అందులో ఉంచాలి.

పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి వేడి చేయాలి.

వేడిచేసినప్పుడు ఆకులోని పత్రహరితం తొలగించబడి, లేత తెలుపు రంగులోకి మారుతుంది.

ఆకును తీసి వాచ్‌గ్లాస్‌లో పరిచి దానిపై 2, 3 చుక్కల అయోడిన్‌ ద్రావణాన్ని లేదా బెటాడిన్‌ దావ్రణాన్ని వేయాలి.

అయోడిన్‌ ద్రావణం వేసినచోట ఆకు నీలినలుపు రంగులోకి మారుతుంది.

ఫలితం: అయోడిన్‌ పిండిపదార్థాన్ని నీలిరంగుగా మారుస్తుంది. కాబట్టి ఆకులో పిండిపదార్థం ఉన్నట్లు రుజువు అవుతుంది.

2. ‘CO2 లేకుండా కిరణజన్య సంయోగక్రియ జరగదు’ అని నిరూపించడానికి మీరు చేసే ప్రయోగ విధానం ఏమిటి? 

విధానం: 

పొడవాటి, వెడల్పు తక్కువగా ఉన్న ఆకులు గల కుండీలోని మొక్కను ఎన్నుకొని దాన్ని కనీసం వారం రోజులపాటు చీకటిలో ఉంచాలి.

దీని వల్ల ఆకుల నుంచి పిండిపదార్థం తొలగించబడుతుంది.

ఒక వెడల్పు మూతి గల గాజు సీసాను తీసుకొని అందులో KOH ద్రావణాన్ని పోసి, రెండుగా చీల్చిన రబ్బరు బిరడాను సీసామూతికి బిగించాలి.

మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బిరడా చీలిక ద్వారా సగభాగం సీసా లోపలికి, సగభాగం సీసా బయటకు ఉండే విధంగా అమర్చాలి.

ఆకును KOH ద్రావణం తాకకుండా జాగ్రత్త వహించాలి.

ప్రయోగ అమరికను సీసాతోసహా సూర్యరశ్మిలో కొన్ని గంటలు ఉంచాలి. 

సీసాలో అమర్చిన ఆకుకు, మొక్కలోని మరొక ఆకును తీసుకొని వాటికి అయోడిన్‌ పరీక్షను నిర్వహించాలి.

ఫలితం: సీసా లోపలి భాగంలోని ఆకు ఏ రంగులోకి మారదు. సీసా బయటి ఆకు మాత్రం నీలి - నలుపు రంగులోకి మారుతుంది. సీసాలోని KOH ద్రావణం సీసాలో ఉన్న గాలిలోని CO2 ను పీల్చుకుంటుంది. కాబట్టి సీసా లోపలి భాగంలోని ఆకు కిరణజన్య సంయోగక్రియ జరపనందున అది నీలి - నలుపు రంగులోకి మారదు.

IV. సమాచార సేకరణ నైపుణ్యాలు - ప్రాజెక్టు పనులు

1. కొవ్వులో కరిగే విటమిన్లను పేర్కొని వాటి వనరులు, లోపం వల్ల కలిగే వ్యాధులు, లక్షణాలను రూపొందిస్తూ పట్టిక రాయండి.

జ: కొవ్వులో కరిగే విటమిన్లు A, D, E, K.

V. బొమ్మలు గీయడం, నమూనాలు తయారుచేయడం

1. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిపే కణాంగం యొక్క నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి.

జ: మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిపే కణాంగం ‘హరితరేణువు’.

నిర్మాణం:

హరితరేణువులు పత్రంలోని పత్రాంతర కణాల్లో ఉంటాయి. 

ఇవి ఆకుపచ్చని మొక్క భాగాలన్నింటిలో ఉంటాయి.

ఇవి చక్రాభంగా ఉండి చుట్టూ రెండు త్వచాలను కలిగి ఉంటాయి.

దీని లోపల చిక్కటి వర్ణరహిత ద్రవపదార్థం ఉంటుంది. దీన్ని ‘ఆవర్ణిక’ (స్ట్రోమా) అంటారు. దీనిలో పళ్లేలు పేర్చినట్లుగా ఉన్న దొంతరలను ‘థైలకాయిడ్లు’ అంటారు.

థైలకాయిడ్‌ గుంపును ‘గ్రానా’ (పటలికా రాశి) అంటారు. ఇవి ఆవర్ణికా పటలికలతో కలిపి ఉంటాయి.

ఈ థైలకాయిడ్‌ పొరల్లో ‘పత్రహరితం, ఇతర వర్ణద్రవ్యాలు' కరిగి ఉంటాయి.

ఈ వర్ణద్రవ్యాలు కాంతి చర్య వ్యవస్థ - I (PS - I), II (PS - II)లుగా ఉంటాయి.

VI. అభినందించడం - సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం - విలువలు పాటించడం

1. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరగనట్లయితే భూగ్రహంపై సజీవులు ఉండవు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు?

జ: భూమి మీద ఆహారాన్ని తయారుచేసే ఏకైక జీవక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఇది ఆకుపచ్చని మొక్కల్లో మాత్రమే జరుగుతుంది.

అన్ని జీవరాశులు ఆహారం కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మొక్కల మీద ఆధారపడుతున్నాయి.

జీవులకు ఆహారాన్ని మాత్రమే కాకుండా ఆక్సిజన్‌ను అందించే అద్భుత ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ. ఈ క్రియ వల్లే మనం శ్వాసించడానికి కావాల్సిన ఆక్సిజన్‌ లభిస్తుంది. కాబట్టి జీవులన్నీ ఆహారం, ఆక్సిజన్‌ కోసం మొక్కలపై ఆధారపడతాయి. 

కిరణజన్య సంయోగక్రియ కోసం ఎక్కువ చెట్లను పెంచి జీవరాశుల జీవితకాలాన్ని పెంచవచ్చు.

మాదిరి ప్రశ్నలు

ఒక మార్కు ప్రశ్నలు

1. మొక్కల్లో కొత్తగా ఏర్పడిన ఎరుపురంగు లేత ఆకులు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయా?

2. జీర్ణక్రియలో జరిగే ప్రధాన దశలు ఏవి?

3. కాంతిశక్తిని రసాయన శక్తిగా మార్చే క్రియను కిరణజన్య సంయోగక్రియగా మీరు సమర్థిస్తారా?

4. పోషకాహార లోపం అంటే ఏమిటి?

5. కిరణజన్య సంయోగక్రియలోని దశలు ఏవి?

6. హిల్‌ చర్యను తెలపండి.

7. జీర్ణవ్యవస్థలో పెరిస్టాలిటిక్‌ చలనాలు ఉన్న భాగాలను తెలపండి.

8. ఎంజైమ్స్‌ లేని జీర్ణరసం ఏది? జీర్ణక్రియలో దాని పాత్రను తెలపండి.

9. న్యూనతా వ్యాధులు అంటే ఏమిటి?

10. గోధుమలు, జొన్నలు, బియ్యం లాంటి వాటిని నమిలితే కొంత సమయం తర్వాత అవి తియ్యగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు?

రెండు మార్కుల ప్రశ్నలు

1. పారామీషియంలో పోషణ విధానాన్ని తెలపండి.

2. జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడటానికి కారణాలు తెలిపి, నివారణా చర్యలు రాయండి.

3. అజీర్తి కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

4. జ్వరంతో ఉన్నప్పుడు వైద్యులు జంక్‌ఫుడ్‌ తినకూడదంటారు. ఎందుకు?

నాలుగు మార్కుల ప్రశ్న

1. మొక్కల పత్రాల్లో పిండిపదార్థపు ఉనికిని గుర్తించడానికి మీరు చేసిన ప్రయోగ విధానాన్ని తెలపండి.

Posted Date : 22-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం