• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవ‌క్రియ‌ల్లో సమన్వయం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

విషయావగాహన  

1. ఆకలి కోరిక అంటే ఏమిటి?

జ: * రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు, జీర్ణాశయంలో ఖాళీ అయినప్పుడు, జీర్ణాశయ గోడల్లోని కణాలు గ్రీలిన్ అనే హర్మోన్‌ను స్రవిస్తాయి.

¤ * ఈ హార్మోన్ వల్ల ఆకలి సంకేతాలు ఉత్పత్తి అయి, మెదడుకు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో మొదలవుతాయి.

¤ * ఇవి దాదాపు 30 - 45 నిమిషాల వరకు ఉంటాయి.

¤ * దీనికి 10వ కపాల నాడి అయిన వేగస్‌నాడి కీలక పాత్ర వహిస్తుంది.

2. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో ఏయే వ్యవస్థలు తోడ్పడతాయి?

జ:¤ * జీర్ణక్రియ నోటిలోనే ప్రారంభం అవుతుంది.

¤ * ఆహారం జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థ, అంతస్రావీ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి.

¤ * అంతస్రావీ వ్యవస్థ స్రవించే గ్రీలిన్ హార్మోన్ ఆకలి సంకేతాలను పెంచగా, లెప్టిన్ హార్మోన్ తగ్గిస్తుంది.

¤ * ఆకలి సంకేతాలు నాడుల ద్వారా మెదడుకు చేరి సంబంధిత ఆదేశాలు వస్తాయి.

¤ * జీర్ణమైన ఆహారం చిన్న పేగులోని చూషకాల నుంచి రక్తప్రసరణ వ్యవస్థలోకి శోషణం చెందుతుంది.

3. ఆహార పదార్థాల వాసన ఆకలిని పెంచుతుందని రఫీ అన్నాడు. అతడి వ్యాఖ్య సరైనదేనా? ఎలా?

జ: సరైంది. రుచి, వాసన చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.

¤ * రుచి, వాసన గ్రాహకాలు రసాయన గ్రాహకాలు.

¤ * ఆహారం మంచి వాసన కలిగి ఉండటం వల్ల ష్రూణ గ్రాహకాలు ప్రతిస్పందించి వార్తలను మెదడుకు పంపుతాయి.

¤ * మంచి వాసన వల్ల తినాలనే కోరిక మరింత పెరిగి ఎక్కువ తింటాం. కాబట్టి మంచి వాసన ఆకలిని పెంచుతుందని చెప్పవచ్చు.

¤ * ఆహారం రుచిగా ఉన్నప్పటికీ చెడు వాసన వస్తే దాన్ని మనం తినలేం.

4. పెరిస్టాలిసిస్, సంవరిణీ కండరాల గురించి రాయండి.

జ: పెరిస్టాలిసిస్:

¤ * ఆహారపు ముద్ద ఆహార వాహికలో ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే అలల లాంటి చలనాన్ని 'పెరిస్టాలిటిక్ చలనం' అంటారు. దీన్నే పెరిస్టాలిసిస్ అంటారు.

¤ * నోటిలో ఆహారం నమిలిన తర్వాత ముద్దగా మారుతుంది. దీన్నే 'బోలస్' అంటారు.

¤ * 'మింగడం' ద్వారా బోలస్ ఆహార వాహికలోకి ప్రవేశిస్తుంది.

¤ * ఆహార వాహికలోని స్తంభాకార కండరాల సడలింపు వల్ల, బోలస్ ముందు భాగం పొడవు తగ్గి వెడల్పు అవుతుంది.

¤ * ఇదే సమయంలో బోలస్ పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెందడం వల్ల బోలస్ కిందకు నెట్టబడుతుంది.

¤ * దీనితో పాటు ఆహార వాహికలోని మ్యూసిన్ (శ్లేష్మం) బోలస్ జారడానికి సహాయపడుతుంది.

¤ * ఇలా ఆహారవాహికలో కండరాల సంకోచ - వ్యాకోచాల వల్ల తరంగాకార చలనం ఏర్పడి బోలస్ జీర్ణాశయాన్ని చేరుతుంది. ఈ ప్రక్రియనే 'పెరిస్టాలిసిస్' అంటారు.

సంవరణీ కండరం

¤ * జీర్ణాశయ పరభాగంలో స్వయం నియంత్రిత కండరం ఉంటుంది. దీన్ని 'జఠర నిర్గమ సంవరిణి' అంటారు.

¤ * ఇది జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.

¤ * జీర్ణాశయంలోని ఆహారం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని 'కైమ్' అంటారు.

 * కైమ్ ఏర్పడిన తర్వాత కండరం తెరుచుకుని కొద్దికొద్దిగా ఆంత్రమూలాన్ని చేరుతుంది.

¤ * ఆంత్రమూలాన్ని చేరిన కైమ్ ఆధారంగా ఈ కండరం మూసుకుపోతుంది.

¤ * దీనివల్ల నిర్దిష్ట పరిమాణంలో ఆహారం ఆంత్రమూలానికి చేరి పూర్తిగా జీర్ణం అవుతుంది.

5. కింద ఇచ్చిన జీర్ణ వ్యవస్థలోని భాగాన్ని పరిశీలించండి. ఇది ఏమిటి? ఇది నిర్వర్తించే పనులను రాయండి.

జ: * పటంలో చూపిన బొమ్మ మానవ జీర్ణ వ్యవస్థలోని 'జీర్ణాశయం'.     

¤ * జీర్ణాశయం - జీర్ణ వ్యవస్థలో ఆహారవాహిక తర్వాతి భాగం. ఇది పెద్దదిగా సంచిలా ఉండే కండర నిర్మాణం.

¤ * జీర్ణాశయ పూర్వ భాగాన్ని హార్థిక జీర్ణాశయం అనీ, పర భాగాన్ని జఠర జీర్ణాశయం అని పిలుస్తారు.

¤ * జీర్ణాశయ గోడలు మందంగా ఉండి, జఠర గ్రంథులతో జఠర రసాన్ని స్రవిస్తాయి.

విధులు

1. జీర్ణాశయం ప్రధానంగా ఆహార నిల్వ (4 - 5 గంటలు) చేస్తుంది.

2. జీర్ణాశయంలో HCl ఉండి సూక్ష్మజీవులను చంపుతుంది.

3. జీర్ణాశయ ఆయత, వలయ, వాలు కండరాలు ఆహారాన్ని బాగా చిలుకుతాయి.

4. జఠర రసంలోని లైపేజ్, రెనిన్, అమైలేజ్ ఎంజైములు ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాయి.

5. ఈ ఎంజైముల వల్ల జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణం అవుతుంది. దీన్ని 'కైమ్' అంటారు.

6.  కిందివాటికి తగిన కారణాలు తెలపండి.

ఎ) నాలుకతో అంగిలిని నొక్కిపట్టడం ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.

బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు మనకు ఆకలి వేస్తుంది.

డి) చిన్న పేగు చుట్టుకుని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.

జ: ఎ) నాలుకతో అంగిలిని నొక్కిపట్టడం ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.

   నోటిలో ఆహారం లాలాజలంలో కరిగి ద్రవస్థితికి మారుతుంది. నాలుకతో అంగిలిని నొక్కడం వల్ల ఈ ద్రవ ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గల్లోకి ప్రయాణిస్తుంది. రుచి మొగ్గల్లోని రుచి గ్రాహక కణాలు

ఆహార రుచిని గ్రహించి, మెదడుకు సందేశాలు పంపుతాయి.

బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

   నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు ఆహారం రుచిని గుర్తిస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉన్న ఆహార పదార్థాల రుచిని సులువుగా గుర్తిస్తాయి. ఆహారం బాగా వేడిగా ఉన్నప్పుడు రుచి మొగ్గల్లోని గ్రాహక కణాలు రుచిని సరిగా గుర్తించలేవు. అందువల్ల ఆహారం వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు మనకు ఆకలి వేస్తుంది.

¤ రక్తంలోని గ్లూకోజ్‌ను కణజాలం వినియోగించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది.
¤ ఈ సమయంలో జీర్ణాశయ గోడలు గ్రీలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది జీర్ణాశయంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

డి) చిన్నపేగు చుట్టుకునిఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.

¤ చిన్న పేగు ప్రధాన విధి శోషణ.

¤ జీర్ణమైన ఆహారం రక్తంలోకి ప్రవేశించడాన్ని శోషణ అంటారు.

¤ శోషణ ప్రక్రియ జరగడానికి ఎక్కువ ఉపరితలం అవసరం. కాబట్టి చిన్న పేగు పొడవుగా, కొద్ది స్థలంలో అమరడానికి వీలుగా ముడతలు పడి చుట్టుకుని ఉంటుంది.

¤ శోషణతల వైశాల్యాన్ని పెంచడానికి చిన్న పేగు లోపలి గోడలు ముడతలు పడి ఆంత్రచూషకాలుగా మారుతాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుని రక్తంలోకి చేర్చుతాయి.

7.  కిందివాటి మధ్య భేదాలు రాయండి.

ఎ) బోలస్ - కైమ్ బి) చిన్న పేగు - పెద్ద పేగు సి) మాస్టికేషన్ - రుమినేషన్ డి) మొదటి మెదడు - రెండో మెదడు

జ:

8.  మీ నోరు ఒక నమిలే యంత్రం అని ఎలా చెప్పగలవు?

జ: ¤ జీర్ణవ్యవస్థ మొదటి భాగం నోరు. ఇది ఆహారాన్ని ముక్కలుగా చేసి లాలాజలంతో కలుపుతుంది.

¤ నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి రెండు దవడల మీద దంతాలు అమరి ఉంటాయి.

¤ నోటిలో 4 రకాల దంతాలు ఉంటాయి. అవి

    1. కుంతకాలు - కొరకడానికి,

    2. రధనికలు - చీల్చడానికి,

    3. అగ్రచర్వణకాలు - నమలడానికి,

    4 చర్వణకాలు - విసరడానికి ఉపయోగపడతాయి.

¤ ఈ దంతాలు ఆహారాన్ని ముక్కలుగా చేయడం వల్ల నోరును నమిలే యంత్రంగా పరిగణించవచ్చు.

9.  మాస్టికేషన్ అంటే ఏమిటి? అందుకు తోడ్పడే వివిధ రకాల దంతాల గురించి వివరించండి.

జ: నోటిలో ఆహారాన్ని నమిలి చూర్ణం చేయడాన్ని 'మాస్టికేషన్' అంటారు. ఈ ప్రక్రియకు 4 రకాల దంతాలు తోడ్పడతాయి. అవి

10.  ఆహార పదార్థాలు నోటి నుంచి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరే మార్గంలో కండర వ్యవస్థ నియంత్రణ ఏ విధంగా పనిచేస్తుంది?

జ:¤ * జీర్ణ వ్యవస్థలో ఆహార పదార్థాల కదలికను కండర వ్యవస్థ నియంత్రిస్తుంది.

¤ * నోటిలో నమిలిన ఆహారం ముద్దగా మారుతుంది. దీన్ని 'బోలస్' అంటారు.

¤ * మింగడం అనే ప్రక్రియ వల్ల బోలస్ ఆహార వాహికలోకి నెట్టబడుతుంది.

¤ * ఆహారవాహికలో అలల లాంటి తరంగ చలనం వల్ల ఆహారం జీర్ణాశయం చేరుతుంది. ఈ చలనాన్ని 'పెరిస్టాలిటిక్' చలనం అంటారు.

¤ * ఈ చలనంలో బోలస్ పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెంది ఆహారాన్ని కిందకు నెడతాయి.

¤ * అదే సమయంలో బోలస్ కింద ఉన్న ఆయత కండరాలు సడలి ఆహారం కిందకు జారడానికి మార్గం సుగమం చేస్తాయి.

¤ * ఈ కండరాల సంకోచ - సడలింపులు ఏకాంతరంగా జరుగుతూ ఆహారవాహికలో అల లాంటి చలనాన్ని ఏర్పరచి ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరుస్తాయి.

11.  చిన్న పేగు చుట్టుకొని అనేక ముడతలుగా ఉండటానికి గల కారణం ఏమైనా ఉందా? జీర్ణక్రియకు అది ఏ విధంగా తోడ్పడుతుంది?

జ:¤ ఉంది. చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై, శోషణం జరుగుతుంది.

¤ * జీర్ణమైన ఆహారం రక్తంలోకి పీల్చుకోవడాన్ని 'శోషణం' అంటారు.

¤ * శోషణ తల వైశాల్యాన్ని పెంచడానికి చిన్న పేగు పొడవుగా, తక్కువ స్థలంలో అమరడానికి అనేక ముడతలుగా చుట్టుకుని ఉంటుంది.

¤ * చిన్న పేగు లోపలి తలం ముడతలు పడి ఆంత్రచూషకాలుగా ఏర్పడుతుంది.

¤ * చిన్న పేగు శోషణతో పాటు జీర్ణక్రియకు ఉపయోగపడే ఆంత్రరసాన్ని ఉత్పత్తి చేస్తుంది.

12.  కింది భాగాల్లో పెరిస్టాలిసిస్ విధులను తెలపండి.

ఎ) ఆహార వాహిక బి) జీర్ణాశయం సి) చిన్న పేగు డి) పెద్ద పేగు

జ: ఎ) ఆహార వాహిక: ఆహార వాహికలోని 'పెరిస్టాలిసిస్' చలనం వల్ల ఆహారం నోటి నుంచి జీర్ణాశయానికి చేరుతుంది.

బి) జీర్ణాశయం: జీర్ణాశయంలోని పెరిస్టాలిసిస్ చలనం వల్ల ఆహారం జఠరరసంతో బాగా కలిసి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని చిలకడానికి, కదపడానికి జీర్ణాశయంలో 'పెరిస్టాలిసిస్' తోడ్పడుతుంది.

సి) చిన్న పేగు: చిన్న పేగులో పెరిస్టాలిసిస్ చలనం వల్ల ఆహారం నెమ్మదిగా ముందుకు కదిలి పెద్ద పేగును చేరుతుంది.

డి) పెద్ద పేగు: పెద్ద పేగులో పెరిస్టాలిసిస్ చలనం వల్ల వ్యర్థ పదార్థాలు క్రమేణా ముందుకు జరిగి పాయువు ద్వారా విసర్జితం అవుతాయి.

ప్రశ్నించడం, పరికల్పన చేయడం 

1. లాలాజల గ్రంథుల నాళాలు మూసుకొనిపోతే ఏమవుతుంది?

జ: * ¤లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలోని అమైలేజ్ ఎంజైమ్ పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తుంది.

¤ * లాలాజల గ్రంథుల నాళాలు మూసుకునిపోతే నోటిలోకి లాలాజలం స్రవించదు.

¤ * దీనివల్ల ఆహారం ముద్దగా మారి బోలస్‌గా ఏర్పడదు. మింగడం కష్టం.

¤ * ఆహారం కరగదు, రుచి తెలియదు ఎందుకంటే రుచి గ్రాహకాలు రసాయన గ్రాహకాలు. ఇవి కరిగినప్పుడే రుచిని గుర్తిస్తాయి.

¤ * పిండి పదార్థాలు చక్కెరగా మారవు.

2.  జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల సమన్వయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రశ్నావళిని తయారు చేయండి.

జ: 1. జీర్ణక్రియలో ఏయే గ్రంథులు ఉపయోగపడతాయి?

   2. జీర్ణగ్రంథుల పనికి, నాడీ వ్యవస్థకు మధ్య సంబంధం ఏమిటి?

   3. జీర్ణమండల నాడీ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా?

   4. జీర్ణాశయాన్ని రెండో మెదడుగా ఎందుకు పరిగణిస్తారు?

   5. న్యూరోట్రాన్స్‌మీటర్స్ అంటే ఏమిటి?

3.  చిన్న పేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగానే ఉంటే ఏం జరుగుతుంది?

జ:¤ చిన్న పేగుల విధి - శోషణ.  శోషణ సమర్థవంతంగా జరగడానికి ఇది బాగా పొడవు ఉండి, మెలితిరిగి ఉంటుంది. ముడతలుగా ఉండటం వల్ల శోషణ వైశాల్యం పెరుగుతుంది. ¤ చిన్న పేగు ఆహారనాళం మాదిరిగా ఆకారం, పొడవు ఉంటే పొడవు తగ్గుతుంది. శోషణ వైశాల్యం తగ్గి శోషణ సక్రమంగా జరగక, జీర్ణక్రియ ఉద్దేశం నెరవేరదు.

ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు 

1.  లాలాజలం చర్యను అర్థం చేసుకోవడానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్ధతిని, పరికరాల గురించి వివరించండి.

జ: ఉద్దేశం: పిండి పదార్థాలపై లాలాజల చర్యను అర్థం చేసుకోవడం.

పరికరాలు: పిండి పదార్థం, అయోడిన్, లాలాజలం, పరీక్షనాళిక, నీరు.

విధానం: 1) ఒక పరీక్షనాళికలో సగం వరకు నీటిని తీసుకుని, పిండిపదార్థం కలపడం వల్ల పిండి ద్రావణం ఏర్పడింది.

2) దీన్ని వాచ్ గ్లాసులో తీసుకుని అయోడిన్ కలపడం వల్ల పిండి ద్రావణం నీలి రంగుకు మారింది.

3) ఈ నీలి రంగు పిండి ద్రావణాన్ని 2 సమ భాగాలు చేసి రెండు పరీక్ష నాళికల్లో తీసుకున్నాను.

4) ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలిపాను. రెండో దానికి ఏమీ కలపలేదు.

5) పై రెండు పరీక్షనాళికలను 45 నిమిషాల పాటు స్థిరంగా ఉంచి పరిశీలించాను.

పరిశీలన: లాలాజలం కలిపిన పరీక్షనాళికలోని పిండి ద్రావణం రంగును కోల్పోయింది. దీనికి ఒక చుక్క అయోడిన్‌ను కలిపితే నీలి రంగు ఏర్పడలేదు.వివరణ: మొదటి పరీక్షనాళికలోని అయోడిన్ నీలి రంగుగా

మారలేదంటే పిండి పదార్థం లేదని అర్థం. కలిపిన లాలాజలం పిండి పదార్థంపై పనిచేయడం వల్ల పిండి పదార్థం చక్కెరగా మారింది. అందువల్ల ద్రావణం నీలి రంగుకు మారలేదు.

నిరూపణ: లాలాజలం పిండి పదార్థంపై పనిచేసి దాన్ని చక్కెరగా మారుస్తుంది.

2.  రుచిని గుర్తించడంలో అంగిలి పాత్రను నిర్ధారించేలా ఒక చిన్న ప్రయోగాన్ని సూచించండి.

జ: ఉద్దేశం: రుచిని గుర్తించడంలో అంగిలి పాత్రను నిర్ధారించడం.

పరికరాలు: చక్కెర గుళికలు, చక్కెర ద్రావణం, స్టాప్ వాచ్.

విధానం:

1) కొంచెం చక్కెరను నాలుకపై ఉంచుకుని నోరు తెరిచే ఉంచాను. నాలుక అంగిలిని తాకకుండా జాగ్రత్తపడ్డాను. స్టాప్‌వాచ్ ఉపయోగించి, నాలుకపై ఉంచిన చక్కెర గుళికల రుచి ఎంతసేపటికి తెలిసిందో గమనించి సమయం నమోదు చేశాను.

2) రెండో సందర్భంలో నోటిలో చక్కెరను అంతే పరిమాణంలో ఉంచి, నోరు మూసుకుని నాలుక అంగిలిని తాకేలా చేశాను. స్టాప్ వాచ్ ఉపయోగించి నాలుక రుచిని పట్టే సమయం గుర్తించాను.

పరిశీలన: నోరు తెరిచి ఉన్నప్పటి కంటే నోరు మూసి అంగిలి నాలుకకు తగిలిన సందర్భంలో తక్కువ సమయంలో చక్కెర రుచిని గుర్తించగలిగాను.

వివరణ: నోరు మూసినప్పుడు అంగిలి ఆహార పదార్థాలను రుచి మొగ్గల్లోకి నెట్టడం వల్ల రుచిని త్వరగా గుర్తించగలిగాను. దీని ఆధారంగా రుచిని గుర్తించడంలో అంగిలి ప్రధాన పాత్ర వహిస్తుందని నిర్ధారించవచ్చు.

నిరూపణ: రుచిని గుర్తించడంలో అంగిలి కీలక పాత్ర వహిస్తుంది.

సమాచార సేకరణ నైపుణ్యాలు - ప్రాజెక్టు పనులు 

1. మీ పాఠశాల గ్రంథాలయం నుంచి ఆకలికి సంబంధించిన సమాచారాన్ని, చిత్రాలను సేకరించి ఒక నివేదిక తయారు చేయండి.

జ:¤ * ఆకలి జంతువుల సహజ స్వభావం. ఇది శరీరం పోషకాలను కోరే స్థితి.

¤ * జీర్ణాశయంలోని గ్రీలిన్ హార్మోన్ వల్ల ఆకలి సంకేతాలు మెదడును చేరతాయి.

¤ * మెదడులోని ద్వారగోర్ధం ఆకలిని నియంత్రిస్తుంది.

¤ * ఆకలి సంకేతాలు మెదడుకు వేగస్‌నాడి (10వ కపాల నాడి) ద్వారా చేరతాయి.

¤ * ఆకలి కోరికలు 30 - 45 నిమిషాలు ఉంటాయి.      

¤ * ఆకలి కోరికను తగ్గించడానికి లెప్టిన్ స్రవిస్తుంది.

¤ * పదార్థ రుచి, వాసన, అలవాట్లపై కూడా ఆకలి ఆధారపడి ఉంటుంది.

¤ * మానవుల్లో ఆకలి నిబంధన సహిత చర్య కాబట్టి మనకు నిర్దిష్టసమయానికి ఆకలి వేస్తూ ఉంటుంది.

¤ * ఆకలి సమయానికి ఆహారం తీసుకోకపోయినా, ఆహారం దొరకని సమయంలో శరీరంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ వినియోగమవుతుంది.

బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం 

1. ఆహార పదార్థాల నుంచి రుచి సంవేదన మెదడుకు చేరే క్రమాన్ని సూచించే బ్లాక్ చిత్రం గీయండి.

2. ఆహారవాహికలో పెరిస్టాలిటిక్ కదలికలను చూపే చిత్రం గీసి భాగాలు గుర్తించండి. ఆహారవాహిక లోపలి తలంలోని శ్లేష్మస్తరం ఆవశ్యకతను వివరించండి.

జ:¤ * నోటిలోని ఆహారం, ఆహారవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది.  

¤ * ఆహారవాహికలోని పెరిస్టాలిటిక్ చలనం వల్ల ఆహారం కిందకు జరుగుతుంది.

¤ * ఆహారనాళపు గోడలు జారుడు గుణం ఉన్న జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీన్ని మ్యూసిన్ (శ్లేష్మం) అంటారు.

¤ * ఆహారనాళంలో ఆహారం సులువుగా కదలడానికి శ్లేష్మం తోడ్పడుతుంది.

¤ * శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.

¤ * దీనివల్ల ఆహార బోలస్ ఆహార వాహికలో సులభంగా కదులుతూ, కిందికి జరుగుతుంది.

3.  చిన్న పేగులోని ఆంత్రచూషకాల నిర్మాణాన్ని తెలిపే చిత్రం గీయండి. జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థల్లోని సహ సంబంధాన్ని వివరించండి.

జ:¤ * శరీరంలో జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ సమన్వయంగా పని చేస్తుంటాయి. 

¤ * జీర్ణక్రియ వల్ల జీర్ణమైన ఆహారం చిన్న పేగులోకి చేరుతుంది.  

¤ * చిన్న పేగు లోపలి తలం అనేక ముడతలు పడి వేళ్ల లాంటి ఆంత్రచూషకాలను ఏర్పరుస్తుంది.

¤ * ఈ ఆంత్రచూషకాల్లో రక్తకేశనాళికలు, లింఫ్ గ్రంథులు విస్తరించి ఉంటాయి.

¤ * జీర్ణమైన సరళ పదార్థాలు ఆంత్రచూషకంలోని రక్తంలోకి విసరణ చెందుతాయి.

¤ * రక్తంలోకి చేరిన ఆహార పదార్థాలు శరీరమంతా సరఫరా అవుతాయి.

4.  ఆహార పదార్థాల వాసన లేదా వాటిని చూసిన వెంటనే ఆకలి ప్రేరేపితం అవుతుంది. దీన్ని సూచించే చిత్రాన్ని గీయండి.

కృత్యాలు 

కృత్యం - 1 ఆకలి వేయడం: (మనకు ఆహారం అవసరం అని ఎలా తెలుస్తుంది)

   కింది పట్టికను పరిశీలించి, మీ దృష్టిలో ఆకలి వేయడానికి గల కారణాలను (4)తో గుర్తించండి. మీ స్నేహితులతో చర్చించండి.

1. ఏయే కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి?

జ: వాసన, రుచి, అలసట, నీరసం, ఆహార అవసరం లాంటి కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి.

2. ఆకలవుతోందని తెలిసేలా చేసే ఉద్దీపనల వల్ల ఫలితం ఏమిటి?

జ: ఉద్దీపనల వల్ల తినాలనే కోరిక కలిగి జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్స్ స్రవిస్తాయి.

3. మనకు ఆకలి అవుతుందని తెలియజేయడానికి ఏ వ్యవస్థ సంకేతాలను పంపుతుంది?

జ: నాడీ వ్యవస్థలోని 10వ కపాల నాడి (వేగస్‌నాడి) ఆకలి సంకేతాలను మెదడుకు పంపుతుంది.

కృత్యం - 2: రుచి, వాసన పరస్పర సంబంధం

(జీలకర్ర, సోంపు, ఆలుగడ్డ, ఆపిల్‌ను నమలడం)

¤ ముందుగా వేళ్లతో ముక్కు మూసుకుని, కొంచెం జీలకర్రను నోటిలో వేసుకుని కాసేపు నమలండి. తర్వాత సోంపు గింజలు నమలండి. వాటి రుచిని గుర్తించగలిగారా? రుచిని గుర్తించడానికి ఎంత సమయం తీసుకుంది? తర్వాత నోటిని శుభ్రంగా కడిగి ఒక చిన్న ఆపిల్ ముక్కను నమలండి. తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుని నమలండి. అయితే నమిలేటప్పుడు ముక్కును మూసుకునే ఉంచాలి.

1. నీవు పరిశీలించిన అంశాలేమిటి?

జ: ముక్కు మూసుకున్నప్పుడు జీలకర్ర, సోంపు గింజల రుచిని సరిగా గుర్తించలేకపోయాను.    

ముక్కు మూసుకున్నప్పుడు రుచిని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టింది.

ముక్కుకు, రుచికి (నాలుకకు) సంబంధం ఉండవచ్చు.

2. రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలిగారా? రెండింటి రుచి ఒకేలా ఉందా? కారణమేమిటి?

జ: రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలం. రెండింటి రుచి ఒకే విధంగా లేదు. ఈ రెండు పదార్థాలు వేర్వేరు రుచులు కలిగి ఉంటాయి.

కృత్యం - 3: రుచికి - వాసనకు దగ్గర సంబంధం

విధానం:  చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి తీసుకుని చేతి రుమాలు లేదా టిష్యూ పేపరుపై రుద్దండి. కళ్లు మూసుకుని వాసన చూడండి. మీ స్నేహితుల సహాయంతో వివిధ ఆహార పదార్థాల రుచులను చూడండి.

1. ఆపిల్ కంటే అల్లం వాసన ఘాటుగా ఉంటుందా? ఘాటైన వాసనలు రుచి స్పందనలపై ప్రభావం చూపిస్తాయని మీరు భావిస్తున్నారా?

జ: ఆపిల్ కంటే అల్లం వాసన ఘాటుగా ఉంటుంది. ఘాటైన వాసనలు రుచిపై ప్రభావం చూపుతాయి.

2. మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలను సరిగ్గా గుర్తించగలిగారు?

జ: నేను దాదాపు 6 రకాల ఆహార పదార్థాల వాసనను సరిగ్గా గుర్తించాను.

3. వాసన - రుచికి ఏమైనా సంబంధం ఉందని గ్రహించారా? కేవలం చూడటం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పగలరా?

జ: రుచికి - వాసనకు దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే సువాసన ఉన్న ఆహారం రుచిగా ఉంటుంది. కానీ, ఆహారం రుచిగా ఉన్నప్పటికీ చెడు వాసన ఉంటే దాన్ని తినలేం.
కేవలం చూడటం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పలేం.

కృత్యం - 4: రుచి నాలుకకు, అంగిలికి సంబంధించిన విషయం

                   (నాలుక మీద చక్కెర గుళికలు)

విధానం: * కొంచెం చక్కెరను నాలుకపై వేసుకోండి. మీ నోటిని తెరిచే ఉంచండి. మీ నాలుక అంగిలిని తాకకూడదు. స్టాప్ వాచ్‌ను ఉపయోగించి మీరు నాలుకపై ఉంచిన చక్కెర గుళికల రుచి ఎంత సేపటికి తెలుసుకోగలిగారో గుర్తించి సమయాన్ని నమోదు చేయండి.

      * ఇప్పుడు అదే ప్రయోగాన్ని నాలుకతో అంగిలిని నొక్కి పెట్టి చేయండి. చక్కెర గుళికల రుచి, నాలుకపై ఉంచినప్పటి నుంచి సమయాన్ని నమోదు చేయండి.

      * తర్వాత ఒక చుక్క చక్కెర ద్రావణాన్ని డ్రాపర్ ఉపయోగించి నాలుకపై వేయండి.

1. నాలుక పొడిగా ఉప్నప్పుడు రుచి తెలుస్తుందా?

జ: తెలియదు.

2. ఏ విధానం త్వరగా రుచిని గ్రహించడంలో తోడ్పడింది? ఎందుకు?

జ: నాలుకను అంగిలితో నొక్కి పెట్టినప్పుడు రుచి త్వరగా గ్రహించింది. నాలుకను అంగిలి నొక్కిపెట్టినప్పుడు ద్రవ ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గల్లోకి ప్రవేశించి రుచిని తొందరగా గ్రహించింది.

అద‌న‌పు ప్ర‌శ్న‌లు

1. పగలు నిద్రించినప్పుడు సొంగ (లాలాజలం) ఎందుకు కారుతుంది?

జ: మన జీర్ణ వ్యవస్థ రాత్రి సమయంలో కంటే పగటి వేళలో చురుకుగా ఉండటం వల్ల అది ఆహారాన్ని స్వీకరించి జీర్ణక్రియ జరపడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే పగటి వేళలో నిద్రిస్తే నోటి ద్వారా స్రవించే లాలాజలం పెదవుల వెంబడి బయటకు కారుతుంది. కానీ, రాత్రివేళలో ఇలా జరగదు.

సాధారణంగా ఒక రోజులో మనం 1 - 1.5 లీటర్ల లాలాజలం ఉత్పత్తి చేస్తాం.

2. మనకు ఆహారం అవసరం అని ఎలా తెలుస్తుంది?

జ: రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిన వెంటనే మనకు ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు 'గ్రీలిన్' అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేసి మెదడుకు పంపుతుంది. మెదడుకు సంకేతాలు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో కలుగుతాయి.

3. ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే క్రియలో పాలుపంచుకునే వ్యవస్థలను తెలపండి.

జ: ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేయడంలో అంతఃస్రావీ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థలు పాల్గొంటాయి.

4.  బంగాళదుంప కదిలే ప్రయోగానికి, ఆహారవాహికలోని ఆహార చలనానికి మధ్య పోలికలను మీరు గమనించారా? అవి ఏమిటి?

జ: సైకిల్ ట్యూబులో బంగాళదుంప కదలిక ఆహారవాహికలోని ఆహార ముద్ద కదలికను పోలి ఉంటుంది. ఈ ప్రక్రియలో సైకిల్ ట్యూబ్‌ను ఆహారవాహికతోనూ, బంగాళదుంపను ఆహారముద్దతోనూ, ట్యూబుకు రాసిన నూనెను లాలాజలంతోనూ పోల్చవచ్చు.

5.  సాధారణంగా ఆహారాన్ని నమలకుండా మింగకూడదని లేదా తొందరపడి త్వరగా తినొద్దని సలహాలిస్తుంటారు. ఎందుకు?

జ: ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల జీర్ణక్రియ ఎంజైములు సరిగా పనిచేయవు. ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది. ఆహారం బాగా నమిలినప్పుడు లాలాజలం ఎక్కువగా చేరి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కాబట్టి తొందరపడి త్వరగా తినకూడదని అంటారు.

6.  వాంతి ఎలా కలుగుతుంది?

జ: ఆహారవాహికలో జరిగే పెరిస్టాలిసిస్ చలనం అపసవ్య దిశలో జరిగితే, జీర్ణాశయంలోని ఆహారం బయటకు వస్తుంది. దీన్నే 'వాంతి' అంటారు. ఉదా: చెడిపోయిన ఆహారం/ శరీరానికి సరిపడని ఆహారం తిన్నప్పుడు వాంతి వస్తుంది.

7.  మనకు జలుబు చేసినప్పుడు ఆహార రుచిని సరిగా గుర్తించలేం. ఎందుకు?

జ: రుచి జ్ఞానం వాసనతో ముడిపడి ఉంటుంది. జలుబు చేసినప్పుడు, శ్లేష్మస్తరంలోని అధిక శ్లేష్మం వల్ల వాసనను గుర్తించలేం. కాబట్టి రుచిని కూడా సరిగా ఆస్వాదించలేం.

8.  పెద్దపేగులో మలం ఎలా ఏర్పడుతుంది?

జ:» అవసరమైన వ్యర్థ పదార్థాలు పెద్ద పేగును చేరినప్పుడు దానిలోని నీటిని పెద్ద పేగు గోడలు శోషిస్తాయి.

» పెరిస్టాలిసిస్ తరంగాలు వ్యర్థ పదార్థాలను పెద్ద పేగు నుంచి పురీషనాళంలోకి కదిలిస్తాయి. ఇక్కడ నీరు పునఃశోషణ చెందుతుంది.

»దుర్గంధంతో కూడిన ఈ పసుపు రంగులోని వ్యర్థాన్ని 'మలం' అంటారు. తర్వాత ఇది పాయువు ద్వారా బయటకు విసర్జితం అవుతుంది.

9.  మన దంతాల అమరిక 2, 1, 2, 3 అయితే '1' దేన్ని సూచిస్తుంది?

జ: రధనికలు

10.  మాంసకృత్తుల దీర్ఘ శృంఖలాలు జీర్ణ వ్యవస్థ ఏ భాగంలో విచ్ఛిన్నం అవుతాయి?

జ: ఆంత్రమూలం

11.  జీర్ణక్రియలో స్రవించే బలమైన ఆమ్లం ఏది?

జ: హైడ్రోక్లోరికామ్లం

12.  వేటిలో ఉండే ఘ్రాణగ్రాహికలు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి?

జ: ముక్కు

13.  లాలాజల పీహెచ్ స్వభావం ఏమిటి?

జ: క్షార స్వభావం

 

 

రచయిత: శివలింగా గౌడ్ 

Posted Date : 18-12-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

జీవశాస్త్రం

ఇతర సబ్జెక్టులు