• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

భారతదేశానికి ఉత్తరాన, మంచుతో కప్పబడి నెలవంకను అలంకరించినట్లు ముగ్ధమనోహరంగా కనిపించే హిమాలయాలను చూసి, అందంలో మేమూ తీసిపోము అంటున్నాయి వాయువ్య దిశలోని ఎడారి ఇసుక తిన్నెలు. తూర్పు, పశ్చిమతీర మైదానాల మధ్యలో ద్వీపకల్ప పీఠభూమి; తెల్లటి కొండల దిగువున పచ్చటి తివాచీలు పరచినట్లుగా ప్రకృతి అందాలను ఒలకబోస్తున్న గంగా - సింధూనది మైదానాలు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో, వివిధ వృక్ష జాతులతో కళకళలాడుతూ మేము మీకు దూరంగా ఉన్నా మీ చుట్టాలమే అంటున్నాయి అండమాన్ నికోబార్, లక్షద్వీప దీవులు. విశాల భారత భూభాగంలో ఒక చోట ఉన్నట్లు మరోచోట ఉండదు. ఇవీ మనదేశంలోని విశిష్ట, వైవిధ్య రూపురేఖలున్న భౌగోళిక స్వరూపాలు.

ప్రపంచంలో భారతదేశం ఎక్కడ?

కొత్త వ్యక్తులకు లేదా తెలిసిన వారికి మన చిరునామా చెప్పాల్సి వచ్చినప్పుడు వారికి  రైతు బజారు దగ్గర అనో, పోస్టాఫీస్ పక్కన అనో కొన్ని ఆధారాలతో చెబుతాం. అదేవిధంగా భూమిపై ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని కచ్చితంగా చెప్పాలంటే అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా చెప్పవచ్చు. భారత దేశం భౌగోళికంగా 8º 4' - 37º 6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68º 7' - 97º 25' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణంగా 30º పొడవునా; రేఖాంశాల పరంగా  తూర్పు పడమరలుగా కూడా 30º వెడల్పున వ్యాపించి ఉంది. ఆసియా ఖండంలో దక్షిణ భాగాన ఉన్న మనదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. (భూమధ్య రేఖ (0 డిగ్రీలు) నుంచి ఉత్తర ధ్రువం వరకు ఉన్న అర్ధభాగాన్ని 'ఉత్తరార్ధ గోళమని', గ్రీనిచ్ రేఖాంశం (0 డిగ్రీలు) నుంచి తూర్పున 180º వరకు ఉన్న అర్ధ భాగాన్ని 'పూర్వార్ధ గోళం' అని అంటారు.)

అన్నిదేశాల్లో ఒకే సమయం ఉంటుందా?

ఇతర దేశాల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు టి.వి.ల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉంటారు. రాత్రి సమయంలో అక్కడ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ పగటి సమయంలో, అక్కడ పగటి సమయంలో మ్యాచ్ జరుగుతూ ఉంటే ఇక్కడ రాత్రి సమయంలో మ్యాచ్‌ను చూస్తుంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న కారణంగా వివిధ దేశాల సమయాల్లో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒకే సమయం ఉండదు.

భారతదేశంలో ఇలా.......

రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా మనదేశం 30º విస్తరించి ఉండటంతో, గుజరాత్‌లోని ద్వారకలో కంటే అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు గంటల ముందే సూర్యోదయం అవుతుంది. భారతదేశంలో వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని వైవిధ్యాన్ని తొలగించడానికి 82º 30' తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించారు. ఈ రేఖ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ద్వారా ప్రయాణిస్తోంది. అవి: ఉత్తర ప్రదేశ్ (అలహాబాద్), ఆంధ్ర ప్రదేశ్ (కాకినాడ), చత్తీస్‌గఢ్ (రాయపూర్), ఒడిశా (కోరాపూట్), పాండిచ్చేరి (యానాం).

గ్రీనిచ్ రేఖాంశం:

ప్రపంచ ప్రామాణిక కాలంగా సున్నా డిగ్రీ (0º)ల గ్రీనిచ్ రేఖాంశాన్ని తీసుకున్నారు. ఇది లండన్ నగరంలోని గ్రీనిచ్ అనే ప్రాంతం ద్వారా వెళుతోంది.

గ్రీనిచ్ కాలం కంటే భారత ప్రామాణిక కాలం కచ్చితంగా 5 గంటల ముందు ఉంటుంది.

ఉదా: లండన్‌లో ఉదయం 6 గంటల 30 నిమిషాలైతే, భారత్‌లో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది.

భూమి - మార్పులు:

పురాజీవ మహాయుగానికి పూర్వం ప్రపంచంలోని భూభాగమంతా సంఘటితంగా ఇమిడి ఒకే ఖండంగా ఉండేది. దీన్ని 'పేంజియా' అంటారు. దీని మధ్యలో 'బెథిస్ సముద్రం' ఉండేది. దీనికి ఉత్తరంగా లారెన్షియా భూభాగం (అంగారా భూమి) ఉండేది. నేటి ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలు దీనిలోని భూభాగాలే. టెథిస్ సముద్రానికి దక్షిణంగా 'గోండ్వానా భూమి' ఉండేది. నేటి ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ భారతదేశం, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు గోండ్వానా భూమిలో భాగాలు. అంతర్జనిత శక్తి వల్ల పేంజియా విచ్ఛిన్నమై, దాని భూఖండాల్లో చలనం మొదలై అవి దూరంగా జరిగి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్న భూఖండాలుగా ఏర్పడ్డాయి.

భారత్ ద్వీపకల్పం ఇలా....    

భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది. 20 కోట్ల సంవత్సరాల కిందట గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయింది. భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి యురేసియా ఫలకం (అంగార భూమి)తో ఢీకొంది. ఇలా ఢీకొనడం వల్ల తీవ్ర ఒత్తిడి ఏర్పడి, లక్షల సంవత్సరాల క్రమంలో ముడత పడే ప్రక్రియ వల్ల ఇప్పటి హిమాలయాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలి, ఒక పెద్దలోయ ఏర్పడింది. ఈలోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేట వేసింది. భూగర్భ నిర్మాణాలు, శిలాశైథిల్యం, క్రమక్షయం, నిక్షేపణం లాంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం, నేలలు ఏర్పడ్డాయి. లక్షల సంవత్సరాల నుంచి ఈ అంశాలు నేడు మనం చూస్తున్న భౌతిక స్వరూపాన్ని ఏర్పరిచి, మారుస్తూ వచ్చాయి.

ప్రధాన భూస్వరూపాలివి:

విశాల క్షేత్రియ భూభాగ విస్తృతి ఉన్న భారతదేశంలో భౌతికంగా వివిధ రూపురేఖలు గోచరిస్తాయి. మనదేశంలో ఆరు ప్రధాన భూస్వరూపాలున్నాయి. అవి:

1) హిమాలయాలు

2) గంగా - సింధూనది మైదానం

3) ద్వీపకల్ప పీఠభూమి

4) తీరప్రాంత మైదానాలు

5) ఎడారి ప్రాంతం

6) దీవులు

హిమాలయాలు:

హిమం అంటే సంస్కృతంలో మంచు అని అర్థం. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండటంతో హిమాలయాలనే పేరు వచ్చింది. ఇవి భారతదేశానికి ఉత్తరాన ఒక చాపంలా పడమర నుంచి తూర్పునకు 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో హిమాలయాలు 500 కి.మీ. వెడల్పు ఉండగా మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కి.మీ. వెడల్పుతో ఉన్నాయి. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు పర్వత శ్రేణులున్నాయి. అవి: హిమాద్రి (ఉన్నత హిమాలయాలు), నిమ్న హిమాలయాలు, శివాలిక్‌ శ్రేణి.

ప్రాముఖ్యం:

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుందర సుమనోహర కాశ్మీరు లోయ హిమాలయాల్లోనే ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడటానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు వస్తారు. తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను ఇవి అడ్డుకుంటున్నాయి. భారతదేశంలో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇక్కడ జన్మించిన నదులు సంవత్సరం పొడవునా నీళ్లతో ఉంటాయి వీటినే జీవనదులు అంటారు. ఈ నదులు కొండల నుంచి ఒండ్రుమట్టిని తెచ్చి దిగువన ఉన్న మైదాన ప్రాంతాలను సారవంతంగా చేస్తున్నాయి.

గంగా - సింధూనది మైదానం:

ఉత్తర భారత మహా మైదానాలుగా పిలిచే ఈ మైదానాలు పురాతన కాలం నుంచి నేటి వరకు ఎక్కువ జనాభాతో, విశిష్టమైన నాగరికతతో ప్రసిద్ధి చెందాయి. హిమాలయ నదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదుల వల్ల ఈ మైదానం ఏర్పడింది. దీన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజింపవచ్చు.

అవి:

1) పశ్చిమ భాగం

2) మధ్యభాగం

3) తూర్పు భాగం.

హిమాలయాల నుంచి దక్షిణంగా జీవనదులు ప్రవహించే క్రమంలో వివిధ రకాల ఉపరితల భూస్వరూపాలు ఏర్పడ్డాయి. శివాలిక్ పర్వతపాద భాగంలో నిక్షేపిత భూస్వరూపాన్ని భాబర్ అంటారు. భాబర్ మండలం దిగువగా అనేక చిన్న హిమాలయ నదులు ప్రవహిస్తున్నాయి. అవి భాబర్ నుంచి ఉపరితలానికి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంలో చిత్తడి ప్రదేశం ఏర్పడింది. దీన్నే 'టెరాయి' అంటారు. టెరాయి ప్రాంతానికి దక్షిణ భాగంలో మెత్తటి ఒండ్రుమట్టితో కూడిన ప్రాంతాలు ఏర్పడ్డాయి.

ద్వీపకల్ప పీఠభూమికి ఆపేరెలా వచ్చింది?

భారతదేశ పీఠభూమికి మూడువైపులా సముద్రాలు ఉండటం వల్ల  'ద్వీపకల్ప పీఠభూమి' అనే పేరొచ్చింది. ఇది దేశంలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం. ఈ పీఠభూమిని ఉత్తరాన 'మాళ్వా పీఠభూమి' (మధ్య ఉన్నత భూములు)గా, దక్షిణాన దక్కన్ పీఠభూమిగా విభజింపవచ్చు. త్రిభుజాకారంగా ఉండే దక్కన్ పీఠభూమిని, దీనికి ఉత్తరంగా ఉన్న మధ్య ఉన్నత భూములను నర్మదా నది విడదీస్తుంది. ఉన్నత భూములకు పశ్చిమాన ఉన్న మాళ్వా పీఠభూమి, తూర్పున ఉన్న ఛోటా నాగపూర్ పీఠభూమి ముఖ్యమైన పీఠభూములు. దక్కన్ పీఠభూమికి పశ్చిమ, తూర్పు సరిహద్దులుగా పశ్చిమ, తూర్పుకనుమలు; దక్షిణంగా నీలగిరి పర్వతాలున్నాయి. దక్కన్ పీఠభూమి పడమటి నుంచి తూర్పునకు కొద్దిగా వాలి ఉంది.

పడమటి కనుమలు:

ఇవి పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి. పడమటి కనుమలు గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలతో కలుస్తాయి. ఊటీ అని పిలిచే ఉదక మండలం నీలగిరి పర్వతాల్లోనే ఉంది. ఇది ప్రఖ్యాతి గాంచిన వేసవి విహార కేంద్రం. నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2637 మీ.).

తూర్పు కనుమలు:

ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటి దక్షిణ శాఖ అక్కడక్కడ తెగినట్లు కనిపిస్తుంది. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి, కృష్ణా నదులు పీఠభూమి ద్వారా ప్రవహిస్తూ తూర్పు కనుమల మధ్య నుంచి ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

భారతదేశ గొప్ప ఎడారి:

మనదేశంలో వాయువ్యంగా ఉన్న 'థార్ ఎడారి' అతిపెద్ద ఎడారి. అందుకే దీన్ని 'భారతదేశ గొప్ప ఎడారి' అంటారు. ఇది రాజస్థాన్‌లో అధిక భాగం  విస్తరించి ఉంది. థార్ ఎడారి ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన ఇందిరా గాంధీ కాలువ (650 కి.మీ.) ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ కాలువ థార్ ఎడారికి నీరు అందిస్తుంది. దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది.

తీర మైదానాలు:

ద్వీపకల్ప పీఠభూమి దక్షిణభాగంలో పశ్చిమాన అరేబియా సముద్రం వెంట ఉన్న తీరప్రాంతాన్ని 'పశ్చిమ తీర మైదానం' అని, తూర్పున బంగాళాఖాతం వెంట ఉన్న తీరాన్ని 'తూర్పు తీర మైదానం' అని అంటారు. ఈ రెండు తీర మైదానాలకు విభిన్న లక్షణాలు ఉంటాయి. వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు.

పడమటి తీర మైదానం:

ఇది 10 - 15 కి.మీ. వెడల్పుతో రాణ్ ఆఫ్ కచ్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించి ఉంది. తూర్పు తీర మైదానం కంటే వెడల్పు తక్కువగా ఉండే ఈ తీరప్రాంత మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరయి ఉంటుంది. పడమటి తీర మైదానాలను ఆయా ప్రాంతాల్లో కొంకణ్, కెనరా, మలబార్ తీరప్రాంతాలుగా పిలుస్తారు. 

తూర్పు తీర మైదానం:

ఈ మైదానం పశ్చిమ తీర మైదానాల కంటే వెడల్పుగా, తేమతో, డెల్టాలతో కూడి ఉంటుంది. ఇది ఒడిశాలోని మహానది నుంచి, తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానంలోని డెల్టా ప్రాంతాలు సారవంతంగా ఉండి వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాయి. కోస్తా ప్రాంతంలో చేప వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఈ మైదానాలను ఉత్కల్, సర్కార్, కోరమాండల్ తీరాలుగా విభజించారు.

దీవులు

ద్వీపకల్పంగా పిలిచే మనదేశంలో దీవులు కూడా ఉండటం విశేషం. భారతదేశంలో సుమారు 615 దీవులున్నాయి. బంగాళాఖాతంలో 572, మిగిలిన 43 దీవులు అరేబియా సముద్రంలో విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవుల్లోని నార్కొండాం, బారెన్ దీవులు అగ్ని పర్వతాల వల్ల ఏర్పడగా, లక్షద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుంచి ఏర్పడ్డాయి.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం