• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 ప్రపంచీకరణ

పురాతన కాలంలో లేఖలను పావురాలు చేరవేసేవని చెబుతారు. రాజరికపాలనలో భటులు వర్తమానాలను తీసుకెళ్లేవారు. తర్వాత ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాం. వీటన్నింటి ద్వారా సమాచారం చేరవేయడానికి చాలా సమయం పట్టేది. ప్రస్తుతం చరవాణి (సెల్‌ఫోన్)తో నిమిషాల్లో దేశ, విదేశాలలో ఉన్నవారితో మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ కాలప్రవాహంలో వచ్చిన మార్పులు.
          లండన్‌లోని ఒక వార్తాపత్రికను దిల్లీలో డిజైన్ చేసి ముద్రిస్తారు. పత్రికలో ప్రచురించాల్సిన అంశాలు లండన్ నుంచి అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా దిల్లీ కార్యాలయానికి చేరుకుంటాయి. దిల్లీలో పత్రిక డిజైనింగ్ అంతా కంప్యూటర్లో చేసి ఇంటర్నెట్ ద్వారా లండన్ పంపుతారు. ముద్రించిన పత్రికలను విమానంలో లండన్ చేరవేస్తారు. డిజైనింగ్, ముద్రణకు అయిన డబ్బును లండన్‌లోని బ్యాంకు నుంచి దిల్లీలోని బ్యాంకుకు ఇంటర్నెట్ (ఈ-బ్యాంకింగ్) ద్వారా తక్షణమే పంపిస్తారు. ఇది నేటి ప్రపంచంలో కొన్ని రంగాల్లో ఉన్న పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడంతో దేశాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది.

భారతదేశంలో వ్యాపారం
          లండన్ నుంచి ఒక వీడియో ప్రకటన వచ్చింది. భారతదేశంలో చందాదారుల సంఖ్య పెంచుకోవడం దీని ఉద్దేశం. భారతీయ పాఠకులను ఆకట్టుకోవడానికి చైనా వంటి దేశాలు భారతదేశంపై శ్రద్ధపెట్టి భారతీయ భాషలను నేర్చుకుంటు చెబుతున్నట్లుగా ఆ ప్రకటనలో ఉంది. ఈ ప్రకటనలో ప్రపంచీకరణ వివిధ కోణాలను మీరు చూడవచ్చు. చైనీయులు భారతీయ భాషలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ, భారతదేశంలో తమ వస్తువులను అమ్మాలని, తమ కార్మికులను ఇక్కడికి పంపించాలని, భారతీయ భాగస్వాములతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు.

ప్రపంచీకరణ
          20వ శతాబ్దం చివరలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను 'ప్రపంచీకరణ' అంటారు. ఇది ప్రపంచమంతా సంభవించిన గొప్ప మార్పు. దీనికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు దోహదపడ్డాయి.

మూడు రకాల ప్రవాహాలు
          మార్కెట్‌లో పెద్ద సంఖ్యలో వినియోగ వస్తువులు లభిస్తున్నాయని మనకు తెలుసు. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడులతో మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండోది శ్రమ ప్రవాహం (ఉపాధి వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం). మూడోది పెట్టుబడి ప్రవాహం (స్వల్పకాల, దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూరప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించటం).

అరబ్ వసంతం
          ప్రపంచీకరణకున్న రాజకీయ, సాంస్కృతిక కోణాలను కింది ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక దానితో ఒకటి ప్రభావితమైన పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, ట్యునీషియా, ఈజిప్టు లాంటి అనేక దేశాల్లో నియంతలను తొలగించడానికి విప్లవాలు జరిగాయి. ప్రసార మాధ్యమాల్లో దీన్ని 'అరబ్ వసంతం' అని పేర్కొన్నారు.

ప్రసార మాధ్యమాల కీలకపాత్ర
          పైన తెలిపిన దేశాల్లో ప్రసారమాధ్యమాలు కీలక పాత్రను పోషించాయి. ఇతర దేశాల యాజమాన్యంలో ఉండి వారు నడుపుతున్న టీవీ ఛానళ్లు ప్రజలకు మద్దతు ఇవ్వడంతో స్థానిక నాయకుల అధికారాలను నియంత్రించడానికి వీలైంది. పౌర యుద్ధం, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ ప్రసార మాధ్యమాల వల్ల వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభించింది. ప్రపంచీకరణ కేవలం మార్కెట్‌కే పరిమితమవ్వలేదు. ఆలోచనలు, భావాలు కూడా పంచుకోవడం వల్ల విస్తృతమవుతోంది.

బహుళజాతి సంస్థల రంగప్రవేశం
          20వ శతాబ్దం మధ్యభాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశంలోపల నిర్వహించేవారు. ముడిసరకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులను దాటి వెళ్లేవి. భారతదేశం వంటి వలసదేశాలు ముడిసరకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి, తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూర దేశాలను కలపటానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది. ఇది పెద్ద బహుళజాతి సంస్థలు (MNC's) రంగప్రవేశం చేయటానికి ముందు పరిస్థితి. ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే, ఉత్పత్తులను నియంత్రించే సంస్థను 'బహుళ జాతి సంస్థ' అంటారు. ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాల్లో ఎమ్.ఎన్.సి.లు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించి తమ లాభాలను పెంచుకోవడానికి 'బహుళజాతి సంస్థలు' ఇలా చేస్తాయి.

వస్తువు ఒక్కటే, తయారీ ఎన్నో దేశాల్లో
          పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాల్లో డిజైన్ చేస్తుంది. దానిలోని విడి భాగాలు చైనాలో తయారవుతాయి. ఈ విడిభాగాలను మెక్సికో, తూర్పు యూరప్ దేశాలకు పంపించి అసెంబ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత పూర్తయిన సరకులను, ప్రపంచమంతా విక్రయిస్తారు. భారతదేశంలోని కాల్ సెంటర్లు ఈ సంస్థల 'వినియోగదారుల సేవ' (customer care) ద్వారా సేవలను అందిస్తాయి.

50 - 60 శాతం ఆదా
          పై ఉదాహరణలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా చైనా గుర్తింపు పొందింది. అమెరికా, ఐరోపాలోని మార్కెట్లకు దగ్గరగా ఉండటంతో మెక్సికో, తూర్పు యూరప్‌లో అసెంబ్లింగ్ చేపట్టారు. భారతదేశంలో ఆంగ్లం మాట్లాడే విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలను అందిస్తోంది. ఫలితంగా బహుళజాతి సంస్థల ఖర్చులో 50 - 60 శాతం ఆదా అవుతోంది. ఉత్పత్తిని దేశ సరిహద్దులు దాటి చేపట్టడం వల్ల బహుళజాతి సంస్థలకు చాలా లాభాలుంటాయి.

పని ప్రదేశాన్ని ఎంచుకోవడం
 *    కొన్ని సాధారణ సూచికలను ఉపయోగించి బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అవి:
*  మార్కెట్‌కు దగ్గరగా ఉండటం.
*  తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యంలేని కార్మికుల లభ్యత.
*  ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు.
*  సంస్థల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు.

విదేశీ పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు
          భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు లాంటి వాటికోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని 'విదేశీ పెట్టుబడులు' అంటారు. లాభాలు సంపాదించి పెడతాయన్న ఆశతో ఇలాంటి పెట్టుబడులు పెడతారు. కొన్ని సందర్భాల్లో ఎమ్.ఎన్.సిలు ఆయాదేశాల స్థానిక కంపెనీలతో కలసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని 'జాయింట్ వెంచర్లు' అంటారు. ఈ సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల, అదనపు పెట్టుబడుల వల్ల స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.

'కార్గిల్‌ఫుడ్స్' చేతిలో పారఖ్‌ఫుడ్స్
          చాలా సందర్భాల్లో బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో స్థానిక కంపెనీలను కొనుగోలు చేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. పెద్దఎత్తున నిధులుండే ఈ కంపెనీలు ఈ పనిని తేలికగా చేయగలుగుతాయి. ఉదాహరణకు 'కార్గిల్‌ఫుడ్స్' అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ, 'పారఖ్‌ఫుడ్స్' వంటి చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. పారఖ్‌ఫుడ్స్‌కు నాలుగు వంటనూనె శుద్ధికర్మాగారాలు, భారతదేశమంతటా పెద్ద మార్కెటింగ్ నెట్‌వర్క్, వారి బ్రాండుకు మంచి పేరు ఉన్నాయి. స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత భారతదేశంలో వంటనూనెల్లో కార్గిల్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది.

కష్టం మాది పేరు వారిది
          బహుళ జాతి సంస్థలు ఉత్పత్తిని మరొక విధంగా కూడా నియంత్రిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్ద బహుళ సంస్థలు చిన్న ఉత్పత్తిదారులకు ఉత్పత్తికి ఆర్డర్లిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడాపరికరాలు లాంటి వస్తువులను ఉత్పత్తి చేసి ఎమ్.ఎన్.సిలకు అందచేస్తే, అవి వాటిని తమ బ్రాండ్ పేర్లతో వినియోగదారులకు అమ్ముతాయి. ఈ చిన్న ఉత్పత్తి దారులకు చెల్లించే ధర, నాణ్యత, సరకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం ఈ సంస్థలకు ఉంటుంది.

వాణిజ్యంతో అనుసంధానం
          బహుళజాతి సంస్థల కారణంగా దూరప్రాంతాల్లోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడుతోంది. దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటోంది. యూరప్ నుంచి మన దేశానికి సముద్రమార్గం కనిపెట్టడం, ఆ మార్గాల ద్వారా జరిగిన వాణిజ్యం గురించి కింది తరగతుల్లో మీరు చదివారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈస్టిండియా కంపెనీ వంటి వాణిజ్య సంస్థలు భారతదేశానికి వచ్చాయి. ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తోంది. అదే విధంగా కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాల్లోని మార్కెట్లను అనుసంధానం చేస్తోంది.

బొమ్మలు నవ్వాయి, ఉత్పత్తిదారులు దిగులుపడ్డారు
          చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. భారతదేశంలో కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మల్లో ఏవి కావాలో ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఆదరణ పొందాయి. ఒక సంవత్సర కాలంలో దుకాణాల్లో ఇక్కడ తయారైన వాటికి బదులుగా చైనా బొమ్మల అమ్మకాలు 70 నుంచి 80 శాతం పెరిగాయి. చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు తమ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోటానికి ఇది అవకాశమిచ్చింది. భారతీయ బొమ్మల ఉత్పత్తిదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పోటీ వల్ల భారతీయ బొమ్మల ఉత్పత్తి దారులు కొత్త మార్గాలను అన్వేషించవలసి వచ్చింది. కొంత మంది దివాలా తీశారు. బాగా విక్రయించిన బొమ్మలు నవ్వుతూ భారతీయ ఉత్పత్తిదారులను హేళన చేసినట్లుందీ పరిస్థితి.

మారిన జీవన విధానం
          సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులు, విధానాల సరళీకరణ వంటివి ప్రపంచీకరణకు దోహదం చేసే అంశాలు. ఇందుకు ముఖ్యకారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందటమే. ప్రస్తుతం సుదూరాలకు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో వస్తువులను చేరవేస్తున్నాం. ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోటానికి, మారుమూల ప్రాంతాల నుంచి సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి టెలీ కమ్యూనికేషన్ సేవలను ఉపయోగించుకుంటున్నాం. ఇంటర్నెట్ ద్వారా ఏ విషయాన్నైనా నిమిషాల్లో తెలుసుకుంటున్నాం. నామమాత్రపు ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడికైనా సమాచారాన్ని పంపుతున్నాం, మాట్లాడుకోవడానికి. ఇదీ నేటి జీవన పరిస్థితి.

వాణిజ్య అవరోధాలు
          వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించటం వల్ల దీన్ని అవరోధం అంటారు. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి, తగ్గించడానికి (నియంత్రించడానికి) ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు. అవరోధాల ద్వారా దేశంలోకి ఎలాంటి వస్తువుల దిగుమతిని అనుమతించాలి, ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవచ్చనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. స్వాతంత్య్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం విదేశీవాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించింది.

ఆర్థిక సరళీకరణ
          భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచ ఉత్పత్తిదారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం గుర్తించి, 1991 నుంచి దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాల్లో మార్పులు చేసింది. విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలను చాలావరకు తొలగించారు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని 'ఆర్థిక సరళీకరణ' అంటారు. అంతకుముందుతో పోలిస్తే చాలా తక్కువ పరిమితులను ప్రభుత్వం విధించింది. కాబట్టి దీనిని 'సరళీకృత ఆర్థిక విధానం' అంటారు.

ప్రపంచ పరిపాలనా సంస్థల పాత్ర
          ఇప్పుడు ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను ప్రపంచ పరిపాలనా సంస్థలు తీసుకుంటున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ శీతోష్ణస్థితి మార్పు, కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయాన్ని ఆయా దేశాలకు వదిలి పెట్టారు. అయితే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం ప్రయత్నిస్తే నియంత్రణలు తక్కువగా ఉన్న మరో చోటుకు పరిశ్రమలు తరలిపోయి ఉద్గారాలను విడుదల చేస్తూ ఉంటాయని గుర్తించారు. కాబట్టి ఉద్గారాలు, శీతోష్ణస్థితి మార్పు లాంటి అంశాలను దేశాలన్నీ కలిపి పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
          అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థల్లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి వాటిని దేశాలు పాటించేలా చూస్తుంది. అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాల్సిన బాధ్యత ఈ సంస్థకు ఉంది.

భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం
          ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాల్లోని సంపన్నులకు మేలు జరిగింది. ఇప్పుడు మార్కెట్‌లో వీరు ఎంచుకోవడానికి చాలా వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి. ఫలితంగా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. కానీ ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.
          భారతదేశంలో వ్యాపారం లాభసాటిగా ఉన్న కారణంగా బహుళ జాతి సంస్థలు తమ పెట్టుబడులను పెంచాయి. సెల్‌ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్‌ఫుడ్ లాంటి పరిశ్రమల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల్లోనూ ఎమ్.ఎన్.సిలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఉత్పత్తులను సంపన్న వర్గాలు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిశ్రమలు, సేవల వల్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు ముడి సరకులు అందించే స్థానిక సంస్థలు సైతం లాభపడ్డాయి.

లాభాల్లో భారతీయ కంపెనీలు
          పెరిగిన పోటీ వల్ల భారతదేశ అతిపెద్ద కంపెనీలు ప్రయోజనం పొందాయి. ఎమ్.ఎన్.సిలు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతుల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచాయి. విదేశీ కంపెనీలతో కలసి పనిచేయడం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.

భారతీయ బహుళజాతి సంస్థలు
          ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటార్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (ఐటీ), రాన్‌బాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాస్టెనర్స్ (నట్లు, బోల్టులు) లాంటి భారతీయ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు జరుపుతున్నాయి.

సమాచార సాంకేతిక విద్య (IT)
          ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి. భారతదేశ కంపెనీ లండన్‌లో ఉన్న కంపెనీకి పత్రికను ముద్రించి ఇవ్వడం, కాల్‌సెంటర్ల నిర్వహణ ఇందుకు కొన్ని ఉదాహరణలు. డేటా ఎంట్రీ, జమా ఖర్చు లెక్కలు, పరిపాలనా సంబంధమైన పనులు, ఇంజినీరింగ్ ఇప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో చౌకగా చేసి, అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

పోటీ పడటమా? అంతరించి పోవటమా?
          అనేక చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు ప్రపంచీకరణ అనేక సమస్యలను సృష్టించింది. భారతదేశంలోని చిన్న చిన్న ఉత్పత్తిదారులు బహుళజాతి సంస్థల ధాటికి తట్టుకోలేక కొందరు ఉత్పత్తిని తగ్గిస్తే, మరికొందరు పరిశ్రమలను మూసివేస్తున్నారు. కొన్ని పరిశ్రమలు బహుళ జాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. భారతీయ ఉత్పత్తిదారులు అందిస్తున్న దానిలో సగం ధరకే ఎమ్.ఎన్.సిలు ఇవ్వడం వల్ల వినియోగదారులు వాటికే మొగ్గుచూపుతున్నారు.

పోరాడి సాధిద్దాం
          ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేరు. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వారు కొత్త అవకాశాల ద్వారా బాగా లాభపడ్డారు. ఇంకొక వైపు ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. 'ప్రపంచీకరణ' ఇప్పుడు ఎవరూ కాదనలేదనేది వాస్తవం. దీని వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు చేయాలి. నష్టపోతున్న దేశాలతో కలిసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాలి. న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే పోరాటంలో ప్రజలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించవచ్చని ఈ మధ్య జరిగిన సంఘటనలు నిరూపించాయి.
ప్రభుత్వం చేయాల్సిన పనులు
* న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే పోరాటంలో ప్రభుత్వం ప్రధానపాత్ర పోషించాలి.
* ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వారినే కాకుండా దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి.
* కార్మిక చట్టాలు సరిగ్గా అమలయ్యేలా చూసి కార్మికులకు వారి హక్కులు లభించేలా చూడాలి.
* చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడే శక్తి వచ్చే వరకు వాళ్లకు సహాయపడాలి.
* అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవాలి.
* మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపాలి.
భిన్న వాదనలు
          ప్రపంచీకరణ వల్ల జాతీయ రాజ్యాలు అంతరించిపోతాయా అనేది చర్చనీయాంశం అయింది. ప్రజలు ఒక ప్రాంతం ఆధారంగా సంఘటితమైన దేశాలను, రాజకీయంగా గుర్తించడమే ఇంతకాలం జరిగింది. ఈ రకమైన ప్రాంతాల విభజన వల్ల మేము, వాళ్లు, బయటది, స్థానికమైనది అనే మానసిక పునాదులతో తమ దేశం అనే భావన ఏర్పడి, జాతీయతా భావన రూపొందింది. ప్రపంచీకరణ వల్ల అతి పెద్ద ప్రభావం ఏదైనా ఉంటే అది ఈ జాతీయ భావన పలచబడటమే.
          ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యానికి దారి తీస్తుందా లేదా సాంస్కృతిక మూసపోతకు దారితీస్తుందా అనేది అందరి దృష్టినీ ఆకర్షించిన మరొక అంశం. ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు ప్రాచుర్యం పొంది, మరికొన్ని మరుగున పడిపోతున్నాయని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతమై, కొన్ని భాషలు నిర్లక్ష్యానికి గురై అంతరించిపోయే ప్రమాదముందని కొంతమంది పేర్కొంటున్నారు.
ప్రపంచ బ్యాంకు (WORLD BANK)
* అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకును (IBRD), అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను (IDA) కలిపి ప్రపంచబ్యాంకుగా వ్యవహరిస్తారు.
* అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి.
* అమెరికాకు 16 శాతం, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌కు 3 నుంచి 6 శాతం ఓటు అధికారం ఉంది.
* పేదదేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది.
* ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది.
* విధానాలను రూపొందించుకోవడంలో సలహాలు ఇచ్చి, మార్గనిర్దేశం చేస్తూ ప్రపంచ బ్యాంకు ప్రభుత్వాలను ప్రభావితం చేస్తోంది.
ప్రధానాంశాలు
* 20వ శతాబ్దం చివర్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో 'ప్రపంచీకరణ' ఒకటి.
* దీనికి రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలున్నాయి.
* అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిల్లో మూడు రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు.
* మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం.
* రెండోది శ్రమ ప్రవాహం − ఉపాధికోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం.
* మూడోది పెట్టుబడి ప్రవాహం − స్వల్పకాల లేదా దీర్ఘకాల ప్రయోజనాల కోసం దూర ప్రాంతాలకు పెట్టుబడి ప్రవహించడం.
* ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక కోణాలున్నాయనడానికి కింది ఉదాహరణ చెప్పవచ్చు.
* పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో ట్యునీషియా, ఈజిప్టు లాంటి అనేక దేశాల్లో నియంతలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్నాయి. ప్రసార మాధ్యమాలు ఈ విప్లవాన్ని 'అరబ్‌వసంతం'గా పేర్కొన్నాయి.
* ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయి. ఇతర దేశాల యాజమాన్యాలు నడుపుతున్న టీవీ ఛానళ్లు ప్రజలకు మద్దతు తెలపడంతో స్థానిక నాయకుల అధికారాలను నియంత్రించడం వీలైంది.
* పౌరయుద్ధం, సునామి వంటి ప్రకృతి వైపరీత్యాలు జాతీయ సరిహద్దులకు లోబడి చర్చించినప్పటికీ వాటికి ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు, సానుభూతి లభిస్తుంది.
ఆలోచనలు, భావాలు పంచుకోవడం వల్ల ప్రపంచీకరణ కేవలం మార్కెట్‌కే పరిమితం కాకుండా విస్తృతమవుతోంది.
* ప్రపంచీకరణ ప్రస్తుత దశ 30 − 40 సంవత్సరాల క్రితం మొదలైంది.
* 19వ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాల్లో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి.
* వస్తువులు, పెట్టుబడులు కదిలినంత స్వేచ్ఛగా కార్మికుల వలసలు లేనప్పటికీ యూరప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాకు దాదాపు 5 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి వలస వెళ్లారని అంచనా.
* వలస పాలకుల ప్రణాళికలో భాగంగా లక్షలాది మంది భారతీయ, చైనా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటలు, గనులు, రోడ్డు, రైలు మార్గ నిర్మాణ పథకాల్లో పని చేయడానికి వలస వెళ్లారు.
* భారతదేశం నుంచి కార్మికులు కరీబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు ఒప్పంద కూలీలుగా వెళ్లారు.
* అక్కడ నివాస, పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండడమే కాకుండా వారికి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు.
* ఇలా వలస వెళ్లిన వారిలో చాలా మంది ఆయా దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా సాంస్కృతిక మేళవింపులు అనేకం జరిగాయి.
* ప్రపంచీకరణలో భాగంగా గత 30 − 40 సంవత్సరాల్లో చోటుచేసుకున్న ఆర్థిక అంశాలను ఈ పాఠంలో తెలుసుకోవచ్చు.
 20వ శతాబ్దం మధ్యభాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశంలో నిర్వహించేవారు. ముడిసరకులు, ఆహారధాన్యాలు, తయారైన వస్తువులను మాత్రమే దేశ సరిహద్దులు దాటించేవారు.
* భారతదేశం లాంటి వలస దేశాలు ముడిసరకులు, ఆహారధాన్యాలను ఎగుమతి చేసి, తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి.
* పెద్ద బహుళజాతి సంస్థ (MNC)లు రంగప్రవేశం చేయడానికి ముందు దూరదేశాలను కలపడానికి వాణిజ్యమే ప్రధాన మార్గం.
* ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా నియంత్రించే సంస్థలను 'బహుళజాతి సంస్థ' (MNC)లు అంటారు.
* బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ఖర్చు తగ్గించి తమ లాభాలు పెంచుకోవడానికి కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాల్లో కార్యాలయాలు, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
ఉదా: పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధన కేంద్రాల్లో డిజైన్ చేస్తుంది.
* ఆ పరికరాల్లోని విడిభాగాలను చైనాలో తయారుచేసి, వాటిని మెక్సికో, తూర్పు యూరప్ దేశాలకు పంపించి అసెంబ్లింగ్ చేస్తారు. ఇలా తయారైన వస్తువులను ప్రపంచం అంతటా అమ్ముతారు.
* భారతదేశంలోని కాల్‌సెంటర్లు ఈ సంస్థల 'వినియోగదారుల సేవల' ద్వారా సేవలు అందిస్తాయి.
 పై ఉదాహరణలో బహుళజాతి సంస్థలు తమ వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మడమే కాకుండా వస్తువులు, సేవల ఉత్పత్తిని విస్తరించుకున్నాయి.
* దీంతో ఉత్పత్తి ప్రక్రియను చిన్నచిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో అనేక చోట్ల సంక్లిష్ట రూపాల్లో చేపడుతున్నారు.
* ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే దేశంగా చైనా పేరుపొందింది.
* అమెరికా, యూరప్‌లోని మార్కెట్లకు దగ్గరగా ఉండడంతో మెక్సికో, తూర్పు యూరప్‌ల్లోనూ అసెంబ్లింగ్ చేపట్టారు.
* ఆంగ్లంలో బాగా మాట్లాడగలిగే విద్యావంతులైన భారతీయ యువత కస్టమర్ కేర్ సేవ (వినియోగదారుల సేవ)లను అందిస్తున్నారు.
* వీటి ఫలితంగా బహుళజాతి సంస్థలు పెట్టే ఖర్చులో 50 − 60 శాతం ఆదా అవుతుంది.
* దేశ సరిహద్దులు దాటి ఉత్పత్తి చేపట్టడం వల్ల ఈ సంస్థలకు అనేక లాభాలు చేకూరుతున్నాయి.
* బహుళజాతి సంస్థలు మార్కెట్లకు దగ్గరగా ఉండి, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ఇతర ఉత్పత్తి కారకాల అందుబాటు, తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వ విధానం ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటాయి.
* లాభార్జనే ధ్యేయంగా ఈ సంస్థలు భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కోసం ఖర్చుపెట్టే మొత్తాన్ని
'విదేశీ పెట్టుబడులు' అంటారు.
* కొన్ని సందర్భాల్లో బహుళజాతి సంస్థలు ఆయా దేశాల స్థానిక సంస్థలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని 'జాయింట్ వెంచర్లు' అంటారు.
* బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు పెట్టుబడుల వల్ల స్థానిక సంస్థలు ప్రయోజనం పొందుతాయి.
* పెద్ద ఎత్తున నిధులుండడంతో అనేక సందర్భాల్లో బహుళజాతి సంస్థలు స్థానిక సంస్థలను కొని ఉత్పత్తిని విస్తరించుకుంటాయి.
ఉదా: 'కార్గిల్ ఫుడ్స్' అనే అమెరికాకు చెందిన పెద్దబహుళ జాతి సంస్థ 'ఫారఖ్ ఫుడ్స్' లాంటి చిన్న భారతీయ సంస్థను కొనుగోలు చేసింది.
* ఫారఖ్ ఫుడ్స్‌కు నాలుగు నూనె శుద్ధి కర్మాగారాలు, దేశమంతా పెద్ద మార్కెటింగ్ నెట్‌వర్క్‌తో పాటు ఆ బ్రాండ్‌కు మంచి పేరు ఉంది.
* ఆ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత కార్గిల్ ఫుడ్స్ భారత్‌లో అతిపెద్ద వంటనూనెల ఉత్పత్తిదారుగా అవతరించింది.
* అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్ద బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల కోసం చిన్న ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తాయి.
* ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాల లాంటి ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసి బహుళజాతి సంస్థలకు అందజేస్తే అవి తమ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తాయి.
* చిన్న ఉత్పత్తిదారులకు చెల్లించే ధర, నాణ్యత, సరకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం వీటికి ఉంటుంది.
* బహుళజాతి సంస్థల కారణంగా దూర ప్రాంతాల్లోని ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
* ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతి పెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది.
* ఈ కంపెనీ 1995లో భారతదేశానికి వచ్చి రూ.1,700 కోట్లతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది.
* భారతదేశంలో జీపులు, లారీల తయారీలో అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్ర అండ్ మహీంద్రతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది.
* 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లను విక్రయించింది.
* భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తోంది.
* ఈ కంపెనీ ఇతర దేశాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు విడిభాగాలను సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను అభివృద్ధి చేసే యోచనలో ఉంది.
* వాణిజ్య ప్రయోజనాల కోసం 'ఈస్ట్ ఇండియా కంపెనీ' లాంటి సంస్థలు భారతదేశానికి వచ్చాయి.
* ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అందిస్తోంది.
* దీని వల్ల కొనుగోలుదార్లకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులతో పాటు మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. అంటే విదేశీ వాణిజ్యం వివిధ దేశాల్లోని మార్కెట్లను అనుసంధానిస్తోంది.
*  చైనా ఉత్పత్తిదారులు భారత్‌కు ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేస్తున్నారు. భారత్‌లోని కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలను ఎంచుకొనే అవకాశం ఉంది.
* కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో ఆదరణ పొందాయి. ఒక సంవత్సర కాలంలోనే బొమ్మల దుకాణాల్లో భారతీయ బొమ్మలకు బదులుగా 70 − 80 శాతం ఎక్కువగా చైనా బొమ్మలు అమ్ముడయ్యాయి.
* దీంతో చైనాలోని బొమ్మల ఉత్పత్తిదారులకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం వచ్చింది.
* భారతీయ బొమ్మల ఉత్పత్తిదారుల పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. పోటీ వల్ల భారతీయ ఉత్పత్తిదారులు కొత్తమార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో కొంతమంది దివాలా తీశారు.
* గత మూడు, నాలుగు దశాబ్దాలుగా అనేక బహుళజాతి సంస్థలు చౌకగా ఉత్పత్తి చేయగలిగే అవకాశాలున్న ప్రదేశాల కోసం ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి.
* ఆయా దేశాల్లో ఈ బహుళజాతి కంపెనీల విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. దేశాల మధ్య విదేశీ వాణిజ్యం వేగంగా పెరుగుతోంది.
¤ విదేశీ వాణిజ్యంలో అధికభాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి.
ఉదా: భారత్‌లోని ఫోర్డ్ మోటర్స్ కార్ల తయారీ కర్మాగారం భారతీయ మార్కెట్ల కోసమే కాకుండా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. కార్ల విడిభాగాలను ప్రపంచమంతటా ఉన్న తమ అనేక కార్మాగారాలకు ఎగుమతి చేస్తోంది.
* ఇదేవిధంగా అనేక బహుళజాతి సంస్థల కార్యకలాపాలు, వస్తువులు, సేవల వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
* అధిక విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం వల్ల వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగింది.
* దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం, అంతఃసంబంధాలే ప్రపంచీకరణ.
* ఈ ప్రక్రియలో బహుళజాతి కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
* దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞాన ప్రవాహాలు పెరుగుతున్నాయి.
* ప్రజలు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది.
* ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతాయి.
ఉదా: ఒకప్పుడు, సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించేవి. ఇప్పుడు ఆ నిర్ణయం ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెటు శక్తుల చేతిలో ఉంది.
* ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం.
ఉదా: గత యాభై సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన రవాణా, సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ దూరాలకు సైతం తక్కువ సమయంలో, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నారు.
* సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇంకా గణనీయంగా ఉంది.
* టెలీకమ్యూనికేషన్ సేవలను (టెలిగ్రాఫ్, టెలిఫోను, మొబైల్ ఫోన్లతో సహా ఫ్యాక్స్) ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మారుమూల ప్రాంతాల నుంచి సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు.
* ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమైంది.
* ప్రస్తుతం పత్రికా రంగంలో కంప్యూటర్లు ప్రవేశించాయి.
* ఇంటర్నెట్ ద్వారా మీరు ఏ విషయం గురించైనా సమాచారాన్ని తెలుసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవచ్చు.
*ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్ పంపించవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు.
* వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించటం వల్ల దీన్ని అవరోధం అంటారు.
* విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి (నియంత్రించడానికి) ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు.
* ఎటువంటి వస్తువుల దిగుమతిని అనుమతించాలి, ఒక్కొక్క దాన్ని దేశంలోకి ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవచ్చు లాంటివి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
*  స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు అవరోధాలు విధించింది. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీదారుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది.
* 1950 − 60 దశకంలో భారత్‌లో అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఈ దశలో దిగుమతుల నుంచి పోటీని అనుమతించి ఉంటే ఇవి నిలదొక్కుకునేవి కావు.
* అందుకే అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, ముడిచమురు లాంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.
* అన్ని అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందుతున్న దశలో తమ దేశ ఉత్పత్తిదారులకు ఏదో ఒక విధంగా రక్షణ కల్పించాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* 1991 నుంచి దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారత విదేశీ వాణిజ్య విధానాల్లో మార్పులు చేశారు.
* భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తిదారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
* ఫలితంగా దేశంలోని ఉత్పత్తిదారులు తమ నాణ్యతను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
* ఈ నిర్ణయానికి బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు లభించింది.
* దీంతో విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలను చాలా వరకు తొలగించారు.
* దీనివల్ల దేశంలోకి సరకులు స్వేచ్ఛగా దిగుమతి, ఎగుమతి చేసుకోవచ్చు. విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కర్మాగారాలను స్థాపించవచ్చు.
* ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించడాన్ని 'ఆర్థిక సరళీకరణ' అంటారు.
* సరళీకృత విధానాల ఫలితంగా వ్యాపారులు, వాణిజ్యం చేసేవారు తాము ఎగుమతి, దిగుమతి చేయదలచుకున్న ఉత్పత్తులపై స్వేచ్ఛా నిర్ణయాలు తీసుకోవచ్చు.
* అంతకు ముందుతో పోలిస్తే ప్రభుత్వం చాలా తక్కువ పరిమితులు విధిస్తోంది. కాబట్టి దీన్ని 'సరళీకృత ఆర్థిక విధానం' అంటారు.
* ప్రపంచీకరణకు ఆర్థిక రంగమే మూలం అని భావించే వారు ఆర్థిక శక్తులే దానికి కారణమని, దాని ఎల్లలను అవే నిర్ణయిస్తాయని వాదిస్తారు. రాజకీయాలు కారణమని భావించేవారు ముందుగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది ప్రారంభమైందని అంటారు.
* ప్రభుత్వాలు పరిమితులు విధిస్తాయి లేదా తొలగిస్తాయి. ఉత్పత్తికి ఒక ప్రదేశం అనువైనదో కాదో అంచనా వేయడానికి మార్కెట్ పరిస్థితులతో పాటు రాజకీయ వాతావరణం కూడా ముఖ్యమైన అంశం.
* వాస్తవమేమిటంటే పై రెండింటికీ సంబంధం ఉంది. ఒక ప్రత్యేక నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని గుర్తిస్తే, ఇవి అప్పటికే వచ్చిన ఆర్థిక, సాంకేతిక మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయి.
* ప్రస్తుతం ప్రపంచ పరిపాలన సంస్థలు ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ శీతోష్ణస్థితి మార్పు.
* మొదట కర్బన ఉద్గారాలను తగ్గించే విషయాన్ని ఆయా దేశాలకు వదిలిపెట్టారు. ఒకవేళ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం ప్రయత్నిస్తే పరిశ్రమలు నియంత్రణలు తక్కువగా ఉన్న ప్రాంతానికి తరిలిపోయి ఉద్గారాలను విడుదల చేస్తాయని గుర్తించారు.
* కాబట్టి ఉద్గారాలు, శీతోష్ణస్థితి మార్పు లాంటి అంశాలను దేశాలన్నీ కలిసి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.
* భారతదేశంలో విదేశీ వాణిజ్యం, పెట్టుబడుల్లో సరళీకృత విధానాలకు బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉంది.
* విదేశీ వాణిజ్యానికి, పెట్టుబడులకు అవరోధాలు నష్టం కలగజేస్తాయని ఈ సంస్థలు వాదిస్తాయి. దేశాల మధ్య వాణిజ్యం ఎటువంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలని వీరు అంటారు.
* అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థల్లో 'ప్రపంచ వాణిజ్య సంస్థ' ఒకటి.
* అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించి, సభ్య దేశాలన్నీ వాటిని పాటించేలా చూస్తుంది.
* ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
* ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి.
* ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ దీనికి ఉదాహరణ.
* ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాల్లోని సంపన్నులకు మేలు జరిగింది. ఇప్పుడు వీరు ఎంచుకోవడానికి ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. దీంతో అనేక ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ధరలు తగ్గాయి.
* ఫలితంగా ప్రజలు అంతకు ముందు సాధ్యం కాని మెరుగైన జీవన ప్రమాణాలు అనుభవిస్తున్నారు.
* ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు.
* బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ పెట్టుబడులను పెంచాయి అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వారికి లాభసాటిగా ఉంది.
* సెల్‌ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్, శీతల పానీయాలు, ఫాస్ట్‌ఫుడ్ లాంటి పరిశ్రమలు, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ లాంటి సేవల్లోనూ బహుళజాతి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
* ఈ ఉత్పత్తులకు సంపన్న కొనుగోలుదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పరిశ్రమలు, సేవల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు ముడిసరకులు అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి.

* పెరిగిన పోటీ వల్ల భారత్‌లోని అతిపెద్ద సంస్థలు ప్రయోజనం పొందాయి. అవి కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతుల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచాయి.
* విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.
* ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి.
* టాటా మోటార్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (ఐ.టి.), రాన్‌బాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాస్టెనర్సు (నట్టులు, బోల్టులు) లాంటి భారతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు జరుపుతున్నాయి.
* ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐ.టి.తో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి.
* లండన్‌లోని కంపెనీకి భారతదేశంలోని కంపెనీ పత్రికను ముద్రించి ఇవ్వడం, కాల్‌సెంటర్ల నిర్వహణ ఇందుకు కొన్ని ఉదాహరణలు.
* ఇవే కాకుండా డేటాఎంట్రీ, జమా ఖర్చు లెక్కలు, ఇంజినీరింగ్, పరిపాలన సంబంధమైన పనులను భారత్ లాంటి దేశాల్లో చౌకగా చేసి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
* భారత్‌లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి.
* ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. వీటిలో ప్రపంచస్థాయి సౌకర్యాలుంటాయి. అవి విద్యుత్తు, నీరు, రోడ్లు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు.
* ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)లో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి అయిదేళ్ల పాటు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
* విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది.
* కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది.
* దీని వల్ల ఆ కంపెనీ కార్మికులకు చెల్లించే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి.
* చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు ప్రపంచీకరణ పెను సవాళ్లను సృష్టించింది.
* దీంతో చిన్న పారిశ్రామికవేత్తలు ఈ పోటీ తట్టుకోలేక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు పరిశ్రమలు మూసేసే పరిస్థితి ఏర్పడింది.
ఉదా: బహుళజాతి సంస్థల టీవీ బ్రాండుల నుంచి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి.
* పై ఉదాహరణ ద్వారా ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తోంది.
* విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వారు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. వీరితో పాటు ఎలాంటి ప్రయోజనం పొందని ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.
* ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల ఎలా అందరికీ న్యాయం జరిగేటట్లు చేయాలి అనేది మన ముందున్న ప్రశ్న.
* న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది.
* దీన్ని సాధ్యం చేయడంలో ప్రభుత్వం ప్రధానపాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వారికే కాకుండా దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి.
ఉదా: కార్మిక చట్టాలు సరిగా అమలయ్యేలా చూసి కార్మికులకు వారి హక్కులు లభించేలా చూడాలి.
* చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీ పడే శక్తి వచ్చేంత వరకు ప్రభుత్వం సహాయపడాలి.
* న్యాయబద్ధమైన నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరపవచ్చు. ఇలాంటి ఆసక్తి ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.
* గత కొన్ని సంవత్సరాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాలతో, ప్రజా సంఘాల విన్నపాలతో ప్రపంచ వాణిజ్య సంస్థలో వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు ప్రభావితమయ్యాయి.
* న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే పోరాటంలో ప్రజలు ముఖ్య పాత్ర పోషించగలరని ఇవి నిరూపిస్తున్నాయి.
* ప్రపంచీకరణ వల్ల జాతీయ రాజ్యాలు అంతరించిపోతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది
* ఇప్పటి వరకు ప్రజలు ఒక ప్రాంతం ఆధారంగా సంఘటితమై దేశాలను రాజకీయంగా గుర్తించారు.
*  ఈ రకమైన ప్రాంతాల విభజన వల్ల మేము, వారు, బయటిది, స్థానికమైనది అనే మానసిక పునాదులతో తన దేశం అనే భావన ఏర్పడి, జాతీయతా భావన రూపొందింది.
*  ప్రపంచీకరణ వల్ల కలిగిన అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉంటే అది ఈ జాతీయ భావన పలచబడడమే.
*  ప్రపంచీకరణ సాంస్కృతిక వైవిధ్యతకు దారి తీస్తుందా లేదా మూసధోరణికా అనేది అందరినీ ఆకర్షించిన మరొక ముఖ్య అంశం.
*  ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతుల భావాలు ప్రాచుర్యం పొందడం వల్ల ఇతర స్థానిక, అల్ప సంఖ్యాక వర్గాల సంస్కృతులు మరుగున పడతాయని కొందరి వాదన.
*  తమ చుట్టూ ఉన్న సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటునిచ్చి అవి విస్తరించడానికి దోహదపడిందని మరికొందరు భావిస్తున్నారు.
*  కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగంలో ఉండి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండడంతో ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని కొంతమంది పేర్కొంటున్నారు.
*  ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ప్రపంచ బ్యాంకు (WB), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) లాంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
* ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవడంలో ప్రపంచ బ్యాంకు సలహాలిస్తూ, మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేస్తోంది.
* ప్రపంచీకరణను విమర్శించేవారు ఇది ప్రపంచంపై ఆధిపత్యం పొందడానికి కొన్ని పాశ్చాత్య దేశాలు చేసే ప్రయత్నమని భావిస్తున్నారు. అనేక పేద దేశాల్లో దీనివల్ల ప్రజాస్వామ్యం, కార్మికుల హక్కులు, పర్యావరణానికి భంగం కలుగుతోందని వీరు వాదిస్తున్నారు.
* మద్దతు పలికేవారు విశ్వ అనుసంధానం ద్వారా ప్రపంచీకరణ అభివృద్ధికి, సంపదకు అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.
 

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం