• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 

ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల కాలంలో 'రాజ్యాంగం' అనే భావన ఉదయించింది. రాజనీతిశాస్త్ర పితామహుడు 'అరిస్టాటిల్' (క్రీ.పూ.384 - 322) తన గ్రంథం 'పాలిటిక్స్‌'లో 150కి పైగా గ్రీకు రాజ్యాంగాల గురించి విశ్లేషణ చేశాడు. ఈయన నిర్వచనం ప్రకారం... ''రాజ్యం యొక్క ప్రభుత్వ, చట్ట, నిర్మాణ ప్రక్రియను వివరించేదే రాజ్యాంగం..."

ఏ దేశ పరిపాలనా ప్రక్రియయైన ఆ దేశ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది. రాజ్యాంగమే దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దేశ భవిష్యత్తును ఎలా రూపొందిస్తారు లాంటి అంశాలకు సంబంధించి ఏ దేశ రాజ్యాంగమైనా కొంత మౌలిక నిర్మాణాన్ని, సిద్ధాంతాలను అందజేస్తుంది. అంటే రాజ్యాంగం రెండు విధులు నిర్వర్తిస్తుంది అన్నమాట. (1) పౌరుల హక్కులు, బాధ్యతలను పేర్కొనడం, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల లాంటి నిర్మాణం, అధికారాలను పేర్కొనడం, (2) ప్రభుత్వం, సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించడం. అంటే దేశం ముందుకు వెళ్లడానికి ప్రస్తుత అంశాలను ఎలా మార్చాలో రాజ్యాంగం సూచిస్తూ ప్రధానంగా భవిష్యత్తు చట్రాన్ని పేర్కొంటుంది.

రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ - చర్చలు, వాదోపవాదాలు, అభిప్రాయ భేదాలను పరిష్కరించడం, పరస్పర విరుద్ధ భావాలు ఉన్న వారందరికీ ఆమోదయోగ్యమయ్యే చట్రాన్ని రూపొందించడం... ఈ ప్రక్రియే రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ. భారతదేశంలో ఇది ఎలా జరిగిందో చూద్దాం భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ రూపొందించి, ఆమోదించింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం భారతీయ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితం ఇది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించడంతో తమను తాను పరిపాలించుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి భారత ప్రజలకు కొత్త రాజ్యాంగం అవసరమైంది.

1946లో భారతదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్ ప్లాన్ సూచనలు మేరకు ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తుకు 1946 జూన్, జులై నెలల్లో ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది, బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉంటారు. మొత్తంమీద దీంట్లో 9 మంది మాత్రమే మహిళలు. మొత్తం 292 స్థానాల్లో జాతీయ కాంగ్రెస్‌కు 202 స్థానాలు, ముస్లిం లీగ్‌కు 73 స్థానాలు లభించాయి. మొదట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన అన్ని ప్రాంతాల సభ్యులు దీంట్లో ఉన్నారు. అయితే 1947, ఆగస్టు 14న దేశవిభజన జరిగి  పాకిస్థాన్, భారతదేశంగా ఏర్పడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన సభ్యులు పాకిస్థాన్ రాజ్యాంగసభగా ఏర్పడ్డారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యులను పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతిలో ఆయా రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే భారత సమాజంలోని అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించడంలేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉండేది.

రాజ్యాంగసభ అందరికీ ప్రాతినిధ్యం వహించనప్పటికీ అన్ని రకాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఉత్తరాలు, వార్తాపత్రికల్లో వ్యాసాలు, ఇతర మార్గాల ద్వారా అన్ని రకాల ప్రజలు తమ భావాలను తెలియజేసేలా తన పనికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. 1946, డిసెంబరు 13న రాజ్యాంగసభలో జవహర్‌లాల్ నెహ్రూ ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు.

''.... భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికో లేదా ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైంది కాదు. ఇది దేశ 40 కోట్ల జనాభాకు సంబంధించింది... ఇక్కడ లేనివాళ్లను గుర్తుచేసుకోవడం మన విధి. ఇక్కడ ఒక పార్టీ కోసమో లేదా ఒక బృందం కోసమో పనిచేయడానికి లేం. దేశం మొత్తం కోసం మనం ఆలోచన చేయాలి. భారతదేశ 40 కోట్ల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.... మన స్వార్థాల నుంచి, పార్టీ వివాదాల నుంచి సాధ్యమైనంతవరకు బయటపడి మనముందున్న పెద్ద సమస్య గురించి అత్యంత విస్తృత, సహనశీల ప్రభావవంత పద్ధతిలో ఆలోచించి మనం రూపొందించేది దేశమంతటికీ అర్హమైందిగా ఉండాలి. ఈ అత్యంత బాధ్యతాయుత కార్యక్రమంలో ప్రవర్తించాల్సిన విధంగా మనం ప్రవర్తించామని ప్రపంచం గుర్తించేలా ఉండాలి..."

రాజ్యాంగ పరిషత్తులో కొందరు ప్రముఖ సభ్యులు:

డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, జె.బి.కృపలానీ, ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, సచ్చిదానంద సిన్హా, కె.టి.షా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృతకౌర్... ఈ జాతీయ నాయకులు అందరూ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు.

ముసాయిదా రాజ్యాంగం:

ఇది చాలా పెద్దది. దీంట్లో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. దీన్ని 1948, ఫిబ్రవరి 21న రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించారు. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని ఎనిమిది నెలలపాటు ప్రజల ముందు ఉంచారు. దాంట్లోని అంశాల పట్ల తమ స్పందనలను తెలియ చేయడానికి మిత్రులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు తగినంత సమయం లభించింది. 1948, నవంబరు 4న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా రాజ్యాంగంపై చర్చను ప్రారంభించింది. ఈ చర్చ ముసాయిదా రాజ్యాంగంలోని Phrase by Phrase, Clause by Clause పరిశీలన పద్ధతిలో అక్టోబరు 17, 1949 వరకు కొనసాగింది. ముసాయిదా రాజ్యాంగంపై చివరి చర్చ నవంబరు 14, 1949న ప్రారంభమై నవంబరు 26, 1949 వరకు కొనసాగింది. నవంబరు 26, 1949న రాజ్యాంగపరిషత్తు ముసాయిదా రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇలా రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.

రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జనవరి 24, 1950న జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్‌ను భారత ప్రథమ రాష్ట్రపతిగా ఎన్నుకుని జనవరి 26, 1950 నుంచి నూతన రాజ్యాంగం అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఈ తేదీ ప్రాముఖ్యం ఏమిటంటే... జాతీయోద్యమకాలంలో 1929 డిసెంబరు 31న లాహోర్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1930, జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్య దినంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం అమలుపరచడానికి నిర్ణయించింది.

తర రాజ్యాంగాల ప్రభావం:

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు, దాని కమిటీలు రచించినప్పటికీ పరిషత్ సభ్యులు ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందులో భారతదేశానికి సరిపడే నిబంధనలను గ్రహించి మన రాజ్యాంగంలో పొందుపరిచారు. భారత రాజ్యాంగానికి ఉన్న ఆధారాలను ఈ విధంగా చెప్పొచ్చు.

బ్రిటిష్ రాజ్యాంగం: పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, సమన్యాయపాలన, స్పీకర్ వ్యవస్థ, శాసన నిర్మాణ ప్రక్రియ, అఖిల భారత సర్వీసులు, నామమాత్రపు దేశాధినేత.

అమెరికా రాజ్యాంగం: సమాఖ్య ప్రభుత్వ విధానం, రాష్ట్రపతి పరోక్ష ఎన్నిక, మహాభియోగం ద్వారా తొలగింపు; ప్రాథమిక హక్కులు, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్షాధికారం.

ఐర్లాండ్ రాజ్యాంగం: ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ సభ సభ్యుల నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ఎన్నిక, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం.

కెనడా రాజ్యాంగం: కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్రానికి అవశిష్టాధికారాలు చెందడం.

ఆస్ట్రేలియా రాజ్యాంగం: ఉమ్మడి జాబితా అంశం

దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణా విధానం

జర్మనీ రాజ్యాంగం: అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల తాత్కాలిక నిలుపుదల.

పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం: ప్రాథమిక విధులు

1935 భారత ప్రభుత్వ చట్టం: సమాఖ్య పద్ధతి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పార్లమెంటరీ విధానం, గవర్నరు వ్యవస్థ, ద్విశాసనసభావిధానం, ఫెడరల్ న్యాయస్థానం.

పార్లమెంటరీ వ్యవస్థ:

రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విధానంలో దేశాధినేత, ప్రభుత్వాధినేత వేర్వేరుగా ఉంటారు. మన దేశాధినేత రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరిస్తారు. వాస్తవ కార్యనిర్వహణాధికారాలను ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి చెలాయిస్తారు. పార్లమెంటు విశ్వాసం ఉన్నంతకాలం ప్రధానమంత్రి, మంత్రిమండలి పదవిలో కొనసాగుతారు.

రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు/రాష్ట్రపతి ఉంటారు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తుకు తెస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి, ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం పోలిక లేదు. అమెరికా అధ్యక్షతరహా విధానంలో అధ్యక్షుడి కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. భారతదేశంలో కూడా మంత్రులు ఉంటారు. ఇక్కడ కూడా ఈ రెండింటికీ మధ్య మౌలికమైన తేడా ఉంది. తన సెక్రెటరీలు ఇచ్చే సలహాకు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదు. కానీ, భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటారు. వాళ్ల సలహాలకు విరుద్ధంగా అతడు ఏమీ చేయలేరు. అదేవిధంగా వాళ్ల సలహా లేకుండా కూడా ఏమీ చేయలేరు. అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రెటరీనైనా, ఎప్పుడైనా తొలగించవచ్చు. పార్లమెంటులో మెజారిటీ మద్దతు ఉన్నంతవరకు భారత సమాఖ్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం లేదు.

సమాఖ్య వ్యవస్థ:

చరిత్రలో ముఖ్యంగా రెండు రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒకదాన్ని ఏకీకృత విధానమని, రెండోదాన్ని సమాఖ్య విధానమని అంటారు.

ఏకీకృత రాజ్యాంగంలోని రెండు ముఖ్యమైన అంశాలు:

(1) కేంద్ర రాజ్యతంత్రం యొక్క సర్వాధిక్యత

(2) ఉపసర్వసత్తాక రాజ్యతంత్రాలు లేకపోవడం..

ఇందుకు విరుద్ధంగా సమాఖ్య విధాన రాజ్యాంగంలో (1) కేంద్ర రాజ్యతంత్రంతోపాటు ఉపరాజ్యతంత్రాలు కూడా ఉండటం. (2) వాటికి కేటాయించిన రంగాల్లో ఈ రెండూ సర్వసత్తాకత కలిగి ఉండటం. అంటే సమాఖ్య వ్యవస్థ ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ముసాయిదా రాజ్యాంగాన్ని సమాఖ్య విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఇది ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపాదిత రాజ్యాంగంలోని ద్వంద్వ రాజ్యతంత్రం కింద కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, వాటి పరిధుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాజ్యాంగం వీటికి కేటాయించే రంగాల్లో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి.

భారతదేశం సమాఖ్య వ్యవస్థగా ఉండి, అదే సమయంలో భారతదేశ ఐక్యతను కాపాడటానికి అవసరమైన అన్ని మౌలిక అంశాల్లో సారూప్యతను కలిగి ఉండేలా విధానాలను, పద్ధతులను రూపొందించడానికి ముసాయిదా రాజ్యాంగం ప్రయత్నించింది. ఇందుకు ముసాయిదా రాజ్యాంగం మూడు విధానాలను అవలంబించింది:

1) ఒకే న్యాయవ్యవస్థ

2) పౌర, నేర అంశాల్లోని మౌలిక చట్టాల్లో సారూప్యం

3) ముఖ్యమైన పదవుల్లో నియమించడానికి దేశమంతటికీ అఖిల భారత సివిల్ సర్వీస్.

చట్టాలు చేసే అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చెయ్యగలదు. ఉభయజాబితాలోని అంశాలపై రాష్ట్రాలు, కేంద్రం చట్టాలు చెయ్యవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటవుతుంది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా ఉండే ద్వంద్వ రాజ్యతంత్రాల్లో అన్ని దేశాల్లో ద్వంద్వ సేవల విధానాన్ని అవలంబించారు. అన్ని సమాఖ్యల్లో సమాఖ్య సివిల్ సర్వీసు, రాష్ట్రసివిల్ సర్వీసు ఉన్నాయి. రాష్ట్రాలు తమకు ప్రత్యేక సివిల్ సర్వీసును ఏర్పరుచుకునే హక్కుకు భంగం కలిగించకుండానే భారతదేశమంతటా ఇలాంటి కీలక పదవుల్లో నియమించడానికి ఒకే అర్హత, ఒకే రకమైన వేతనంతో అఖిలభారత స్థాయిలో ఎంపికయ్యే అఖిల భారత సర్వీసు ఉంటుంది.

రాజ్యాంగ సభలోని చర్చల్లో విమర్శలకు ఉదాహరణలు:

ముసాయిదా రాజ్యాంగంపై అనేక విమర్శలు ఉన్నాయి. అవి...

1) మౌలానా హస్రత్ మొహానీ లాంటి వారు ముసాయిదా రాజ్యాంగం 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించారు.

2) దామోదర్ స్వరూప్ సేథ్ లాంటి సోషలిస్టులు ఇటీవల కాలంనాటి రాజ్యాంగాల నుంచి, సోవియట్ యూనియన్ నుంచి ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించారు.

3) డి.ఎస్.సేథ్.... ''మన భారత గణతంత్రం స్వయంప్రతిపత్తి ఉన్నచిన్న చిన్న గణతంత్ర సమాఖ్యగా ఉండాల్సింది. ఈ విధంగా మనదేశంలో ఏర్పడిన సమాఖ్యలో కేంద్రీకరణకు విజ్ఞుడైన డాక్టర్ అంబేడ్కర్ ఇచ్చినంత ప్రాముఖ్యం అవసరమై ఉండేది కాదు. కేంద్రీకరణ మంచిదే, ఒక్కోసారి ఉపయోగకరమే. కానీ మనం, మహాత్మాగాంధీ తన జీవితకాలమంతా చెప్పినట్లుగా అధికారాన్ని మరీ కేంద్రీకరిస్తే అది మరీ నిరంకుశ అధికారంగా మారుతుందని, ఫాసిస్టు ఆదర్శాలవైపు తీసుకెళుతుందని మనం మరచిపోతున్నాం. నిరంకుశత్వం, ఫాసిజం నుంచి రక్షణ పొందడానికి ఏకైక మార్గం అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించడం..."

4) ప్రొమధ రంజన్ ఠాకూర్- ''కులవ్యవస్థను నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు. అంటరానితనం అనేది కులవ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే. మనం కులవ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పైపై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు.

5) ఎస్.సి.బెనర్జీ- ''అంటరానితనం అనే పదానికి ముందు వివరణ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలుగా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అయినా ఈనాటికీ అది ఏం సూచిస్తోందో తెలియని తీవ్ర గందరగోళంలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవడం, కొన్నిసార్లు 'హరిజనులకు' ఆలయ ప్రవేశం కల్పించడం అనే అర్థంలో వాడతారు, కొన్నిసార్లు అది అన్ని కులాలు కలిసి భోజనం చేయడంగా పరిగణిస్తున్నారు. కొన్నిసార్లు కులాంతర వివాహంగా భావిస్తున్నారు".

6) రోహిణి కుమార్ చౌదరి - ''అంటరానితనాన్ని నిర్వచించడానికి, స్పష్టంగా ఇలా పేర్కొనాలి. మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు."

7) ధీరేంద్రనాథ్ దత్త - ''అంటరానితనం ఏ రూపంలోనైనా నేరమే. న్యాయస్థానాలు సరైన శిక్ష విధించేలా అంటరానితనం అనే పదాన్ని కేంద్రశాసనసభ నిర్వచిస్తుందని ఆశిస్తున్నాను." రాజ్యాంగం - సామాజిక నిర్మాణం

గత రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగసభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా జవహర్‌లాల్ నెహ్రు పేర్కొన్నారు. కాబట్టి అభివృద్ధితోపాటు సామాజిక మార్పునకు కూడా రాజ్యాంగం దోహదం చేయాలని గుర్తించారు.
 సామాజిక మార్పునకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. దీనికి మంచి ఉదాహరణ: అంటరానితనాన్ని నిషేధించడం, షెడ్యుల్డ్ కులాలు-షెడ్యుల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించడం, ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొన్న అన్యాయాలను అధిగమించడానికి, వారి ఓటుహక్కుకు సరైన అర్థాన్ని ఇవ్వడానికి కేవలం సమానత్వపు హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. వాళ్ల ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాజ్యాంగ చర్యలు అవసరం. అందుకనే షెడ్యుల్డ్ కులాల, తెగల ప్రయోజనాలను కాపాడటానికి శాసనసభ స్థానాల రిజర్వేషన్, ప్రభుత్వరంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లాంటి అనేక ప్రత్యేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. రాజ్యాంగంలో 'ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలు' ఉన్నాయి. ఇవి ప్రభుత్వం ముందు ప్రధాన సామాజిక వ్యవస్థలను ఉంచాయి. సామాజిక ఇంజినీరింగ్ సాధనలో ఒక ముఖ్యమైన అంశం అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. వీరికి ప్రత్రేక రక్షణ కల్పించి అధిక సంఖ్యాకులు తమను అంచుకు నెట్టేశారన్న భావన కలగకుండా చెయ్యాలని వారు నిర్ణయించారు.

ప్రస్తుత రాజ్యాంగం

ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగంలో ప్రారంభంలో 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 448 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 5 అనుబంధాలు ఉన్నాయి. చట్టాలను అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుందని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. కాబట్టి రాజ్యాంగ సవరణలకు అవకాశం కల్పించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో 'లౌకిక', 'సామ్యవాద' అనే పదాలను చేర్చారు.

ముఖ్యాంశాలు

దేశ పరిపాలనా ప్రక్రియలను నిర్ణయించేది రాజ్యాంగమే. దేశభవిష్యత్తు చట్టాన్ని రూపొందించేది రాజ్యాంగమే.

భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగసభ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. కేబినెట్ మిషన్‌ప్లాన్ సూచనల మేరకు ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తుకు 1946లో ఎన్నికలు జరిగాయి.

రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. దేశ విభజనానంతరం పాకిస్థాన్‌కు చెందిన సభ్యులు పాకిస్థాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు.

రాజ్యాంగ సభ ప్రథమ సమావేశం 1946, డిసెంబరు 9న జరిగింది. చివరి సమావేశం 1949, నవంబరు 26న జరిగింది. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగసభ అధ్యక్షులు డాక్టర్ బాబూరాజేంద్రప్రసాద్. ముసాయిదా/రచనా కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. రాజ్యాంగసభలోని ఇతర ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, జె.బి.కృపలానీ, ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, సచ్చిదానంద సిన్హా, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్‌ముఖ్. 

భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం, సమాఖ్య విధానం, సార్వజనీన వయోజన ఓటుహక్కు, ద్విశాసన సభావిధానం, ఏకీకృత న్యాయవ్యవస్థ మొదలైనవి.

రాజ్యాంగసభలో ముసాయిదా రాజ్యాంగంపై అనేక వాదోపవాద చర్చలు జరిగాయి. కులవ్యవస్థ, అంటరానితనం, ప్రాథమిక హక్కులు... లాంటి వాటిపై విమర్శనాత్మక చర్చలు జరిగాయి.

భారత రాజ్యాంగం సామాజిక న్యాయ సాధనకు అనేక చర్యలు చేపట్టింది. అంటరానితనం నిషేధం, షెడ్యుల్ కులాలు, తెగల వారికి చట్టసభలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మొదలైనవి.

భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 448 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 5 అనుబంధాలు ఉన్నాయి.

లౌకిక, సామ్యవాదం అనే పదాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.

కాలానుగుణంగా అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని అధికరణలను సవరించడానికి, కొత్తవాటిని చేర్చడానికి అవసరమైన ఏర్పాట్లు రాజ్యాంగంలో చేశారు.

భారత రాజ్యాంగం భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం