• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ జాతీయోద్యమం - దేశవిభజన, స్వాతంత్య్రం : 1939 - 47

ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

ఒక మార్కు ప్రశ్నలు

1. 'అక్షరాజ్యాలు' అని వేటిని అంటారు?
జ: జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలను 'అక్షరాజ్యాలు' అంటారు.
 

2. ఎన్.డబ్ల్యూ.ఎఫ్.పి.ను విశదీకరించండి.
జ: నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్
 

3. పాకిస్థాన్ లేదా పాక్‌స్థాన్ అనే పదం ఏవిధంగా ఏర్పడింది?
జ: * ఈ పదాన్ని ఇంగ్లిష్ అక్షరాలతో రూపొందించారు.
* కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న పంజాబీ ముస్లిం అయిన చౌదరీ రహ్మత్ అలీ పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్‌లను కలిపి పాకిస్థాన్ లేదా పాక్‌స్థాన్‌గా రూపకల్పన చేశాడు.

 

4. ప్రస్తుతం సింధు ప్రాంతం ఏ దేశంలో ఉంది?
జ: ప్రస్తుతం సింధు ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది.

5. ఆర్.ఎస్.ఎస్.ను విశదీకరించండి.
జ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
 

6. 'క్విట్ ఇండియా' అంటే అర్థం ఏమిటి?
జ: క్విట్ ఇండియా అంటే 'భారతదేశం వదిలి వెళ్లండి' అని అర్థం.
 

7. భారత జాతీయ సైన్యం (ఐ.ఎన్.ఎ.) అని దేన్ని అంటారు?
జ: బర్మా, మలయా దేశాల్లో బ్రిటన్‌ను ఓడించిన జపాన్ కొంతమంది సైనికులను బందీలుగా తీసుకెళ్లింది. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్లి బందీగా ఉన్నవారిని విడుదల చేయించి, వారితో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే భారత జాతీయ సైన్యం అంటారు.
 

8. 'తెభాగ' ఉద్యమం అంటే ఏమిటి?
జ: బెంగాల్‌లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు కౌలు పెంచాలని చేసిన ఆందోళననే 'తెభాగ ఉద్యమం' అంటారు.
 

9. రాయల్ నౌకాదళంలో తిరుగుబాటుకు కారణమేమిటి?
జ: బొంబాయి రేవులో రాయల్ నౌకాదళంలోని భారత్ సైనికులకు నాసిరకం ఆహారం అందించడం వల్ల, వారిపట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తనకు నిరసనగా ఈ తిరుగుబాటు జరిగింది.

10. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సంఘాల ఆశయం ఏమిటి?
జ: కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావడమే హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ సంఘాల ఆశయం.
 

11. క్రిప్స్ రాయబారం ఎందుకు విఫలమైంది?
జ: వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యుడిగా భారతీయుడిని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో 'క్రిప్స్ రాయబారం' విఫలమైంది.
 

12. ముస్లిం లీగ్ 'ప్రత్యక్ష కార్యాచరణ దినం'గా ఏ తేదీని ప్రకటించింది?
జ: 1946, ఆగస్టు 16ను ముస్లిం లీగ్ 'ప్రత్యక్ష కార్యాచరణ దినం'గా ప్రకటించింది.
 

13. 1947, ఆగస్టు 15 నాటికి ఏయే సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు?
జ: 1947, ఆగస్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాదు, జునాగఢ్ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు.
 

14. 'రాజాభరణం' అని దేన్ని అంటారు? దాన్ని ఎప్పుడు రద్దు చేశారు?
జ: * భారతదేశంలో విలీనమైన సంస్థానాల ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చుల కోసం పెన్షన్ మంజూరు చేసేవారు. దీన్నే 'రాజాభరణం' అనేవారు.
* 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని, రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది.

రెండు  మార్కుల ప్రశ్నలు 

1. దేశ విభజనకు ముందు రాజకీయాల్లో మతాన్ని ఏవిధంగా ఉపయోగించుకున్నారు?
జ: * స్వాతంత్య్రానికి ముందు రాజకీయాల్లో మతం కీలకపాత్ర పోషించి దేశ విభజనకు దారి తీసింది.
* బ్రిటిష్‌వారు 'విభజించు - పాలించు' విధానం ద్వారా హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించారు.
* హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కులం, వర్గాలను అధిగమించి హిందూ మతస్థులందరినీ ఏకం చేశాయి.
* అధిక సంఖ్యాకులైన హిందువులు ముస్లింల ప్రయోజనాలను పట్టించుకోరని ముస్లిం లీగ్ పెద్దలను ఒప్పించగలిగింది.
* హిందువుల ఐక్యతకు బాలగంగాధర్ తిలక్ గణపతి, శివాజీ ఉత్సవాలను నిర్వహించారు.
* ముస్లింలను ప్రోత్సహించడానికి బ్రిటిషర్లు 1909లో వారికి ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసి వేర్పాటు వాదాన్ని పెంచారు.

 

2. భారత జాతీయ సైన్యంలో భారత సైనికులు చేరడానికి కారణాలేమిటి?
జ: * రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడిన భారతీయ సైనికులు చాలామంది జపాన్‌లో యుద్ధ ఖైదీలుగా ఉండిపోయారు.
* సుభాష్ చంద్రబోస్ జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి సైనికులను విడిపించారు. వారిని భారత జాతీయ సైన్యం (ఐ.ఎన్.ఎ.)లో చేర్చుకోవడానికి, బ్రిటిషర్లపై పోరాడటానికి జపాన్ అంగీకారం పొందారు.

* ఈ విషయం తెలుసుకున్న భారత యుద్ధ ఖైదీలు దేశం కోసం భారత జాతీయ సైన్యంలో చేరి పోరాడటానికి సమ్మతించారు.
* భారత జాతీయ సైన్యం బ్రిటిషర్ల చేతిలో ఓటమి పాలయ్యింది.
* బ్రిటిష్ పాలకులు భారత జాతీయ సైనికులను శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. వారిపై విచారణ కొనసాగుతుండగానే దేశంలోని చాలా ప్రాంతాల్లో అశాంతి, అసంతృప్తి నెలకొన్నాయి.

 

3. కింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


i) 1937లో బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించినప్పుడు ఏ పార్టీ ఘనవిజయం సాధించింది? ఆ పార్టీవారు ఎన్ని రాష్ట్రాల్లో ప్రధాన మంత్రులుగా ఎన్నికయ్యారు?
జ: కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధాన మంత్రులుగా ఎన్నికయ్యారు.

ii) నౌకాదళ భారత సైనికులు ఎలాంటి జెండాలను ఎగరవేశారు?
జ: నౌకలపై మూడు రంగుల జెండా, కత్తి, సుత్తి జెండాలను భారత సైనికులు ఎగరవేశారు.
 

4. యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్‌వారి చేతుల్లో చిక్కుతామన్న భయం భారతీయ సైనికులకు ఎందుకు లేదు?
జ: భారత జాతీయ సైన్యానికి యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్‌వారి చేతుల్లో చిక్కుతామన్న భయం లేదు. ఎందుకంటే...
* వారిలో దేశభక్తి ఎక్కువ.
* భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి భారతీయులందరిలో జాతీయవాద భావన పెంపొందింది.
* తాము చేసే యుద్ధంలో ఇంగ్లండ్ ఓడిపోతే భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని ఆశించారు.
* స్వదేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాలని నిశ్చయించుకున్నారు.

 

5. దేశ విభజన తర్వాత జరిగిన సంఘటనలను తెలపండి.
జ: దేశ విభజన తర్వాత జరిగిన సంఘటనలు:
* 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు.
* హత్యలు, దోపిడీలు, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి.
* రెండు లక్షల నుంచి అయిదు లక్షల మంది హిందువులు, ముస్లింలు చనిపోయారు.
* కొందరు కాందిశీకులుగా మారి పునరావాస శిబిరాల్లో గడిపారు.
* కొత్త ఇళ్ల అన్వేషణకు రైళ్లలో బయలుదేరారు.
* గాంధీజీ శాంతి సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ, అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య గడిపారు.

6. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్‌లలో మీకు నచ్చిన గుణాలు ఏవి?


జ: గాంధీజీలో నాకు నచ్చిన గుణాలు:


* అహింసా మార్గంలో భారతదేశ ప్రజలకు స్వాతంత్య్రాన్ని సంపాదించడం.
* సత్యమునే పలకమని చెప్పడం.
* దేశ విభజన జరిగిననప్పుడు శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రుల్లో గడపడం.


 సుభాష్ చంద్రబోస్‌లో నాకు నచ్చిన గుణాలు:


* ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేయడం.
* విదేశీ సహాయంతో దేశ స్వాతంత్య్రానికి ప్రయత్నించడం.
* అనుకున్నది సాధించే క్రమంలో గాంధీజీని సైతం విభేదించడం.

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకు ఒకవైపున ఉన్న హిందువుల్లో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు అవతలివైపున ఉన్న ముస్లింలలో కూడా ఇదే పరిస్థితి. తమ ఇల్లు, ఊళ్లు, పట్టణాలను విడిచి వెళ్లాల్సి రావడంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వ్యాఖ్యానించండి.
జ: 1906లో ఏర్పడిన 'ముస్లిం లీగ్‌'కు 1930 వరకు ప్రజల మద్దతు అంతగా లేదు. ఆ తర్వాత ముస్లింల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాలనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనే భావన చాలామందిలో ఏర్పడింది. ఈ భావనే భారతదేశం రెండు భాగాలుగా విడిపోవడానికి కారణమైంది. ఈ విభజనే పై పరిస్థితి రావడానికి కారణం.


విభజనకు దారితీసిన వివిధ పరిస్థితులు:


* 'సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా' కవిత రాసిన ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగ్‌కు అధ్యక్షోపన్యాసం చేస్తూ 'వాయవ్య ముస్లిం రాష్ట్ర' ఆవశ్యకత గురించి మాట్లాడారు.
* కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి 'చౌదరీ రహ్మత్ అలీ' ముస్లిం వర్గానికి ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి కల్పించాలనే అభిప్రాయంతో 'పాకిస్థాన్' అనే పదానికి రూపకల్పన చేశాడు.

* 1940, మార్చి 23న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
* బ్రిటన్ అనుసరించిన 'విభజించి - పాలించు' విధానం ముస్లిం లీగ్ బలపడేలా చేసింది.
* చర్చలతో స్వాతంత్య్రం రాదని భావించిన లీగ్, 'ప్రత్యక్ష కార్యాచరణ'కు దిగడంతో అనేక అల్లర్లు జరిగి హింసకు దారి తీసింది.
* చివరకు 1947, ఆగస్టు 14న పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం ఇస్తామని మౌంట్‌బాటన్ ప్రకటించాడు.
* ఆ తర్వాత భారత్, పాకిస్థాన్‌లుగా విడిపోవడం; సరిహద్దు రేఖ వద్ద హిందువులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రావడం జరిగింది.

 

2. కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. వివరించండి.
జ: * స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ అధికారం కింద సర్వసత్తాక పాలనలో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి.
* భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులు వెళ్లిపోవడంతో ఈ సంస్థానాలు కూడా స్వాతంత్య్రం పొందాయి.
* స్వతంత్రంగా ఉంటాయో, భారతదేశం లేదా పాకిస్థాన్‌లో విలీనమవుతాయో నిర్ణయంచుకోమని ఈ సంస్థానాలను కోరారు.

* రాచరిక కుటుంబాల పాలన కొనసాగడం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు.
* హైదరాబాద్, ట్రావెన్‌కోర్‌లలో పాలక జమీందార్లకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటాన్ని చేపట్టింది.
* సంస్థానాల ప్రజల ఉద్యమాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తూ, అవి భారతదేశంలో విలీనమవ్వాలని కోరింది.
* 1947 జులైలో ఈ బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అప్పగించారు.
* సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాదీశులతో చర్చలు జరిపి, విలీనం కాకపోతే సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
* 1947, ఆగస్టు 15 నాటికి కాశ్మీర్, హైదరాబాద్, జునాఘడ్‌లు తప్ప మిగిలినవన్నీ భారతదేశంలో విలీనమయ్యాయి.
* ఆ తర్వాత రెండు సంవత్సరాల్లోపు ఈ మూడు సంస్థానాలను కూడా విలీనమయ్యేలా చేశారు.

 

3. భారతదేశ పటంలో కిందివాటిని గుర్తించండి.


ఎ) 1. కశ్మీర్ 2. హైదరాబాద్ 3. జునాఘడ్ 4. బెంగాల్

బి) 1. ముంబయి 2. దిల్లీ 3. తూర్పు పాకిస్థాన్ 4. పాకిస్థాన్ సరిహద్దు ప్రస్తుత

4. ప్రపంచ పటంలో కిందివాటిని గుర్తించండి.
 

ఎ) 1. జర్మనీ 2. ఇటలీ 3. ఇండోనేషియా 4. బ్రిటన్

బి) 1. జపాన్ 2. మలేషియా (మలయా) 3. ఇండియా 4. బర్మా

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం