• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం

* ఒక దర్పణపు పరావర్తన తలం గోళాకార భాగంగా ఉన్నట్లయితే ఆ దర్పణాన్ని గోళాకార దర్పణం అంటారు.

* గోళాకార దర్పణాలు రెండు రకాలు: 1) కుంభాకార దర్పణం 2) పుటాకార దర్పణం.

* ఒక గోళాకార దర్పణం ఉబ్బెత్తు భాగం పరావర్తన తలంగా, లోపలి భాగం వెండి పూత పూసి ఉండే దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటారు.

* కుంభాకార దర్పణం సాధారణ కాంతి పుంజాన్ని పరావర్తనం తర్వాత అపసరణం చెందిస్తుంది కాబట్టి దీన్ని అపసరణ దర్పణం (వికేంద్రీకరణ దర్పణం) అంటారు.

* ఒక గోళాకార దర్పణం ఉబ్బెత్తు భాగం వెండి పూత పూసి ఉండి, లోపలి భాగం పరావర్తనం తలంగా ఉండే దర్పణాన్ని పుటాకార దర్పణం అంటారు.    

* పుటాకార దర్పణం, సాధారణ కాంతి పుంజాన్ని పరావర్తనం తర్వాత అభిసరణం చెందిస్తుంది. కాబట్టి దీన్ని అభిసరణ దర్పణం (కేంద్రీకరణ దర్పణం) అంటారు.

* గోళీయ దర్పణాన్ని ఏర్పరిచిన గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. దీన్ని 'C' తో సూచిస్తారు.

* గోళాకార దర్పణం మధ్య బిందువు లేదా జ్యామితీయ కేంద్రాన్ని ధృవం అంటారు. దీన్ని 'P' తో సూచిస్తారు.

* దర్పణ ధృవాన్ని, వక్రతా కేంద్రాన్ని కలుపుతూ గీసిన రేఖను ప్రధానాక్షం అంటారు.
* దర్పణాలపై సమాంతరంగా పతనమైన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును నాభి (F) అంటారు.
* ఒక దర్పణం నాభికి, ధృవానికి మధ్య ఉండే దూరాన్ని నాభ్యంతరం (f) అంటారు. నాభికి, వక్రతా కేంద్రానికి మధ్య ఉండే దూరాన్ని కూడా నాభ్యంతరంగా పరిగణిస్తారు.
* ఒక దర్పణం వక్రతా కేంద్రానికి, ధృవానికి మధ్య ఉండే దూరాన్ని ఆ దర్పణం వక్రతా వ్యాసార్ధం (R) అంటారు.


* పరావర్తన కిరణాలను వెనక్కి పొడిగించినప్పుడు ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. దీన్ని తెరపై పట్టలేం.
* పరావర్తన కిరణాలు ఖండించుకున్న ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. దీన్ని తెరపై పట్టవచ్చు.

f - నాభ్యంతరం
u - వస్తు దూరం
v - ప్రతిబింబ దూరం


దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించాల్సిన సంజ్ఞా సంప్రదాయాలు
1) అన్ని దూరాలను దర్పణ ధృవం (P) నుంచే కొలవాలి.
2) కాంతి (పతన కాంతి) ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా, కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగా పరిగణించాలి.
3) వస్తువు ఎత్తు (ho), ప్రతిబింబం ఎత్తు (hi) ప్రధానాక్షానికి పైవైపు ఉన్నప్పుడు ధనాత్మకంగా, కిందివైపు ఉన్నప్పుడు రుణాత్మకంగా పరిగణించాలి.

* పెద్ద పూటాకార దర్పణాలను సోలార్ కుక్కర్ తయారీలో ఉపయోగిస్తారు. 'సూర్యకాంతిని ఈ దర్పణం ఒక బిందువు (F) వద్ద కేంద్రీకరిస్తుంది' అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.


కుంభాకార దర్పణాల ఉపయోగాలు
* వాహనాల్లో డ్రైవర్ వెనుక వైపు వాహనాలను చూడటానికి వాడే సైడ్ మిర్రర్‌గా
* దుకాణాల్లో సెక్యూరిటీ దర్పణంలా పెద్ద కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు.


పుటాకార దర్పణాల ఉపయోగాలు
* దంత వైద్యులు; ఈఎన్‌టీ వైద్యులు ఉపయోగించే దర్పణాల్లో షేవింగ్ దర్పణంలా ఉపయోగిస్తారు.
* వాహనాలకు, హెడ్‌లైట్‌లకు పరావర్తన దర్పణంలా ఉపయోగిస్తారు.
* ఖగోళదర్శిని, సెర్చ్ లైట్లలో ఉపయోగిస్తారు.
* సోలార్ ఉపకరణాల్లో ఉపయోగిస్తారు.

గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం

భావ‌న‌ల అమ‌రిక చిత్రం

Posted Date : 25-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం