• facebook
  • whatsapp
  • telegram

కేశవానంద భారతి కేసు.. చారిత్రక తీర్పునకు 50ఏళ్లు..!

అసలేమిటీ కేసు..?ఎందుకంత ప్రాధాన్యం?

 

 

రాజ్యాంగ మౌలిక స్వరూపం, పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించి అత్యంత కీలకమైన కేసుగా కేశవానంద భారతి కేసు న్యాయచరిత్రలో నిలిచింది. కేరళ భూసంస్కరణల చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఆ కేసులో వచ్చిన తీర్పు.. తదనంతరం ఎన్నో కేసులకు దిక్సూచిగా నిలుస్తోంది. ‘కేశవానంద భారతి వర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసు తీర్పు వెలువడి ఏప్రిల్‌ 24తో 50 ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు వాదనలు, లిఖిత పూర్వక ప్రతులతోపాటు చరిత్రాత్మక తీర్పుతో ఓ ప్రత్యేక వెబ్‌ పేజీని సుప్రీంకోర్టు రూపొందించింది.

 

‘యావత్‌ ప్రపంచ పరిశోధకులు చూసేందుకు వీలుగా కేశవానంద కేసుకు సంబంధించి ఉన్న అన్ని లిఖిత పూర్వక దస్త్రాలతో కూడిన ఓ వెబ్‌పేజీని ఏర్పాటు చేశాం. 50ఏళ్ల క్రితం ఏప్రిల్‌ 24, 1973 దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడింది’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. దీంతో కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేశారు. పరిశోధకులు, విద్యార్థులు, న్యాయవాదులకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.

 

అసలేమిటీ కేసు..?

కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25, 29వ రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ సవరణలు న్యాయవ్యవస్థ అధికారాలతోపాటు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై 1972 అక్టోబర్‌ 31న ప్రారంభమైన విచారణ 1973 మార్చి 24 వరకు సాగింది. అప్పట్లో ఈ కేసును 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఒక కేసు విచారణ కోసం 13 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి.

 

అయితే, విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు, మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఉందా? లేదా? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. 68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం.. రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అని చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఏ విషయంలోనైనా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ..  మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను మార్చలేదని తెలిపింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని స్పష్టం చేసింది. దీనర్థం.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య, చట్టం అందరికీ సమానం వంటివి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తెలిపింది.

 

కేశవానంద భారతి కేసు వెబ్‌పేజీ

 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సివిల్స్‌లో సందేహాలను నివృత్తి చేసుకుందాం..

‣ అత్యున్నత సైన్స్‌ కోర్సుల వేదిక.. ఐసర్‌

‣ ఐసెట్‌ ర్యాంకుకు మెరుగైన మార్గం

‣ అటామిక్‌ ఎనర్జీలో ఉద్యోగాలు

‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు

‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..

Posted Date : 24-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌