• facebook
  • twitter
  • whatsapp
  • telegram

9,231 గురుకుల కొలువులకు చదవండిలా..

9 నోటిఫికేషన్లతో బోధనా ఖాళీల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో  ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. మొత్తం 9231 పోస్టులకుగాను.. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. 

గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులు 4,020 ఉండగా.. ఏప్రిల్‌ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులున్నాయి. అన్ని వివరాలతో 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఏప్రిల్‌ 17 నుంచి మే 17 వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

జూనియర్‌ కళాశాలల్లో 2008 (జూనియర్‌ లెక్చరర్, ఫిజికల్‌ డైరెక్టర్‌/ లైబ్రేరియన్‌) పోస్టులకు ఏప్రిల్‌ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ ఉద్యోగాల్లో మొత్తం 1276 పోస్టులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

మూడు గురుకుల సొసైటీల్లోని పాఠశాలల్లో 434 లైబ్రేరియన్‌ పోస్టులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 275 ఉండగా.. వీటికి కూడా పైతేదీల్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆర్ట్‌ టీచర్, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులు 134 ఉన్నాయి. క్రాఫ్ట్‌ టీచర్, క్రాఫ్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 92.. మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు 124 ఉన్నాయి. 

అర్హతలుంటే ఒకటికి మించి.. 

ఈ నోటిఫికేషన్లు అన్నీ జనరల్‌ స్టడీస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టుల జ్ఞానాన్ని పరిశీలించే పరీక్షలకు చెందినవి. అంటే జనరల్‌ స్టడీస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టుల పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా సిలబస్‌ ఉంటుంది.

తగిన అర్హతలు ఉండటం వల్ల కొంతమంది అభ్యర్థులు ఒకటికి మించిన నోటిఫికేషన్లకు స్పందించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వారి వారి సామర్థ్యాలను బట్టి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలనూ వినియోగించుకునే ఆలోచన మంచిది. అంటే ఆయా పోటీ పరీక్షలు మెరుగ్గా రాసేందుకు సంసిద్ధం కావాలి. 

అదే సందర్భంలో రోస్టర్‌ పాయింట్ల ప్రకారం పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక ప్రధానమైన ఆలోచనగా ఉండాలి. ఒకటి లేదా రెండు పోస్టుల కంటే ఎక్కువ పోస్టులున్న నోటిఫికేషన్‌కు సిద్ధపడ్డమే తెలివైన నిర్ణయం.

ఇప్పటికే గ్రూప్‌-2, గ్రూప్‌-1 పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూవుంటే అక్కడ చదివిన జనరల్‌ స్టడీస్‌ ఇక్కడ కూడా ఉపయుక్తమే. కాబట్టి మిగిలిన పేపర్లపై దృష్టి పెట్టడం మంచిది.

అయితే ప్రస్తుత నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా, లేదా గ్రూప్‌ 1, 2లపై అధిక అపేక్ష ఉన్నా గ్రూప్స్‌ పరీక్షలకు సంసిద్ధమవడమే సమయానుకూల నిర్ణయం అవుతుంది.

ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి

తెలంగాణ పోటీ పరీక్షల్లో ఇంగ్లిషు భాషపై ప్రశ్నలను జనరల్‌ స్టడీస్‌లో భాగంగా అడుగుతున్నారు. వంద మార్కుల ప్రశ్నపత్రంలో కూడా 10 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంది. అందువల్ల అంతిమ పోటీలో నిలబడాలనుకుంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించటం చాలా అవసరం. ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రయత్నం చేయాలి. పట్టణ అభ్యర్థులకు కూడా సాధారణంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో పట్టు ఉంటుంది గానీ వ్యాకరణంపై పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఈ లోపాలను గుర్తించి అభ్యర్థులు ఇంగ్లిష్‌ భాషపై తగిన పట్టు సాధించటం అవసరం. గురుకులాల నోటిఫికేషన్లలో జనరల్‌ స్టడీస్‌లో ఇంగ్లిష్‌ భాషపై 10కి పైన ప్రశ్నలు వచ్చినా ఎదుర్కొనే స్థాయిలో సన్నద్ధత పెంచుకోవాలి. 

జనరల్‌ స్టడీస్‌ మార్కులే కీలకం

ఇలాంటి సబ్జెక్టు ప్రత్యేక పరీక్షల్లో మెరిట్‌ అభ్యర్థులందరికీ సబ్జెక్టుల్లో దాదాపుగా సమాన మార్కులే వస్తాయి. అయితే జనరల్‌ స్టడీస్‌లో వచ్చే మార్కులు అంతిమంగా ఉద్యోగ ఎంపికకు దోహదపడే అవకాశాలు ఎక్కువ.

అందువల్ల సబ్జెక్టులపై పూర్తిస్థాయి కమాండ్‌ వచ్చినప్పుడు మాత్రమే కాదు, జనరల్‌ స్టడీస్‌కి మిగతా సబ్జెక్టులతో పాటు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.

చాలామంది ఈ పరీక్షలపై అవగాహన లేక జనరల్‌ స్టడీస్‌ మహా సముద్రమని నిర్లక్ష్యం చేస్తూ సబ్జెక్టు పేపర్లపైనే అధిక దృష్టి పెడుతున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు.

కచ్చితంగా జనరల్‌ స్టడీస్‌లో ఉండే సిలబస్‌ చాలా ఎక్కువే అయినప్పటికీ సరైన ప్రణాళికతో ముందుకెళ్తే దీనిలో మంచి మార్కులు సాధించవచ్చు. అంతిమంగా ఉద్యోగానికి ఎంపిక కావచ్చు.

జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌ అంశాలు ప్రిపేర్‌ అయ్యేటప్పుడు తాజాగా ప్రశ్నల ధోరణిలో వస్తున్న మార్పులను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆపై ఒక్కొక్క విభాగాన్ని అవసరమైనంత లోతుగా చదవాల్సి ఉంటుంది.

   

ఊగిసలాట వద్దు

రాబోయే గ్రూప్‌-1 ప్రిలిమ్స్, గ్రూప్‌-2, 4 లాంటి పరీక్షలకు ఇప్పటికే సిద్ధపడిన అభ్యర్థులు ఇవి రాయాలా వద్దా అనే మీమాంసతో సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. తాజా గురుకుల నోటిఫికేషన్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ పరీక్షలపైన దృష్టి పెట్టడం సరైన నిర్ణయమే అవుతుంది.

పరీక్ష స్థాయిని బట్టి ఆయా సబ్జెక్టుల్లో ప్రిపేర్‌ అవ్వాల్సిన లోతును నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్‌ లెక్చరర్స్‌లో పెడగాజి సిలబస్‌గా ఉంది. డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షలో అడిగే ప్రశ్నల స్థాయి జూనియర్‌ లెక్చరర్‌ ప్రశ్నల స్థాయి కంటే అధికంగా ఉండవచ్చు. అదే సందర్భంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ పరీక్షలు కొంత సులభంగా ఉండవచ్చు. కాబట్టి పరీక్ష స్థాయులను బట్టి సంబంధిత అంశాల్లో లోతుగా, విస్తృతంగా చదవాలి. ఇదే సూత్రం జనరల్‌ స్టడీస్‌ విషయంలో కూడా వర్తిస్తుంది.

అన్ని పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ ఒక పేపర్‌ అయినప్పటికీ దానిలో ఉన్న సిలబస్‌ విభాగాలు కొన్ని ఉద్యోగాలకు తగ్గించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించుకుని జనరల్‌ స్టడీస్‌ ప్రిపరేషన్‌కు సిద్ధపడటం సరైన ప్రణాళిక అవుతుంది.


 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

‣ 18 ఎయిమ్స్‌ కేంద్రాల్లో 3055 నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ ఆర్కిటెక్చర్‌ ప్రవేశానికి మార్గం.. నాటా

‣ సమాచార విశ్లేషణకు ‘క్విక్‌సైట్‌’

Posted Date : 20-04-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌