• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌లో సందేహాలను నివృత్తి చేసుకుందాం..

పార్లమెంటరీ కమిటీ సిఫారసుల వివరాలు

యూపీఎస్‌సీ దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష విధానంలో హఠాత్తుగా మార్పులు చేస్తారా? ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రకటనలూ లేకుండా కమిటీని ఏర్పాటు చేస్తుందా? దాని సూచనలను వెంటనే అమలు చేస్తుందా? సోషల్‌మీడియాలో రకరకాల ఊహాగానాలూ, వదంతులూ వ్యాపిస్తుండటంతో ఇలాంటి సందేహాలెన్నో అభ్యర్థులను సతమతం చేస్తున్నాయి. ఇంతకీ వాస్తవాలేమిటి?  

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో పార్లమెంటరీ కమిటీ కొన్ని మార్పులను సూచించిందని కొన్ని రోజులకిందట పత్రికా  నివేదిక వెల్లడించింది. అంతే.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష, రాష్ట్ర సర్వీస్‌ పరీక్షల్లో మార్పులు రాబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ సందర్భంగా విద్యార్థుల్లో తలెత్తిన ప్రధానమైన  సందేహాలను నివృత్తి చేసుకుందాం!  

ఈ కమిటీ ఏమిటి? ఇతర సివిల్‌ సర్వీస్‌ సంస్కరణ కమిటీల్లా దీన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ముందుగా ఎలాంటి సమాచారం లేదెందుకని? 

ఇది సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన స్టాండింగ్‌ కమిటీ. ప్రతి సంవత్సరం ఏర్పాటుచేసే ఇలాంటి కమిటీలు తమకు అప్పగించిన విధులపై పనిచేస్తూ కొన్ని సిఫారసులను అందజేస్తుంటాయి. ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా బడ్జెట్‌కు సంబంధించిన చర్చ, ఓటింగ్‌ ఉంటాయి. మన దేశంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి మంత్రిత్వశాఖ అంచనాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. అదే డిపార్ట్‌మెంటల్లీ రిలేటెడ్‌ స్టాండింగ్‌ కమిటీ. ఈ కమిటీ బడ్జెట్‌ వ్యయ అంచనాల ముఖ్యాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. పార్లమెంట్‌ ప్రధానంగా వీటిమీదే దృష్టిపెట్టి అర్థవంతమైన చర్చ జరుపుతుంది. 2023-24 సంవత్సరానికి చెందిన పర్సనెల్, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అంచనాలను పరిశీలించిన కమిటీ.. ఈ రకంగా మీడియా, సోషల్‌ మీడియా వార్తల్లో నిలిచింది. ఈ డిపార్టుమెంట్‌కు అనుసంధానమైనదే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ). 

కమిటీ పరిశీలనలు, సూచనలను ఎందుకు చేసింది?

ప్రభుత్వ వ్యయాలను పరిశీలించడం కమిటీ విధి. దీనివల్ల ప్రజాధనం వృథా కాకుండా ఉంటుంది. ఈ పరిధిలోనే కమిటీ పరిశీలనలు, సూచనలను చేసింది. 

ఈ కమిటీ చేసిన సిఫారసులు ఏమిటి? 

ఎ) సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ప్రకటన వెలువడిన తేదీ నుంచి తుది ఫలితాలు వెల్లడయ్యే నాటికి 15 నెలల సమయం పడుతుంది. అభ్యర్థి పరీక్షకు దరఖాస్తు చేసి.. ప్రిలిమినరీకి హాజరై.. ఫలితాల కోసం ఎదురుచూసి.. దాంట్లో అర్హత సాధిస్తే మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్‌ ఫలితాల కోసం నిరీక్షించాలి. దాంట్లోనూ అర్హత సాధిస్తే పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరై.. చివరగా తుది ఫలితాల కోసం ఎదురుచూడాలి. ఈ 15 నెలల కాలవ్యవధిని ఏడాదికి తగ్గించాలని కమిటీ సూచించింది. ఈ సుదీర్ఘమైన నియామక ప్రక్రియ అభ్యర్థి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందనీ, అభ్యర్థుల విలువైన సమయం కూడా వృథా అవుతోందనీ తెలిపింది. 
సివిల్స్‌ పరీక్ష స్వభావం.. వివిధ దశల పరంగా అవుతున్న వ్యవధిని తగ్గించే అవకాశాన్నివ్వదు. ఇది ఏదైనా కోర్సులో చేరడానికి రాసే ప్రవేశ పరీక్ష కాదు. స్వల్పకాల వ్యవధిలో సన్నద్ధతను కొనసాగించినా దాంట్లో పాసయ్యే అవకాశం ఉంటుంది. కానీ సివిల్స్‌.. అర్హులైన అభ్యర్థుల నుంచి అనర్హులను వడపోసే వ్యవస్థ. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఒక్కసారి అభ్యర్థి ఎంపికైతే జీవితాంతం ప్రభుత్వ యంత్రాంగంలోనే ఉంటారు. ఈ ప్రక్రియ అంతా వేగంగా జరిగితే.. అనర్హులు ఎంపికయ్యే అవకాశం ఎక్కువ. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ప్రిలిమ్స్, డిస్క్రిప్టివ్‌ విధానంలోని మెయిన్స్, ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్టింగ్‌ ..వీటి మధ్య వ్యవధిని తగ్గించడం అసాధ్యమే. ఈ కమిటీ సూచన అమలవ్వాలంటే ఒకటే మార్గం కనిపిస్తుంది. ప్రిలిమ్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాలను వెంటనే ప్రకటించటం. తర్వాత మెయిన్‌ నిర్వహించి.. డిజిటల్‌ కరెక్షన్‌ ప్రవేశపెట్టాలి. దీనికి సుదీర్ఘకాల ప్రణాళిక, ఏర్పాట్లు అవసరమవుతాయి.  

బి) ప్రిలిమ్స్‌ జరిగినవెంటనే కీ వెల్లడించి, అభ్యంతరాలు స్వీకరించి అవసరమైతే సవరణలు చేయాలి. అప్పుడే ప్రిలిమినరీ ఫలితాలు ప్రకటించాలి. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, న్యాయబద్ధతలకు ఇలా ఆస్కారం ఏర్పడుతుంది. (యూపీఎస్‌సీ ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. అర్హత మార్కులనూ, ‘కీ’నూ వెల్లడించటం లేదు. ఈ వివరాలను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు ముగిశాకే ప్రకటిస్తోంది. దీనివల్ల క్వాలిఫై అవ్వనివారు దానికి కారణమేమిటో, తమ జవాబులు ఎందుకు తప్పయ్యాయో తెలుసుకోలేకపోతున్నారు).   
ఈ ప్రక్రియకు చాలా కాలం పడుతుంది. విజయానికీ, పరాజయానికీ ఒక ప్రశ్న కారణమైనపుడు చాలామంది అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఫలితంగా జవాబులు ఏవి సరైనవో, వాటి ఆధారమేమిటో కూడా యూపీఎస్‌సీ ప్రకటించాల్సివుంటుంది. మొత్తం ప్రక్రియ దీనివల్ల సంక్లిష్టమైపోతుంది. పరీక్ష నిర్వహణలో జాప్యం అనివార్యమవుతుంది. అందువల్ల ఈ సిఫార్సు అమలు కష్టమవుతుంది. 

సి) ప్రస్తుతం 1472 మంది ఐఏఎస్‌ అధికారుల కొరత ఉంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్‌ల ద్వారా ఎక్కువమందిని నియమించాలి. 
ఈ సిఫారసుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే.. ఐఏఎస్‌ల సంఖ్యను పెంచాలి. రాష్ట్ర సర్వీస్‌ నుంచి ఐఏఎస్‌గా పదోన్నతి పొందేవాళ్ల సంఖ్యనూ పెంచాలి. అయితే.. ప్రస్తుత ప్రభుత్వం లేటరల్‌ ఎంట్రీకి ప్రాధాన్యం ఇస్త్తోంది. దీంట్లో భాగంగా ప్రైవేటు రంగానికి చెందిన అనుభవజ్ఞులైన ఉద్యోగులు స్వల్పకాలం హోదాల్లో ఉంటారు. మొత్తమ్మీద చెప్పుకోదగ్గ సంఖ్యలో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు.

డి) ప్రస్తుత ఎంపిక విధానం పట్టణ ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులకూ, గ్రామీణ ఆంగ్లేతర మీడియం విద్యార్థులకూ సమాన అవకాశం కల్పిస్తోందా? (ఇది కమిటీ లేవనెత్తిన ముఖ్యమైన ప్రశ్న). 
ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలను ఇంగ్లిష్, హిందీలలో ఇస్తున్నారు. హిందీయేతర రాష్ట్రాలకు చెందిన.. గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు స్పష్టమైన ప్రతికూలతే ఇది. ఎందుకంటే.. ఇంగ్లిష్‌ వారిస్థాయి కంటే పై స్థాయిలో ఉంటుంది. మెయిన్స్‌లో అభ్యర్థి మాతృభాషలో సమాధానం రాయొచ్చు గానీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు చెంది ప్రాంతీయ మీడియంలో చదివిన అభ్యర్థులు పైస్థాయిలోని ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోకపోవచ్చు. అలాంటప్పుడు మార్కులు సాధించే విధంగా సమాధానమూ రాయలేరు. ఈ సిఫారసు మూలంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లోనూ ప్రశ్నపత్రాలను అనువదించే ఆస్కారం ఉంటుంది. ఇది అమలయితే ప్రాంతీయ భాషల్లో చదివిన అభ్యర్థులకు ప్రయోజనకరమే! 

సంక్షిప్తంగా చూద్దాం! 

1. ఏటా స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ సిఫారసులన్నీ సూచనప్రాయమైనవి మాత్రమే. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చు. తీసుకోకపోనూవచ్చు. 

2. గరిష్ఠ వయసు, పరీక్ష విధానంపై ఏర్పాటయ్యే నిపుణుల కమిటీ సిఫారసులపై ఆధారపడి మాత్రమే వాటిలో మార్పులకు అవకాశం ఉంటుంది.     

3. ఏ మార్పు అమలు చేయాలన్నా సరే, ప్రభుత్వం ముందస్తుగా తగిన నోటీసు జారీ  చేస్తుంది. 

4. ఈ కమిటీ సిఫారసులు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పరీక్షల మీద ఎలాంటి ప్రభావాన్నీ చూపవు. 

చివరగా చెప్పేదేమిటంటే.. ఎలాంటి సందేహాలూ పెట్టుకోకుండా.. ఆందోళన పడకుండా విద్యార్థులు పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలి. ‘మనం వంతెన దగ్గరకు వచ్చినపుడే దాన్ని దాటగలం’ అనే సూక్తి తెలుసా? అంటే వంతెన దగ్గరకు వెళ్లకుండానే దాన్ని ఎలా దాటాలో చర్చలు చేయటంలో అర్థం ఉండదు. సివిల్స్‌ పరీక్ష విధానంలో మార్పులు జరగొచ్చని వ్యాపించే ప్రచారానికీ ఇదే వర్తిస్తుంది. సోషల్‌ మీడియాలో వచ్చే రకరకాల పోస్టులకు అనవసరంగా ప్రభావితం కాకుండా.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. 
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐసెట్‌ ర్యాంకుకు మెరుగైన మార్గం

‣ అటామిక్‌ ఎనర్జీలో ఉద్యోగాలు

‣ ప్రతిష్టాత్మక ప్రమాణాలతో ఉన్నత కోర్సులు

‣ 9,231 గురుకుల కొలువులకు చదవండిలా..

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌