• facebook
  • whatsapp
  • telegram

ఎంత పరిధి? ఏవి ముఖ్యం? 

జనరల్‌ స్టడీస్‌ - జాగ్రఫీ ప్రిపరేషన్‌

 

 

పోటీ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో భాగంగా గతంలోనూ, వర్తమాన కాలంలోనూ ప్రాధాన్యం ఉన్న అంశం- భౌగోళిక  వ్యవస్థ (జాగ్రఫీ). రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పోటీ పరీక్షల్లో ఈ విభాగాన్ని ఎలా చదవాలి? ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏమేం గమనించాలి? 

 

పోటీ పరీక్షల్లో జాగ్రఫీ మూడు స్థాయుల్లో ఉంటోంది. 1. ప్రపంచ 2. భారత 3. ప్రాంతీయ (ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ) భూగోళ అంశాలు. రాయబోతున్న పోటీ పరీక్ష సిలబస్‌లో ఈ మూడు అంశాలూ ఉన్నాయా? ఒకటి గానీ, రెండు గానీ ఉన్నాయా అని ముందుగా నిర్థరించుకోవాలి.

 

ఈ మూడు అంశాలూ సిలబస్‌లో ఉంటే-  ప్రపంచ భూగోళ అంశాల నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు, భారత భూగోళ అంశాల నుంచి 8 నుంచి 12 ప్రశ్నలు, ప్రాంతీయ భౌగోళిక అంశాల నుంచి 4 నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కచ్చితంగా ఇలాగే రావాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ విధమైన మోతాదును నిర్ణయించుకుని ప్రిపేర్‌ అయితే మొత్తం సిలబస్‌కు న్యాయం చేయవచ్చు; మంచి మార్కులూ సాధించవచ్చు.

 

మొదట భారత భౌగోళిక అంశాలను ఎలా చదవాలో చూద్దాం. 

 

వీటిని లోతుగా చదవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. భారత భూగోళ అంశాలు స్థూలంగా- భౌతిక, ఆర్థిక, మానవ భూగోళ అంశాలుగా ఉంటాయి.

 

భౌతిక అంశాలు

గతంలో భారతదేశ భౌతిక భౌగోళిక అంశాలపై ఎక్కువ ప్రశ్నలూ, ఆర్థిక అంశాలపై తక్కువ ప్రశ్నలూ ఉండేవి. కానీ అనువర్తన ధోరణి పోటీ పరీక్షల్లో ఎక్కువవుతున్నకొద్దీ ఆర్థిక భౌగోళిక అంశాలపై ప్రశ్నలు పెరుగుతున్నాయి.

 

గ్రూప్‌ 1, 2 మొదలైన పరీక్షల్లో ఎకానమీ ఒక కీలక భాగంగా మారింది. ఈ నేపథ్యంలో ఎకనమిక్‌ జాగ్రఫీ రెండు సబ్జెక్టుల్లో ఉపయుక్తంగా ఉంది. ఈ సౌలభ్యం గుర్తించి అందుకనుగుణంగా తయారైతే అభ్యర్థులు అధిక లబ్ధి పొందుతారు.

 

భౌతిక భౌగోళిక అంశాల్లో- భారతదేశ ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి ముఖ్య అంశాలని చెప్పవచ్చు. నైసర్గిక స్వరూపంలో భాగంగా భారతదేశ పీఠభూమి, మైదానాలు, ఎడారి ప్రాంతాలు, పర్వతాలు, నదులు మొదలైనవాటి సమాచారం తెలుసుకోవాలి. ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ, తూర్పు భారతదేశాలుగా విభజించుకుని ఆయా అంశాల్ని అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలి. ఉనికి, నైసర్గిక స్వరూపంపై 4-6 ప్రశ్నలు రావొచ్చు. అందువల్ల కొన్ని విషయాల్లో బట్టీ పట్టినా సరే ఈ అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా నదీ వ్యవస్థపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.

 

శీతోష్ణస్థితి మానవుని ఉనికికీ, అభివృద్ధికీ దోహదపడే భౌతిక అంశం. మనదేశానికి సంబంధించినంతవరకు శీతోష్ణస్థితిపై 3-4 ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌లో అడిగే అవకాశం ఉంది. శీతోష్ణస్థితికి సంబంధించిన సైద్ధాంతిక అంశాలు అప్పుడప్పుడూ ప్రశ్నల రూపంలో కనిపిస్తాయి కాబట్టి భారతదేశానికి అన్వయించుకుని శీతోష్ణస్థితిని చదవాల్సి ఉంటుంది. రుతుపవనాలు, కాలాలు మొదలైనవి దిగువ స్థాయి పరీక్షల్లో అడుగుతుంటారు. శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే వివిధ కారకాలను గ్రూప్‌ 1, 2 స్థాయి పరీక్షల్లో ప్రశ్నల రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

భారతదేశంలో పొడవైన నది? ఎత్తయిన పర్వతం? విస్తీర్ణం రీత్యా చిన్న రాష్ట్రం? తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం? జలావరణం అధికంగా ఉన్న రాష్ట్రం?.. ఇలా వివిధ భౌతిక అంశాలను తులనాత్మకంగా పోలుస్తూ ప్రశ్నలు వస్తాయి.

 

దేశంలో వివిధ రూపాల్లో ఉన్న రవాణా వ్యవస్థ కూడా పరీక్షల్లో ప్రశ్నల రూపంలో ఎక్కువ సందర్భాల్లో కనిపిస్తుంది. రోడ్డు, రైలు, జల, వాయు రవాణాలుగా విభజించుకుని రవాణా వ్యవస్థను చదవాలి. ఇటీవల కేంద్రప్రభుత్వం మౌలిక రంగ విస్తరణలో భాగంగా ఈ నాలుగు రవాణా విభాగాల్లో అనేక మార్పులను ప్రతిపాదించింది. 2022-23 బడ్జెట్లో మార్పులు కనిపిస్తున్నాయి. వాటిని కూడా అనుసంధానించుకుని చదవడం మేలైన విషయం. వివిధ రాష్ట్రాల మధ్య ఈ రవాణాలకు సంబంధించి పోలికలతో పాటు భేదాలనూ గమనించాలి. వివిధ రవాణాలకు సంబంధించి భౌతికంగా గుర్తింపు ఉన్న ప్రదేశాలను పరీక్ష కోసం గుర్తుపెట్టుకోవాలి.

 

తేయాకు అస్సాంలోనే ఎందుకు పండుతుంది? అని ఆలోచించే కోణమే - భౌగోళిక వ్యవస్థ అధికంగా తేయాకు ఎక్కడ పండుతుంది? ఎంత పడుతుంది? దాని విలువ? ఎగుమతులు? అని ఆలోచించే కోణం - ఎకానమీ

 

ఆర్థిక అంశాలు

ఆర్థిక వ్యవస్థ అనగానే వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అని చెప్పుకుంటాం. భౌగోళిక వ్యవస్థలో కూడా అదే రీతిలో చదవొచ్చు. అయితే సులభంగా చెప్పుకోవాలంటే ఆర్థిక వ్యవస్థకు దోహదపడే వివిధ రకాలైన పంటలు, అడవులు, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ మొదలైనవాటిని ఆర్థిక భూగోళ అంశాలుగా గుర్తించాలి. ఇవన్నీ ఎకానమీ విభాగంలోనూ కనిపిస్తాయి. అయితే భౌగోళిక వ్యవస్థలో చదివేటప్పుడు ఆయా అంశాల ఉత్పత్తుల, సేవల వెనకున్న భౌగోళిక కారణాలపై అధికంగా దృష్టి పెట్టాలి. 

 

మనదేశంలో ఏ పంటలు పండిస్తున్నారు? వాటి నేలలు, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, కాలాలు, వివిధ రాష్ట్రాల ఉత్పాదకత మొదలైన ఉప కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉత్పత్తుల సమాచారంపై పట్టు కోసం భారతదేశ తాజా ఆర్థిక సర్వే 2021-22లో ఉదాహరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడో ప్రచురించిన పుస్తకాల్లో ఈ సమాచారం అప్‌డేట్‌గా ఉండదు.

 

దేశంలో లభించే వివిధ రకాల ఖనిజాలు, సంబంధిత పరిశ్రమలు పరీక్ష కోణంలో ప్రాధాన్యం పొందుతాయి. అందువల్ల ఖనిజాలు ఏ నేలల్లో లభిస్తున్నాయి? ఏ రాష్ట్రాల్లో లభిస్తున్నాయి? ఏ పరిశ్రమలకు ఆధారాలుగా ఉన్నాయి? ఎక్కడ నుంచి ఎక్కడికి  ఎగుమతులు చేస్తున్నారు? ఉద్యోగ కల్పనలో వాటి భాగస్వామ్యం? మొదలైన కోణాల్లో చదవాలి.

 

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పర్యాటక స్థలాలు, అవి ఉన్న రాష్ట్రాలు, వాటి ప్రాధాన్యాలపై కూడా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రాలవారీగా పర్యాటక ప్రదేశాలను గుర్తుంచుకోవటం ప్రిపరేషన్లో అంతర్భాగమే. పర్యాటక ఆదాయం, దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య ఎకానమీలో అంతర్భాగంగా చదువుతూనే జాగ్రఫీతో అనుసంధానం చేసుకోవాలి. 

 

మానవ భౌగోళిక అంశాలు

ఈ విభాగం కింద భారతదేశ జనాభాపై ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో జనసాంద్రత, జన సంఖ్య, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా జనాభా, భాషల, మతాల వారీగా జనాభా, మొత్తం జనాభా శాతం, మహిళా జనాభా సంఖ్య, శాతాలు ఈ సందర్భంలో కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ తెగలవారు ఏయే రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? ఆయా తెగల ప్రత్యేకతలు మొదలైనవీ ముఖ్యమే. వివిధ ప్రాంతాల్లో ప్రజల ఆచార సాంస్కృతిక వ్యవహారాలు, వృత్తులు, అక్షరాస్యత ఆధారంగా విభజన- ఈ విభాగంలో అంతర్భాగంగానే చదవాలి. 

 

2011 జనాభా లెక్కల తరువాత 2021 జనాభా లెక్కలు రానున్న నేపథ్యంలో జనాభా పరిణామాలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. NSO నివేదిక 2020, నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2021 ద్వారా జనాభా గణాంకాలు కొన్ని అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఆబ్జెక్టివ్‌ పరీక్షతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌లోనూ వినియోగించుకోవచ్చు.
 

********************************************************

స్టడీమెటీరియల్
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ బాగా చదవాలంటే సరిగా తినాలి!

‣ ఆర్కిటెక్చర్‌లో... ప్రవేశాలకు నాటా

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌