• facebook
  • whatsapp
  • telegram

లెక్చ‌ర‌ర్ ఉద్యోగం సాధించాలంటే?

జేఎల్ ప‌రీక్ష స‌న్న‌ద్ధ‌త‌కు సూచ‌న‌లు

 

 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జేఎల్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు డిసెంబర్‌ 16 నుంచి 2023 జనవరి 6 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నియామక రాతపరీక్షను 2023 జూన్‌/ జులైలో నిర్వహించనున్నారు. 


బోధన వృత్తిపై ఆసక్తి ఉండి లెక్చరర్‌గా స్థిరపడాలని అనుకునేవారికి తాజా నోటిపికేషన్‌ మంచి అవకాశం. మొదటినుంచీ ప్రణాళిక ప్రకారం సన్నద్ధత సాగిస్తే.. ఈ పరీక్షలో నెగ్గే అవకాశాలు ఎక్కువ. విజేతలుగా నిలిచి పీహెచ్‌డీ చేసినవారు లేదా ఇప్పటికే పీహెచ్‌డీ పూర్తిచేసినవారు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పదోన్నతిని పొందొచ్చు. 


రాత పరీక్షలో మొత్తం 2 పేపర్లుంటాయి. నెగెటివ్‌ మార్కులు, ఇంటర్వ్యూ లేకపోవడం అభ్యర్థులకు కలిసివచ్చే అంశం. కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి సన్నద్ధత మెలకువలను తెలుసుకుని ఆచరిస్తే ఉద్యోగం పొందడం సులువు అవుతుంది. 


పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌)


150 ప్రశ్నలకు 150 మార్కులు. ఈ పేపర్‌ సిలబస్‌ 15 విభాగాలుగా ఉంది. వీటిలో వర్తమానాంశాలు, అంతర్జాతీయ అంశాలు, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, జనరల్‌ సైన్స్, విపత్తు నిర్వహణ, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్‌ ఇంగ్లిష్‌ ముఖ్యమైనవి. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తోన్న అన్ని పోటీ పరీక్షలకంటే ఈ పేపర్‌లో అత్యధిక విభాగాలున్నాయి. అభ్యర్థులు దీన్ని గమనించాలి. 


ఈ పరీక్షలో మంచి మార్కులు రావడానికి మొదటి పేపర్‌ కీలకం. ఉద్యోగాన్ని నిర్ణయించేది ఈ పేపరేనని గమనించాలి. చాలామంది ఈ పేపర్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. సిలబస్‌ ఎక్కువనే భయంతో సరిగా సన్నద్ధం కారు.  


కొత్తగా సన్నద్ధతను సాగిస్తున్నవారు: ఇంతకుముందు ఏ పోటీ పరీక్షకూ తయారవనివారు పేపర్‌-1తో సన్నద్ధత ఆరంభించాలి. కష్టంగా భావించేవాటిని మొదటి ప్రారంభించి.. చివరికి సులువుగా ఉండేవి చదవటం మేలు. పరీక్షకు 7 నెలల సమయం ఉన్నందున ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పేపర్‌లో కొన్ని విభాగాలను వదిలేస్తుంటారు. ఇది సరైంది కాదు. అన్ని విభాగాలూ ముఖ్యమైనవే. పోటీ పరీక్షలో ప్రతి మార్కూ ముఖ్యమైనదేనని మర్చిపోకూడదు. ఆర్ట్స్‌ అభ్యర్థులు ముందుగా తమకు పట్టులేని సైన్స్, పర్యావరణం, విపత్తు నిర్వహణ, మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ లాంటివి బాగా చదవాలి. సైన్స్‌ అభ్యర్థులు ముందుగా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ లాంటి వాటితో సన్నద్ధత సాగించాలి. ఈ పద్ధతిని పాటిస్తే త్వరగా పేపర్‌-1 సన్నద్ధతను    పూర్తిచేయొచ్చు. 


ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు: కొంతమంది ఇప్పటికే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4, సివిల్స్‌ లాంటి పోటీ పరీక్షలకు చదువుతుంటారు. వీరికి పేపర్‌-1 సన్నద్ధత కొంత తేలిక. వీరు పేపర్‌-1లో ఉన్న 15 విభాగాల్లో కష్టంగా భావించేవాటిని ముందుగా చదివి, తర్వాత అన్ని విభాగాల్లో పట్టు సాధించాలి. ఇప్పటికే ఈ పేపర్‌లో బాగా పట్టు సంపాదించివుంటే.. తరచుగా మర్చిపోతున్న అంశాల సినాప్సిస్‌ రాసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. చాలాకాలం నుంచి పోటీ పరీక్షలకు తయారవుతున్నప్పటికీ సముద్రంలాంటి విస్తృతి ఉన్న జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. 


పేపర్‌-2 (అభ్యర్థుల సబ్జెక్టు పేపర్‌)


150 ప్రశ్నలకు 300 మార్కులు. అంటే ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొదట సిలబస్‌ను వివరంగా చదివి విశ్లేషించండి. మీరు డిగ్రీ, పీజీల్లో చదివిన సిలబస్‌ను గమనించండి. ఏవైనా అంశాలు ఇంతకుముందు తెలియనివి లేదా చదివివుండనివి ఉన్నాయేమో చూడండి. ఇలాంటివి వేరుచేయండి. వివిధ యూనివర్సిటీల్లో సిలబస్‌ వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి జూనియర్‌ లెక్చరర్‌ పోటీ పరీక్షలో ఉండే సిలబస్‌లో కొంత భాగం మీకు కొత్తగా అనిపించొచ్చు. సబ్జెకు పేపర్‌లోని కొత్త అంశాలను ముందుగా చదువుతూ నోట్సు రాసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టు మీద పట్టు వస్తుంది. 


ఇటీవల పీజీ పూర్తిచేసినవారు: రెండు లేదా మూడు సంవత్సరాల కిందట పీజీ పూర్తిచేసి ఇతర వృత్తుల్లో ఉన్నట్లయితే వీరి సన్నద్ధత వేరుగా ఉండాలి. వీరు పేపర్‌-1తోపాటుగా పేపర్‌-2లోని కొత్త అంశాలను చదవాలి. పీజీ వరకూ నేర్చుకున్న సిలబస్‌ కంటే ఈ పరీక్షలో సిలబస్‌ ఎక్కువ. కాబట్టి అన్ని అంశాలనూ క్షుణ్ణంగా చదవాలి. ఇప్పటికే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) లేదా స్టేట్‌ లెక్చరర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌) లాంటివి చదివివున్నవారికి ఈ సిలబస్‌ కొంత తేలిగ్గా ఉంటుంది. ఇటీవల పీజీ పూర్తిచేసినవారు సబ్జెక్టు పేపర్‌లో పట్టు సాధించాలంటే మాత్రం ఎక్కువగానే కష్టపడాలి. 


బోధన వృత్తిలో ఉన్నవారు: కొద్ది సంవత్సరాల నుంచీ ఇంటర్, డిగ్రీ లేదా పీజీ స్థాయిలో బోధిస్తున్నవారు సబ్జెక్టు పేపర్‌ సన్నద్ధతను తేలిగ్గా భావిస్తుంటారు. అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. వీరు బోధిస్తున్నదాని కంటే ఈ పరీక్షలో భిన్నమైన సిలబస్‌ ఉంటుంది. సిలబస్‌లో ఉన్న అన్ని అంశాల్లో మీకు పట్టుందో లేదో పరీక్షించుకోవాలి. బోధనకూ, పరీక్ష రాయడానికీ తేడా ఉంటుంది. ఇప్పటికే వివిధ స్థాయుల్లో బోధన వృత్తిలో ఉన్నవారికి పేపర్‌-2 కలిసివచ్చే విధంగా ఉంటుంది. వీరు ముందుగా బోధించని అంశాలను చదివితే, ఆపై సిలబస్‌లోని అన్ని అంశాలపైనా పట్టు సాధించవచ్చు. 


తెలుగు మీడియం అభ్యర్థులు: పేపర్‌-1 ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉన్నందున ఏ సమస్యా ఉండదు. కానీ సబ్జెక్టు పేపర్‌ (పేపర్‌-2) ప్రశ్నలు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. దీంతో వీరికి ప్రశ్నలను అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉండొచ్చు. అందుకని సన్నద్ధత సమయంలో తమకు తెలియని సబ్జెక్టు పదాల తెలుగు అర్థాన్ని లేదా తెలుగు పదం ఆంగ్ల రూపాన్ని రాసుకోవాలి. ఇంటర్, డిగ్రీ స్థాయుల్లోని తెలుగు మీడియం పుస్తకాల్లో తెలుగుపదంతో పాటుగా ఉన్న ఆంగ్ల పదాలను నోట్‌ చేసుకోవాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన సబ్జెక్టు సంబంధిత ప్రత్యేక నిఘంటువు సహాయం తీసుకోవచ్చు.  


ఏయే పుస్తకాలు? 


పేపర్‌-1 సన్నద్ధత కోసం... రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన 6 నుంచి 10 తరగతుల సైన్స్, సోషల్‌ స్టడీస్‌ పుస్తకాలను చదవాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివి అర్థం చేసుకోగలిగితే 6 నుంచి 10వ తరగతుల ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను కూడా చదువుకోవచ్చు. తెలుగు అకాడమీ కూడా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1కు సంబంధించిన అనేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వీటిని చదవొచ్చు. 


పేపర్‌-2 కోసం ముందుగా ఇంటర్, డిగ్రీ,  పీజీ స్థాయి పుస్తకాల పఠనం అవసరం. విద్యార్థిగా ఉన్నప్పుడు వీటిని అనేకసార్లు చదివివుంటారు. కాబట్టి సబ్జెక్టు తేలిగ్గా అర్థం అవుతుంది. నెట్, స్లెట్‌కు క్వాలిఫై అయినవారు లేదా సన్నద్ధతను సాగించినవారు ఇప్పటికే చదివిన పుస్తకాలను తిరిగి చదవాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన సబ్జెక్టు సంబంధిత ఇంటర్, డిగ్రీ స్థాయి ఆంగ్ల మాధ్యమ పుస్తకాలూ ఉపయోగపడతాయి. సబ్జెక్టు పేపర్‌లో ఉన్న కొన్ని అంశాలు లోతుగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటి కోసం సబ్జెక్టు నిపుణులు రాసిన ప్రత్యేక పుస్తకాలను చదవాలి.


గమనించండి

 

వయసు: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/ భాషలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ. రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీం నగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌.


వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/directRecruitment


గత ప్రశ్నపత్రాల సాధన


పేపర్‌-1, పేపర్‌-2లకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల సరళి అర్థం అవుతుంది. దీని ద్వారా సన్నద్ధతను మెరుగుపరచుకోవచ్చు. 


పేపర్‌-1కు సంబంధించి గతంలో జరిగిన జూనియర్‌ లెక్చరర్‌ ప్రశ్నపత్రాలు లేకుంటే ఇతర పోటీ పరీక్షలైన గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లను విశ్లేషణతో సాధన చేయండి. పేపర్‌-2కు సంబంధించిన గత ప్రశ్నపత్రాలు అందుబాటులో లేకుంటే ఇలాంటి సిలబస్‌ ఉన్న నెట్, స్లెట్, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్‌ పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాల సాధన అవసరం. దీనిద్వారా సబ్జెక్టు ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. 


రెండు పేపర్ల పూర్వ ప్రశ్నపత్రాల సాధన తర్వాత అభ్యర్థులు తాము చేసిన పొరపాట్లను గుర్తించాలి. వీటిని రెండోసారి రాకుండా చూసుకోవాలి. ఇలా అనేకసార్లు చేయడం వల్ల పొరపాట్లు పూర్తిగా తగ్గి.. మెరుగైన మార్కుల సాధనలో ముందుంటారు. 


- డాక్టర్‌.బి.నరేష్‌ 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్రీయ విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్‌ 6 సిగ్మా

‣ టాప్‌ 5 ఉద్యోగాలు ఇవే!

‣ ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

Posted Date : 17-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌