• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగులు, నియామకాలు: గిర్‌గ్లానీ కమిటీ

కొలువులు పోయి.. ఆర్థికరంగం దిగజారి

ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హమీలు, ఏర్పాటు చేసిన నిబంధనలు ఉల్లంఘనలకు గురయ్యాయి. స్థానికేతరులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం తీవ్ర అసంతృప్తులకు తద్వారా ఉద్యమాలకు దారితీసింది. ఆర్థిక స్థితి దిగజారిపోయింది. కీలకమైన జీవోలు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన గిర్‌గ్లానీ కమిటీ అన్ని విషయాలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. సమస్య పరిష్కారానికి సూచనలు చేసింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956 - 2014) అధ్యయనంలో భాగంగా ఈ విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

 

ఉద్యోగులు, నియామకాలు: గిర్‌గ్లానీ కమిటీ

ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ నుంచి మొదలుపెడితే 2014లో తెలంగాణ ఆవిర్భావం వరకు జరిగిన ప్రతి దశలోని ఉద్యమం ఉద్యోగులు, నియామకాల సమస్యలతోనే ముడిపడి ఉంది. ప్రత్యేక తెలంగాణకు బలమైన పునాది వేసిన 1969 ఉద్యమం కూడా ఇదే అంశంతో మొదలైంది. పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ ప్రకారం ముల్కీ నిబంధనలను ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత కూడా కొనసాగించాలి. కానీ వాటిని అప్పటి పాలకులు ఉల్లంఘించారు. దీంతో తెలంగాణ రక్షణల (సేఫ్‌గార్డ్స్‌) కోసం ఉద్యమం ప్రారంభమైంది. రక్షణలు అమలు కావాలంటూ అనేకమంది నినదించారు. మొదటిసారి 1959, మార్చి 21న చట్టపరంగా ముల్కీ నిబంధనలు వెలువడ్డాయి. వాస్తవానికి ఈ రక్షణల నిబంధనలను ప్రతి అయిదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాలి. 1964లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఒత్తిడి మేరకు పునరుద్ధరించారు. తర్వాత 1969లో పునరుద్ధరించాలి కానీ అప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రాంతీయ కమిటీ పరిధిలో ఉద్యోగుల అంశం లేకపోవడంతో వారి మాట వినడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. 1968 వరకు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రాంతీయ కమిటీకి మధ్య ఉద్యోగుల అంశంపై వాదోపవాదాలు కొనసాగుతూ ఉండేవి.

 

 ఉద్యోగులు, ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఇచ్చే నివేదికలపై ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మధ్యలో దామోదరం సంజీవయ్య మాత్రమే ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై గవర్నరు వద్ద పంచాయతీ పెడితే నిబంధనల ప్రకారం ‘ఉద్యోగుల అంశం ప్రాంతీయ కమిటీ పరిధిలో లేదని, దీనిపై మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మాట్లాడేవారు లేకుండా పోయారు. ఈ సంఘర్షణ క్రమంగా ఉద్యమంగా మారింది. కానీ అంతకుముందే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని గమనించిన ప్రభుత్వం 1968, ఏప్రిల్‌ 30న ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన నాన్‌ ముల్కీలను తొలగించి వారి స్థానంలో అర్హత ఉన్న ముల్కీలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది జీవో 36 కంటే ముందే వచ్చినా దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. పంచాయతీరాజ్, విద్యుత్తు, వ్యవసాయ విభాగాల్లో మాత్రమే దీన్ని అమలుచేశారు. దీంతో విద్యుత్తు శాఖలోని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విద్యుత్తు బోర్డు, కార్పొరేషన్‌లో ముల్కీ నిబంధనలు వర్తించవంటూ జస్టిస్‌ కుప్పుస్వామి తీర్పు ఇచ్చారు. వారం తర్వాత మిగిలిన విభాగాల కేసులు జస్టిస్‌ చిన్నప్ప రెడ్డి వద్దకు వచ్చాయి. ఆయన 1969, ఫిబ్రవరి 3న ముల్కీ నిబంధనలను కొట్టివేశారు. తదనంతర పరిణామాల్లో తెలంగాణకు రక్షణలు (సేఫ్‌గార్డ్స్‌) కావాలంటూ ఉద్యమం ఆరంభమైంది.

ఉద్యమం ఉద్దేశాలు :

* ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు అమలు చేయడం. * రిట్రెంచ్‌మెంట్‌ పేరుతో ఉద్యోగులను తీసివేయకుండా ఉండటం.

మరోవైపు 1969 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఉద్యోగులను తగ్గించుకోవాలంటూ కేంద్రం కూడా హెచ్చరించింది. దీంతో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన వారందరినీ తీసేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాల నుంచి తెలంగాణ వారిని ఎక్కువగా తీసేసి, ఆంధ్రులను మాత్రం అలాగే కొనసాగించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమైంది. సమకాలీన ఉద్యమంలో సకల జనుల సమ్మె లాంటిదే 1969లోనూ జరిగింది.

 

610 జీవో - గిర్‌గ్లానీ కమిషన్‌ నివేదిక

తెలంగాణకు సంబంధించి స్థానిక రిజర్వేషన్లలో భాగంగా తీవ్రంగా చర్చలు జరిగిన అంశం 610 జీవో.  ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1985, డిసెంబరు 30న ఈ జీవోను జారీచేసింది.

610 జీవో ముఖ్యాంశాలు:

* రాష్ట్రపతి నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన స్థానికేతరులను 1986, మార్చి 31లోపు వారి స్వస్థలాలకు పంపాలి. అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టించి వారికి అక్కడ స్థానం కల్పించాలి.

* ప్రాజెక్టుల్లో నాన్‌గెజిటెడ్‌ కేడర్‌లలో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులందరినీ వెంటనే వెనక్కి పంపాలి.

* శాఖాధిపతులు, సచివాలయాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో కూడా అన్ని ప్రాంతాలవారికి న్యాయం జరగాలి. అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులను ఎంపిక చేసి, వారికి సమాన అవకాశాలు కల్పించాలి.

* బోగస్‌ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైనా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకుంటే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.

* అక్రమ నియామకాలు, పదోన్నతులకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెట్టుకున్న అప్పీళ్లను కూడా 1986, మార్చి 31లోగా పరిష్కరించాలి. 

* వివిధ స్థానిక ప్రాంతాలు, కేడర్‌ల మధ్య బదిలీలను ఇష్టం వచ్చినట్లు చేయకూడదు.

* రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి 1986, జూన్‌ 30 వరకు జరిగిన అన్నీ నియామకాలు, పదోన్నతులను పునఃసమీక్షించాలి. 

 

విచారణ అంశాలు

అత్యంత కీలకమైన 610 జీవో అమలుకు నోచుకోలేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా (తెలుగు గంగ లాంటి ప్రాజెక్టుల్లో స్థానికేతరులు పనిచేస్తున్నారనే ఆరోపణలు) ఇలాంటి స్థానికేతర సమస్య వస్తే వారి కోసం ఒక జీవో జారీ చేశారు. అక్కడ మాత్రం స్థానికేతరులను పంపించి వేస్తూ ఆ జీవోను అమలుచేశారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి 610 జీవోను అమలు చేయలేదు. చాలాకాలం దీని ఉనికిని కూడా మరిచిపోయారు. 1989 తర్వాత తెలంగాణకు సంబంధించిన చర్చ ప్రారంభమై 1996లో ఊపందుకున్న తర్వాత మళ్లీ 610 జీవో తెరపైకి వచ్చింది. ఈ జీవో ఉద్యమానికి ఊపిరి పోసింది. 610 జీవో గురించి చర్చలు పెరిగి దాన్ని అమలు చేయాలనే డిమాండ్‌ విస్తృతమైంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కోసం చర్చించడం, కేసీఆర్‌ తెలంగాణ నినాదం లేవనెత్తడంతో రాజకీయ వేడి మొదలైంది. ఈ దశలో ప్రభుత్వం అనివార్యమైన పరిస్థితుల్లో 610 జీవో అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి, దాన్ని అమలుచేయడంలో జరిగిన అన్యాయాలను గుర్తించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జె.ఎమ్‌.గిర్‌గ్లానీ సారథ్యంలో 2001, జూన్‌ 25న ఏడాది గడువుతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2004, సెప్టెంబరు 21న గిర్‌గ్లానీ నివేదికను సమర్పించారు.

* 610 జీవోను అమలు చేయడంలో జరిగిన అన్యాయాలను గుర్తించి నివేదిక ఇవ్వడం, ఆ సంఘటనలను సరిదిద్దడం. 

* రాష్ట్రపతి ఉత్తర్వుల ఆచరణలో చోటు చేసుకున్న తప్పులు, దారి తప్పిన సందర్భాల గురించి నివేదించడం.

* తదుపరి రక్షణలను సూచించడం.

 

రాష్ట్ట్ర్రపతి ఉత్తర్వులను విస్మరించారు

జె.ఎం. గిర్‌గ్లానీ

పరిస్థితులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. పరిపాలనలోనూ మార్పులు చేర్పులు అవసరమవుతాయి. కానీ ఈ మార్పులు చేయాల్సిన సందర్భంలో రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయనే సృహ కోల్పోయి వ్యవహరించడంతో ఈ సమస్యలు తలెత్తాయి. పాలకుల ఆశ్రిత జన పక్షపాతం ఈ ఉల్లంఘనలకు కారణంగా కనిపిస్తోంది. పాలనలో అవసరార్థం కొన్ని మార్పులు, సంస్కరణలు చేయాల్సి రావొచ్చునేమో కానీ రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయనే సంగతిని గుర్తుంచుకొని దానికి లోబడి సంస్కరణలు, నిర్ణయాలను తీసుకొని ఉంటే.. సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండేవి కావు. రాష్ట్రపతి ఉత్తర్వుల వివరాలు కూడా చాలామందికి తెలియవు. ఏడో జోన్‌ అని, ఫ్రీజోన్‌ అని మాట్లాడుతున్నారు. ఈ మాట అంటున్నారంటే వారికి రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి అవగాహన లేదని అర్థం. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా ఈ పదాలు లేవు. పైగా ఉత్తర్వుల అమలును పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోలేదు. తత్ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఎవరికి తోచినట్లు వారు అన్వయించుకొని అమలు చేస్తున్నారు.

 

18 రకాల ఉల్లంఘనలు

గిర్‌గ్లానీ నివేదిక చాలా కీలకమైంది. దీనిలో మూడు భాగాలున్నాయి.

మొదటి భాగం: ఉపోద్ఘాతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాధాన్యం, ఎందుకు ఉల్లంఘనలు జరిగాయో వివరించారు. 

రెండో భాగం: ఉల్లంఘనలు ఎక్కడెక్కడ జరిగాయో చెప్పారు.

మూడో భాగం: బాగు చేయడానికి, అమలు చేయడానికి సూచనలు చేశారు.

అవకతవకలపై నివేదిక సమర్పించిన గిర్‌గ్లానీ కమిషన్‌ 18 రకాల ఉల్లంఘనలు, వాటిలో 126 ప్రత్యేక తప్పిదాలను గుర్తించింది. 35 నివారణ చర్యలను సూచించింది. 

రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానిక నియామకాల నుంచి శాఖాధిపతులు, సచివాలయం, ప్రత్యేక కార్యాలయాలకు మినహాయింపులిచ్చారు. అంటే వీటిలో స్థానిక రిజర్వేషన్లు అమలుకావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా అర్హులే. ఉత్తర్వుల సమయంలో 50 శాఖలు మాత్రమే ఉండేవి కానీ వాటి సంఖ్యను తర్వాత కాలంలో విపరీతంగా పెంచారు. శాఖాధిపతి కార్యాలయం నిర్వచనం ఎక్కడా లేకపోవడంతో వీటి సంఖ్యను పెంచి స్థానిక రిజర్వేషన్లు నుంచి మినహాయింపునిస్తూ వెళ్లారు. అంతేకాకుండా శాఖలను విడగొట్టి ఉప శాఖలను ఏర్పాటు చేశారు. వాటికి కొత్తగా శాఖాధిపతులను నియమించారు. ఉదాహరణకు వ్యవసాయశాఖలో నుంచి ఉద్యానవశాఖను వేరుచేశారు. వైద్య శాఖలో, విద్యా శాఖలో ఇలాగే చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేకపోయినా న్యాయశాఖను మొత్తంగా స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయించారు. దీంతో జిల్లా స్థాయి కోర్టులోని ఉద్యోగాలకు కూడా స్థానిక రిజర్వేషన్లు లేకుండా పోయాయి. ఏ శాఖలోనైనా శాఖాధిపతి ఒకరే ఉండాలి కానీ నలుగురు ఉండరు. అవసరమైతే రాష్ట్రపతి నుంచి అనుమతి తెచ్చుకొని ఆయా శాఖాధిపతులను పెంచుకోవాలి. అలా చేయకపోవడం రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమే.

* కీలకమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఉల్లంఘన మరొకటి. మినహాయింపుల్లేని పోస్టులు కూడా భర్తీ చేశారు. ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసిన ఇంజినీర్లను ప్రాజెక్టు తర్వాత వేరేచోట స్థానిక రిజర్వేషన్ల స్థానాల్లో నింపారు. ఇలా లోకల్‌ కేడర్లకు దక్కాల్సిన పోస్టులో అన్యాయం జరిగింది. తర్వాత డిప్యూటేషన్ల పేరుతో సిబ్బందిని ఒక జోన్‌ నుంచి మరో జోన్‌కు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు తీసుకురావడం ఇంకో ఉల్లంఘన. అలాగే స్పెషల్‌ డ్యూటీలపై తీసుకురావడం.

* స్థానిక రిజర్వేషన్లను పాటించకుండా తాత్కాలిక పద్ధతిలో నియామకాలు చేసి తర్వాత వారిని క్రమబద్దీకరించడం.

* పోస్టుల స్థాయిని మార్చడం. పలు నాన్‌గెజిటెడ్‌ పోస్టులను గెజిటెడ్‌గా మార్చారు. జోనల్‌ గెజిటెడ్‌ పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా మార్చారు. తద్వారా వాటికి స్థానిక రిజర్వేషన్ల కోటా తగ్గడమో, పూర్తిగా లేకుండా పోవడమో జరిగింది.

* హైదరాబాద్‌కు సంబంధించిన హోదాను గుర్తించలేదు. వేరే జోన్‌గా చూడటం, ఫ్రీజోన్‌గా పరిగణించడం చేశారు. 

* ఉపాధి కల్పన కేంద్రాల్లో బోగస్‌ నమోదులు, తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా నియమితులైన వారున్నారు.

* కారుణ్య నియామకాల్లో స్థానిక రిజర్వేషన్లను పాటించడం లేదు.

 

సూచనలు

* సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులపై 610 జీవో అమలుపై ఒక శిక్షణ విభాగం ఏర్పాటు చేయాలి. సుశిక్షితులైన అధికారులను అక్కడ ఉంచాలి.

* బాధ్యతలను కచ్చితంగా నిర్వహించి, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

* ఎన్ని శాఖాధిపతి కార్యాలయాలుండాలో రాష్ట్రపతి అనుమతి తీసుకొని, మిగిలిన వాటికి స్థానిక రిజర్వేషన్లను వర్తింపజేయాలి.

* ప్రతి ఉద్యోగి సర్వీస్‌ రిజిస్టర్‌లో తన స్థానికతను విధిగా పేర్కొనాలి.

 

ఈ సూచనల తర్వాత కూడా గిర్‌గ్లానీ కమిషన్‌ నివేదికపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కదల్లేదు. 2004లో నివేదిక వస్తే 2006 దాకా దీని అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ సంఘాలు, తెలంగాణవాదులు డిమాండ్‌ చేసిన మీదట తొలుత దీన్ని పరిశీలించేందుకు 2004,  అక్టోబరు 12న మంత్రుల బృందాన్ని నియమించారు. వీరికి సాయం చేయడానికి అధికారుల బృందాన్ని వేశారు. మొత్తం నివేదిక సారాంశాన్ని మంత్రుల బృందానికి తెలియజేయడం ఈ అధికారుల బృందం పని. 2006, మార్చిలో నివేదిక ఇవ్వగా దీని అమలుపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై నిరసనలు రావడంతో ఆ జీవో అమలును ఆపేశారు. ఆ తర్వాత గిర్‌గ్లానీ కమిటీ నివేదిక అమలుపై మళ్లీ  అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. గిర్‌గ్లానీ నివేదిక అమలును పర్యవేక్షించడానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సారథ్యంలో సభా సంఘాన్ని వేశారు. ఇంతలో రెండో అధికారుల కమిటీ 2006, ఆగస్టులో తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 548 జీవో జారీ చేసింది. ఇది 2006, అక్టోబరు 4న విడుదలైంది. 610 జీవోను సంపూర్ణంగా అమలు చేస్తామన్నది 548 జీవో సారాంశం. అప్పటి నుంచి కొద్దికొద్దిగా గిర్‌గ్లానీ నివేదిక అమలు చర్యలు ఆరంభమయ్యాయి. 

రచయిత: బండారి ధనుంజయ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣  తెలంగాణలో భూసంబంధాలు

‣  తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 11-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌