Post your question

 

    Asked By: జి.నిఖిల్‌

    Ans:

    మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసినా, సీఏ కూడా చదివారు కాబట్టి అకౌంట్స్‌ రంగంలో పనిచేయడానికి మీకు విద్యార్హత ఉంది. కాకపోతే, రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం హ్యూమన్‌ రిసోర్సెస్‌లో ఉండటం, ఆరేళ్లు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు అకౌంట్స్‌ రంగంలోకి వెళ్ళడం కొంత ఇబ్బందే కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా మీరు అకౌంట్స్‌లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకొని ఇటీవలికాలంలో ఈ రంగంలో వచ్చిన మార్పులను తెలుసుకోండి. అందుకు అనుగుణంగా అవసరమైన కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో చేసే ప్రయత్నం చేయండి. అకౌంటింగ్‌తో పాటు కంప్యూటర్‌ వాడకంపై కనీస పరిజ్ఞానం, ఎంఎస్‌ ఎక్సెల్, అకౌంటింగ్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకోండి. జీఎస్టీ, ఇన్‌కమ్‌టాక్స్, ఆడిటింగ్‌ ప్రమాణాలపై కూడా పట్టు సాధించాలి. వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్ధ్యం, సమకాలీన వ్యాపార అంశాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సంజీవరావు

    Ans:

    ఫార్మకాలజీ అనేది జీవ వ్యవస్థలపై ఔషధాలు ఎలా పనిచేస్తాయి, ఔషధానికి శరీరం ఎలా స్పందిస్తుంది లాంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రసాయన లక్షణాలు, జీవ ప్రభావాలు, ఔషధాల చికిత్సా ఉపయోగాల గురించి ఈ విభాగం అధ్యయనం చేస్తుంది. ఔషధం, ఫార్మసీ, డెంటిస్ట్రీ, నర్సింగ్, వెటర్నరీ మెడిసిన్‌తో సహా అనేక విభాగాల పరిజ్ఞానం ఫార్మకాలజీ రంగంలో ఉపయోగపడుతుంది.
    ఈ కోర్సు చదివినవారు క్లినికల్‌ స్టడీస్, బయో అనలిటికల్‌ స్టడీస్, టిష్యూ స్టడీస్, బ్లడ్‌ స్టడీస్, ఫార్మకో విజిలెన్స్‌ విభాగాలున్న అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలతో పాటు పరిశోధన కూడా చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌. రవిశంకర్‌

    Ans:

    ఉద్యోగ ప్రపంచంలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఉద్యోగులకు ఎంతో అవసరం. సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ ఒక సంస్థ ఆదాయం పెంచడంలో, ఖర్చు తగ్గించడంలో, నాణ్యతను పెంపొందించడంలో, తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత పెంచడంలో, వినియోగదారులను సంతృప్తిపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని చేసినవారికి నాయకత్వం, క్వాలిటీ మేనేజ్‌మెంట్, సమస్యా పరిష్కారాల్లో మంచి నైపుణ్యాలు ఉంటాయి. ఈ కోర్సు చేసినవారు ఆపరేషన్స్‌ డైరెక్టర్, సీనియర్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అనలిస్ట్, సీనియర్‌ కంటిన్యువస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లీడర్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, కన్సల్టెంట్, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌ కేర్, మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: Ahmad

    Ans:

    మీరు ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గతి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌దివి ఉంటే టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌లు రాసుకోవ‌డానికి స్థానిక‌త వ‌ర్తిస్తుంది. లేదా నాన్‌లోక్ కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    Asked By: prasanth

    Ans:

    కొత్త భాష నేర్చుకోవాలంటే పదజాలాన్ని పెంచుకోవడం చాలా అవసరం.  సరైన వ్యాకరణ నియమాలు ఎంత అవసరమో, పద సంపద కూడా అంతే ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఈ  విషయంలో వెనకబడుతున్నారు. ఈ  సమస్యను అధిగమించడానికి ఇటీవలికాలంలో చాలా పుస్తకాలు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మెక్‌ గ్రాహిల్‌ ఎసెన్షియల్‌ ఈఎస్‌ఎల్‌ డిక్షనరీ, ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ ఇన్‌ యూజ్‌ సిరీస్, ఆక్స్‌ఫర్డ్‌ పిక్చర్‌ డిక్షనరీ, 504 ఆబ్సల్యూట్లీ ఎసెన్షియల్‌ వర్డ్స్, ఎన్‌టీసీ ఒకాబ్యులరీ బిల్డర్స్, వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ లాంటి పుస్తకాలను చదివి సాధన చేయండి. యాప్‌ల విషయానికొస్తే, BUSUU, MEMRISE, LinGo Play, Quizlet, Alpha bear 2, WordReference, Word of the day  లాంటి వాటిని అనుసరించవచ్చు. వీటితోపాటు memorise.com, Ffluentu.com, ఇఫ్లూ యూనివర్సిటీ వారి English Pro app ల ద్వారా కూడా మీ ఆంగ్ల పదజాలాన్నీ, భాష ఉచ్చారణనూ పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. శివశంకర్రెడ్డి

    Ans:

    ఇంగ్లిష్‌ మన మాతృభాష కాదు కాబట్టి వ్యాకరణ దోషాలు సహజమే. మనలో చాలామంది ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగల్గినా రాయడంలో తప్పులు చేస్తారు. వ్యాకరణ దోషాలు కనిపెట్టి సరిదిద్దటానికి వివిధ రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రామర్లి, జింజర్, ప్రూఫ్‌ రీడర్, స్క్రిబెన్స్, లింగ్వీక్స్‌ లాంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆంగ్లంలో డ్రాఫ్టింగ్‌ మెలకువలు పెంచుకోవాలంటే ముందుగా మీకు గ్రామర్‌పై మంచి పట్టు ఉండాలి. అందుకోసం మొదటగా హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌ (రెన్‌ అండ్‌ మార్టిన్‌) పుస్తకాన్ని చదివి, బాగా సాధన చేయండి. ఆంగ్ల పదసంపద పెంచుకోవడానికి ఏదైనా ఒక ఆంగ్ల వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదవండి. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే, అంత తక్కువ దోషాలతో రాయగలరు. యాప్‌ల ద్వారా రాసే భాషను మెరుగుపర్చుకొనే క్రమంలో మీరు ఎక్కువగా ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఆ తప్పులు ఎలా సరి అవుతున్నాయో తెలుసుకొని మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి.

    Asked By: బి.వీరారెడ్డి, కడప

    Ans:

    -  బీఎస్సీ (ఎంపీసీఎస్‌) తరువాత ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఎంసీఏ కోర్సులో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ చదివితే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో థియరీతో పాటు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల గురించి ఎక్కువగా నేర్చుకుంటారు. మీకు లాజిక్, అల్గారిథమ్స్‌ల్లో గట్టి పట్టుండి, బోధన/పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు ఎంచుకోండి. బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌ఈ), ఎంసీఏ..ఈ మూడు కోర్సులూ ఉపయోగకరమైనవే. దేని ప్రాధాన్యం దానిదే. బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివినవారికి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వస్తుంది కానీ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. విషయ పరిజ్ఞానం, లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ థింకింగ్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లాంటివి ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తాయి. వీటితోపాటు మీరు చదువుకొన్న విద్యాసంస్థ ర్యాంకింగ్, విశ్వసనీయత, ప్రాంగణ నియామకాలు కూడా మీరు త్వరగా ఉద్యోగం పొందడంలో ఉపయోగపడతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,

    Asked By: వి. ఉదిత్‌ నారాయణ్‌

    Ans:

    బీఎస్సీ తరువాత మేథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎమ్మెస్సీ చేయొచ్చు. ఎమ్మెస్సీ చేసిన తరువాత ఆసక్తి ఉంటే బోధన రంగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.  బీఈడీ/డీ…ఈడీ చేసి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. క్రీడల్లో ఆసక్తి ఉంటే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ చేయొచ్చు. ఇంగ్లిష్‌/ తెలుగు భాషలపై ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టుల్లో కూడా పీజీ చేయొచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశించాలనుకొంటే ఎంబీఏ, పత్రికా రంగంలోకి వెళ్లాలనుకొంటే జర్నలిజం, కంప్యూటర్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఎంసీఏ, న్యాయరంగంపై ఆసక్తి ఉంటే బీఎల్, గ్రంథాలయాల్లో ఉద్యోగాలకోసం లైబ్రరీ సైన్స్‌ లాంటి కోర్సులు చేయటానికి వీలుంది. డేటాసైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే, ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి కోర్సులు చేయండి. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రవేశించదలిస్తే ఎంబెడెడ్‌ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొంది నచ్చిన ఉద్యోగంలో స్థిరపడండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌