Post your question

 

    Asked By: My Guru :

    Ans:

    CTET certificate holders are also eligible to teach in Government schools under State Government. Although most of the states conduct their own TET exam, the CTET certificate is considered in all State schools.

    Asked By: prasanth

    Ans:

    బీడీఎస్‌ చదివినవారికి కెనడాలో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే, అక్కడకి వెళ్లి ఉద్యోగం/ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలంటే వివిధ రెగ్యులేటరీ సంస్థల అనుమతులు అవసరం. ముందుగా మీ బీడీఎస్‌ డిగ్రీ, కెనడా డెంటల్‌ డిగ్రీకి సమానమని నిర్ధరించడానికి నేషనల్‌ డెంటల్‌ ఎగ్జామినింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడా (ఎన్‌డీఈబీ)కి దరఖాస్తు చేసుకోవాలి. మీ డిగ్రీ నిర్ధÄరణ పూర్తయ్యాక ఆబ్జెక్టివ్‌ స్ట్రక్చర్డ్‌ క్లినికల్‌ ఎగ్జామినేషన్‌ (ఓఎస్‌సీఈ) రాయాలి. దీనిలో ముఖ్యంగా ప్రాథమిక పరిజ్ఞానం,  క్లినికల్‌ నాలెడ్జ్‌లను పరీక్షిస్తారు. సాధారణంగా క్లినికల్‌ జడ్జ్‌మెంట్, డయాగ్నోసిస్, ట్రీట్‌మెంట్‌ ప్లానింగ్, ప్రోగ్నసిస్, ట్రీట్‌మెంట్‌ మెథడ్స్, క్లినికల్‌ డెసిషన్‌ మేకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం 75 స్కేల్డ్‌ స్కోర్‌ పొందితేనే ఉత్తీర్ణత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ విజయవంతం కాలేకపోతే మరో రెండు సార్లు ఈ పరీక్షలు రాసే వీలుంటుంది. పైన చెప్పిన ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే నేషనల్‌ డెంటల్‌ ఎగ్జామినింగ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడా సంస్థ ఆ దేశంలో డెంటిస్ట్‌గా ప్రాక్టీస్‌ చేయడానికి అనుమతి పత్రం జారీ చేస్తుంది. కెనడాలో డెంటిస్ట్రీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఆ తరువాత ఉద్యోగ/ ప్రాక్టీస్‌ ప్రయత్నాలు చేయొచ్చు. ఇతర దేశాల్లో బీడీఎస్‌ చేసిన తరువాత కెనడాలో నాలుగు సంవత్సరాల ఇంటర్నేషనల్‌ డెంటిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో మూడో సంవత్సరంలో చేరి డెంటిస్టుగా కెరియర్‌ను మొదలు పెట్టే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీరు ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు చేశాక, బీఏ డిగ్రీ కూడా చేశారు కాబట్టి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ‘ఇంటర్‌ వొకేషనల్‌ చేసినవారు అర్హులు కాదు’ అని చెప్పనంతవరకు మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలనూ నిశ్చింతగా రాయవచ్చు. ఇటీవల జారీ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలోనూ ఆ విధంగా పేర్కొనలేదు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: బి.పార్థసారథి

    Ans:

    - అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం అడవులను పరిరక్షించడానికి అవసరమైన ఒక పరిపాలనా ఉద్యోగం. దీనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అర్హులే. ఈ ఉద్యోగంలో అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లేమీ లేవు. ఫీల్డ్‌ వర్క్‌తోపాటు పరిపాలనా సంబంధిత బాధ్యతలనూ నిర్వహించవలసి ఉంటుంది. అటవీ పరిరక్షణ, ఆధునిక టెక్నాలజీని వాడటం, అపాయాలను ముందే పసిగట్టడం, ఉద్యోగుల పర్యవేక్షణ, అటవీ ప్రమాదాలను అంచనా వేయడం లాంటి బాధ్యతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి ఏం అవసరమంటే.. శారీరక దృఢత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం, శ్రద్ధగా వినగలగటం, విశ్లేషణాత్మక శక్తి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోగల సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాలు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో అమ్మాయిలు చేయలేని, చేయకూడని ఉద్యోగాలంటూ ఏమీ లేవు. అడవులను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్న ఆసక్తి ఉంటే, అమ్మాయిలు కూడా నిరభ్యంతరంగా ఈ ఉద్యోగానికి సన్నద్ధం కావొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి.అశోక్‌

    Ans:

    మీ లక్ష్యం.. ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు ఉద్యోగమో మొదట నిర్ణయించుకోండి. మనదేశంలో అత్యుత్తమ ప్రభుత్వ ఉద్యోగంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌కు డిగ్రీ విద్యార్హతగా ఉంది. సాధారణంగా పీజీ చేసినవారికి (మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ సైన్స్‌లను మినహాయించి) జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో బోధన చేసే అవకాశాలుంటాయి. ఒకవేళ మీరు సైన్స్‌ విద్యార్ధి అయితే, అదనంగా పరిశోధన సంస్థల్లో టెక్నికల్‌/ సైంటిఫిక్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-4 నుంచి గ్రూప్‌-1 వరకు అన్ని ఉద్యోగాలకూ డిగ్రీనే విద్యార్హత. పోలీస్‌ ఎస్‌ఐ, బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఉద్యోగాలకూ, ఇన్సూరెన్స్‌ ఉద్యోగాలకూ డిగ్రీనే విద్యార్హత. బీఈడీ చేస్తే కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు పాఠశాలల్లో బోధన ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. బీఈడీతోపాటు పీజీ కూడా చేస్తే నవోదయ, కేవీలాంటి విద్యాసంస్థల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ ఉద్యోగానికి అర్హత ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ రంగంపై ఆసక్తి ఉండి, మంచి బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చేస్తే ఉద్యోగావకాశాలు అధికం. సాఫ్ట్‌వేర్‌పై ఆసక్తి ఉంటే ఎంసీఏ/ ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. త్వరగా ఉద్యోగం పొందడమనేది మీ డిగ్రీ కంటే, పరీక్షకు ఎంత బాగా సన్నద్ధమవుతున్నారు, మీ పట్టుదల, సబ్జెక్టుపై ఉన్న పట్టు లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దీర్ఘకాలిక ఆశయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌