• facebook
  • whatsapp
  • telegram

Jobs: కొలువు కష్టమే!

ప్రాంగణానికి రాని సంస్థలు
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తగ్గిన ఎంపికలు
ఆశగా ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు
కానూరు, ప్రసాదంపాడు, న్యూస్‌టుడే: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రాంగణ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు సంస్థల్లో గత ఏడాదితో పోలిస్తే 50 శాతం మేర తగ్గాయి. రష్యా-ఉక్రెయిన్, పాలిస్తీనా యుద్ధాలు, స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థికమాంధ్యం భయంతో ప్రస్తుతం ఐటీ సంస్థలు ఆలోచనలో పడటం తదితర అంశాలే ఇందుకు కారణాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇదే నెలలోనే ప్రాంగణ ఎంపికలు వందల సంఖ్యలో ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. ఇదే పరిస్థితి మరికొద్ది నెలలు ఉండవచ్చని, ప్రస్తుతం కొలువుల కోసం ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎనిమిదో సెమిస్టర్‌ ప్రారంభమైనా..:  ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏడో సెమిస్టర్‌ పూర్తి చేసి ఎనిమిదిలోకి ప్రవేశించిన విద్యార్థులు సుమా రు 32 వేల మంది ఉన్నారు. ఇంజినీరింగ్‌ నాల్గో సంవత్సరంలో ప్రాంగణ ఎంపికలు మొదలవుతాయి. ఎక్కు వ శాతం మంది 7వ, మరికొంత మంది 8వ సెమిస్టర్లలో కొలువులు పొందుతారు. కానీ ఇప్పుడు అన్ని కళాశాలల్లో 8వ సెమిస్టర్‌ ప్రారంభమైనా 10 శాతం కూడా ఎంపికలు పూర్తి కాలేని పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికమాంధ్యం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే కొలువులకు కోతలు పెట్టాయి. కొన్ని సంస్థలు ఎంపికలు చేసినా ఆఫర్‌ చేసే ప్యాకేజీని తగ్గిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రముఖ కళాశాలల్లో మాత్రమే నామమాత్రంగా ఈ ఎంపికలు జరుగుతుండగా.. మిగిలిన కళాశాలల్లో అసలు ప్రాంగణ ఎంపికల ఊసేలేదు. గతంలో కొందరినీ ఎంపిక చేసినా వారికి వేరే ఉద్యోగం చూసుకోమని ఆయా సంస్థల నుంచి విద్యార్థులకు మెయిల్స్‌ వస్తున్న దాఖలాలు ఉన్నాయి. ప్రాంగణ ఎంపికలు తేదీలు ప్రకటించి కూడా కొన్ని సంస్థలు పరీక్షలు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి.
కొవిడ్‌ నాటి పరిస్థితి పునరావృతం 
గతంలో కొవిడ్‌కు ముందు ఈ జిల్లాల్లో 20 శాతం వరకు విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో విద్యార్థులు ఎంపికయ్యేవారు. 150 వరకు సంస్థలు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించాయి. కరోనా సంక్షోభ కాలంలో ఐటీ సేవలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరగడంతో నియామకాలు అదే స్థాయిలో పెరిగాయి. ఈ సమయంలో దాదాపుగా 30 శాతం వరకు ఎంపికలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు కొవిడ్‌ నాటి పరిస్థితి కన్పిస్తోంది.  
నైపుణ్య శిక్షణపై దృష్టి: జి.వి.రమేష్‌బాబు, ప్రాంగణ ఉపాధి అధికారి
ప్రస్తుతం కళాశాలల్లో ఆయా సంస్థలు తమకు కావాల్సిన వృత్యంతర నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విద్యార్థులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఈ సమయంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నవారికే సంస్థలు అవకాశం ఇస్తాయి. 
భయపడాల్సిన అవసరం లేదు: కె.కృష్ణమోహన్, విద్యావేత్త
ప్రస్తుతం ప్రాంగణ ఎంపికలు తగ్గినా విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు విద్యార్థులు ఉన్నత విద్యపై దృష్టి సారించాలి. పీజీ చేయడానికి గేట్‌ వంటి ప్రవేశపరీక్షలకు వెళ్లాలి. కరోనా అనంతరం ఎక్కువగా మంది విదేశీ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలు కూడా ఉపకారవేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందున ఈ దిశగా విద్యార్థులు యోచించాలి. 
సర్టిఫికేషన్‌ కోర్సులతో మేలు: ఎన్‌వీ సురేంద్రబాబు, టీపీవో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
ప్రస్తుతం అనేక సంస్థలు నియామకాలు చేపట్టడం లేదు. స్వల్పంగా నిర్వహించినా మంచి నైపుణ్యం ఉన్న వారికే అవకాశం ఇస్తున్నాయి. నాల్గో సంవత్సరం రెండో సెమిస్టర్‌కు వచ్చిన విద్యార్థులు మరిన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు చేయడం మంచిది. కమ్యూనికేషన్, కోడింగ్‌ ఇతర అంశాలపై పట్టు అవసరం.

మరింత సమాచారం... మీ కోసం!

ఎల్‌బీఎస్‌ఐఎమ్‌లో పీజీ డిప్లొమా కోర్సులు 

ఆరోగ్య శాఖలో 487 కొలువులు

వైజాగ్‌ నావల్ డాక్‌యార్డులో 275 అప్రెంటిస్ ఖాళీలు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.