• facebook
  • whatsapp
  • telegram

school:బడి పిల్లలపై ఫీ‘జులం’

* విద్యాశాఖ అధికారులకు కల్పవృక్షంగా డీసీఈబీ

* ఒక్కో విద్యార్థికి రూ.200.. రెండు జిల్లాల్లో రూ.3 కోట్లు

* గత ఏడాది కంటే మూడు రెట్లు రుసుము పెంపు

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో..డిస్ట్రిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు (డీసీఈబీ) పేరుతో విద్యాశాఖాధికారులు చేస్తున్న వసూళ్లు విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, పంపిణీ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి గత ఏడాది వరకూ ఆరు, ఏడు తరగతులకు రూ.30, ఆపైన తరగతులకు రూ.60 వసూలు చేసేవారు. కనీసం ప్రశ్నపత్రాలు కూడా ఇవ్వకుండా.. వాట్సాప్‌లో పేపర్లను పంపిస్తే.. వాటిని బోర్డులపై రాసి పరీక్షలు మమ అనిపించారు. కనీసం పేపర్లను కూడా ఇవ్వనప్పుడు రూ.లక్షల్లో వసూలు చేసిన ఈ డబ్బులు ఏమయ్యాయనే దానికే స్పష్టత లేదు. ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లకు పైగా రుసుం పెంచేసి.. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.


గతంలో వెయ్యి మంది పిల్లలున్న ప్రైవేటు పాఠశాలల్లోనూ ఈ డీసీఈబీ ఫీజు తక్కువ ఉండడంతో యాజమాన్యాలే కట్టేస్తుండేవి. వెయ్యి మందిలో ఆరు, ఏడు తరగతులకు 300 మంది ఉంటే వారికి ఏటా రూ.30 చొప్పున రూ.9 వేలు, ఏడు నుంచి పది వరకూ నాలుగు తరగతులకు 700 మంది ఉంటే.. వారికి రూ.41 వేల వరకూ అయ్యేది. మొత్తంగా కలిపినా.. రూ.50 వేల లోపే ఉండేది. అందుకే పెద్ద పాఠశాలలు ఈ రుసుమును వాళ్లే కట్టేసేవాళ్లు. అలాగే వంద నుంచి 200 మంది విద్యార్థులున్న చిన్న ప్రైవేటు బడులు కూడా మొత్తం రుసుమంతా కలిపినా రూ.10 వేల లోపే ఉండడంతో కట్టేస్తుండేవి. కానీ.. ఇప్పుడు వెయ్యి మంది పిల్లలుంటే.. రూ.2 లక్షల డీసీఈబీ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే ఈ రుసుమును కూడా ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. అసలు ఇంత భారీగా.. మూడు రెట్లు పెంచేసి ఎందుకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


అస్తవ్యస్తంగా పరీక్షల నిర్వహణ..

ఎన్టీఆర్‌ జిల్లాల్లో డీసీఈబీ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ తీరు కూడా దారుణమనే విమర్శలున్నాయి. కేవలం వసూళ్లకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. నిర్వహణను గాలికి వదిలేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. పేపర్లను కూడా వాట్సాప్‌లో పంపించడం, వాటిని బోర్డుపై ఉపాధ్యాయులు రాసేసి.. పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు.. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల రుసుమే రూ.120 ఉంటే.. దానికి మించి డీసీఈబీ వసూలు చేయడం గమనార్హం. అసలు ప్రశ్నపత్రాలను సైతం ముద్రించినవి ఇవ్వనప్పుడు రూ.కోట్లలో విద్యార్థులపై భారం మోపడం ఎందుకనేది అధికారులకే తెలియాలి. కేవలం అధికారుల వసూళ్లకు డీసీఈబీని కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూళ్లు చేసిన ఈ డబ్బులను ఏం చేస్తున్నారనే దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం దృష్టి పెట్టకపోవడం వల్లే.. ఈ పరిస్థితి తలెత్తుతోందని తెలుస్తోంది.

ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థి రూ.200 చొప్పున ఈ ఏడాది డీసీఈబీకి చెల్లించాలని విద్యాశాఖాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది వరకూ రూ.60 చొప్పున వసూలు చేసి ప్రశ్నపత్రం కూడా ఇవ్వలేదనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది రూ.200 కట్టించుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల మంది 6 నుంచి 10 వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులున్నారు. వీరి నుంచి గత ఏడాది వరకూ.. రూ.80లక్షల వరకూ వసూలు చేయగా.. ఈ ఏడాది ఏకంగా.. రూ.3 కోట్లకు పైగా విద్యార్థులపై భారం మోపారు.

ఇదేం పద్ధతి బాబోయ్‌...


పరీక్షల విధానం గతంలో పద్ధతి ప్రకారం ఉండేది. నాలుగు యూనిట్‌ పరీక్షలు, క్వార్టర్లీ, అర్ధ సంవత్సర, ఏడాది పరీక్షలు ఉండేవి. యూనిట్‌ స్థానంలో ఎఫ్‌ఏ పరీక్షలను ప్రవేశపెట్టారు. వాస్తవంగా నాలుగు పరీక్షలు పెట్టాల్సి ఉండగా.. ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2 రెండే పెడుతున్నారు. అలాగే.. ఎస్‌ఏ పరీక్షలను కూడా రెండు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తూ, ఆఖరి నిమిషంలో ప్రశ్నపత్రాలను వాట్సాప్‌లలో పెట్టడం, వాటిని కొందరు ప్రింట్లు తీసుకోవడం, మరికొందరు బోర్డులపై రాసేసి.. పరీక్షను మమ అనిపించడం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు కట్టే రుసుములపై తప్ప.. పరీక్షల నిర్వహణ ఎలా సాగుతోందనేది పట్టించుకునే యంత్రాంగమే లేకపోయింది. డీసీఈబీ రుసుం చెల్లించాలని ఈనెల 20న ఎన్టీఆర్‌ జిల్లా విద్యాధికారి పేరుతో ఆదేశాలు జారీ చేశారు. కేవలం మూడు రోజులు సమయం ఇచ్చి.. వెంటనే విద్యార్థుల ఫీజులన్నీ చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఆ డబ్బులను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.