• facebook
  • whatsapp
  • telegram

TSPSC: గ్రూప్‌-1 చిక్కుముడి వీడేదెలా?

* నూతన ప్రభుత్వ నిర్ణయమే కీలకం
 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడిన ఈ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబరులో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.8 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో ఈ ఏడాది జూన్‌లో కమిషన్‌ పునఃపరీక్ష నిర్వహించింది. దీనికి 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం పరీక్ష రద్దుచేయాలని తీర్పునిచ్చింది. దీన్ని పునఃసమీక్షించాలంటూ కమిషన్‌ సెప్టెంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నూతన ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న జారీచేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్‌పై నిర్ణయం కీలకం కానుంది. ఈ నోటిఫికేషన్‌ రద్దుచేసి, కొత్తగా ఇవ్వడమా? అదనపు ఉద్యోగాలను గుర్తించడమా? వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్‌ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలంటే సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుని, హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు గత ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో గ్రూప్‌-3, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల పోస్టులకు ఇప్పటికీ షెడ్యూలు ఖరారు కాలేదు. గ్రూప్‌-2 పరీక్షకు షెడ్యూలు జారీఅయినా పరీక్ష రెండుసార్లు వాయిదాపడింది.

వివిధ నోటిఫికేషన్ల పరిస్థితి ..

గ్రూప్‌-2: దాదాపు 783 పోస్టులున్న గ్రూప్‌-2 పరీక్ష తేదీలు రెండుసార్లు రీషెడ్యూల్‌ అయ్యాయి. జనవరిలో పరీక్ష జరగాల్సి ఉంది.

గ్రూప్‌-3: గ్రూప్‌-3 సర్వీసుల కింద 1380కిపైగా పోస్టులతో కమిషన్‌ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. కానీ ఇప్పటివరకు పరీక్ష తేదీలను ప్రకటించలేదు.

గ్రూప్‌-4: మొత్తం 8039 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష పూర్తయింది. దీనికి 9.51 లక్షల మంది దరఖాస్తు చేయగా, 7.62 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష తుది కీ వెల్లడైంది.

పోలీసు, యూనిఫాం సర్వీసులు: యూనిఫాం సర్వీసుల కింద 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందులో 587 ఎస్సై స్థాయి పోస్టుల తుది నియామకాలు పూర్తయ్యాయి. ఎంపికైన వారు శిక్షణలో ఉన్నారు. కానిస్టేబుల్‌ పోస్టుల తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే న్యాయవివాదం కారణంగా వైద్యపరీక్షలు నిలిచిపోయాయి.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు (ఏఈఈ): ప్రభుత్వ విభాగాల్లో 1540 ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, అగ్రికల్చరల్‌ ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ ఏడాదిలో తొలుత జరిగిన పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో రెండోసారి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తుదికీ వెల్లడైంది. అభ్యర్థుల మార్కులు, ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను కమిషన్‌ ప్రకటించింది.
అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ పోస్టులు: ఈ విభాగాల్లో మొత్తం 355 పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు పూర్తయ్యాయి. తుది కీలు సిద్ధమయ్యాయి.
జూనియర్‌ లెక్చరర్లు: పాలిటెక్నిక్‌, ఇంటర్‌విద్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సెప్టెంబరులో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ వెల్లడైంది. తుదికీలు ఇంకా ఖరారు కాలేదు.


సంక్షేమ గురుకులాలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం 9210 ఉద్యోగాలకు దాదాపు 2.6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులకు ఆగస్టు నెలలో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు పూర్తయ్యాయి. వీటికి సంబంధించి తుది కీ వెల్లడైంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుంచి జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులకు సంబంధించి ఆప్షన్లు తీసుకుంటున్నారు.

వైద్యవిభాగం: వైద్యవిభాగంలో వైద్య పోస్టుల భర్తీ పూర్తయింది. దాదాపు 5204 స్టాఫ్‌నర్సుల పోస్టులకు సంబంధించి రాతపరీక్షలు పూర్తయి మెరిట్‌ జాబితా వెల్లడైంది. దాదాపు 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) పోస్టులకు దరఖాస్తులు స్వీకరించినా పరీక్ష ఇంకా పూర్తికాలేదు.

పాఠశాల విద్య: పాఠశాల విద్యలో 9500 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిస్తే 5089 ఉపాధ్యాయ పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెల్లడైంది. ఈ ప్రకటనకు 1.76లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష ఇంకా పూర్తికాలేదు.


పంచాయతీరాజ్‌శాఖ: పంచాయతీరాజ్‌శాఖలో గ్రూప్‌-4 సర్వీసుల కింద దాదాపు వెయ్యివరకు ఉద్యోగాలను తొలుత గుర్తించి గ్రూప్‌-4 ప్రకటనలో చేర్చారు. సమగ్ర ప్రకటనలో ఈ విభాగం నుంచి పేర్కొన్న ఉద్యోగాలను ఉపసంహరించారు. పంచాయతీ విభాగంలో పోస్టులపై ఆ శాఖ నుంచి స్పష్టత రాలేదు.
 



మరింత సమాచారం... మీ కోసం

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.