• facebook
  • whatsapp
  • telegram

Students: పోటీ ప్రపంచంలో ఎదిగేందుకే ప్రోత్సాహకాలు

విదేశీ వర్సిటీల విద్యార్థులకు, సివిల్స్‌ అభ్యర్థులకు రూ.42.60 కోట్లు
బటన్‌ నొక్కి నిధులు జమ చేసిన  సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదగాలనే ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా కష్టపడి చదివి, విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో సీటు సాధిస్తే ఫీజులకు ఇబ్బంది పడాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 390 మంది విద్యార్థులకు, సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మందికి, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు కలిపి రూ.42.60 కోట్లను క్యాంపు కార్యాలయంలో డిసెంబ‌రు 20న బటన్‌ నొక్కి వారి వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్‌లో టాప్‌-50 కళాశాలల్లో 21 కోర్సుల్లో సీటు వస్తే మొత్తం ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల పిల్లలకు రూ.1.25 కోట్ల వరకు చెల్లిస్తుంది. మిగిలిన వారికి రూ.కోటి ఇస్తున్నాం. దాదాపు మొత్తం ఫీజు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఏడాది దాదాపుగా 51 మంది కొత్తగా అర్హత సాధించారు. ఇది చూసి మిగిలిన వాళ్లు స్ఫూర్తి పొందాలి. సీఈఓలుగా పెద్ద పెద్ద సంస్థల్లో పేరు సంపాదించుకున్న తర్వాత రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఫీజులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది..
విదేశీ వర్సిటీల్లో ఫీజులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కార్నిగీ మిలాన్‌ వర్సిటీలో రూప అనే విద్యార్థినికి కంప్యూటర్‌ సైన్సు కోర్సుకు రూ.89 లక్షల ఫీజు చెల్లించాం. కొలంబియా వర్సిటీలో ప్రకీర్త్‌ అనే విద్యార్థికి ఇంజినీరింగ్‌ చదవడానికి రూ.75.87లక్షలు చెల్లించాం. ఈ ఫీజులు చూస్తుంటే సీటు వచ్చినా అక్కడకు వెళ్లి చదవడానికి విద్యార్థులకు ధైర్యం సరిపోదు. అందుకే టాప్‌ కళాశాలలో సీటు వస్తే ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రయోజనం పొందుతున్న వారిలో 45 శాతం ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటే మిగిలిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే. సివిల్స్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఎన్నిసార్లు సివిల్స్‌ రాసినా సహాయం అందిస్తాం. ఎక్కువ మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు మన రాష్ట్రం నుంచి అవుతారనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.