• facebook
  • whatsapp
  • telegram

 Education: శాసనసభ సమావేశాల్లో… తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు

* ఏటా 20 వేల మందికి నైపుణ్య శిక్షణ


ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికి ‘తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ’ అని పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో వర్సిటీని ప్రారంభించాలని, అవసరమైతే న్యాక్‌ క్యాంపస్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్న బృహత్తర లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ నిర్వహణకు ఎంతఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు ముసాయిదాలోని అంశాలపై, యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి... రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వారిద్దరూ పలు సూచనలు చేశారు. దిల్లీ, హరియాణాల్లోని స్కిల్‌ యూనివర్సిటీలను పరిశీలించి ముసాయిదాను సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. యూనివర్సిటీ నిర్వహణ, చేపట్టనున్న కోర్సులు, వ్యవధి, మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చు, వివిధ సంస్థల భాగస్వామ్యంపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. 

లాభాపేక్ష లేకుండా.. స్వయం ప్రతిపత్తి ఉండేలా..

స్కిల్‌ యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) లాభాపేక్ష లేకుండా, స్వయం ప్రతిపత్తి ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. మూడు, నాలుగేళ్ల కాలవ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతోపాటు ఏడాది కాలవ్యవధి కలిగిన డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి కలిగిన సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేశారు. ఈ మేరకు 17 ప్రాధాన్యరంగాలను గుర్తించారు. వాటిలో ఫార్మా, నిర్మాణ, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఈ-కామర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ తదితరాలు ఉన్నాయి. తొలుత ఆరు రంగాలకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెడతారు. ప్రతి కోర్సునూ... సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది. 

ఏడాదికి 20 వేల మందికి ప్రవేశాలు 

తొలి ఏడాది రెండువేల మందితో ప్రారంభించి, ప్రతి ఏడాది 20 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ యూనివర్సిటీ క్యాంపస్‌తోపాటు జిల్లా కేంద్రాల్లోనూ ప్రాంతీయ ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్న చర్చ జరిగింది. జిల్లా కేంద్రాల్లోని శాటిలైట్‌ క్యాంపస్‌లలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని, అంతా హైదరాబాద్‌ క్యాంపస్‌లో చేరేందుకే పోటీపడతారని సీఎం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అందరికీ హైదరాబాద్‌లోనే శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన ప్రాంగణాలను గుర్తించాలని ఆదేశించారు. భూదాన్‌పోచంపల్లిలోని స్వామిరామానందతీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సులు, అక్కడి కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించాలని ఆదేశించారు. డిమాండ్‌ ఎక్కువ ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తుది ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సీఎం కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.