• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Engineering: సాఫ్ట్‌వేర్‌ కోర్సులదే జోరు!

* సాఫ్ట్‌వేర్‌ కొలువులు దక్కే కోర్సుల్లో 91% సీట్ల భర్తీ
 

ఈనాడు, అమరావతి: ‘బీటెక్‌లో చేరాలి. కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకోవాలి. లేదంటే కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు చదవాలి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలి.’ ఇవీ నేటి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలు. వెరసి, బీటెక్‌ అంటేనే సాఫ్ట్‌వేర్‌ కొలువుల కోర్సుగా మారిపోయింది. ఉపాధి అవకాశాలు, సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా కోర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులైన మెకానికల్, సివిల్, ఈఈఈ వంటివి చదివే వారు తగ్గిపోతున్నారు. కళాశాలలు సైతం వీటిల్లో సీట్లు తగ్గించి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పించే కోర్సులను భారీగా పెంచేశాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అన్ని కళాశాలల్లో కలిపి కన్వీనర్‌ కోటాలో 1,36,660 సీట్లు ఉంటే, వీటిలో వ్యవసాయ, కోర్‌ ఇంజినీరింగ్, ఇతర కోర్సులకు సంబంధించిన సీట్లు కేవలం 26,085 మాత్రమే. మొత్తం సీట్లలో వీటి వాటా 19% మాత్రమే. ఇదే ఒరవడి కొనసాగితే మెకానికల్, సివిల్‌ లాంటి కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. ఇంజినీరింగ్‌ అంటేనే కంప్యూటర్‌ సైన్స్‌ అనేలా పరిస్థితి మారిపోతోంది. ఎమర్జింగ్‌ కోర్సులు కాకుండా సీఎస్‌ఈలో 42,303 సీట్లు ఉండగా, వీటిల్లో 40,242 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ లెక్కన 95% సీట్లు నిండాయి. 


సీట్ల భర్తీలోనూ వ్యత్యాసమే..

ప్రస్తుతం ప్రాంగణ నియామకాలంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలే అన్నట్లుగా ట్రెండ్‌ మారిపోయింది. ఒకవేళ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు రాకపోయినా కొత్త కోర్సులు నేర్చుకోవడం, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాలు పొందేందుకు అవకాశముంటోంది. సివిల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు గతంలో నిర్మాణ, ఉత్పత్తి కంపెనీలు కళాశాలలకు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా నియామకాలు తగ్గిపోవడం, కేంద్ర సంస్థలు గేట్‌ మార్కుల ఆధారంగానే నియామకాలు చేపట్టడంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపడం లేదు. సాఫ్ట్‌వేర్‌తో పోల్చితే ఇతర ఇంజినీరింగ్‌ ఉద్యోగులకు ప్రారంభ వేతనాలు తక్కువగా ఉండడం మరో కారణం. రాష్ట్రంలో సీఎస్‌ఈలో 42 వేల సీట్లుంటే, సివిల్‌లో 6,760 మాత్రమే ఉన్నాయి. వీటిల్లోనూ 62 శాతమే భర్తీ అయ్యాయి. ఈఈఈలో 8,800 సీట్లకుగానూ 6,239 నిండాయి. మెకానికల్‌లో 7,996 సీట్లకు 4,82 మాత్రమే భర్తీ అయ్యాయి. ఆటోమొబైల్‌లో 56 సీట్లు ఉంటే, కేవలం 19 మంది ఎంచుకున్నారు. మెకానికల్‌లో రోబోటిక్స్‌లో మాత్రం 57 సీట్లు ఉంటే అన్ని భర్తీ అయ్యాయి. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో ఉన్నవే 510 సీట్లు కాగా, ఎంచుకున్నది 147 మంది మాత్రమే. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పేరుతో కొన్ని కళాశాలల్లో 128 సీట్లు ఉంటే వంద శాతం నిండిపోయాయి. అటు ఎలక్ట్రానిక్స్, ఇటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు వెళ్లే అవకాశమున్న ఈసీఈలో 24,121 సీట్లు ఉంటే 21,060 సీట్లు భర్తీ అయ్యాయి. మెటలార్జికల్, పెట్రోలియం ఇంజినీరింగ్‌లో 65 చొప్పున సీట్లు ఉండగా ఇవి వంద శాతం నిండాయి.


సీట్లు పెరిగినా డిమాండే..

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో 86% సీట్లు భర్తీ కాగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సుల్లో 91% సీట్లు నిండాయి. ఇతర కోర్సుల్లో 64% సీట్లే భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవే 1,10,575 సీట్లు ఉండగా, వీటిల్లో 1,00,383 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇంకా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ వర్సిటీల్లోనూ వేల సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సుల్లోనే చేరుతున్నారు. కోర్‌ కోర్సులను తప్పనిసరిగా నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధన పెట్టడంతోనే ఇంజినీరింగ్‌ కళాశాలలు వాటిని కొనసాగిస్తున్నాయి. కొన్ని వర్సిటీల్లో మెకానికల్‌లోనూ రోబోటిక్స్‌ వంటివి ప్రవేశపెట్టారు. కళాశాలల్లో 80 శాతానికిపైగా సీట్లు సాఫ్ట్‌వేర్‌ కొలువులకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ ఏడాది ఏఐసీటీఈ అనుమతితో దాదాపు అన్ని కళాశాలలు సీట్లు పెంచుకున్నాయి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Posted Date : 20-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం