• facebook
  • whatsapp
  • telegram

జేఎన్‌టీయూలో బీటెక్‌ కృత్రిమ మేధ!

ఈ ఏడాది నుంచి మంథని కళాశాలలో అందుబాటులోకి
సుల్తాన్‌పూర్‌ కాలేజీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ సైతం బీటెక్‌ కృత్రిమ మేధ అండ్‌ మెషిన్‌ లాంగ్వేజ్‌ కోర్సును ప్రారంభించనుంది. పెద్దపల్లి జిల్లా మంథని కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2020-21) నుంచి దాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 45 ప్రైవేట్‌ కళాశాలల్లో ఈ కోర్సుకు అనుమతి ఇచ్చిన జేఎన్‌టీయూహెచ్‌.. తన పరిధిలోని నాలుగు వర్సిటీ కళాశాలల్లో ఒకటైన మంథని కాలేజీలో 60 సీట్లతో ప్రారంభించనుంది. తొలి ఏడాది అన్ని కోర్సులకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక(కామన్‌ సిలబస్‌) ఉన్నందున బోధనా సిబ్బంది సమస్య లేదని, వచ్చే విద్యా సంవత్సరానికి  విశ్వవిద్యాలయం కొత్త నియామకాలు జరుపుతుందని భావిస్తున్నామని ఆ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య మార్కండేయ చెప్పారు. ఈ కళాశాల ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా కొత్త కోర్సును ప్రవేశపెడుతుండటం ఆనందంగా ఉందన్నారు. సుల్తాన్‌పూర్‌లోని వర్సిటీ కళాశాల పరిధిలో ఔషధ పరిశ్రమలతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ను మొదలుపెట్టాలనేది ఆలోచన. ఈ కోర్సు ప్రస్తుతం కూకట్‌పల్లిలోని వర్సిటీ కళాశాలలో 2014-15 నుంచి నడుస్తోంది. దీనికి అవసరమైన ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాల విస్తరణకు తగిన స్థలం లేదు. అందుకే ఈ కోర్సును సుల్తాన్‌పూర్‌ కాలేజీకి తరలించాలని భావిస్తోంది. ‘వీలైతే ఈ ఏడాది, లేకుంటే వచ్చే ఏడాది కచ్చితంగా మార్చాలనుకుంటున్నాం’ అని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ చెప్పారు. ప్రస్తుతం అనుబంధ కాలేజీల్లో తప్ప విశ్వవిద్యాలయ కళాశాలలు నాలుగింటిలో ఎక్కడా బీఫార్మసీ కోర్సు లేదు. వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి దాన్నీ ప్రారంభిస్తామని రిజిస్ట్రార్‌ చెప్పారు.
ఐఐటీ జోధ్‌పూర్‌లోనూ ఈ ఏడాది నుంచే..
బీటెక్‌ స్థాయిలో గత విద్యా సంవత్సరం(2019-20) ఐఐటీ హైదరాబాద్‌ దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో 27 సీట్లున్నాయి. అదే బాటలో ఒక్కో ఐఐటీ అడుగులు వేస్తోంది. రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌ సైతం ఈ విద్యా సంవత్సరం నాలుగేళ్ల బీటెక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ పేరిట కోర్సు ప్రారంభించింది. అందులో 50 సీట్లున్నాయి. జోసా కౌన్సెలింగ్‌ ద్వారా ఆ సీట్లను భర్తీచేస్తారు. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.