• facebook
  • whatsapp
  • telegram

ఇక ఎంబీబీఎస్‌  నాలుగున్నరేళ్లే!

* రెండేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన
* కేంద్రానికి మంత్రుల బృందం నివేదిక

 

ఈనాడు, దిల్లీ: ఎంబీబీఎస్‌ కోర్సు కాల పరిమితిని త‌గ్గించాల‌ని కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది. 
ప్ర‌స్తుతం ఇంట‌ర్న్‌షిప్‌తో క‌లిపి అయిదున్నర ఏళ్ల కోర్సు ఉండ‌గా దాన్ని నాలుగున్నర ఏళ్లకు తగ్గించాలని సూచించారు.  కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ నేతృత్వంలోని ఆ బృందం మారుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా
కోర్సు కాల వ్యవధిని కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. ఎంబీబీఎస్‌ డిగ్రీ ప్రదానం చేయడానికి ముందు విద్యార్థులు రెండేళ్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన విధించాలని, దానివల్ల గ్రామాల్లో వైద్యుల లభ్యత పెరుగుతుందని కూడా పేర్కొన్నట్టు సమాచారం. కొవిడ్‌ అనంతర సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని, దీనిలో భాగంగా వైద్యరంగాన్ని పూర్తిగా ప్రక్షాళించాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఎంబీబీఎస్‌ కోర్సును విద్యార్థులు ఎంతకాలం చదివారన్నది కాకుండా ఎంత మేరకు నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారన్న దానిపై దృష్టి సారించాలని తెలిపింది. ఇదివరకు 54 నెలల పాటు కొనసాగే ఎంబీబీఎస్‌ కోర్సును భారత వైద్య మండలి 50 నెలలకు (ఇంటర్న్‌షిప్‌ మినహాయించి) కుదించినట్లు మంత్రుల బృందం గుర్తుచేసింది. దీన్నిబట్టి చూస్తే కోర్సు నాలుగేళ్లకు దగ్గరలో ఉందని, ఇంటర్న్‌షిప్‌నూ జతచేసి నాలుగున్నరేళ్లలో పూర్తయ్యేలా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
 

మంత్రులు సూచించిన విధానాలు..
1. ఎంబీబీఎస్‌ కోర్సును 4 ఏళ్లకు, ఇంటర్న్‌షిప్‌ను  6 నెలలకు పరిమితం చేయడం.
2. ఇంటర్న్‌షిప్‌ లేకుండా ఎంబీబీఎస్‌ నాలుగేళ్లకు కుదించడం, చివరి సంవత్సరం కామన్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ ద్వారా రెండేళ్ల పీజీ కోర్సు ఆఫర్‌ చేయడం.
3. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎండీ/ఎంఎస్‌ కోర్సు ప్రవేశపెట్టడం. ఈ కోర్సులో చేరాలనుకున్న వారికి మొదటే ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించాలని మంత్రుల బృందం సూచించింది. దీనివల్ల ఆరేళ్లలో సంపూర్ణ నైపుణ్యంతో వైద్యులు బయటికొస్తారని పేర్కొంది. ఈ విధానంలో కూడా ఇంటర్న్‌షిప్‌ అమలు చేయకూడదని అభిప్రాయపడింది.
ఈ మూడింటిలో ఏ విధానంలో వైద్య విద్య పూర్తిచేసినా మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా నమోదు చేసుకోవడానికి ముందు రెండేళ్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన విధించాలని కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఏడాది ఇంటర్న్‌షిప్‌ కాలంతో పాటు, మరో ఏడాది కాలాన్ని జోడించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.