• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒత్తిడిని ఓడించేద్దాం..!

అకడమిక్‌ సక్సెస్‌కు సూచనలుఉదయం లేచింది మొదలు విద్యార్థులకు ఎన్ని పనులో చెప్పలేం. కాలేజీకి వెళ్లాలి. క్లాసులకు హాజరై.. పాఠాలను శ్రద్ధగా వినాలి. అవసరమైతే ట్యూషన్లకు వెళ్లాలి. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా కుదరదు. రాయాల్సిన.. చదవాల్సిన.. పాఠాలెన్నో సిద్ధంగా ఉంటాయి. ఇలా క్షణం  తీరికలేని పనులతో సతమతమవుతూ ఒత్తిడికి గురయ్యేవారిలో మీరూ ఉన్నారా? 


చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తూవుండాలి. ‘తర్వాత చేయొచ్చులే’ అనుకుంటూ వాయిదా వేస్తూపోతే అవి కొంతకాలానికి పెనుభారంగా తయారై ఒత్తిడిని పెంచుతాయి.  


ఒత్తిడి కొంతవరకూ ఫర్వాలేదుగానీ.. మితిమీరితే మాత్రం అనారోగ్య సమస్యలెన్నో చుట్టుముడతాయి. కంటి నిండా నిద్ర ఉండదు. సమయానికి ఏమీ తినాలనిపించదు. తలనొప్పీ, చిరాకు బాధిస్తాయి. అంతేకాదు- దీనివల్ల సహ విద్యార్థులు, స్నేహితులు, కుటుంబసభ్యులతో సంబంధాలూ దెబ్బతింటాయి. 


బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు స్నేహితులు సరదాకు ఏమైనా అన్నా.. వెంటనే అపార్థం చేసుకుని ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతో ఆ తర్వాత గొడవలూ జరిగే ప్రమాదం ఉంటుంది. 


పదేపదే ఆలోచనలు

ఒకచోట కూర్చుని.. చేయాల్సిన పనుల గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆరుబయట నిదానంగా నడుస్తూ ఆలోచించడం వల్ల ఒత్తిడి కాస్త తగ్గుతుంది. 

చేయాల్సిన పనులు చాలా ఉండటం వల్ల.. అవి పూర్తిచేయగలమో లేదోననే అనుమానంతో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. నిజానికి అన్ని పనులనూ ఒకేసారి చేయలేరు కదా. కాబట్టి ‘అత్యవసరంగా చేయాల్సినవి’, ‘తర్వాత చేయదగినవి’, ‘ఇతరులకు అప్పగించగలిగినవి’ అంటూ విభజించుకోవాలి. ఇలా ప్రాథమ్యాలను గుర్తించి, వాటిని పరిష్కరించటం మొదలుపెడితే సాఫీగా పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. 

ఒకే సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలాకాకుండా పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. 


ప్లాన్‌-బి ఉందా?

గిరిగీసుకుని ఒక పరిధికి లోబడి మాత్రమే ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని దాటి బయటకు వచ్చి విస్తృతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఉదాహరణకు మీ దగ్గర ప్లాన్‌-ఎ మాత్రమే ఉంటే కాస్త ఆందోళనగా ఉంటుంది. ప్లాన్‌-ఎ విఫలమైతే ఏంచేయాలని ఒకసారి ఆలోచించి.. ప్లాన్‌-బిని సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. దీనర్థం మరో ప్లాన్‌ సిద్ధంగా ఉందని నిర్లక్ష్యంగా ఉండమని కాదు. వీలైనంత వరకూ ముందుగా పని పూర్తిచేయడానికే ప్రయత్నించాలి. అది విఫలమైనప్పుడు మాత్రమే ప్లాన్‌-బికి రావాలి. 


ప్రకృతికి దగ్గరగా..

ఒత్తిడిని నియంత్రించే శక్తి ప్రకృతికి పుష్కలంగా ఉంది. స్మార్ట్‌ఫోన్లకు దూరంగా.. ఆరుబయట స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ నడవండి. సూర్యకిరణాలు శరీరాన్ని తాకేలా చూడండి. పక్షుల కువకువలను, వీచే గాలికి తోడుగా చెట్ల ఆకులు చేసే సవ్వడిని వినండి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించి.. మానసిక ప్రశాంతతను రెట్టింపు చేస్తాయి. 

శ్వాస వ్యాయామాలు కూడా ఒత్తిడిని నియంత్రించడానికి తోడ్పడతాయి. దీర్ఘంగా గాలి పీల్చి.. మెల్లగా బయటకు వదలాలి. ఇలా కనీసం ఐదారుసార్లు చేయాలి. ఒత్తిడిగా అనిపించినపుడల్లా ఈ వ్యాయామాలు చేస్తే తేడా మీకే తెలుస్తుంది. నాడీ వ్యవస్థకు ప్రశాంతతా చేకూరుతుంది. తలనొప్పీ, తల పట్టేసినట్టుగా ఉండటం లాంటి సమస్యలూ బాధించవు. 

చివరిగా ఒక విషయం. ఒత్తిడిని నియంత్రించడం అంటే జీవితంలో సవాళ్లే లేకుండా చేసుకోవడం కాదు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని తెలివిగా, సులువుగా పరిష్కరించుకోవడమేనని గుర్తుంచుకోవాలి.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!

‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!

‣ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌లో 153 కొలువుల భర్తీ

‣ ఇవి పాటిస్తే.. భవిష్యత్తు మీదే! ‣ బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

Posted Date : 30-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌