• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డైవ్‌.. కెరియర్‌ వావ్‌!

సాహసాల బాటలో సాగిపోయే ఔత్సాహికులకు.. సముద్రాల లోతుల్లో విహరించే ‘స్కూబా డైవింగ్‌’ ఎంతో ఇష్టమైన ప్రక్రియ. కానీ ఎప్పుడో ఒకసారి విహారయాత్రల్లో కాదు, రోజూ ఆఫీసుకి వెళ్లినట్టే అండర్‌వాటర్‌లోకి వెళ్లిపోవచ్చు! ఎందుకంటే వినూత్నమైన కెరియర్‌ను ఎంచుకోవాలి అనుకునేవారికి ఇప్పుడు ప్రొఫెషనల్‌ స్కూబా డైవింగ్‌ స్వాగతం పలుకుతోంది.

స్కూబా డైవింగ్‌లో విభిన్నమైన సంస్థలు, కమ్యూనిటీలు ఉన్నాయి. ఇవి డైవర్స్‌ అందరినీ ఒక తాటిపైకి తెచ్చే అనుసంధానకర్తలు అనుకోవచ్చు. పాడి(ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌) ప్రముఖ డైవర్స్‌ కమ్యూనిటీ. ఇందులో దాదాపు లక్షన్నర మంది డైవర్స్‌ సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మనకు నచ్చిన దాన్ని ఎంచుకుని డైవింగ్‌ నేర్చుకోవచ్చు. కోర్సులో విభిన్నమైన ర్యాంకులుంటాయి. ఎన్ని ఎక్కువ డైవ్‌లు పూర్తిచేస్తే అంత ఉత్తమ ర్యాంకు సంపాదించవచ్చన్నమాట. అభ్యర్థి గడించిన అనుభవాన్నిబట్టి కెరియర్‌ అవకాశాలుంటాయి.

స్కూబా డైవర్, ఓపెన్‌ వాటర్‌ డైవర్, అడ్వాన్స్‌డ్‌ ఓపెన్‌ వాటర్‌ డైవర్, డైవ్‌ మాస్టర్‌ వంటివి ఇందులో దొరికే విభిన్నమైన కోర్సులు. ప్రొఫెషనల్‌ డైవర్‌ అవ్వాలంటే కనీసం ‘డైవ్‌ మాస్టర్‌’ పూర్తిచేసి ఉండాలి. దీనికోసం 60 సార్లు డైవ్‌ చేసిన అనుభవం తప్పనిసరి. అదే ఈ కోర్సులు పూర్తిచేసి డైవ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం సంపాదిస్తే కొత్తవారికి డైవింగ్‌ నేర్పించొచ్చు. పర్యటక ప్రాంతాల్లో సరదాగా డైవింగ్‌ చేయాలనుకునే వారికి గైడెన్స్‌ ఇవ్వడం వంటివి ఈ ర్యాంకులో భాగం. రిసార్టులు, డైవ్‌ సెంటర్లలో వీరికి మంచి డిమాండ్‌ ఉంది.

ఈ దశలో అభ్యర్థి నైపుణ్యాలను బట్టి నెలకు రూ.15వేల నుంచి రూ.75వేల వరకూ సంపాదించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ ఏడాదికి రూ.5 లక్షల నుంచి  రూ.10 లక్షల వరకూ ప్యాకేజీలు పొందొచ్చు. గోవా, పుదుచ్చేరి, అండమాన్‌ అండ్‌ నికోబార్, లక్షద్వీప్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఉన్న దాదాపు 80 డైవ్‌ సెంటర్లలో వీరికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అయితే ఇది ప్రారంభదశ మాత్రమే. ఇతర అర్హతలు ఉన్నవారికి మరిన్ని అవకాశాలు ఉంటాయి.

సైంటిఫిక్‌ రిసెర్చ్‌ డైవర్‌..

సముద్రపు లోతుల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీరు సమాచారం సేకరిస్తారు. కొత్త కొత్త జాతులను అన్వేషించడం, నమూనాలు సేకరించడం వంటివి రిసెర్చ్‌ డైవర్‌ ప్రధాన లక్ష్యాలు. వీరు నిజానికి పూర్తిస్థాయి శాస్త్రవేత్తలే.. దాంతోపాటు డైవింగ్‌లోనూ రాణిస్తారన్నమాట. ఇలా చేయాలంటే సంబంధిత సైన్స్‌ సబ్జెక్టులో కనీసం మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అండర్‌ వాటర్‌ స్టంట్స్‌..

సినిమాలు, సిరీస్‌లు, ప్రకటనలు, మ్యూజిక్‌ వీడియోల కోసం నీటి అడుగున స్టంట్స్‌ చేసే ఉద్యోగమిది. చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో నటీనటుల రక్షణ, స్టంట్స్‌ పర్యవేక్షణ, డూప్స్‌ బాధ్యతలూ వీరికి ఉంటాయి. అయితే ఇందులో పోటీ ఎక్కువగా ఉంది. ఎక్కువ ర్యాంకులు పూర్తిచేస్తే తప్ప సరైన అవకాశాలు అందుకోవడం కష్టం.

కమర్షియల్‌ డైవర్‌: అన్ని డైవింగ్‌ ఉద్యోగాల్లోనూ ఇది అధిక సవాళ్లతో కూడుకున్నది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, షిప్పింగ్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్‌ కంపెనీల్లో అవకాశాలుంటాయి. నీటి అడుగున ఉండే యంత్రాలు, పరికరాల తయారీ, తనిఖీ బాధ్యతలు నిర్వహించాలి. నదులు, హార్బర్లలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆపరేషన్స్‌లో ఇన్‌లాండ్‌ డైవర్స్‌గానూ ఉండొచ్చు. వంతెనలు, డ్యాముల వంటి నిర్మాణాల్లో సర్వే విభాగంలో ఈ నిపుణుల అవసరం ఉంటుంది. శాచురేషన్‌ డైవింగ్, న్యూక్లియర్‌ డైవింగ్‌ వంటివి మరింత రిస్క్‌తో కూడుకున్న ఉద్యోగాలు. వారాల తరబడి సముద్రంలో ఉండటం, ప్రమాదకరమైన రేడియేషన్‌ మధ్య పనిచేయడం ఈ వృత్తిలో అంతర్భాగం. అందుకే వీరికి జీతభత్యాలు కూడా అంతేస్థాయిలో ఉంటాయి. విదేశాల్లో ఈ నిపుణులకు మరింత గిరాకీ ఉంది!

మెరైన్‌ ఆర్కియాలజిస్ట్‌: మునిగిపోయిన ఓడలు, ఎయిర్‌క్రాఫ్టులు, ఇతర ముఖ్య సమాచారం వెతికే వీరు... సముద్ర గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలను వెలికితీసే అన్వేషకులు! ఆర్కియాలజీ పూర్తిచేసి ఉండి, పాడి ప్రో లేదా ఇతర సంస్థల్లో ఉన్నతస్థాయిలో డైవింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం. అభ్యర్థికి మెరైన్‌ సైన్స్‌పై కనీస అవగాహన తప్పనిసరి.

భారత నౌకాదళంలోనూ ‘డైవింగ్‌ ఆఫీసర్‌’గా చేరొచ్చు.

డైవర్స్‌ 45 ఏళ్ల తర్వాత కెరియర్‌లో కొనసాగడం అంత సులువు కాదు. అందుకే ఇరవైల్లో ఉన్నవారే దీని గురించి ఆలోచించడం మంచిదని నిపుణుల సూచన.

ఇందులో అమ్మాయిలు తక్కువైనా ఇటీవలి కాలంలో వారి సంఖ్య కాస్త పెరిగింది. మొత్తం డైవర్స్‌లో దాదాపు 10 శాతం మంది అమ్మాయిలు ఉన్నారు.

డైవర్‌ అవ్వాలంటే అభ్యర్థికి కనీసం 18 ఏళ్ల వయసుండాలి. 10వ తరగతి, తత్సమాన అర్హత అవసరం. ప్రత్యేక విభాగాల్లో పనిచేసేవారికి ఆయా అర్హతలు ఉండాలి.

ఈత నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకం. పూర్తి ఆరోగ్యవంతులై శారీరక దృఢత్వంతో ఉండాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ బాగా చదవాలంటే సరిగా తినాలి!

‣ ఆర్కిటెక్చర్‌లో... ప్రవేశాలకు నాటా

‣ పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

‣ ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌