• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

ఫార్మసీలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలనే ఆశయం ఉన్నవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్‌ జేఈఈ. ఇందులో సాధించిన స్కోరుతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. ఇవి ఫార్మసీ చదువులకు దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలు. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లు ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే కోర్సు చివరలో ప్రాంగణ నియామకాల ద్వారా బహుళజాతి ఔషధ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపర్‌ జేఈఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు..

మన దేశంలో నైపర్లను అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలీ, మొహాలిల్లో నెలకొల్పారు. ఇంజినీరింగ్‌కు ఐఐటీల మాదిరి ఫార్మసీలో మేటి చదువులకు నైపర్లు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇక్కడ చాలా స్పెషలైజేషన్లతో ఎంఫార్మసీతోపాటు ఎంబీఏ ఫార్మా కోర్సు అందుబాటులో ఉంది. అలాగే ఫార్మా రంగంలో పీహెచ్‌డీ సైతం నైపర్లలో పూర్తి చేసుకోవచ్చు. 

ఉన్నత బోధన ప్రమాణాలు, ఆధునిక ప్రయోగశాలలు, వసతులు ఈ సంస్థల ప్రత్యేకత. ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు ఫార్మాకు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లోనూ రాణించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. నైపర్లు ప్రపంచంలో పేరొందిన సంస్థలతో కలిసి ఫార్మసీలో బోధన, పరిశోధనను కొనసాగిస్తున్నాయి.    

ఇంటిగ్రేటెడ్‌ పీజీ పీహెచ్‌డీ

నైపర్లు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ పీజీ-పీహెచ్‌డీ కోర్సులను అందించనున్నాయి. ఇందులో మొదటి రెండేళ్లు పీజీ కోసం, తర్వాత నాలుగేళ్లు పీహెచ్‌డీకి కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సులోకి తీసుకుంటారు. మొదటి రెండేళ్లు పీజీ ఫెలోషిప్, తర్వాతి నాలుగేళ్లు పీహెచ్‌డీ ఫెలోషిఫ్‌ అందుతుంది. నైపర్లలో పీజీ కోర్సులో చేరడానికి ఉన్న అర్హతలే ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకీ వర్తిస్తాయి. నైపర్లలో ఫార్మసీ పీజీ కోర్సుల్లో చేరినవారు చదువు పూర్తయినంత వరకు ప్రతి నెలా రూ.12,400 స్టైపెండ్‌ పొందవచ్చు. ఎంబీఏ ఫార్మా కోర్సుకు స్టైపెండ్‌ వర్తించదు. ఈ కోర్సులో చేరిన మెరిట్‌ విద్యార్థులకు ఆయా సంస్థలు ప్రత్యేకంగా స్టైపెండ్‌ చెల్లిస్తున్నాయి. 

కోర్సులు, స్పెషలైజేషన్లు

ఎంఫార్మసీ, ఎంటెక్‌ (ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌) ఎంఎస్‌ ఫార్మసీలో.. బయో టెక్నాలజీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, మెడికల్‌ డివైజ్‌లు, నేచురల్‌ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్‌ ఎనాలిసిస్, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మా స్యూటిక్స్, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్‌ ..తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఫార్మసీలో ఫార్మస్యూటికల్‌ టెక్నాలజీ (ఫార్ములేషన్స్‌), ఫార్మసీ ప్రాక్టీస్‌ స్పెషలైజేషన్లు కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. 

అర్హత: బీఫార్మసీ ఉత్తీర్ణత. అయితే కొన్ని కోర్సులకు బీవీఎస్సీ, ఎంబీబీఎస్, నిర్దేశిత విభాగాల్లో ఎమ్మెస్సీ, బీటెక్‌ పూర్తిచేసుకున్నవారికీ అవకాశం ఉంది. సంబంధిత కోర్సుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం, దివ్యాంగులైతే 50 శాతం ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నైపర్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు జీప్యాట్‌ /గేట్‌ /నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.

పీజీ పరీక్ష ఇలా...

అన్ని పీజీ కోర్సులకు ఒకటే పరీక్ష. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో 200 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావుశాతం మార్కులు తగ్గిస్తారు. ప్రశ్నలను బీఫార్మసీ, సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ సబ్జెక్టుల నుంచి అడుగుతారు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకున్నవారూ పీజీకి నిర్వహించే పరీక్షనే రాయాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి బృందచర్చలు, ముఖాముఖి నిర్వహిస్తారు. అహ్మదాబాద్, హైదరాబాద్, ఎస్‌ఎఎస్‌ నగర్‌ (మొహాలీ) క్యాంపస్‌ల్లోనే ఈ కోర్సు ఉంది. బీఫార్మసీ పుస్తకాల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. జీప్యాట్, నైపర్‌ జేఈఈ పాత ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా పరీక్షలో ఎక్కువ మార్కులు పొందవచ్చు. 

పీహెచ్‌డీ పరీక్ష

ఎంఎస్‌ ఫార్మ్‌/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌ ఫార్మ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో 170 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 85 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా సమాధానం గుర్తిస్తే పావుశాతం మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అర్హత సాధించినవారికి 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 3 వరకు

పరీక్ష తేదీ: జూన్‌ 12  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ. 

వెబ్‌సైట్‌: http://www.niperhyd.ac.in/index.html

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇగ్నోలో.. బీ.ఎడ్, నర్సింగ్‌ కోర్సులు

‣ యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

‣ చరిత్రపై ఎన్ని అపోహలో!

‣ భగ్గుమంటున్న ధరల ముప్పు

‣ తెల్లబంగారానికి యంత్ర సొబగు

‣ వినయం... విధేయం నేర్చుకుంటే విజయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-04-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌