• facebook
  • whatsapp
  • telegram

తెల్లబంగారానికి యంత్ర సొబగు

ఆధునిక పద్ధతుల్లో పత్తి సాగు

ఇండియా వ్యవసాయ రంగంలో పత్తి కీలకమైన వాణిజ్య పంట. పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో పత్తి కీలక పాత్ర పోషిస్తోంది. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన ముడిసరకులో దాదాపు 75శాతం దీన్నుంచే అందుతుంది. అయిదు దశాబ్దాల క్రితందాకా మనదేశం పత్తిని దిగుమతి చేసుకునేది. ఆ తరవాత హైబ్రీడ్‌ విత్తనాల రాకతో ఉత్పాదకత, ఉత్పత్తి పెరిగాయి. ఫలితంగా 1947-48లో హెక్టారుకు 132 కిలోలు (విత్తనాలు తీసిన పత్తి) ఉన్న ఉత్పాదకత 2013-14నాటికి 566 కిలోలకు చేరుకుంది. అదే కాలంలో ఉత్పత్తి 33.36 లక్షల బేళ్ల(బేలు అంటే 170 కిలోలు) నుంచి 3.98 కోట్ల బేళ్లకు పెరిగింది. ఉత్పాదకతలో మాత్రం ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌ వెనకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా హెక్టారుకు పత్తి సగటు దిగుబడి 759 కిలోలు. 2021లో అత్యధికంగా ఆస్ట్రేలియా 1923 కిలోలు, చైనా 1879 కిలోలు, బ్రెజిల్‌ 1796 కిలోల ఉత్పాదకతతో తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం అంచనా వేసింది. ఇందులో భారత్‌ స్థానం 34 (492 కిలోలు).

పెట్టుబడి భారం

భారత్‌లో గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పత్తిని ఎక్కువగా సాగుచేస్తారు. గుజరాత్‌లో ఏటా 95 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోంది. అది దేశంమొత్తం ఉత్పత్తిలో 30శాతం. పత్తి ఉత్పత్తి, వినియోగంపై కమిటీ సమావేశం (సీఓసీపీసీ) అంచనాల ప్రకారం 2020-21లో భారత్‌లో హెక్టారుకు పత్తి సగటు ఉత్పాదకత 451 కిలోలు (విత్తనాలు తీసిన పత్తి). 2021-22 అంచనాల ప్రకారం అది 469 కిలోలు. ఇదే కాలానికి పంజాబ్‌ 652 కిలోలు (విత్తనాలు తీసిన పత్తి), రాజస్థాన్‌ 548 కిలోలు, గుజరాత్‌ 642 కిలోలు, మహారాష్ట్ర 306 కిలోలు, తెలంగాణ 546 కిలోలు, ఆంధ్రప్రదేశ్‌ 515 కిలోల ఉత్పాదకత కలిగి ఉన్నాయి. భారత్‌లో పత్తి సాగయ్యే భూముల్లో 65శాతం వర్షాధారమైనవి. వర్షపాతంలో హెచ్చుతగ్గులు పంట దిగుబడులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంటపై చీడపీడల ఉద్ధృతీ అధికమైంది. ఫలితంగా పత్తి సాగు తగ్గిపోతోంది. సీఓసీపీసీ అంచనాల ప్రకారం భారత్‌లో 2020-21లో 1.32 కోట్ల హెక్టార్లలో పత్తి సాగైంది. 2021-22లో అది 1.23 కోట్ల హెక్టార్లకే పరిమితమైంది.

పత్తి సాగుకు నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. భారత్‌లో ఇతర భూముల్లోనూ పత్తిని సాగుచేస్తున్నారు. మెట్టభూముల్లో పత్తి ప్రధానపంటగా మారిపోయింది. గత నాలుగైదేళ్లుగా పత్తిపై చీడపీడల ప్రభావం అధికంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో గులాబీ పురుగు పత్తిని తీవ్రంగా నష్టపరుస్తోంది. దాని నివారణకు రైతులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటంలేదు. ఇండియాలో సాగయ్యే పంటలో 95శాతం బీటీ విత్తనాలే. అవి మార్కెట్లోకి వచ్చిన తొలినాళ్లలో కొన్ని రకాల తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొన్నాయి. ఫలితంగా దిగుబడులు పెరిగాయి. పోనుపోను బీటీ రకానికీ తెగుళ్ల బెడద పెరుగుతోంది. దాంతో పురుగు మందులు అధికంగా పిచికారీ చేయాల్సి రావడంతో పెట్టుబడి అధికమవుతోంది. మరోవైపు దిగుబడులు తగ్గి రైతులకు నష్టాలు తప్పడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌

ప్రపంచవ్యాప్తంగా పత్తికి, నూలు వస్త్రాలకు డిమాండ్‌ చాలా అధికంగా ఉంది. పత్తి విత్తనాలనుంచి వచ్చే నూనెను వివిధ అవసరాలకు వాడతారు. నూనె తీసిన తరువాత వచ్చే వ్యర్థాలను పంటలకు ఎరువుగా వాడుకోవచ్చు. భారత్‌ మొత్తం వస్త్రాల ఎగుమతిలో నూలు దుస్తుల వాటా 23శాతం. కొన్ని సందర్భాల్లో విదేశాల్లో చౌకగా పత్తి లభ్యం కావడం, నాణ్యమైన పత్తికి మన దగ్గర డిమాండ్‌ అధికంగా ఉండటంతో భారత్‌ ఇతర దేశాలనుంచీ దిగుమతి చేసుకుంటోంది. 2020-21లో ఇండియా 11 లక్షల బేళ్లను దిగుమతి చేసుకుంది. దాని విలువ దాదాపు 3482.72 కోట్లు. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక పత్తి ఉత్పాదకత ఉన్న మొదటి మూడు దేశాల్లో ఇండియాను నిలపాలనే పాలకుల సంకల్పం నెరవేరాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవాలి. భారత్‌లో పత్తి రైతులకు మంచి లాభాలు దక్కాలంటే ఉత్పాదకత గణనీయంగా పెరగాలి. పెట్టుబడి వ్యయం తగ్గింపు గురించి ఆలోచించాలి. సాగులో యాంత్రీకరణ పూర్తి స్థాయిలో చోటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో అధిక ఉత్పాదకతకు యాంత్రీకరణ ఒక ముఖ్యమైన కారణం. విత్తనం వేసే దగ్గరినుంచి పంట తీసేదాకా యంత్రాల ద్వారానే జరుగుతుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలూ ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. భారత్‌లోనూ అలాంటి విత్తనాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తేవాలి. అందుకోసం ప్రభుత్వం బహుళజాతి, దేశీయ విత్తన కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది.  

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వినయం... విధేయం నేర్చుకుంటే విజయం!

‣ అర్థం చేసుకుంటూ.. అవగాహన పెంచుకుంటూ!

‣ నిట్‌ల్లో ఎంసీఏకి నిమ్‌సెట్‌!

‣ ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఏంతో మేలు!

‣ ఎంసెట్‌ పై సందేహాలకు సమాధానాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం