• facebook
  • whatsapp
  • telegram

భగ్గుమంటున్న ధరల ముప్పు

ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రమాదం అంచున పేద దేశాలు

ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినప్పుడు... కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ, నెల రోజులు గడచినా రష్యా పైచేయి సాధించలేకపోయింది. యుద్ధం మరో నెల రోజుల పాటు కొనసాగి రష్యన్‌ సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తే- ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడానికి అఫ్గానిస్థాన్‌ కారణమైనట్లే, ఈసారి రష్యా పతనానికి ఉక్రెయిన్‌ హేతువు అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోననే భయాలూ వ్యక్తమవుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం మాటేమో కానీ- కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం కచ్చితంగా మొదలవుతుందని నిపుణులు విస్పష్టంగా చెబుతున్నారు. గతంలో అమెరికా, సోవియట్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఈసారి అమెరికా-నాటో కూటమికి, చైనా-రష్యా కూటమికి మధ్య తెరచాటు పోరు చోటుచేసుకొంది.

దాడి చేస్తున్న ద్రవ్యోల్బణం

యుద్ధంవల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాలపాటు తీవ్ర ఒడుదొడుకులకు లోనుకానుంది. ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందని అంతర్జాతీయ ముడి సరకుల వ్యాపారంలో 70శాతాన్ని నిర్వహించే సంస్థలు నమ్ముతున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్యలు విధించిన ఆర్థిక ఆంక్షలు చాలా తీవ్రమైనవి కావడమే దీనికి కారణం. గతంలో ఆంక్షలు ఏదో కొన్ని రంగాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇంధనం, ఆహారం, బ్యాంకింగ్‌, సరఫరా గొలుసులు, పారిశ్రామికోత్పత్తి, అంతర్జాతీయ రవాణా, చెల్లింపులు- ఇలా అనేక రంగాలపై ఆంక్షల ప్రభావం పడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లోని 164 సభ్య దేశాలు ఆంక్షలు విధించడం రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ జీడీపీలో 58శాతం ఈ దేశాల నుంచే వస్తోంది. 27 దేశాల సభ్యత్వం కలిగిన ఐరోపా సమాఖ్య (ఈయూ) రష్యాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2020లో 37శాతం రష్యా వాణిజ్యం ఈయూతోనే జరిగింది. ఆంక్షలతో ఈ వ్యాపారం దెబ్బతిన్నది. ప్రపంచ మార్కెట్‌కు గోధుమ, ఇతర ఆహార ధాన్యాల సరఫరా ప్రధానంగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచే జరుగుతోంది. యుద్ధం వల్ల గోధుమల ఎగుమతులు దెబ్బతినడంతో అనేక దేశాల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతోంది. చమురు, ఆహారం, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో అన్ని దేశాలనూ ద్రవ్యోల్బణం చుట్టుముడుతోంది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను నెరవేర్చలేకపోవడంతో అంతర్జాతీయ వ్యాపారం అతలాకుతలమవుతోంది. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి పెద్దయెత్తున నిధులు అవసరం. శరణార్థి వలసలు పొరుగుదేశాలపైన, ఐక్యరాజ్యసమితి మీద తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి. శరణార్థులు ఉక్రెయిన్‌కు తిరిగివెళ్ళాక వారి పునరావాసానికి సైతం భారీగా ధనం అవసరమవుతుంది.

రష్యన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ మార్కెట్‌లో చమురు, గ్యాస్‌ సరఫరాలను దెబ్బతీయడమే కాకుండా- ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఎగుమతులను పూర్తిగా నిషేధిస్తే రోజుకు 25 నుంచి 30 లక్షల పీపాల చమురు సరఫరా కోసుకుపోతుంది. ఈ కొరతను భర్తీ చేసే అవకాశం ఇప్పట్లో లేదు. ఒకవేళ ఇరాన్‌ మీద ఆంక్షలు ఎత్తివేసినా, అక్కడి నుంచి రోజుకు పది లక్షల పీపాల చమురు మాత్రమే వస్తుంది. ఇది అంతర్జాతీయ చమురు సరఫరా లోటును భర్తీ చేయలేదు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నా అందుకు కనీసం ఏడాది పడుతుంది. ఐరోపా దేశాలకు ప్రధాన చమురు, గ్యాస్‌ సరఫరాదారు రష్యాయే. అక్కడి నుంచి డీజిల్‌ ఎగుమతులు నిలిచిపోవడం ఐరోపా రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతర్జాతీయంగా ఆహార ధరలు గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌, రష్యన్‌ గోధుమల ఎగుమతులు దెబ్బతినడం వల్ల ఏర్పడిన లోటును ఆస్ట్రేలియా, భారత్‌లతో పాటు కొంతవరకు ఐరోపా దేశాలు భర్తీచేస్తున్నా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయిన అమెరికాలో అనావృష్టి ఏర్పడినందువల్ల అక్కడి నుంచి పెద్దగా సరఫరాలను ఆశించలేం. గోధుమల కొరతవల్ల ఈజిప్ట్‌, టర్కీ, సిరియా, ఆఫ్రికాలలో రొట్టెల ధరలు పెరిగిపోయాయి. వాటి సరఫరా కూడా దెబ్బతిన్నది. ప్రపంచమంతటా 12.5 కోట్లమంది పేదల ఆకలి తీర్చే ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమ సంస్థకు ఉక్రెయిన్‌ నుంచి సరఫరాలు నిలిచిపోయాయి. ఈ సంస్థ కొనుగోలు చేసే ఆహారధాన్యాల్లో సగం ఉక్రెయిన్‌ నుంచే వస్తాయి. ఆంక్షల వల్ల రష్యా నుంచీ గోధుమల ఎగుమతి పడిపోయింది. ఫలితంగా అన్ని దేశాల్లో ఆహార ధరలు మండిపోవడం ఖాయం.

భారత్‌ మాటేమిటి?

రష్యా, చైనాల బంధం బలపడటం వ్యూహపరంగా భారత్‌కు ఆందోళనకరమే. భారత్‌ ఇప్పటికీ 46శాతం ఆయుధాలను రష్యా నుంచే దిగుమతి చేసుకొంటోంది. అమెరికా, ఐరోపాలు విధించిన ఆంక్షలవల్ల రష్యా వ్యాపారపరంగా చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. ఇది కూడా దీర్ఘకాలంలో భారత్‌పై ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. చమురు, ఎరువుల ధరలు పెరగడం భారత్‌లో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. గోధుమ ఎగుమతులు పెరగడం ఉత్తర, మధ్య భారతాల్లోని రైతులకు మేలు చేయనుంది. ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ప్రపంచ మార్కెట్‌కు గోధుమ ఎగుమతులు నిలిచిపోవడం దీనికి కారణం. గత పది నెలల్లోనే భారతీయ గోధుమ ఎగుమతులు 13.8 లక్షల టన్నుల నుంచి 60 లక్షల టన్నులకు పెరిగాయి. ఈజిప్ట్‌కు మరింతగా ఎగుమతులు పెంచడానికి చర్చలు జరుగుతున్నాయి

ఆంక్షలతో ఐరోపాకు నష్టం

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో రష్యాపై విధించిన ఆంక్షలు ఐరోపాకే నష్టదాయకంగా పరిణమిస్తాయి. అమెరికన్‌ బ్యాంకులకన్నా ఐరోపా బ్యాంకులకే రష్యాతో లావాదేవీలు ఎక్కువ కావడం ఇందుకు కారణం. ఐరోపాలో నాలుగు అతిపెద్ద బ్యాంకులు రష్యన్‌ ప్రభుత్వం, రష్యన్‌ సంపన్నులతో నెరపే ఆర్థిక కార్యకలాపాల విలువ 7,000 కోట్ల డాలర్లని అంచనా. చైనా నుంచి రష్యా మీదుగా ఐరోపాకు నిర్మించిన 6,000 మైళ్ల రైలు మార్గం ద్వారా గతేడాది 14.6 లక్షల కంటైనర్లలో 7,500 కోట్ల డాలర్ల విలువైన సరకులు రవాణా అయ్యాయి. రష్యాపై ఆంక్షల దెబ్బకు ఈ సరకులను ఓడల్లో రవాణా చేయకతప్పదు. ఇది రవాణా వ్యయాన్ని పెంచుతుంది. యుద్ధంవల్ల నల్ల సముద్రంలో 200 రవాణా నౌకలు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. యుద్ధం మూలంగా నౌకా రవాణాకు బీమా వ్యయం పది శాతం పెరిగింది. దాన్ని కొనుగోలుదారులే భరించకతప్పదు. ఏతావతా ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు మరి రెండుమూడేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని, వృద్ధిరేటు క్షీణతను చవిచూడకతప్పదు. దీనివల్ల రష్యా, ఉక్రెయిన్‌లే కాకుండా 25 పేద దేశాలు కూడా ఆర్థికంగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఇలా సాధించాడు!

‣ చదువుకునే చోటు ఎలా ఉండాలి?

‣ ఎప్పటి పాఠాలు అప్పుడే చదవాలి!

‣ భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం