• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాట తీరు ఎలా ఉండాలి?  


 

కొంతమందికి ఎప్పుడు ఎలా  మాట్లాడాలో తెలియదు. తరగతిలో సరదాగా ఎవరైనా ఆట పట్టించినా వెంటనే గొడవకు దిగుతుంటారు. సంతోషంగా ఉండాల్సిన సమయాల్లోనూ ప్రతికూలంగా స్పందిస్తుంటారు. తమ మాటలతో అప్పటివరకూ సంతోషంగా ఉన్న వాతావరణాన్నీ సీరియస్‌గా మార్చేస్తుంటారు. 


ఇంజినీరింగ్‌ చదువుతోన్న రిషీతో పరిచయం పెంచుకోవడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. కారణం.. అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తాడుగానీ.. దానికి ముందు కొంచెం కూడా ఆలోచించడు. 


పీజీ చేస్తున్న స్నేహ పరిస్థితీ ఇలాగే ఉంటుంది. ఎదుటివారు మర్యాదగా పలకరించినా.. ఆమె ఎప్పుడూ ప్రతికూలంగానే సమాధానాలు చెబుతుంటుంది. పైగా కావాలనే అందరూ తనను దూరం పెడుతున్నారని బాధపడుతుంటుంది. అసలు ఎప్పుడెలా మాట్లాడాలో తెలుసుకుంటే తరగతిలోనే కాదు, బయటా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అందుకోసం ఏం చేయాలో చూద్దామా... 

నిజానికి మన ఆలోచనా విధానం, ప్రవర్తన ఎలా ఉంటాయనేది మాటల ద్వారానే తెలుస్తుంది. అందుకే వీలైనంత వరకూ జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఇతరులు బాధపడకుండా, అలాగే మనమూ ఇబ్బందిపడకుండా అభిప్రాయాలను తెలియజేయగలగాలి. 

‘మాటలే కదా.. ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుందిలే’ అనుకోవడానికి లేదు. మనం అనుకునేదాని కంటే వీటిల్లో చాలా శక్తి ఉంటుంది. పదునైన మాటలు ఎదుటివారి మనసును గాయపరచడమే కాదు.. వారి ఆత్మ గౌరవాన్నీ, విశ్వాసాన్నీ దెబ్బతీయగలవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

రోజూ మన చుట్టూ ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో అన్నీ సంతోషాన్ని పంచేవే ఉండవు కదా. నచ్చనివీ ఉండొచ్చు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయడం తప్పుకాదు. కానీ అదే అదునుగా తీసుకుని మాటల తూటాలతో ఇతరుల మనసును ఛిద్రం చేయకూడదు. ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా.. అదే సమయంలో వాళ్ల పొరపాటు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది కాస్త కష్టమేగానీ ఆచరించాలనుకుంటే అసాధ్యమేమీ కాదు. 

భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆవేశంతో కోపంగా మాట్లాడటం. ఆ తర్వాత అలా ఎందుకు చేశానా అని మధనపడే సందర్భాలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అందుకే స్పందించడానికి ముందే కాస్త ఆలోచించగలిగితే ఆ తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపపడాల్సిన అవసరమే ఉండదు. 

‣ సాధారణంగా మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇతర సమాచారం, భావోద్వేగాలను ఇతరులకు తెలియజేయడానికి మాటల సాయం తీసుకుంటాం. ఇవి విషయాన్ని స్పష్టపరిచేలా ఉండాలిగానీ అగౌరవపరిచేలా, కించ పరిచేలా ఉండకూడదు. 

ఎవరైనా కావాలని రెచ్చగొట్టినట్టు అనిపిస్తే.. వెంటనే రెట్టింపు ఆవేశంతో జవాబు చెబుతాం. దీనికి ముందు ఒక్కసారి కాస్త ఆలోచించాలి. వాళ్లు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారా? లేదా మనమే పొరబడుతున్నామా? ముందుగా తెలుసుకోవాలి.

కొన్నిసార్లు మన మాటలు ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు... అనుబంధం మీదా ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు మనకు కష్టంగా అనిపించే సబ్జెక్టులోని మెలకువలను స్నేహితుల నుంచి తెలుసుకుని ఉండొచ్చు. ఆవేశంతో మాట్లాడటం వల్ల ఇలాంటి సహకారం భవిష్యత్తులో దొరక్కపోవచ్చు కూడా. ఇలాంటి ప్రతికూల ఫలితాలకూ అవకాశం లేకపోలేదు. 

చక్కగా మాట్లాడుతూ, నలుగురితో కలిసిపోతూ అందరికీ ఆత్మబంధువులా ఉండాలా.. మాటలతో అందరినీ చిరాకుపెడుతూ ‘వీళ్లు మహా బోరింగ్‌’ అనుకునేలా ఉండాలా? అనేది మన చేతుల్లోనే ఉంటుంది. 

‣ ఆలోచించి మాట్లాడే నైపుణ్యం విద్యార్థులూ, ఉద్యోగార్థులూ, ఉద్యోగులూ అనే తేడా లేకుండా అందరికీ అవసరమే. అలాగే జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఈ నేర్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

చేతిలోంచి పుస్తకం లేదా ఏదైనా వస్తువు జారి కిందపడితే వెంటనే జాగ్రత్తగా తీసుకోవచ్చు. పొరపాటున జారిపడబోయినా దేని సాయంతోనైనా లేచి నిలబడవచ్చు. కానీ మాట జారితే మాత్రం వెనక్కు తీసుకోలేం. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందే ఆలోచించాలి. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Posted Date : 11-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం