• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కాస్త బద్ధకం నేర్చుకోండి...

‘అదేంటి బద్ధకం నేర్చుకోమనడం, విడ్డూరం కాకపోతేనూ’ అని ఆశ్చర్యపోకండి. ‘బీ ఏ లేజీఎస్ట్‌ పర్సన్‌ టు సాల్వ్‌ ఏ ప్రాబ్లం’ అనేది పోటీ  పరీక్షల్లో పాటించే సూత్రం. అంటే మనం బద్ధకంతో ఎంత త్వరగా పనైపోవాలని తాపత్రయపడతామో అంత త్వరగా ప్రశ్నకు జవాబు ఇచ్చేయగలం అన్నది దీని పరమార్థం. అన్నిరకాల పోటీ పరీక్షల్లోనూ విజయానికి తోడ్పడే మరిన్ని సూచనలు ఇవిగో...

1. మనం రాస్తున్న పరీక్షలో టాప్‌ 10 పర్సంట్‌లో ఉంటేనే నెగ్గుకురాగలం. ఒకస్థాయి వరకూ అందరూ ఒకేలా జవాబులు ఇస్తారు. కానీ అది దాటాకే ఎవరు ఉంటారు, ఎవరు ఉండరన్నది తెలిసిపోతుంది. అందువల్ల సమయాన్ని వీలైనంత సమర్థంగా వాడుకోవాలి. దీనికి షార్ట్‌కట్స్‌ చాలా అవసరం. టేబుల్స్, స్వ్కేర్స్, క్యూబ్స్, లెటర్‌ నంబరింగ్‌ అన్నీ గుర్తుండాలి. రోజువారీ జీవితంలోనూ కాలిక్యులేటర్‌ వాడకం తగ్గించాలి. ప్రతి ప్రశ్నకీ వీలైనంత త్వరగా సమాధానాన్ని గుర్తించేలా సిద్ధమవ్వాలి. 

2. పరీక్ష అనగానే అన్ని ప్రశ్నలకూ జవాబులు ఇవ్వాలని అనుకోకూడదు. ప్రతి అభ్యర్థికీ తెలియని భాగం కొంత ఉంటుంది. దాన్ని టచ్‌ చేయాలని ప్రయత్నించడం వల్ల నెగిటివ్‌ మార్కులు ఉంటే వాటి బారిన పడే ప్రమాదం ఉంది. పోటీ పరీక్షల్లో ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ విధానం పనికిరాదు. సరిగ్గా వచ్చిన వాటికి మాత్రమే జవాబులు ఇవ్వాలి. ఇంగ్లిష్‌ పేపర్లలో అయితే పారాగ్రాఫ్‌ ప్రశ్నలు చదివే సమయం లేనప్పుడు పైపైన చదివి జవాబులు రాయడం వంటివి చేయకూడదు.

3. ఏ పరీక్షకైనా ఎన్ని నమూనా ప్రశ్నపత్రాలు రాస్తే అంత మంచిది. ముందు ఒక పేపర్‌ మొత్తం ఎంత సమయంలో చేయగలుగుతున్నాం అన్నది చూడాలి. అదే పేపర్‌ను నిర్ణీత సమయంలో ఎంత వరకూ సాల్వ్‌ చేశాం అనేదీ చూడాలి. ఒక పేపర్‌ను మళ్లీ మళ్లీ ఆన్సర్‌ చేయడం వల్ల ఆ ప్రశ్నలకు మనం జవాబు కనుక్కునే సమయం తగ్గుతుంది. అసలైన పరీక్షలో ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. 

4. పరీక్షను బట్టి సెక్షనల్‌ కటాఫ్స్‌ ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా సిద్ధం కావాల్సి ఉంటుంది. ముందే వివరంగా తెలుసుకోవాలి. 

5. ఈమధ్యకాలంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా ఇంటిగ్రేషన్‌ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సమయాన్ని బట్టి ఏది ఎంతమేరకు చదువుకోవాలనే విషయాన్ని అభ్యర్థులు అర్థం చేసుకోగలగాలి.

6. తెలుగులో లేని పరీక్షలకు ఇంగ్లిష్‌లోనే జవాబులు రాసేలా విద్యార్థులు సన్నద్ధమవ్వాలి. ఒకేలాంటి ప్రశ్నలు బోలెడు చేయడం వల్ల పరీక్షలో ఆ ప్రశ్న వెంటనే అర్థమవుతుంది. 

7. అందరికీ ఒకేలాంటి టైమ్‌ టేబుల్‌ పనికిరాదు. ఎవరి సమర్థతనుబట్టి వారే తమ టైమ్‌ టేబుల్‌ నిర్ణయించుకోవాలి. 

8. ఏ సబ్జెక్టుకైనా కనీసం మూడు పబ్లికేషన్ల పుస్తకాలను రిఫర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రామాణికమైన వాటిని ఎంచుకోకపోతే అందులో తప్పులుండే ప్రమాదం ఉంటుంది. సీనియర్ల సలహాలతో సరైనవాటినే ఎంపిక చేసుకోవాలి. 

9. ఆన్‌లైన్‌ పరీక్ష అయితే ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ పరీక్ష అయితే ఆఫ్‌లైన్‌లోనూ సాధన చేయాలి. ఒకదానికి మరోలా ప్రిపేర్‌ అవ్వకూడదు. 

10. ఒత్తిడే అన్నిటికంటే పెద్ద పరీక్ష. అందుకే ఎగ్జామ్‌ స్ట్రెస్‌ తీసుకోకూడదు. అప్పుడే తప్పులు చేయకుండా ఉంటాం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చదువుకూ.. వ్యాయామం అవసరమే!

‣ ఆడుకుంటూ... నేర్చుకుంటూ!

‣ నాయకత్వ లక్షణాలకు పదునుపెట్టేలా..

‣ మెటా.. ఇక దీనిదే ఆట

‣ గణిత బోధనలో ఘనమైన సంస్థ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-03-2022 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం