• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

మెచ్చిన కోర్సులో ప్రవేశం 

మెరుగైన ఉపాధి అవకాశాలు

ఉన్నత విద్యారంగంలో నూతన విధానం అమల్లోకి వచ్చింది! ఏక కాలంలో రెండు పూర్తిస్థాయి డిగ్రీ కోర్సులు చేయడానికి యూజీసీ అనుమతించింది. విద్యార్థులు బహుళ సబ్జెక్టుల పరిజ్ఞానం, నైపుణ్యాలు సంపాదించేందుకు ఈ కొత్త మార్పు వీలు కల్పిస్తుందనేది దీన్ని ప్రవేశపెట్టడం వెనకున్న లక్ష్యం. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలంటే ఏ అంశాలు గమనించాలి? ఎలా ముందడుగు వేయాలి? 

‘‘మా అబ్బాయి బీఈడీ చేస్తూనే ఎంఏ చదివాడు. ఇప్పుడు రెండు డిగ్రీలనూ పరిగణనలోకి తీసుకొంటారా?’’

‘‘మా తమ్ముడు బీటెక్‌ చదువుతూనే ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చేశాడు. ఇలా చదివిన రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా?’’

‘‘మా అమ్మాయి బీఎస్‌సీ నర్సింగ్‌తో పాటు బీఏ సైకాలజీ కూడా చదివింది. ఇదేమైనా నేరమవుతుందా?’’

‘‘నేను ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తూ బీఏ, బీఈడీలు ఒకేసారి చేశాను. స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌కి నేను అర్హుణ్ణేనా?’’

బోధన, అభ్యసన పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు రావలసిన ఆవశ్యకతను జాతీయ విద్యావిధానం- 2020 విపులంగా చర్చించింది. ఉన్నత విద్యారంగంలో అమలుచేయాల్సిన వివిధ సంస్కరణలను సూచించింది. వీటిలో ముఖ్యమైనవి- మల్టీ డిసిప్ల్లినరీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యను బలోపేతం చేయటం, ఆన్‌లైన్, సార్వత్రిక దూరవిద్యకు ప్రోత్సాహం కల్పించటం, 21వ శతాబ్దానికి కావాల్సిన సామర్థ్యాలను పెంచుకొనేందుకు విద్యార్థులు ఒకటి, అంతకంటే ఎక్కువ ప్రత్యేక విషయాలను లోతుగా అధ్యయనం చేసేందుకు వీలు కల్పించటం. ఈ సంస్కరణలను అమల్లోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఏక కాలంలో రెండు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లను చేయడానికి వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు వెలువడ్డాయి.  

జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన కింది ఉద్దేశాలను నెరవేర్చడం కోసం ఈ వెసులుబాటును కల్పించారు. అవేమిటంటే- 

కళలు- విజ్ఞాన శాస్త్రాల మధ్య, పాఠ్యాంశాలు- పాఠ్యేతర కార్యకలాపాల మధ్య, వృత్తివిద్య- సాధారణ విద్యల మధ్య ఉన్న బలమైన గోడలను తొలగించడం. 

జ్ఞానాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, కళలు, మానవీయ శాస్త్రాలు, భాషలు, ప్రొఫెషనల్, టెక్నికల్, వొకేషనల్‌ సబ్జెక్ట్‌లు, క్రీడలను కలిపి మల్టీ డిసిప్ల్లినరీ, సంపూర్ణ విద్యా వ్యవస్థను నిర్మించడం.

కొద్ది సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలే చాలామందిని వేధిస్తూ వచ్చాయి. వీటన్నింటి సారాంశం- ఒకే సమయంలో పొందిన రెండు డిగ్రీలు చెల్లుబాటు అవుతాయా? అని. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతూ ఇటీవల యూజీసీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. 

సవాళ్ళు కూడా...

ఒకే సమయంలో చేసిన రెండు అకడమిక్‌ ప్రోగ్రాములను గుర్తించడం వల్ల పైన పేర్కొన్న ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అకడమిక్‌ ప్రోగ్రాములను ప్రత్యక్ష పద్ధ్దతిలో చదవడం దాదాపు అసాధ్యం అనే చెప్పవచ్చు. రెండో ప్రోగ్రామ్‌ ఎంపికలో సరైన మార్గదర్శకత్వం లేకపోతే రెండు ప్రోగ్రాములూ నిరుపయోగమయ్యే అవకాశం ఉంది. 

ఏక కాలంలో రెండు ప్రోగ్రాములను చదివించడం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం. 

పట్టణ ప్రాంతాల్లో చదువుకొనేవారికి రెండు ప్రోగ్రాములను ఏకకాలంలో చదవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దీంతో పట్టణ ప్రాంత విద్యార్థుల ఉద్యోగావకాశాలు, గ్రామీణ ప్రాంత విద్యార్ధుల కంటే మెరుగైన స్థితిలో ఉండే అవకాశం ఉంది. 

ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులు... నిరుపేద కుటుంబాల విద్యార్థుల మధ్య విద్య, ఉపాధి అవకాశాలు పొందటంలో అంతరాలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. 

ఒక అకడమిక్‌ ప్రోగ్రామునే సరిగా చదవలేని విద్యార్థులు అవకాశం ఉందని రెండో అకడమిక్‌ ప్రోగ్రాములో చేరి రెండింటినీ పూర్తిచేయలేకపోవచ్చు. 

ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్న కొంతమంది విద్యార్ధులు బాగా డిమాండ్‌ ఉన్న రెండు అకడమిక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశం పొందితే ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు అలాంటి కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతారు. 

ఒకే విద్యార్థి రెండు అకడమిక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశం పొంది, ఒకటి మధ్యలో వదిలేస్తే డ్రాప్‌ అవుట్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఏమిటి ఉపయోగాలు? 

ఒకే సమయంలో ఒక రెగ్యులర్‌ కోర్సుతో పాటు మరో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. 

ఒక సంప్రదాయ పీజీ చేస్తూనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంబీఏ/ ఎంసీఏ/ డేటా సైన్స్‌ కోర్సులు చేస్తూ మెరుగైన భవిష్యత్తుకు దారులు వేసుకోవచ్చు.

ఒకే సమయంలో రెండు అకడమిక్‌ ప్రోగ్రాములు చేయడం వల్ల విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

కుటుంబ కారణాలవల్లనో, ఆర్థిక సమస్యల వల్లనో, అవగాహన లేమి వల్లనో ఒక డిగ్రీలో ప్రవేశం పొంది, ఆ కోర్సును ఇష్టపూర్వకంగా చదవలేక, మధ్యలో వదిలివేయలేక చాలామంది అయిష్టంగానే ఆ చదువును కొనసాగిస్తున్నారు. అలాంటివారు మొదటి కోర్సు వదిలేయకుండానే, వారికి నచ్చిన రెండో డిగ్రీ/ డిప్లొమా చేసే అవకాశం వచ్చింది. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ తరువాత రాయబోయే పోటీపరీక్షల్లో వారు డిగ్రీలో చదివిన సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టుల సిలబస్‌ కూడా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వారు డిగ్రీ చదివాక ప్రైవేటు శిక్షణసంస్థల్లో చేరి వేల రూపాయిల డబ్బు ఖర్చు పెట్టాల్సివస్తోంది. ఆ పరిస్థితి మారుతుంది.

ఎంఎస్‌సీ ఫిజిక్స్‌ చదువుతున్న విద్యార్థి ఎంఎస్‌సీ తరువాత సోషియాలజీ సబ్జెక్ట్‌ ఆప్షనల్‌గా సివిల్స్‌ పరీక్ష రాద్దామనుకోవచ్చు. ఇలాంటపుడు ఎంఎస్‌సీ ఫిజిక్స్‌ చదువుతూనే ఎంఏ సోషియాలజీని దూరవిద్య/ ప్రత్యక్ష పద్ధతిలో చదివే అవకాశం ఉంది. ఒకవేళ సివిల్స్‌ పరీక్షలో నెగ్గలేకపోతే ఫిజిక్స్, సోషియాలజీ అర్హత ఉన్న రెండు రకాల ఉద్యోగాలకు/ ఉన్నత విద్యకు ఆ విద్యార్థి అర్హత సాధిస్తాడు. 

బీకాం/ఎంకామ్‌/ బీఏ/ ఎంఏ హిస్టరీ/ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదువుతూనే పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ చదివే అవకాశమూ ఉంటుంది. 

పరిష్కారాలు? 

నాణ్యత లేని, వ్యాపారాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందకుండా ఉండాలి.

రెండో అకడమిక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం తీసుకునేముందు అకడమిక్‌ కౌన్సెలర్‌ సలహాలు తీసుకోవటం ఉత్తమం. 

ధనిక-పేద; పట్టణ- గ్రామీణ విద్యార్థుల విద్య, ఉపాధి అవకాశాల అంతరం తగ్గించడానికి ప్రభుత్వం/ విశ్వవిద్యాలయాలు కఠిన నియమాలను రూపొందించి, అమలయ్యేలా చూడాలి. 

తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న దోస్త్‌ లాంటి కేంద్రీకృత ప్రవేశాల్లో ముందుగా ఒక అకడమిక్‌ ప్రోగ్రామ్‌లోనే ప్రవేశం కల్పించాలి. రెండో అకడమిక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాన్ని మిగులు సీట్లలోనే కల్పించాలి. 

కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు కేంద్రీకృత ఆన్‌లైన్‌ సబ్జెక్ట్‌ కంటెంట్‌ను అభివృద్ధి చేయాలి. 

జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమలైతే పైన పేర్కొన్న సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతాయి. 

యూజీసీ మార్గదర్శకాలు 

1. ఒక విద్యార్థి ఏకకాలంలో రెండు పూర్తిస్థాయి అకడమిక్‌ ప్రోగ్రాములను (పీజీ/డిగ్రీ/డిప్లొమా/సర్టిఫికెట్‌) ప్రత్యక్ష పద్ధ్దతిలో చదవవచ్చు. అయితే- రెండు ప్రోగ్రామ్‌ తరగతుల సమయాలు వేర్వేరుగా ఉండాలి. 

2. రెండు అకడమిక్‌ ప్రోగ్రాముల్లో ఒకటి ప్రత్యక్ష పద్ధతిలో, మరొకటి ఆన్‌లైన్‌/ దూరవిద్య విధానంలో చదువుకోవచ్చు. రెండు అకడమిక్‌ ప్రోగ్రాములను కూడా ఆన్‌లైన్‌/ దూరవిద్య పద్ధతిలో చదువుకోవచ్చు. 

3. యూజీసీ/భారత ప్రభుత్వం/ఇతర చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలనుంచే దూరవిద్య/ ఆన్‌లైన్‌లో అందించే డిగ్రీ/ డిప్లొమా ప్రోగ్రాములను చదువుకోవాలి.

4. ఈ మార్గదర్శకాల ద్వారా పొందే డిగ్రీ/ డిప్లొమా ప్రోగ్రాములన్నిటికీ యూజీసీ/ ప్రొఫెషనల్‌ కౌన్సిల్స్‌/సంబంధిత చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల నియంత్రణ ఉంటుంది.

5. యూజీసీ ప్రకటించిన తేదీ (13 ఏప్రిల్, 2022) నుంచే నూతన మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటి నుంచి చేసిన రెండు డిగ్రీలే చెల్లుబాటవుతాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ బాగా చదవాలంటే సరిగా తినాలి!

‣ ఆర్కిటెక్చర్‌లో... ప్రవేశాలకు నాటా

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌