• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

ప్రపంచస్థాయి ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేసే అవకాశం

ఒక్కసారి ఊహించుకోండి... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థల్లో ఉండే ప్రయోగశాలలు, సౌకర్యాలు మొత్తం విద్యార్థులందరికీ అందుబాటులోకి వస్తే?... అందరూ ఐఐటీ స్థాయి ప్రమాణాలతో ల్యాబ్‌ ఎక్స్‌పెరిమెంట్స్‌ చేయగలిగితే?... విద్యార్థులు నేర్చుకునే తీరు ఎంతో మెరుగవుతుంది, మరింత ఆసక్తిగా ప్రయోగాల్లో మమేకం కాగలరు కదా! అందుకే వర్చువల్‌ ల్యాబ్స్‌ దీన్ని సాధ్యం చేయడానికి పూనుకున్నాయి.

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఇటీవల ఒక సర్వే చేసింది. ‘2025 పూర్తయ్యేనాటికి ఉన్నత విద్యారంగంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు...?’ అని అడిగిన ప్రశ్నకు... దాదాపు 72 శాతానికి పైగా ‘హైబ్రిడ్‌ లెర్నింగ్‌’ బాగా ప్రాచుర్యంలోకి వస్తుందని అనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు. అంటే పూర్తిగా ఆన్‌లైన్‌ కాకుండా, పూర్తిగా ఆఫ్‌లైన్‌ కాకుండా... సందర్భాన్ని బట్టి రెండు విధానాల్లోనూ చదువుకోవడం. ప్రస్తుతం వర్చువల్‌ ల్యాబ్స్‌ చేస్తున్నది అదే!

సొంతంగా అంచనా వేసుకునేలా...

తరగతి గదిలో థియరీగా నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగాలుగా చేస్తారు. అయితే ఈ ప్రయోగశాలలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా కొన్ని ఇబ్బందులున్నాయి. విద్యార్థులు అనుభవపూర్వక విజ్ఞానం (ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌) పొందేలా ఈ ప్రయోగశాలలకు సరైన పరికరాలు, సౌకర్యాలు, మెటీరియల్‌ ఉండటం తక్కువ. ఇంకా వివిధ కారణాలతో కొన్నిచోట్ల ల్యాబ్స్‌ అంటేనే తేలిక వ్యవహారంలా మారిపోయింది. కానీ ఇది విద్యార్థుల అభ్యాసాన్ని దెబ్బతీస్తుంది.

ఇలాంటి కారణాలతో విద్యార్థులు నష్టపోకుండా వారికి ప్రయోగ అనుభవం ఉండాలనే సంకల్పంతో కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టూడెంట్స్‌ తమ ఇళ్లలోనే ఉంటూ ప్రయోగాలు చేసేలా ‘వర్చువల్‌ ల్యాబ్స్‌’ను మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించింది. దీనికోసం ఎటువంటి అదనపు శ్రమా అవసరం లేకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రయోగాలు చేసేలా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇందులో సైన్స్, ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు సంబంధించి 100కు పైగా ల్యాబ్స్‌ ఉన్నాయి. వీటిలో 700కు పైగా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ ఫోన్‌.. ఇలా దేన్నుంచైనా ఈ ప్రయోగాలు చేయవచ్చు. ప్రయోగానికి ముందూ, తర్వాతా క్విజ్‌లు... విద్యార్థి సొంతంగా తనను తాను అంచనా వేసుకునేలా సెల్ఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఆప్షన్లు ఉన్నాయి. ఇదంతా పూర్తిగా ఉచితం. ఐఐటీ దిల్లీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా... దేశంలోని 12 సుప్రసిద్ధ విద్యాసంస్థలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

ఈ ల్యాబ్స్‌లో విద్యార్థులకు ఆసక్తి ఉండాలే గానీ ఏ ప్రయోగం ఎన్నిసార్లయినా చేయవచ్చు. తప్పులుంటే సరిచేసుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. బయట తక్కువగా లభించే పరికరాలు, ప్రమాదకర రసాయనాల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. కానీ వర్చువల్‌గా అలాంటి చింతలేవీ లేకుండా పూర్తిగా సబ్జెక్టు నేర్చుకోవచ్చు. తద్వారా వారి పరిజ్ఞానం, మార్కులు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువులోనూ, సామాజికంగానూ వెనుకబడిన విద్యార్థులకు ఇవి చాలా మేలు చేస్తాయి.

ప్రైవేటుగానూ...

కేవలం ప్రభుత్వపరంగానే కాదు... ప్రైవేటు రంగంలోనూ ఈ ల్యాబ్స్‌ అందుబాటులో ఉన్నాయి. క్లౌడ్‌ బేస్డ్‌గా పనిచేసే ఈ సంస్థలు అధికంగా ఐటీకి సంబంధించిన ల్యాబ్స్‌ను అందిస్తున్నాయి. విద్యార్థులు కొంతకాలం వీటిని ఉచితంగా ఉపయోగించుకుని... మరిన్ని ఫీచర్లు కావాలంటే కొంత రుసుము చెల్లించాలి. విదేశీ విశ్వ విద్యాలయాల సహాయ సహకారాలతో నడుస్తున్న ఈ ల్యాబ్స్‌ అధునాతన ప్రయోగాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.

చేయడం ఎలా?

ప్రభుత్వ వర్చువల్‌ ల్యాబ్‌ను ఉపయోగించడం చాలా తేలిక. నెట్‌లో సెర్చ్‌ చేస్తే వెబ్‌సైట్‌ తెరుచుకుంటుంది. హోమ్‌పేజ్‌లోనే వివిధ సబ్జెక్టులు, వాటికి సంబంధించిన ల్యాబ్స్‌ జాబితా రూపంలో కనిపిస్తాయి. అవసరమైనదాన్ని ఎంచుకుంటే, ప్రయోగం కనిపిస్తుంది. అచ్చం బయట చేసిన ఫార్మాట్‌లోనే మొత్తం ఉంటుంది. థియరీ, ప్రొసీ‡జర్, సిమ్యులేషన్, క్విజ్, అసైన్‌మెంట్‌... ఇలా వరుసగా ఉంటాయి. ప్రొసీజర్‌ ఓపెన్‌ చేస్తే ల్యాబ్‌ ఇంటర్‌ఫేస్‌ కనిపిస్తుంది. ప్రక్రియ మొదలుపెట్టేందుకు తెరపైనే కంట్రోల్స్‌ కనిపిస్తాయి. వాటిని ఆపరేట్‌ చేయడం ద్వారా ప్రయోగాన్ని మనకు కావాల్సినట్లు చేయవచ్చు. వచ్చిన రీడింగ్స్‌ రాసుకునేందుకు అక్కడే ఎక్స్‌పెరిమెంటల్‌ టేబుల్‌ ఉంటుంది. ఆ రీడింగ్స్‌ను కేవలం ఒక్క క్లిక్‌తో గ్రాఫ్‌ రూపంలో చూడవచ్చు. సరిగ్గా రాలేదు అనుకుంటే వాల్యూస్‌ మారుస్తూ మళ్లీ మళ్లీ ప్రయోగం చేయవచ్చు. అంతా పూర్తయ్యాక ఆ ప్రయోగాన్ని ప్రింట్‌ తీసుకునే సౌలభ్యం కూడా ఉంది.

సబ్జెక్టుకు సంబంధించిన ఒక ప్రయోగం... నేర్చుకోవడంలో విద్యార్థిని పూర్తిగా నిమగ్నం చేస్తుంది. తానే సొంతంగా ఒక విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం వల్ల... తరగతి గదిలో విన్న పాఠాలు  మరింత బాగా అర్థమవుతాయి. 

ఇటీవల చేసిన పరిశోధనల్లో హైబ్రిడ్‌ మోడల్‌లో చదువుకుంటున్న విద్యార్థులు అచ్చంగా ఆన్‌లైన్‌ లేదా అచ్చంగా ఆఫ్‌లైన్‌లో చదివిన వారికంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు తేలింది.

ఉన్నత విద్యలో రాబోయే కాలంలో కొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ మెథడ్స్‌ మరింత చొచ్చుకుపోతాయని నమ్మకం. దానికి వర్చువల్‌ ల్యాబ్స్‌ తొలిమెట్టుగా చెప్పవచ్చు. 

ఇప్పటికే మన దేశంలోని చాలా యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంలో వర్చువల్‌ ల్యాబ్స్‌ ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. కొన్ని సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నాయి.

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

Posted Date : 01-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌