• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!

* యువతకు సూచనలు

కొత్త విషయాలు నేర్చుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. సందేహాలు తీర్చుకోవడానికీ సంకోచిస్తారు. రిస్క్‌ తీసుకోవడం గురించి అసలు ఆలోచించరు. జరిగిన దాంట్లో తమ తప్పు లేకపోయినా వ్యతిరేకించరు. ఫలితాలు ప్రతికూలంగా వస్తాయనే అనుమానంతో.. చేస్తోన్న ప్రయత్నాలను మధ్యలోనే ఆపేస్తారు. నిరాశా నిస్పృహలతో ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు. ఈ   లక్షణాలున్నవారు వాటిని గమనించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం సొంతమవుతాయి!   


కొందరు విద్యార్థుల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా. అది తమ వల్లే జరిగిందని బాధపడిపోతుంటారు. ఇతరులతో పోల్చుకుని తామెందుకూ పనికిరామనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు. సహవిద్యార్థులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉండలేరు. చదువు, ఆటపాటలు, ఆరోగ్యం.. ఏ విషయంలోనూ అంతగా ఆసక్తి చూపించరు. ఇవన్నీ ఆత్మగౌరవం (సెల్ఫ్‌ ఎస్టీమ్‌) లేకపోవటం వల్ల వచ్చిపడే ఇబ్బందులు.  


ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే ఉంటాయని కాదు. వీటిలో కొన్నయినా ఉండొచ్చు. విద్యార్థి దశలోనే వీటి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. లేదంటే ఆ తర్వాత ఉద్యోగార్థిగానైనా, ఉద్యోగిగానైనా ఇబ్బందిపడే అవకాశాలే ఎక్కువ. కాబట్టి వీటిని ఎలా అధిమించవచ్చో తెలుసుకుందాం. 


ప్రతికూల ఆలోచనలు ఎప్పుడూ ఆత్మగౌరవానికి ఆటంకంగానే నిలుస్తాయి. మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆలోచించడం వల్ల ఎప్పటికీ ముందడుగు వేయలేం. అందుకే ముందుగా వాటిని గుర్తించి.. వాటి స్థానంలో సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ‘నేను సరిగా చదవడంలేదు’ అని పదేపదే అనుకునేకంటే.. ‘నా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాను. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరింత కృషిచేస్తాను’ అని అనుకోవాలి. ఆ కృషి సాగించాలి.


మనల్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేసుకోకూడదు. చదువుకోవడం, తీసుకునే ఆహారం, వస్త్ర ధారణ.. ఇలా అన్ని విషయాల్లోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. 


కొంతమంది రుచిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాకాకుండా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 


నిత్యం వ్యాయామాలు చేయడం, తగినంత నిద్రపోవడం వల్ల రోజువారీ పనులను చురుగ్గా పూర్తిచేయగలుగుతాం.  


వార్షిక పరీక్షల్లో ఎక్కువ మార్కులు.. ప్రవేశ పరీక్షలో టాప్‌ స్కోరు.. ఇష్టమైన క్రీడలో ప్రతిభకు మెరుగులు.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి. లక్ష్యాలు అనగానే ముందుగానే భారీగా ఊహించుకోవడం మొదలుపెట్టకూడదు. చిన్నవాటితో ప్రారంభించి.. ఆ తర్వాత పెద్ద వాటిని పెట్టుకోవాలి. అలాగే వీటిని సాధించే క్రమంలో ఎన్నో సవాళ్లూ ఎదురవుతాయి. అలాంటప్పుడు ప్రయత్నాలను మధ్యలోనే ఆపేయకూడదు. ఎక్కువమంది ఇక్కడే పొరబడుతుంటారు. చివరివరకూ ఎంతగానో ప్రయత్నించి.. విజయానికి దగ్గరలో ఉన్నారనగా తమ ప్రయత్నాలను విరమిస్తుంటారు. 


సానుకూల దృక్పథం ఉన్నవాళ్లూ, మిమ్మల్ని అర్థంచేసుకుని ప్రోత్సహించేవాళ్లూ మీ చుట్టూ ఉండేలా చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు చేసేవారికీ, అవకాశం దొరికితే చాలు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారికీ వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. 


అనుకున్నది అయ్యేంతవరకూ సహనంతో ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే అది ఫలించినప్పుడు మనల్ని మనం అభినందించుకోవడమూ మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


లేని నైపుణ్యాల గురించి పదేపదే ఆలోచిస్తూ కొంతమంది బాధపడుతుంటారు. వీరు తమలో సహజంగా దాగున్న నైపుణ్యాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోరు. తమకున్న సామర్థ్యాలను గుర్తించడం ఎంతో ముఖ్యం. వాటిని ఒకచోట రాసుకుని.. ఎలా మెరుగులు దిద్దుకోవాలో ఆలోచించాలి. ఏనుగుకు చెట్టెక్కడం రాదు కాబట్టి ఆ జంతువు ఎందుకూ పనికిరాదని అనుకోవడం అవివేకమే కదా? చెట్టును కూడా అవలీలగా పీకి.. అవతలకు విసిరేయగల శక్తి దానికి ఉంటుంది. కాబట్టి ఒక దాంట్లో వెనకబడి ఉంటే.. ఇక దేనికీ పనికిరారని అనుకోవడం సరికాదు. అందరూ అన్ని విషయాల్లోనూ ముందు వరుసలోనే ఉండరు, ఉండలేరు కూడా. ఎవరికి వారు తమలోని లోటుపాట్లను గుర్తించి వాటికి మెరుగులు దిద్దుకోవడంలోనే నిజమైన సామర్థ్యం దాగి ఉంటుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాక్‌ మార్కెట్‌లో చక్కని కెరియర్‌!

‣ చలికాలంలో పరీక్షల సన్నద్ధత!

‣ సైనిక కొలువుకు సులువు దారి!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Posted Date : 16-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.