• facebook
  • whatsapp
  • telegram

స్టాక్‌ మార్కెట్‌లో చక్కని కెరియర్‌!

వివిధ విభాగాల్లో ఉద్యోగావకాశాలు



స్టాక్‌ మార్కెట్‌.. ఆర్థిక రంగంపై ఆసక్తి ఉన్న వారికి దీని గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే  పెట్టుబడులు, లాభనష్టాలు మాత్రమే కాదు, ఇందులో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అవకాశం కల్పిస్తూ కొన్ని ఉద్యోగాలున్నాయి. ఫైనాన్స్, కామర్స్, అకౌంటింగ్‌.. ఏది చదివిన వారైనా వీటిని ఎంచుకుని చక్కని కెరియర్‌ను నిర్మించుకోవచ్చు. స్టాక్స్‌ అంటే ఎక్కువమంది వెంటనే ఆలోచించేది స్టాక్‌బ్రోకర్ల గురించే! కానీ ఇందులో ఇంకా చాలా అవకాశాలున్నాయి. డేటా అనలిటిక్స్, కన్సల్టెన్సీ, రిసెర్చ్‌ అండ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేయొచ్చు. సరైన శిక్షణ, నైపుణ్యాలతో వీటిని అందుకోవచ్చు. వీటిలో ప్రారంభస్థాయి ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.


మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌

వీరు తమ క్లైంట్‌ లేదా కంపెనీ కోసం పనిచేస్తారు. వినియోగదారుడు, పోటీదారుల వివరాలు సేకరించడం, భద్రపరచడంలో కంపెనీలు మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ల సేవలను అధికంగా ఉపయోగించుకుంటాయి. వీరు సమాచారాన్ని స్టాటిస్టికల్‌ టెక్నిక్స్, సాఫ్ట్‌వేర్స్‌ సాయంతో విశ్లేషిస్తారు, అనంతరం కంపెనీలు, వినియోగదారులకు ఉపయోగకరమైన సలహాలు, సూచనలు చేస్తారు.  స్టాక్స్‌ కొనడం, అమ్మడంలో వీరి సలహాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. 
వ్యాపారాల విస్తరణ, ఐపీవోలు (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్స్‌) వంటి సందర్భాల్లో వీరు వాణిజ్య సంస్థలకు సహాయకారులుగా ఉంటారు. మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌లు తమ పరిశోధన ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోలను అభివృద్ధి చేయడంలో సాయపడతారు. చార్టులు, గ్రాఫ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్‌ ఉపయోగించి డేటా ఇన్‌సైట్స్‌ తయారుచేస్తారు.


డీలర్‌

వీరు సంస్థల వ్యాపారంలో భాగంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో షేర్లు కొనడం, అమ్మడం, హోల్డ్‌ చేయడం వంటివి చేస్తారు. డిమాండ్‌ పెరిగే ముందు అధికంగా షేర్లు కొనుగోలు చేయడం, అధిక డిమాండ్‌ ఉన్న సమయాల్లో వాటిని అమ్మడం ద్వారా కంపెనీలకు లాభాలు చేకూరుస్తారు. ఇదే పని ట్రేడర్లు కూడా చేస్తారు, అయితే అది వారి వ్యక్తిగత ట్రేడింగ్‌. కానీ డీలర్లు దీన్ని పెద్దస్థాయిలో సంస్థల కోసం నిర్వహిస్తారు.


రిస్క్‌ అనలిస్ట్‌

ముఖ్యమైన వ్యాపార నిర్ణయాల్లో రిస్క్‌కు సంబంధించి వీరు విశ్లేషిస్తారు. తద్వారా వ్యాపార సంస్థలకు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతారు. కంపెనీల తరఫున మార్కెట్‌ ట్రెండ్స్‌ను గమనించడం, క్లైంట్ల గురించి పూర్తిగా తెలుసుకుని వారితో వ్యాపారం చేయడంలో ఉన్న రిస్క్‌లను అంచనా వేయడం, ఒక నిర్ణయం తీసుకోవడంలో ఉన్న మంచిచెడులను విశ్లేషించడం.. ఇలా రిస్క్‌తో కూడుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరి పాత్ర ఉంటుంది.


ఇన్వెస్ట్ట్‌మెంట్‌ కన్సల్టెంట్‌

తమ ఆలోచన, అనుభవంతో క్లైంట్లు సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా వీరు పనిచేస్తారు. క్లైంట్‌ ఆర్థిక లక్ష్యాలకు తగిన విధంగా వీరు పెట్టుబడి వ్యూహాన్ని సిద్ధం చేస్తారు. స్టాక్‌ ధరలు, పనితీరు, కంపెనీ వివరాలు, గత చరిత్ర వంటివన్నీ తెలియజెబుతారు. వీరు వ్యక్తిగత వినియోగదారులతోపాటు బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థల కోసం కూడా పనిచేస్తారు. సలహా, ప్రణాళికల్లో వీరిది ప్రధానపాత్ర.


ఫండమెంటల్‌ అనలిస్ట్‌

ఫండమెంటల్‌ అనలిస్ట్‌లు ఒక స్టాక్‌కు సంబంధించి ఏ విషయాన్ని అయినా పూర్తిస్థాయిలో పరిశోధిస్తారు. దాన్ని ప్రభావితం చేయగలిగిన ఏ చిన్నపాటి అంశాన్నీ విడిచిపెట్టకుండా తెలుసుకుని తద్వారా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడతారు. ఒక కంపెనీకి సంబంధించి స్టాక్, రిస్క్, ఆర్థిక పరిస్థితి, ఎదుగుదల అవకాశాలు, క్యాపిటల్, ఈక్విటీ రిటర్న్, ప్రాఫిట్‌ మార్జిన్‌.. ఇలా అన్నీ పరిశీలిస్తారు.


ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌

వీరు బ్యాంకులు, పెన్షన్‌ ఫండ్స్, బీమా కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తారు. స్టాక్స్, బాండ్స్, ఇతర పెట్టుబడుల పనితీరును అంచనా వేస్తారు. ఆర్థిక సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, ఫోర్‌కాస్ట్‌లు ఇచ్చేందుకు ఉపయోగించడం, ఫైనాన్షియల్‌ మోడల్స్‌ను తయారుచేయడం.. వంటి పనులు చేస్తారు. కంపెనీలు ఎటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలన్నా వీరి అవసరం ఉంటుంది. సొంతంగానూ లేదా సంస్థలతోనూ కలిసి పనిచేయొచ్చు.


ఈక్విటీ అనలిస్ట్‌

ఈక్విటీ అనలిస్ట్‌లు ఒక సంస్థ లేదా స్టాక్‌ గత పనితీరును గమనించి భవిష్యత్తులో అది ఎటువంటి ప్రదర్శన చూపగలదో అంచనా వేస్తారు. వారి అవగాహన, నైపుణ్యాన్ని ఉపయోగించి పెట్టుబడి నిర్ణయాల్లో సూచనలు ఇస్తారు. కంపెనీలు లేదా క్లైంట్ల స్టాక్స్‌ ప్రదర్శన ఎలా ఉందో తరచూ గమనిస్తూ ఉంటారు. ఈ ఉద్యోగానికి పరిశోధన నైపుణ్యాలు అవసరం అవుతాయి. విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలతోపాటు ఆర్థిక, న్యాయపరమైన అంశాలపై అవగాహన, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ గురించి కనీస పరిజ్ఞానం తప్పనిసరి.


టెక్నికల్‌ అనలిస్ట్‌

మార్కెట్‌ను అంచనా వేయడంలో సాంకేతిక అంశాలపై వీరు ఆధారపడతారు. డేటా, టెక్నికల్‌ ఇండికేటర్లు పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు ఎలా ఉండాలో చెబుతారు. ధరల్లో హెచ్చుతగ్గులను అంచనా వేస్తూ క్లైంట్లకు సహాయకారులుగా ఉంటారు. ఇందుకోసం వీరు వివిధ టూల్స్, ఇండికేటర్లను ఉపయోగిస్తారు.


కోర్సులు

ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌) - దీనికి సంబంధించిన కోర్సులను ఎన్‌సీఎఫ్‌ఎం అంటారు, ఇవి 50 వరకూ అందుబాటులో ఉన్నాయి. 

సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) - దీనికి సంబంధించిన కోర్సులను ఎన్‌ఐఎస్‌ఎం అంటున్నారు, ఇవి 27 వరకూ అందుబాటులో ఉన్నాయి. 

గ్రాడ్యుయేషన్‌ తర్వాత వీటిలో ఏదైనా ఎంచుకుని చదవొచ్చు. సర్టిఫికేషన్‌ కోసం పరీక్ష రాసిన అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. ఈ పరీక్షలకు ఏం చదవాలో మొత్తం అంతా అధికారిక వెబ్‌సైట్లలో లభిస్తుంది. 

ఈ సర్టిఫికేషన్లు మూడేళ్లపాటు మనుగడలో ఉంటాయి. ఆ సమయం దాటిపోతే మళ్లీ పరీక్ష రాయాలి.

పైన చెప్పిన కెరియర్లు అన్నింటికి సంబంధించిన కోర్సులు అధికారిక వెబ్‌సైట్లలో లభిస్తాయి. నచ్చిన విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయవచ్చు.


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ చలికాలంలో పరీక్షల సన్నద్ధత!

‣ సైనిక కొలువుకు సులువు దారి!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Posted Date: 15-11-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌