• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సమయపాల‌న ఎంతో అవ‌స‌రం

ఇంట‌ర్‌లో అధిక మార్కులు సాధించాలంటే ప‌రీక్ష స‌మయాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. కింది విధంగా చేస్తే ప‌రీక్ష స‌మ‌యంలో హైరానా ప‌డ‌కుండా ఉండేందుకు వీలుంటుంది.
మార్కులను బట్టి ఆ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించవచ్చో నిర్ణయించుకోండి. నిర్ణీత వ్యవధిలోగా అన్నీ పూర్తయ్యేలా చూసుకోండి. అప్పుడప్పుడు సమయాన్ని గమనించండి. ఎక్కువ ఎడిషన్లు రాస్తేనే అధిక మార్కులు వస్తాయని భావించవద్దు. ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల ప్రకారం సమాధానం ఉండాలి. అందులో ఉపయోగించే పదజాలం (కీ వర్డ్స్‌) కీలకం. తెలిసిన ప్రతి చిన్న విషయాన్నీ రాయవద్దు. అడగకుండా చేసే జ్ఞానప్రదర్శనతో మార్కులు తగ్గిపోతాయి.
అకడమిక్‌ పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది. దస్తూరి అర్థమయ్యేలా ఉండాలి. ఇరికించి రాయకుండా పదాల, వాక్యాల మధ్య చిన్న ఖాళీ విడిచిపెట్టాలి. వీలైనంతవరకూ కొట్టివేతలు, దిద్దిరాయడం లేకుండా చూసుకోవాలి.
కనీసం పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయండి. అవసరమైన అన్ని ప్రశ్నలకూ జవాబులు రాశారో, లేదో సరిచూసుకోండి. ప్రశ్న సంఖ్య, సెక్షన్‌ కచ్చితంగా ఉన్నాయా, లేదా గమనించండి. అడిషనల్‌ పత్రాలు క్రమ పద్ధతిలో పెట్టారో లేదో పరిశీలించండి. హాల్‌ టికెట్‌ నంబర్‌ సరిగా రాశారో లేదో గమనించండి….

ఆందోళన పడొద్దు
* ఒత్తిడికి గురైనా, మనసు పక్కకు మళ్లినా.. వచ్చిన ప్రశ్నలే ముచ్చెమటలు పట్టిస్తాయి. కలం ముందుకి కదలదు.
* ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అది సమృద్ధిగా ఉన్నవారినే విజయం వరిస్తుంది.
* బాగా చదివాం.. కాబట్టి బాగా రాయగలం..ఆందోళన చెందాల్సిన పనిలేదు.. అనుకుంటే ఒత్తిడి దూరమవుతుంది.
* నిరుత్సాహానికి గురైన సందర్భాల్లో ‘నేను పరీక్షలు బాగా రాయగలను. విజయం నాదే’ అని మనసుకు సందేశాన్ని పంపండి. మన ఆలోచనలే ఫలితాలకు ప్రతిరూపాలు.
* వేసవి కాలం కాబట్టి సౌకర్యవంతంగా, వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
* పరీక్షలన్నాళ్లూ.. వేగంగా నిద్రకు ఉపక్రమించడం, తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకోండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేయదు. మానసికంగానూ అలసట అనిపిస్తుంది. పరీక్ష హాల్లో ఆహ్లాదంగా, తాజాగా ఉండాలంటే కనీసం 7 గంటల నిద్ర తప్పనిసరి.

పరీక్ష రాశాక...
* పరీక్ష ముగియగానే ప్రశాంతంగా బయటకు వచ్చేయండి. ఎవరితోనూ జవాబుల గురించి చర్చించవద్దు. చేసిన తప్పులు గుర్తుచేసుకుని ‘అయ్యో, ఎందుకలా జరిగిం’దని ఆలోచిస్తూ, దిగులు పడొద్దు. రాసిన జవాబు సరైనదా, కాదా తెలుసుకోవడానికి పుస్తకాలు తిరగేయొద్దు. ఈ వివరాలు సరిచూసుకోవడానికి అన్ని పరీక్షలూ ముగిసిన తర్వాత కావాల్సినంత సమయం ఉంటుంది.
* ఇవాళ్టి పరీక్ష ప్రభావం రేపటి దానిపై పడకుండా జాగ్రత్త వహించండి. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని మర్చిపోండి. మిగిలిన పరీక్షల ద్వారా అదనంగా మార్కులు రాబట్టుకోవడానికి ప్రయత్నించండి.

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More