• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గణితం... ప‌ని ప‌డ‌దాం

ఇంట‌ర్‌లో గ‌ణితం స‌బ్జెక్టులో మార్కులు సాధించాలంటే అధికంగా శ్ర‌మించాల‌ని అందరూ భావిస్తారు. కానీ కింద తెలిపిన స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తే సాధ‌న తెలిక అయ్యే అవ‌కాశం అధికంగా ఉంది.
గణితశాస్త్ర గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కాన్సెప్చువల్‌ ప్రశ్నలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీటిని అభ్యాసం చేయడం మర్చిపోవద్ధు ఏదైనా ఒక అధ్యాయాన్ని సాధన చేసేముందు దాని బేసిక్స్‌, కాన్సెప్టులు, ఫార్ములాలను చదివి, ఆపై తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలన్నింటినీ సాధించాలి.. ఉదాహరణ లెక్కలు, సాధన లెక్కలు అన్నింటినీ చేయాలి.

 

పేపర్‌-1ఎ: దీనిలో మాత్రికలు (మాట్రిక్స్‌), సదిశలు (వెక్టార్స్‌) నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశముంది. ఈ అధ్యాయాల్లోని అన్ని రకాల ప్రశ్నలు- దీర్ఘ, స్వల్ప, అతి స్వల్ప సమాధాన లెక్కలపై పట్టు వచ్చేవరకూ సాధన చేయాలి. వీటితోపాటు త్రికోణమితి (ట్రిగనామెట్రి)లోని పరివర్తనాలు, త్రిభుజ ధర్మాలు, బీజగణితంలోని ప్రమేయాలు, గణితానుగమన సిద్ధాంతం నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిపై దృష్టి పెట్టాలి.
 

పేపర్‌-1బి: ముఖ్యంగా రెండు ప్రధాన అంశాలుంటాయి. మొదటిది నిరూపక జ్యామితి (2డి, 3డి) రెండోది అవకలన గణితం. దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన ప్రశ్నలను అడిగే అవకాశమున్న ప్రతి అధ్యాయాన్నీ క్షుణ్ణంగా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకు నిరూపక జ్యామితిలోని సరళరేఖలు, సరళరేఖా యుగ్మాలు, దిక్‌ కొసైన్లు, దిక్‌ సంఖ్యలు, అవకలన గణితంలోని అవకలజాలు, అవకలన అనువర్తనాలపై ముందుగా పట్టు సాధించాలి.
 

పేపర్‌-2ఎ: పోటీపరీక్షల్లో 2ఎలోని పాఠ్యాంశాలకు ప్రాముఖ్యం ఎక్కువ. సంకీర్ణ సంఖ్యలు, డీమావియర్‌ సిద్ధాంతం, వర్గ సమాసాలు, సమీకరణ వాదన, ద్విపద సిద్ధాంతం, ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యతలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలి. వీటి అనువర్తనాలు పోటీపరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి సాయపడతాయి.
 

పేపర్‌-2బి: ప్రధానంగా రెండు అంశాలుంటాయి. 1. నిరూపక జ్యామితి 2. కలన గణితం. నిరూపక జ్యామితిలోని వృత్తాలు, వృత్తసరణి పూర్తిగా సిద్ధాంతపరమైనవి. వీటిని పూర్తిగా అధ్యయనం చేస్తే తర్వాత వచ్చే శాంకవాలు (కానిక్స్‌) అధ్యాయాల్లో ఎక్కువ శ్రమ ఉండదు. పరావలయం, దీర్ఘవృత్తం, అతి పరావలయం అనే 3 అధ్యాయాలున్నాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరావలయం నుంచి ఒక దీర్ఘ సమాధాన ప్రశ్న తప్పకుండా వస్తోంది. దీర్ఘవృత్తం నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటిని తప్పకుండా చూసుకోవాలి.
నోట్‌: ప్రతి సమాధానానికి సంబంధించిన రఫ్‌ వర్క్‌, బొమ్మలను తప్పకుండా సమాధానానికి పక్కనే సూచించాలి. - ఎం. మహేందర్‌రెడ్డి, గోగుల ముక్కంటిరెడ్డి

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌