• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చదివితే చాలదు.. చక్కగా రాయాలి!

‘పేపర్‌ ఈజీగా వచ్చింది. కానీ టైమే సరిపోలేదు. కొన్ని వదిలేయాల్సివచ్చింది’ ‘సమాధానం అంతా రాసిన తర్వాత చూసుకుంటే అడిగిన ప్రశ్న వేరు. నేను రాసింది వేరు’ ‘ఏదీ వదలకుండా అన్నీ రాశాను. కానీ మార్కులే సరిగా రాలేదు’ పరీక్షలు రాసిన విద్యార్థుల నుంచి తరచూ ఇలాంటి మాటలు వింటుంటాం. మంచి మార్కులు రావాలంటే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే సరిపోదు. వాటిని మెరుగ్గా పేపర్‌పై పెట్టడమూ రావాలి. పరీక్ష ముగిసేలోపు అన్ని ప్రశ్నలూ సరిగా పూర్తిచేయటం చాలా ముఖ్యం. త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. బాగా ప్రిపేర్‌ అవడం ఎంత అవసరమో ... దాన్ని సమాధాన పత్రంలో చక్కగా రాయడం అంతే ప్రధానమని గ్రహించాలి. ఆచరణలో ప్రదర్శించాలి.

సబ్జెక్టుపై మంచి పట్టు ఉంది. కానీ ఆ విషయం ఎగ్జామినర్‌కు ఎలా తెలుస్తుంది? ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చే జవాబుల ఆధారంగానే ఆ సంగతి వారికి అర్థమవుతుంది. పరీక్షలకు ఎంత బాగా సిద్ధమైనప్పటికీ దానిని సమాధాన పత్రంపై సరిగా పెట్టలేకపోతే అప్పటిదాకా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులే విద్యార్థికి సబ్జెక్టుపై ఉన్న అవగాహనకు కొలమానం. కానీ చాలామంది పరీక్షల్లో ప్రతిభను ప్రదర్శించే విషయంలో తడబడుతుంటారు. నష్టపోతుంటారు. అలాంటివి జరగకుండా ముందే జాగ్రత్తపడాలి. పరీక్షల సమరంలో మార్కుల విజయం సాధించేందుకు గరిష్ఠంగా ప్రయత్నించాలి.

కంగారు.. హడావుడి వద్దు
సాధారణంగా పరీక్షహాలులోకి విద్యార్థులను పావుగంట ముందే అనుమతిస్తారు. తనను తాను స్థిమితపరచుకోవడానికి ఈ సమయాన్ని విద్యార్థి ఉపయోగించుకోవాలి. ప్రశ్నపత్రం అందుకోగానే కంగారుగా కనిపించిన ప్రశ్నకు హడావుడిగా జవాబు రాయడం మొదలుపెట్టకూడదు. ఒకటికి రెండుసార్లు ప్రశ్నలను చూసుకోవాలి. ఎలా రాస్తే పరీక్షను విజయవంతంగా పూర్తి చేయవచ్చో ఆలోచించుకోవాలి. వాటిలో బాగా వచ్చినవేవో, చేయగలిగినవేవో గుర్తించాలి. ఆ ప్రకారం బాగా రాయగలిగినవాటితో పరీక్ష ప్రారంభించాలి. తేలికగా, వేగంగా పూర్తయ్యేవాటిని ముందు రాయాలి. కొంచెం సమయం తీసుకునే వాటికి తర్వాత జవాబు ఇవ్వాలి. సమాధానాలు బాగా రాస్తున్న కొద్దీ విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష భయం తగ్గుతుంది. మర్చిపోయే అవకాశం ఉన్న జవాబులూ చురుగ్గా గుర్తుకు వచ్చే వీలుంటుంది.

సూటిగా.. క్లుప్తంగా
చాలామంది విద్యార్థులు ప్రశ్నను చూడగానే జవాబు రాయడం మొదలు పెట్టేస్తుంటారు. ఎగ్జామినర్‌ ఒక్కోసారి వాటిలో చిన్న చిన్న మెలికలు పెడుతుంటారు. వాటిని గమనించకపోతే సమాధానం రాసిన తర్వాత మొత్తం వృథా అవుతుంది. పరీక్ష పూర్తయ్యాక చూసుకుంటే మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ రెండు పరిస్థితులు విద్యార్థికి నష్టం కలిగించేవే. ముందే ప్రశ్నను జాగ్రత్తగా చదివి, ప్రశ్నలో అడిగిందేమిటో అర్థం చేసుకుని రాయడం ప్రారంభించాలి. ప్రశ్నలో అడిగినంత వరకే పరిమితమై సమాధానం రాయాలి. ప్రశ్న ఎంత బాగా వచ్చినా, సంక్షిప్తంగా రాయడానికే ప్రయత్నించాలి. వచ్చిన ప్రశ్నలను వివరంగా, అందంగా రాయాలనే ఉత్సాహం ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టకపోతే చివర్లో సమయం సరిపోక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది.అనవసర వివరణలను వదిలేసి సూటిగా రాయడం మంచిది.

ఎంత వరకు అవసరమో..!
ప్రశ్నపత్రాల్లో సాధారణంగా చాయిస్‌లు ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్నలు ఇచ్చి వాటిలో నచ్చినవి ఎంచుకోమంటారు. ఇంకొన్నిసార్లు ఇంటర్నల్‌ చాయిస్‌లూ (రెండు ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో ఏదోఒకటి ఎంపిక చేసుకోమని అడగడం) ఇస్తారు. ఇంటర్నల్‌ చాయిస్‌ విషయంలో ఒక చిక్కు ఉంది. విద్యార్థులు చాలామంది తొందర్లో ఏదో ఒక ప్రశ్నను ఎంచుకుంటుంటారు. కొంత రాసిన తర్వాత ‘ఇది అనవసరంగా ఎంచుకున్నామే!’ అని బాధపడుతుంటారు. ఇంకోదాన్ని మొదలుపెడతారు. దాంతో అప్పటిదాకా ముందు ప్రశ్నకు ఉపయోగించిన సమయమంతా వృథా అవుతుంది. అందుకే ప్రశ్నను ఎంచుకునే ముందే సమాధానం ఎంతవరకూ గుర్తుందో ఆలోచించుకోవాలి. ఇంటర్నల్‌ చాయిస్‌ ప్రశ్నల్లో ఒక్కోసారి ఒక ప్రశ్న కిందే మళ్లీ రెండు ప్రశ్నలు ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ప్రశ్నలో ఎ, బి ఉండి, మళ్లీ అందులో అ, ఆ.. విభాగాల కింద ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలా ఉన్న ప్రశ్నలు జాగ్రత్తగా గమనించాలి. వాటిని ఎంచుకున్నప్పుడు మార్కులనుబట్టి ఎంతవరకూ అవసరమో అంతవరకే రాయాలి.

అన్నీ రాయవచ్చు కానీ..
‘చాయిస్‌ ఉన్నప్పటికీ తెలిస్తే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం మేలు..’ ఈ మాటను అందరూ చెబుతుంటారు. నిజానికి ఇది మంచి సూచనే. పైగా రుణాత్మక మార్కులు ఏమీ ఉండవు. ఏ ప్రశ్న విషయంలోనైనా పొరపాటుపడి మార్కులు కోల్పోయినా ఇంకో ప్రశ్న దగ్గర అవి కవర్‌ అవుతాయి. కానీ సమయం అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేయాలి. ముందుగా పూర్తిచేయాల్సినవి రాసిన తర్వాతే అదనం జోలికి వెళ్లాలి. అసలు పూర్తయితేనే అదనానికి విలువ అని గుర్తించాలి.

ప్రశ్నలకు సంబంధం ఉన్నా లేకపోయినా తెలిసిందేదో పేజీలకు పేజీలు రాసేస్తే మార్కులు పడిపోతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కనీసం పేజీకి ఒక్కమార్కు అయినా పడకపోతుందా అని లెక్కలేస్తుంటారు. అలా ఎగ్జామినర్‌ని బోల్తా కొట్టించడం కుదరనిపని అని గ్రహించాలి. తక్కువ సమయంలో వేగంగా పూర్తి చేయగలిగిన ప్రశ్నలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత సమయం పట్టే వాటిని తర్వాత రాయాలి. ఆలోచించి రాయాల్సిన వాటి సంగతి చివర్లో చూడాలి.

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి?.
ఒకే ప్రశ్న తక్కువ లేదా ఎక్కువ మార్కులకు!

వ్యాసరూప ప్రశ్నకు సిద్ధమైతే పరీక్షలో అది స్వల్ప సమాధాన ప్రశ్నగా రావచ్చు. షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్న అనుకున్నది ఎస్సే ప్రశ్నగానూ అడగవచ్చు. అందుకే దేన్నయినా కుదించి గానీ, వివరంగా గానీ రాసే నేర్పు సంపాదించాలి. ‘పిండి కొద్దీ రొట్టె’ అన్నట్లుగా మార్కుల కొద్దీ సమాధానం. తక్కువ మార్కులకు అడిగినప్పుడు (ఉదా: నిర్వచనం అని అడిగితే దానికే పరిమితం కావాలి) అంతవరకే రాయాలి. ఎక్కువ మార్కులకు ఇస్తే దాన్ని వివరించాలి. అలాకాకుండా రెండు సందర్భాల్లోనూ వివరంగా రాసినా లేదా నిర్వచనానికే పరిమితమైనా సమయాన్నీ, మార్కులను లేదా రెండింటినీ కోల్పోవాల్సి ఉంటుంది.

చివర్లో గజిబిజి అక్షరాలు
చాలామంది మొదట నెమ్మదిగా రాసుకుంటూ కూర్చుంటారు. పరీక్ష పూర్తయ్యే సమయానికి వ్యవధి సరిపోక కంగారు పడుతుంటారు. అందుకే మొదట్లో రాత అందంగా ఉండి, చివర్లో అర్థం కానంత గజిబిజిగా కనిపిస్తుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మొదటి నుంచి సగటు వేగంతో రాయాలి. పదాల మధ్య తగినంత దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మరీ దూరంగా రాయడమో, దగ్గరగా రాయడమో చేయకూడదు. పాయింట్ల రూపంలో రాయడం ప్రయోజనకరం. ప్రతి ప్రశ్న పూర్తయిన తర్వాత కనీసం రెండు లైన్లకు స్పేస్‌ విడిచిపెట్టడం మంచిది. ఒకవేళ తర్వాత ఏదైనా పాయింటు గుర్తుకు వస్తే రాయడానికి వీలుంటుంది.

పాయింట్లకు గీతలు, బొమ్మలకు రంగులు
ముఖ్యమైన పాయింట్ల కింద గీత గీయమని, బొమ్మల విషయంలో ముఖ్యమైన భాగాలను హైలైట్‌ చేయమని చాలామంది విద్యార్థులకు సూచిస్తుంటారు. ఎగ్జామినర్‌ దృష్టిలో పడేలా చేయడమే వీటి ఉద్దేశం. కానీ ప్రశ్నకు సమాధానం రాయడం పూర్తవగానే అలాంటి కార్యక్రమాలపై కూర్చుంటే సమయం వృథా అవుతుంది. వాటి కోసం చివర్లో సమయాన్ని కేటాయించాలి. తప్పనిసరేం కాదు, అదనపు మార్కులూ ఉండవు. కానీ సమాధానానికీ, హెడ్డింగ్‌లకూ వేర్వేరు పెన్నులను (బ్లూ, బ్లాక్‌) ఉపయోగించడం మంచిది. ముఖ్యమైన పాయింట్లకు అండర్‌లైన్‌ చేయవచ్చు.

చివరి అర గంట..రాయాల్సిందేమో చాలా!
పరీక్ష రాయడం మొదలు పెట్టగానే ఎగ్జామిర్‌ను ప్రభావితం చేయాలనే ఉత్సాహం విద్యార్థుల్లో ఉంటుంది. అందుకే ముందుగా రాసేవాటిపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెడుతుంటారు. చివర్లో వ్యవధి చాలకపోవడంతో ఒత్తిడికి గురవుతుంటారు. కొందరికేమో వేగంగా రాయలేరు. కారణం ఏదైనా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతి జవాబును పాయింట్ల రూపంలో రాయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు- ఒక ప్రయోగం రాస్తుంటే దాన్ని పేరాల రూపంలో వివరించడం కంటే పాయింట్ల రూపంలో ప్రతి దశనూ కవర్‌ చేయడం తేలికవుతుంది. ఎగ్జామినర్‌ ముఖ్యమైన పాయింట్లను రాశారా లేదా అని మాత్రమే చూస్తారు. అందుకే ఈ పద్ధతి ఉపయోగకరం. ప్రశ్నలు, వాటి సంఖ్యనుబట్టి (చిన్న/ వ్యాస రూప) సమయాన్ని నిర్ణయించుకోవాలి. కచ్చితంగా ఆ సమయంలోగా రాయాలి. అనుకున్న సమయంలోగా పూర్తవకపోతే వెంటనే వేరే ప్రశ్నకు వెళ్లాలి. చివర్లో మిగిలిన సమయాన్ని మధ్యలో ఆపేసిన ప్రశ్నలకు కేటాయించాలి.

ముఖ్యాంశాలు... ఎక్కువ పేజీలు
ఎక్కువ పేజీలు లేదా బుక్‌లెట్‌ మొత్తం నింపితేనే బాగా రాసినట్లు అనే భ్రమ చాలామంది విద్యార్థులకు ఉంటుంది. రాసిన సమాధానంలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయో లేదో చూస్తారే తప్ప ఎన్ని పేజీలు రాశారన్నది చూడరు. అనవసరమైన సమాచారం ఎన్ని పేజీల్లో ఉన్నా వ్యర్థమే. మార్కులేమీ రావు అని విద్యార్థులు గ్రహించాలి

Posted Date : 01-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More