• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైరానా మాని.. హాయిగా రాయి!

* పరీక్షల ఘట్టంలో తడబడొద్దు!

* ఆత్మవిశ్వాసం, సానుకూలత ముఖ్యం


పరీక్షలు దగ్గరవుతుంటే చాలామంది విద్యార్థుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంటుంది. కానీ నిజానికి భయపడాల్సిందేమీ లేదు! అందరికీ అవే ప్రశ్నలు.. ఎంతగానో పరిచయం ఉన్నవే. ఏడాది నుంచీ చదివినవే. ఎన్నోసార్లు రాసినవే. మరోమారు రాయాలి. అంతే! ప్రతిభను ప్రదర్శించబోయే ఈ తరుణంలో తడబడితే ఇంతకాలం కష్టం వృథా అవుతుంది. అందుకే ఇంటర్‌, టెన్త్‌ పరీక్షల సమయం సమీపిస్తున్న ఈ సమయంలో పునశ్చరణను విస్మరించకూడదు. హైరానా పడటం మానేసి ప్రశాంతంగా, ధీమాగా ఉంటేనే హాయిగా పరీక్షలు రాసి, ఆనందంగా బయటకు వస్తారు. అందుకు ఏమేం చేయాలో పరిశీలిద్దాం!

ఏడాది పాటు సాగిన కఠోర శ్రమ ఫలితాన్ని నిర్ణయించడానికి రాతపరీక్షలే ప్రామాణికం. ఈ స్వల్ప వ్యవధిని సద్వినియోగం చేసుకున్నవారిదే విజయం. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా.. సానుకూల దృక్పథమే ప్రేరణగా.. పరీక్ష హాలులోకి అడుగెడితే ప్రతి ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. అన్ని సబ్జెక్టుల్లోనూ మెరుగైన మార్కులు ఖాయమవుతాయి.

మూల్యాంకనం చేసేవారికి మీ గురించేమీ తెలీదు. మీ తెలివితేటలపై అవగాహన ఉండదు. మీ సమాధానాలే వారికి ఆధారం. మిమ్మల్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికే ఈ ప్రయత్నం. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వరాదు. ‘వచ్చు. కానీ రాయడం మర్చిపోయా’, ‘ఒత్తిడి ఎక్కువై ఈ లెక్కలో చిన్న తప్పు చేశా’, ‘జ్వరం కదా..సరిగా రాయలేకపోయా..’ ఇలాంటివేమీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పరీక్షలు మీ విద్యాసంస్థలో జరగడం లేదు. మీ మాస్టార్లు వాటిని మూల్యాంకనం చేయడం లేదు. వీటిని గుర్తుంచుకుని జాగ్రత్తగా రాయడం తప్పనిసరి.

ప్రశ్నలు శ్రద్ధగా చదివి, దానికి తగ్గ జవాబులే రాయాలి. తెలిసిన పాయింట్లన్నీ మర్చిపోకుండా ఒక పద్ధతిగా పేర్చాలి. మీ సమాధానాలు మూల్యాంకనం చేసినవారిని హత్తుకోవాలి. వీటికి అక్షరరూపం సాక్షాత్కారం కావడానికి ఏడాదంతా ఏమి నేర్చుకున్నారో కీలకం కాదు. ఒడిసిపట్టిన విజ్ఞానాన్ని ఎంత ప్రభావవంతంగా ప్రదర్శించారన్నదే ముఖ్యం.

పరీక్ష రోజున...

* అవసరమైనవన్నీ (హాల్‌ టికెట్‌, రెండు పెన్నులు, పెన్సిల్‌, రబ్బరు, నీళ్ల సీసా, రుమాలు...) ఉన్నాయో, లేవో పరిశీలించుకుని మీతోపాటు తీసుకువెళ్లండి.

* ఆహారం తీసుకోకపోతే నేర్చుకున్న విషయాలు గుర్తుకురావు, వేగంగా రాయడం సాధ్యంకాదు..మెదడు చురుకుగా పనిచేయాలంటే గ్లూకోజ్‌ అందాలి. అందువల్ల ఏమీ తినకుండా, ఖాళీ కడుపుతో పరీక్ష హాలులోకి వెళ్లవద్దు.
* పరీక్షకు బయలుదేరే ముందు, వెళ్తున్న తోవలో ఏమీ చదవకుండా విశ్రాంతిగా ఉండండి.
* నిర్దేశిత సమయం కంటే కనీసం పావుగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
* ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రంలోకి అడుగెట్టండి. రెండు మూడు సార్లు ఊపిరి బాగా పీల్చుకుని, నెమ్మదిగా వదలండి.
* ప్రశ్నలన్నీ ఒకసారి చదవండి. కష్టమైన ప్రశ్నలు, సమాధానం తెలియనివి కనిపిస్తే ఆందోళన చెందకండి. మీకు కష్టంగా అనిపించింది పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ కష్టంగానే ఉంటుందని తెలుసుకోండి.
* బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు ప్రారంభించండి. ముఖ్యమైన పాయింట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
* మధ్యలో జవాబు మర్చిపోతే ఆలోచనకు కొంత సమయమే కేటాయించండి. అక్కడే ఆగిపోతే మిగిలిన వాటికి సమయం సరిపోదు. అవసరమైనంత ఖాళీ వదిలి మరో ప్రశ్నలోకి వెళ్లండి. పరీక్ష చివరిలో ఇలా వదిలేసినవాటి గురించి ఆలోచించవచ్చు.

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌