• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోరుకున్న మార్కులు తెలివిగా.. తేలికగా..!

నిజానికి పరీక్షలకు సిద్ధమవడం ఒక కళ. ఏడాదిపాటు చదివినదాన్ని కొన్ని వారాల పరిధిలో కవర్‌ చేయాలి. సమర్థంగా పూర్తిచేసిన వాళ్లే మంచి స్కోరు సాధించగలుగుతారు. మొదటి నుంచీ చదవలేదే అని ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఉండదు. ఉన్న సమయాన్ని సరిగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించాలి. అందుకు కష్టంగా, బలవంతంగా చదవడం పరిష్కారం కాదు. ముల్లోకాలనూ కష్టపడి చుట్టొచ్చిన కుమారస్వామిని కాదని, తల్లిదండ్రులైన శివపార్వతులకు తెలివిగా ప్రదక్షిణ చేసిన వినాయకుడినే విజయం వరిచిందనే కథ అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఒక పద్ధతి ప్రకారం, స్మార్ట్‌గా చదివితే అనుకున్న మార్కులు సాధించుకోవచ్ఛు ప్రస్తుతం మిగిలి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

గంటలు.. గంటలు గడిపితే!
పరీక్షలు కొద్ది రోజుల్లో ఉన్నాయంటే కొందరు 24 గంటలూ పుస్తకాలతోనే గడుపుతుంటారు. నైట్‌ అవుట్‌ల పేరుతో కుస్తీలు పడుతుంటారు. 3, 4 గంటలు మాత్రమే పడుకుని మళ్లీ చదువుతుంటారు. ఇలాంటివారిని చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలపై కొంత ఒత్తిడి పెడుతుంటారు. ఇలా గంటలకొద్దీ కేటాయిస్తేనే సరైన పద్ధతిలో సిద్ధమవుతున్నట్లుగా భావిస్తారు. శరీరాన్ని అంతగా శ్రమ పెడితే పరీక్ష సమయానికి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. నేర్చుకోవడం కుదరకపోగా ఒత్తిడిలో వచ్చిందీ మర్చిపోవచ్ఛుఎంతసేపు చదివారనేది కాదు, ఎంత నేర్చుకున్నారన్నదే ప్రధానం. ఒకరితో పోలిక పెట్టుకోకుండా విద్యార్థులు తమ శక్తిమేరకు ప్రణాళికలు వేసుకోవాలి. దాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. అదే అన్ని విధాలుగా ప్రయోజనకరం.

వచ్చినవే అని విస్మరిస్తే..!
కఠినమైన అధ్యాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం, వాటికే అధిక సమయం కేటాయించటం విద్యార్థులు సాధారణంగా చేసే పని. తేలికైనవి/ బాగా వచ్చినవి ఎలాగూ గుర్తుంటాయనే భావనతో వాటిని విస్మరిస్తుంటారు.దీని వల్ల నష్టాలు ఉన్నాయి. కొత్తవి నేర్చుకోవాలనే తపనలో ఇదివరకు వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మర్చిపోయే ప్రమాదం ఉంది. కొంత విరామం తర్వాత పూర్తిగా కాకపోయినా కొంతైనా మర్చిపోవడం సహజం. వచ్చిన అధ్యాయాలు చేతిలో ఉన్న డబ్బుల్లాంటివి. వాటిని జాగ్రత్త చేసుకోకుండా మిగతావాటి కోసం ప్రయత్నిస్తే చేతిలోనివి చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి, వచ్చిన పాఠాలే కదా అని వదిలేయవద్ధు వాటిని పునశ్చరణ చేసిన తర్వాతే మిగతా ప్రశ్నలను చదవాలి.

అండర్‌లైన్‌ చేస్తున్నారా?
పరీక్షలో ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌ చేయడానికి చాలామంది అండర్‌లైన్‌ చేస్తుంటారు. అది ఎగ్జామినర్‌ దృష్టిలో పడాలనే అలా చేస్తారు. సన్నద్ధత సమయంలోనూ అదే చేయవచ్ఛు చదువుతున్న టాపిక్‌లోని ముఖ్యమైన పదాలు, పాయింట్లను పుస్తకంలో హైలైట్‌ చేసుకోవాలి. పరీక్ష ముందురోజు తుది సన్నద్ధతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆపై వాటిని ఒకసారి చూసుకుంటుంటే చదివింది ఫొటోగ్రఫిక్‌ మెమరీలాగా గుర్తుండిపోతుంది.

భాషాశాస్త్రాలూ ముఖ్యమే
సాధారణంగా పదో తరగతి విద్యార్థులు మ్యాథ్స్‌ లేదా సైన్స్‌, ఇంటర్మీడియట్‌ అభ్యర్థులు గ్రూపు సబ్జెక్టులపై ప్రధానంగా దృష్టిపెట్టి చదువుతుంటారు. తెలుగు/ సంస్కృతం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను పరీక్ష ముందు కొద్దిరోజులు చదివితే సరిపోతుందని భావిస్తారు. పదో తరగతితో పోలిస్తే ఇంటర్‌ విద్యార్థుల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంటుంది. అన్ని సబ్జెక్టుల స్కోరు కలిపితేనే తుది మార్కులన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిలో మార్కులు తగ్గినా పర్సంటేజీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, భాషాశాస్త్రాలకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరేషన్‌లో వీటికీ అవసరమైన సమయం కేటాయించాలి.

కొత్తవి వద్దు
పరీక్షలనగానే చాలామంది అప్పటివరకూ చూడని గైడ్‌లు, వేరే మెటీరియల్స్‌ సేకరించి చదివేస్తుంటారు. దీని వల్ల కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయోజనమూ తక్కువే. అందుకే మొదటి నుంచీ అనుసరిస్తున్న పుస్తకం/ మెటీరియల్‌నే కొనసాగించడం మంచిది. అవి ఇప్పటికే అలవాటై ఉంటాయి. పైగా ఆ సమాచారంపై ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. చదవడం, రివిజన్‌ చేయడం సులభమవుతుంది. అందుకే కొత్తవాటి జోలికి వెళ్లకుండా ఉన్నవాటినే ఉపయోగించుకోవాలి.

పాయింట్లుగా ముఖ్యాంశాలు
ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ముఖ్యాంశాలను చదువుతున్నప్పుడే చిన్న పాయింట్ల రూపంలో రాసిపెట్టుకోవాలి. అన్ని సబ్జెక్టులకీ విడివిడిగా చేయాలి. పాయింటుగా మాత్రమే రాయాలి. మళ్లీ మొత్తం రాసుకోకూడదు. చిన్న పాయింటర్లు, చిన్న మ్యాప్‌లు, బొమ్మలు లేదా సబ్‌ హెడ్డింగ్స్‌, కీవర్డ్స్‌లా రాసుకోవాలి. చూడగానే మొత్తం గుర్తుకురావాలి. పరీక్ష ముందు సులువుగా పునశ్చరణ (రివిజన్‌)కు వీలుగా ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ ఫార్ములాలనూ జాబితాగా రాసుకోవాలి. వాటిని నోట్సు రూపంలో కంటే గోడకు అతికించి పెట్టుకుంటే మంచిది. స్టికింగ్‌ నోట్ల రూపంలో విద్యార్థి తాను ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలి. తరచూ వాటిని చూస్తుండటం వల్ల అవి గుర్తుండిపోతాయి..

ప్రాధాన్యక్రమంలో..!
సన్నద్ధత అంటే చాలామంది అప్పటిదాకా కఠినమని భావించి విడిచిపెట్టిన వాటిపై దృష్టిపెడుతుంటారు. లేదా అన్ని సబ్జెక్టుల్లోని ప్రతి చాప్టర్‌నీ చదివేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ రెండింటికీ ఇప్పుడు తగిన సమయం కాదు. ప్రతి సబ్జెక్టులోనూ కొన్ని చాప్టర్లకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. మరికొన్నింటి నుంచి తప్పకుండా ప్రశ్నలు వస్తుంటాయి. అలాంటి వాటిపై దృష్టిపెట్టాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే వాటిపై అవగాహన వస్తుంది. గత కొన్ని సంవత్సరాల పేపర్లను తీసుకుని, ఎక్కువగా వేటిని అడుగుతున్నారో గమనించాలి. అన్ని సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి దానినుంచీ ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలను జాబితాగా రాసుకోవాలి. ముందుగా వాటిలో ఎక్కువ మార్కులు ఉన్న ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పటికే చదివేసినవే అయినా మరోసారి చదవాలి. లేదా మనసులో మననం చేసుకోవాలి. అన్ని ప్రశ్నలూ అధ్యయనం చేయాలి. ఈ విధానం వల్ల కాన్సెప్టుల పునశ్చరణతోపాటు, ప్రశ్నను అడిగేతీరుపై అవగాహన ఏర్పడుతుంది.

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More