• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెయిటేజి మరవొద్దు.. ఏ ప్రశ్నా వదలొద్దు!

* ఇంటర్‌ ప్రిపరేషన్‌ వ్యూహం

* మంచి స్కోరుకు నిపుణుల సూచనలు

విద్యార్థి భావి జీవితంలో ఇంటర్మీడియట్‌ విద్య కీలకపాత్రను పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ అంశాలపై ఎలా దృష్టి పెట్టాలి? ఏ మెలకువలు పాటించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటర్‌ బోధనలో దశాబ్దాల అనుభవమున్న నిపుణులు ఆ మెలకువలను అందిస్తున్నారు. వీటిని శ్రద్ధగా పాటిస్తూ సన్నద్ధమైతే .. అత్యధిక స్కోరు మీ సొంతమవుతుంది!

ఇంటర్‌ పరీక్షల్లో గరిష్ఠ మార్కులు తెచ్చుకోవటానికి ప్రణాళికాబద్ధమైన కృషి అవసరం. పాఠ్యపుస్తకాల్లోని అంశాల అవగాహన, గత ప్రశ్నపత్రాల పరిశీలన వల్ల ప్రశ్నలు అడిగే విధానంపై, మెరుగ్గా రాయాల్సిన తీరుపై స్పష్టత వస్తుంది. చదివిన అంశాల పునశ్చరణ చాలా ప్రధానం. కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి పెట్టి మిగతావి నిర్లక్ష్యం చేయటం ఏ మాత్రం సరికాదు. అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కని దస్తూరి అవసరం. కొట్టివేతలు లేకుండా అర్థమయ్యేలా రాయటం ముఖ్యం. ప్రతి ప్రశ్నకూ సమాధానమిచ్చేందుకు ప్రయత్నించాలి.

భౌతిక శాస్త్రం
ఇంటర్‌ విద్యార్థులు భౌతికశాస్త్ర సన్నద్ధత పూర్తి చేసుకుని పునశ్చరణ సాగించేలా సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. గడిచిన నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను అవగతం చేసుకుని జాగ్రత్తగా చదివితే మంచి మార్కులు సాధించవచ్ఛు దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేసేటప్పుడు వాటికి అనుగుణంగా ఉండే లెక్కలు, సూత్రాలను చూసుకోవాలి. లెక్కలను సాధించే ప్రక్రియలో ఫార్ములా, ప్రమాణాలను ఉపయోగించడంలో జాగ్రత్తవహించాలి.
మొదటి సంవత్సరం: దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం పని, శక్తి, సామర్థ్యం, డోలనాలు, ఉష్ణగతిక శాస్త్రాలను బాగా చదవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమతలంలో చలనం, గమన నియమాలు, భ్రమణ గమనం, గురుత్వాకర్షణ, ఘన పదార్థాల యాంత్రిక ధర్మాలు, పదార్థ ఉష్ణ ధర్మాలను చదవాలి. పాఠ్యాంశం వెనక ఉన్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలనూ చదువుకోవాలి.
రెండో సంవత్సరం: దీర్ఘ సమాధాన ప్రశ్నలకు తరంగాలు, ప్రవాహ విద్యుత్‌, కేంద్రకాలను బాగా చదవాలి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కిరణ దృశా శాస్త్రం, తరంగ దృశా శాస్త్రం, విద్యుత్‌ ఆవేశాలు, క్షేత్రాలు, కెపాసిటర్స్‌, చలించే ఆవేశాలు- అయస్కాంతత్వం, పరమాణువులు, అర్ధవాహక ఎలక్ట్రానిక్స్‌ను చదవాలి. ఈ పాఠ్యాంశాలు పోటీపరీక్షలకూ ఉపయోగపడతాయి. పాఠ్యాంశం వెనకున్న అన్ని అతి స్వల్ప సమాధాన ప్రశ్నలూ చదవాలి. - ఎస్‌. ఇర్షాద్‌ హుశేన్‌

రసాయన శాస్త్రం

ఒక పాఠం చదివేటప్పుడే అందులోని పటాలు, సూత్రాలు, రసాయన సమీకరణాలను కాగితంపై రాసుకోవాలి. నాలుగు మార్కుల ప్రశ్నల్లో కొన్నిసార్లు రెండు మార్కుల ప్రశ్నలు జత చేసి అడుగుతారు. వాటికి సంబంధించిన పటాలు, సూత్రాలు, సమీకరణాలు, ఉదాహరణలు రాయాలి.
మొదటి సంవత్సరం: సంకరీకరణం వివరించే సమయంలో ఎలక్ట్రాన్‌ విన్యాసం, అణువుల నిర్మాణాలను వివరించేటప్పుడు పటాలు, అణువుల పటాల్లో బంధకోణం, బంధ పొడవు, అణువు ఆకృతి లాంటివి పేర్కొనడం మంచిది. 8 మార్కుల ప్రశ్నలకు పరమాణు నిర్మాణం (అటామిక్‌ స్ట్రక్చర్‌), మూలకాల వర్గీకరణ- ఆవర్తన ధర్మాలు (క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ పీరియాడిసిటీ ఇన్‌ ప్రాపర్టీస్‌)పై ఎక్కువ దృష్టిపెట్టాలి. 4 మార్కుల ప్రశ్నలకు పదార్థ స్థితులు (స్టేట్స్‌ ఆఫ్‌ మ్యాటర్‌), స్టాయికియోమెట్రీ, ఉష్ణగతిక శాస్త్రం, రసాయన సమతాస్థితి (కెమికల్‌ అండ్‌ అయానిక్‌ ఈక్విలిబ్రియమ్‌), పి-బ్లాక్‌ మూలకాలపై దృష్టిపెట్టాలి. రసాయన బంధం (కెమికల్‌ బాండింగ్‌) ఎంతో ముఖ్యం. 8, 4 మార్కుల ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఎక్కువ.
రెండో సంవత్సరం: 8 మార్కుల ప్రశ్నలు- కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి ఒక్కొక్కటి చొప్పున అడుగుతున్నారు. అందులోని కర్బన రసాయన శాస్త్రం (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) లో 8 మార్కుల ప్రశ్నలను (2+2+2+2), (4+2+2), (4+4గా) రెండు లేదా ఎక్కువ ప్రశ్నలను కలిపి అడుగుతున్నారు. వాటిలో నేమ్డ్‌ రియాక్షన్స్‌, యాసిడ్‌ అండ్‌ బేసిక్‌ నేచర్‌పై దృష్టిపెట్టాలి. అకర్బన రసాయన శాస్త్రం (ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ)లో ఎక్కువగా తయారీ విధానాలు, రసాయన ధర్మాలు లేదా పేరుతో కూడిన చర్యలు (నేమ్డ్‌ ప్రాసెస్‌)పై దృష్టిపెట్టాలి. పైవన్నీ పటాలతో కూడిన సమాధానాలు కాబట్టి, వాటికి కూడా మార్కులు కేటాయిస్తారు.
భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్‌ కెమిస్ట్రీ)లో విద్యుత్‌ రసాయన శాస్త్రం, రసాయన గతిశాస్త్రాలపై దృష్టిపెట్టాలి. ఇందులో (4+4 విధానంలో) రెండు నాలుగు మార్కుల ప్రశ్నలను జోడించి 8 మార్కుల ప్రశ్నగా అడుగుతున్నారు. 4 మార్కుల ప్రశ్నలకు జీవాణువులు, పాలిమర్లు, ఘనస్థితి, ద్రావణాలు, ఉపరితల రసాయన శాస్త్రం, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలపై దృష్టిపెట్టాలి. - ఆనంద్‌ కుమార్‌ .పి

బోటనీ

వెయిటేజి అనుసరిస్తూ బోటనీలో సంబంధిత చాప్టర్లు పూర్తి చేసుకోవాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే ముఖ్యమైన యూనిట్లను డయాగ్రమ్స్‌ వేస్తూ చదివితే జవాబులు మర్చిపోయే ప్రమాదం ఉండదు. బయాలజీలో ఈ డయాగ్రమ్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వచ్చాయంటే జవాబులు దాదాపుగా వచ్చినట్టే. డయాగ్రమ్స్‌ వేసేటప్పుడు భాగాలు గుర్తించటం చాలా ముఖ్యం. అందుకే కలర్‌ పెన్సిల్స్‌ ఉపయోగిస్తూ డయాగ్రమ్స్‌ వేసి, లేబులింగ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేయాలి.
మొదటి సంవత్సరం: మార్ఫాలజీ, అనాటమీ, రిప్రొడక్షన్‌లలో ఒక్కో దీర్ఘ సమాధాన ప్రశ్న చొప్పున వచ్చే అవకాశముంది. ఏ ప్రశ్ననూ వదలకూడదు. ఈ చాప్టర్లలో అన్ని ప్రశ్నలకూ తయారవ్వాలి. చాలా చిన్న చాప్టరైన ఎకాలజీలో ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. దీనిలో 6 మార్కులు, సెల్‌ బయాలజీ బయో మాలిక్యూల్స్‌లో 12 మార్కులు సులువుగా తెచ్చుకోవచ్ఛు
రెండో సంవత్సరం: ఫిజియాలజీలో ఫొటోసింథసిస్‌/రెస్పిరేషన్‌, బయాటెక్నాలజీ, హ్యూమన్‌ వెల్ఫేర్‌ చాప్టర్లు బాగా సిద్ధం కావాలి. వీటిలో ఒక్కోటి చొప్పున దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. జవాబులు రాసేటప్పుడు సంబంధిత ఫ్లో చార్టులు వేయాలి. స్వల్ప, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు జాగ్రత్తగా సిద్ధం కావాలి. - మయూరి

జువాలజీ
మొదటి సంవత్సరమైనా, రెండో సంవత్సరమైనా ఒక్కో చాప్టర్‌కు ఎంత వెయిటేజి ఉందో చూసుకోవాలి. ఆ ప్రకారం పఠన ప్రణాళిక వేసుకోవాలి. మొదట దీర్ఘ సమాధాన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీటిని బాగా చదివితే వాటిలోనే చాలావరకూ స్వల్ప సమాధాన; అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు మిళితమై ఉండటమే కాకుండా, చదివేటప్పుడు అవి తేలిగ్గా ఉంటాయి.

 

మొదటి సంవత్సరం- ప్రశ్నల్లో ముఖ్యమైనవి...
* స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్‌ నుంచి సిమెట్రీ, సీలోమ్‌, ఎపిథీలియం, కనెక్టివ్‌ టిష్యూ, బ్లడ్‌.
* పెరిప్లానెటా అమెరికానా (కాక్రోచ్‌) చాప్టర్‌ నుంచి డైజిస్టివ్‌ సిస్టమ్‌, రెస్పిరేటరీ సిస్టమ్‌, సర్క్యులేటరీ సిస్టమ్‌, మేల్‌-ఫిమేల్‌ రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌
* హ్యూమన్‌ హెల్త్‌ అండ్‌ డిసీజెస్‌ చాప్టర్‌ నుంచి ప్లాస్మోడియం (ఇన్‌ మ్యాన్‌ అండ్‌ మస్కిటో), ఎంటమీబా, ఆస్కారిస్‌, ఉకరేరియా లైఫ్‌ సైకిల్స్‌.
* ఇకాలజీ చాప్టర్‌ నుంచి ఫ్లో ఆఫ్‌ ఎనర్జీ, టెంపరేచర్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, లైట్‌ యాజ్‌ ఏ ఫ్యాక్టర్‌, టైప్స్‌ ఆఫ్‌ ఎకోసిస్టమ్‌

 

రెండో సంవత్సరం- ప్రశ్నల్లో ముఖ్యమైనవి...
* బాడీ ఫ్లూయిడ్స్‌ అండ్‌ సర్క్యులేషన్‌ నుంచి స్ట్రక్చర్‌ ఆఫ్‌ హార్ట్‌, ఫంక్షన్స్‌ ఆఫ్‌ హార్ట్‌
* ఎక్స్‌క్రిటరీ ప్రొడక్ట్‌ అండ్‌ దెయిర్‌ ఎలిమినేషన్‌ నుంచి స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఎక్స్‌క్రిటరీ సిస్టమ్‌, యూరిన్‌ ఫార్మేషన్‌ మెకానిజం
* రిప్రొడక్టివ్‌ సిస్టమ్‌ నుంచి మేల్‌-ఫిమేల్‌ రిప్రొడక్టివ్‌ సిస్టమ్స్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌
* జెనెటిక్స్‌ నుంచి మల్టిపుల్‌ ఎలీల్స్‌, క్రిస్‌క్రాస్‌ ఇన్‌హెరిటెన్స్‌, జెనెటిక్‌ డిజార్డర్స్‌, సెక్స్‌ డిటర్మినేషన్‌. - సవిత

ఇంగ్లిష్‌
గ్రామీణ విద్యార్థుల్లో ఆంగ్లం పట్ల భయం ఉంటుంది. అదే పట్టణ ప్రాంత విద్యార్థులకు అమితమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. రెండూ నష్టదాయకమే. ప్రణాళికబద్ధంగా ఏకాగ్రతతోపాటు కొన్ని మెలకువలు పాటిస్తే ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు నూటికి 95 నుంచి 98 వరకు సాధించవచ్చు.
మొదటి ఏడాది విద్యార్థులు.. సెక్షన్‌-ఎలోని (రాసేటపుడు అవసరమైన సైడ్‌ హెడ్డింగ్స్‌తో పాఠం/ పద్యం, రచయిత పేర్లను రాయాలి. సమాధానాలకూ ఇది వర్తిస్తుంది. సమాధానాలు సూటిగా ఉండాలి. సాధారణంగా పాఠ్యాంశంలోని విషయం మొత్తాన్నీ రాసేస్తుంటారు. ఇది విసుగు తెప్పిస్తుంది. ఫలితంగా మార్కులు కోల్పోయే ప్రమాదముంది. కొట్టివేతలు, అతిగా రాయకుండా వ్యాకరణ, స్పెల్లింగ్‌ దోషాలు లేకుండా ఆకట్టుకునేలా రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
* సెక్షన్‌-బిలో రెండు ప్యాసేజీల్లో ఒక్కోదానికి ఆరు ప్రశ్నలిచ్చి నాలుగు సమాధానాలు రాయమంటారు. ఆరింటికీ సమాధానాలు రాస్తే మంచిది. పాఠ్యపుస్తకంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్యాసేజీలను తప్పనిసరిగా చూసుకోవాలి. సమాధానాలు క్లుప్తంగా, సూటిగా ప్రశ్నకు తగ్గట్టుగా రాయాలి
* సెక్షన్‌-సి జాగ్రత్త వహించాల్సిన అంశం. ఇచ్చిన ప్రశ్నలను అదే క్రమంలో ఒకేచోట రాయాలి. ప్రశ్నలు 8-20 క్రమం తప్పకుండా రాయాలి. బిట్స్‌ ప్రశ్నల్లో ఐచ్ఛికాలకు తావివ్వకుండా అన్నింటికీ సమాధానాలు రాస్తే మంచిది. క్వశ్చన్‌ ట్యాగ్‌ ప్రశ్నలకు ట్యాగ్‌కు మాత్రమే పరిమితమవ్వకుండా స్టేట్‌మెంట్‌నూ రాయాలి. కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ విభాగంలో కరెక్ట్‌ చేసిన తరువాత పూర్తి వాక్యాలు రాయాలి. డయాగ్రమ్‌ మరీ పెద్దగానో, చిన్నగానో కాకుండా సులభంగా అర్థమయ్యే పరిమాణంలో గీయాలి. అవసరమైతే రంగు పెన్సిళ్లతో అందంగా గీయొచ్చు. పేరాగ్రాఫ్‌ రాసినా, డయాగ్రమ్‌ గీసినా టైటిల్‌ ఇవ్వడం మర్చిపోవద్దు.
* రెండో ఏడాది విద్యార్థులకు మొదటి ఏడాది రాసిన అనుభవం సాయపడుతుంది. కానీ వీరు చాలా శ్రద్ధవహించాల్సిన అంశం- సమయపాలన. ఈ విద్యార్థులు పరీక్ష రాశాక తరచూ చేసే ఫిర్యాదు- సమాధానాలు తెలిసినా సమయాభావం వల్ల అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయలేకపోయామనే! డిస్క్రిప్షన్‌ ఆఫ్‌ ప్రాసెస్‌కు టైటిల్‌ రాయాలి. సీవీ/ రెజ్యూమె, లెటర్లను సరైన ఫార్మాట్‌లో ప్రెజెంటేషన్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. నోట్‌మేకింగ్‌లోని ప్యాసేజ్‌ను చదివి అర్థం చేసుకోవడానికి తగిన సమయం ఉండేలా జాగ్రత్తపడాలి. ప్యాసేజ్‌ థీమ్‌కు అద్దం పట్టేలా టైటిల్‌ ఇవ్వాలి. సమాధానాలు అతి క్లుప్తంగా 5 లేదా 6 పాయింట్లకు మించకుండా సమాధానం డయాగ్రమ్‌/ టేబుల్‌ రూపంలో రాయగలిగే అవకాశముంటే అలాగే చేస్తే మంచిది.
* మొదటి/ రెండో ఏడాది విద్యార్థులు పాఠ్యపుస్తకంలో వ్యాకరణం తప్పనిసరిగా చూసుకోవాలి. చాలావరకూ ప్రశ్నలు పాఠ్యపుస్తకం నుంచే వస్తాయి. తరచూ పునశ్చరణ చేస్తూ గత ప్రశ్నపత్రాలనూ తిరగేస్తే మంచి స్కోరు సులువుగా తెచ్చుకోవచ్చు. - జి. షౌకత్‌ అలీఖాన్‌

సంస్కృతం
సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్న ప్రథమ సంవత్సర విద్యార్థులు.. పద్యాలు, వ్యాసరూప ప్రశ్నలు, వ్యాకరణం వంటివాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో వ్యాసరూప ప్రశ్నలు మాతృభాష/ ఆంగ్లంలో రాయవచ్చు. కొన్ని పద్యాలు- మార్కు వేసినవాటిని నేర్చుకోవచ్చు. వ్యాకరణం విషయంలో సంధులకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. అవి సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులు పాఠశాలలో ఏదో ఒక భాషలో చదివే ఉంటారు. వాటిని ప్రతిరోజూ రాతపూర్వక అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు. వ్యాకరణ అంశాలు అన్నిటికీ రాతపూర్వక అభ్యాసం అవసరం.
* సగటు ఉత్తీర్ణత కోరే విద్యార్థులు పై అంశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యాసం చేయాలి. పూర్తి మార్కులు కోరేవారు అన్ని పాఠాల వ్యాసరూప ప్రశ్నలను చదివితే సందర్భాలు, స్వల్ప, అతి స్వల్ప ప్రశ్నలకు జవాబులు రాయడం చాలా తేలిక అవుతుంది. తరగతి గదిలో లెక్చరర్లు ఇచ్చే ముఖ్య విషయాలను కూడా తప్పక పరిగణనలోకి తీసుకోవాలి.
* ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వారు ప్రతి పదార్థ తాత్పర్యాలు, వ్యాసరూప ప్రశ్నలు, వ్యాకరణం వంటివాటిని రాతపూర్వక అభ్యాసం చేస్తే సగటు ఉత్తీర్ణత సాధించవచ్చు. పూర్తి మార్కులు కోరే విద్యార్థులు ప్రథమ సంవత్సర పరీక్ష రాసిన అనుభవాన్ని జోడించుకుని, పూర్వ అవగాహనతో ఎక్కడా తప్పులు చేయకుండా అన్ని పాఠాలూ చదివి, వాటిలోని ముఖ్యమైన స్వల్ప, అతిస్వల్ప ప్రశ్నలు, సందర్భాలు నేర్చుకోవాలి. పత్రలేఖనం వంటివి ఒకటికి రెండుసార్లు రాతపూర్వకంగా అభ్యాసం చేయాలి. ముఖ్యంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు అతిచిన్న ప్రశ్నలకూ పూర్తి సమాధానాన్ని వాక్యరూపంలో రాయాలి.
* రోమన్‌ నంబర్లవారీగా సమాధానాలను ఒకేచోట రాయాలి. వీలైనంతవరకూ జవాబులు ఒక క్రమపద్ధతిలో కొట్టివేతలు లేకుండా రాయాలి. సాధ్యమైనంతవరకూ అన్ని రోమన్‌ నంబరు జవాబులూ రాయడానికి ప్రయత్నిస్తే మంచిది. - దివాకర్‌

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More