• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇలా చదివితే ఇట్టే మార్కులు..!

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రత్యేకం
ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, తదితర వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ముఖద్వారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం.. ఇందులో సాధించే మార్కులు, చూపించే ప్రతిభ విద్యార్థుల భవితను నిర్దేశిస్తుంది.. మార్కుల సాధనకు అందరూ శ్రమిస్తారు.. తెలివిగా.. సులువుగా చదవడం.. చదివింది శతశాతం జవాబు పత్రంలో ప్రతిబింబించేలా రాసినప్పుడే విద్యార్థి రెండేళ్ల శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఎలా చదివితే ఎక్కువ మార్కులు సాధిస్తారో పాఠ్యాంశాల నిపుణులు ‘ఈనాడు’కు వివరించారు.. వారిచ్చిన సూచనలు, చిట్కాలు.. ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేకం...

 

ఆంగ్లం
* మార్పులను గమనిస్తేనే మార్కులు
ఆంగ్ల పాఠ్యాంశ సిలబస్‌తో పాటు ప్రశ్నపత్రమూ మారింది. మొత్తం 20 ప్రశ్నలకు సమాధానం రాయాలి. గద్యం, పద్య విభాగాలు, నాన్‌ డిటైల్డ్‌ భాగం అన్నింటినీ కలిసి మాడ్యూల్స్‌గా విభజించారు.
* ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు. సెక్షన్‌-ఏలో 40 మార్కులు( 5 బిట్స్‌), సెక్షన్‌-బిలో 16 మార్కులు (4 బిట్స్‌), సెక్షన్‌-సిలో 44 మార్కులు (11 బిట్స్‌)కు సమాధానం రాయాలి.
* సెక్షన్‌-ఏలో గద్య, పద్య భాగం నుంచి యాంటానమ్స్‌, స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. చిన్న కథలు (షార్ట్‌ స్టోరీస్‌) నుంచి షార్ట్‌ ఆన్సర్‌ ప్రశ్నలు ఇస్తారు. 1వ బిట్‌లో గద్య భాగం నుంచి 3 యాంటానమ్స్‌ ఉంటాయి. వాటిల్లో రెండు రాయాలి. 2వ బిట్‌లో పద్య భాగం నుంచి 3 యాంటానమ్స్‌లో రెండు రాయాలి. ఎక్కువ మార్కులు పొందాలంటే నాలుగు మాడ్యూళ్లు పూర్తిగా చదవాలి.
* సెక్షన్‌-బిలో 4 బిట్స్‌ ఉంటాయి. 6వ బిట్‌లో ఏదైనా ఒక షార్ట్‌ స్టోరీ నుంచి ఒక పాసేజ్‌ ఇస్తారు. దాని కింద ఇచ్చిన ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు గుర్తించాలి. అందుకు పాఠాల చివరన పాసేజ్‌లతో పాటు, రివిజన్‌ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రంలో ఇచ్చిన పాసేజ్‌లను క్షుణ్ణంగా చదవాలి.
* ఛాయిస్‌ ఉందని వదిలివేయడం సరైన పద్ధతి కాదు. ఒక్కోసారి అతి విశ్వాసంతో తప్పులు చేస్తుంటారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఉత్తమం. ముఖ్యంగా సెక్షన్‌-బి, సీల్లో ఇది పాటించాలి.
                    - చకిలం అమరేందర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ధర్మసాగర్‌, వరంగల్‌ 

తెలుగు
* వ్యాకరణ అంశాల్లో కొట్టివేతలు వద్దు
తెలుగు ప్రశ్నపత్రంలో మొత్తం 16 ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రాన్ని 1-8 వరకు ప్రధాన విభాగంగా, 9-16 వరకు సహాయ విభాగంగా చెప్పుకోవచ్చు. సహాయ విభాగం తెలివైన విద్యార్థులకు మార్కుల స్కోరింగ్‌కు, సాధారణ విద్యార్థుల ఉత్తీర్ణతకు సహాయకారిగా చెప్పుకోవ‌చ్చు 
* అడిగిన రెండు పద్యాల్లో రాయదలచుకున్న పద్యాన్ని ఒకసారి శ్రద్ధగా చదవాలి. పాఠంలో ఆ పద్యం వచ్చిన సందర్భాన్ని అర్ధం చేసుకొని ప్రతి పదానికి అర్ధం రాయాలి. వరుసగా రాసిన అర్ధాలతో వాక్యాల్ని నిర్మిస్తూ భావం రాయాలి. ఒకటీ అరా వ్యాకరణాంశాల్ని జోడించడం ద్వారా పూర్తి మార్కులు పొందవచ్చు. పద్య భాగంలోని 1, 3 పాఠాల్లోని చుక్క పద్యాలు ముఖ్యమైనవి.
2, 3వ ప్రశ్నలు: పద్య, గద్య భాగాల్లోని వ్యాసరూప ప్రశ్నలు. రెండు చొప్పున అడుగుతారు. ఒకటి చొప్పున సమాధానాలివ్వాలి. 20 పంక్తుల సమాధానాన్ని మూడు పేరాలుగా విభజించి రాయాలి. 4వ ప్రశ్నలో నాటక స్రవంతి నుంచి అడిగిన నాలుగు ప్రశ్నల్లో రెండింటికి జవాబు రాయాలి. దీనికి 12-18 పంక్తుల వరకు రెండు పేరాలుగా రాస్తే సరి.

5, 6 ప్రశ్నలు: విద్యార్థికి పాఠ్య పుస్తకంతో ఉన్న అనుబంధాన్ని ప్రశ్నించే ప్రశ్నలివి. ఇవి సందర్భ వాక్యాలు. పద్యభాగం, నాటక స్రవంతి నుంచి నాలుగేసి చొప్పున అడుగుతారు. రెండేసి జవాబులు చొప్పున రాయాలి. పరిచయం, సందర్భం, వివరణ అనే మూడు ఉప శీర్షికల కింద విషయాన్ని వివరంగా రాయాలి.
7, 8 ప్రశ్నలు: ఈ ప్రశ్నల నుంచే ప్రశ్నపత్రం తేలికవడం మొదలవుతుంది. తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వినని విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో సమాధానాలు రాయవచ్చు. పద్య, గద్య భాగాల నుంచి నాలుగేసి ప్రశ్నలు అడుగుతారు. రెండేసి చొప్పు జవాబులు రాయాలి.
                    - ఎస్‌ఎస్‌ రాజు, తెలుగు అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హుస్నాబాద్‌

Posted Date : 05-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More