• facebook
  • twitter
  • whatsapp
  • telegram

1. సత్య ప్రాశస్త్యం

8 మార్కుల ప్రశ్నలు


1.  విమల యశోనిధీ! పురుష వృత్త యెఱుంగుచునుండుఁ జూవె వే
    దములను బంచ భూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్‌
    యముఁడును జంద్ర సూర్యులు సహంబును రాత్రియ నన్మహా పదా
    ర్థములివి యుండఁగా, నరుఁడు దక్కొన నేర్చునే? తన్ను మ్రుచ్చిలన్‌

ప్రతిపదార్థం

విమల యశోనిధీ (విమల, యశః + నిధీ) = నిర్మలమైన, కీర్తికి నెలవైన వాడా! (కీర్తిమంతుడా!) 
వేదములను = వేదములున్నూ (నాలుగు వేదాలనూ) 
బంచ భూతములన్‌ = భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు ప్రకృతులున్నూ 
ధర్మూలున్, సంధ్యలున్‌ = ఉదయ సంధ్య, సాయం సంధ్య అనే రెండు సంధ్యా కాలములున్నూ
అంతరాత్మయున్‌ (అంతః + ఆత్మయున్‌) = హృదయమున్నూ
యముడును = మృత్యువునకు అధి దేవతయైన యముడునూ 
చంద్ర సూర్యులన్‌ = చంద్రుడునూ, సూర్యుడునూ
అహంబునున్‌ = పగలునూ (పగటి కాలమునూ) 
రాత్రియున్‌ = రాత్రియునూ (రాత్రి కాలమునూ) 
అన్‌ + మహా పదార్థములు = అనబడే మహా పదార్థాలు
పురుష వృత్తము = నరుడి నడవడిని (మానవుడి చరిత్రాన్ని/మానవులు చేసే పనులను) 
నరుడు = మానవుడు 
ఎఱుంగుచు నుండుఁజూవె (ఎఱుంగుచున్‌ + ఉండున్‌ + చూవె) = తెలుసుకుంటూ ఉంటాయి సుమా! 
ఇవి + ఉండగాన్‌ = ఈ పైన చెప్పిన మహా పదార్థాలు ఉంటుండగా 
తన్నున్‌ = తనను 
మ్రుచ్చిలన్‌ = దొంగలింపగా (వంచింపగా/చేసిన పని చేయలేదని చెప్పి వంచించడానికి) 
తక్కొనన్‌ (తల + కొనన్‌), నేర్చునే = పూనుకొనగలడా? (పూనుకోలేడని) 


2.  సతియును గుణవతియు, బ్రజా
    వతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞా 
    న్విత దృష్టిఁ జూచు నతి చు 
    ర్మతి కిహముం బరముఁ గలదె? యతిఁ బరికింపన్‌

ప్రతిపదార్థం 
మతిన్‌ = బుద్ధిలో  
పరికింపన్‌ = ఆలోచింపగా 
సతియును = పతివ్రతయునూ 
ప్రజావతియును = సంతానవతియునూ
అనువ్రతయున్‌ = అనుకూలవతియును
గుణవతియున్‌ = గుణవంతురాలున్నూ 
ఐన = అయినటువంటి 
వనితన్‌ = స్త్రీని (భార్యను)
అవజ్ఞాన్విత దృష్టిన్‌ (అవజ్ఞా + అన్విత, దృష్టిన్‌) = తిరస్కార దృష్టితో 
చూచు = చూసేటువంటి 
అతి, దుర్మతికిన్‌ = మిక్కిలి, దుష్టబుద్ధి గలవాడికి 
ఇహమున్‌ = ఈ లోకంలోనూ 
పరమున్‌ = పరలోకమైన స్వర్గలోకములోనూ 
కలదె (కలదు + ఎ) = సుఖం ఉంటుందా? (అతడు బతికినా, చచ్చినా సుఖపడలేడని భావం)


3. విపరీత ప్రతిభాష లేమిటికి సుర్వనాథ! యీ పుత్త్ర గా 
    త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం 
    ద్ర పరాగ ప్రసరంబుఁ చంధనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్ర గా 
    త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే?

ప్రతిపదార్థం 
ఉర్వీనాథ = భూమికి భర్తవైన ఓ రాజా!
విపరీత, ప్రతిభాషలు = విరుద్ధములైన, మారు మాటలు
ఏమిటికిన్‌ = ఎందుకు? (అలాంటి మాటలు చెప్పవద్దు అని భావం)
ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు
ఈ పుత్ర = ఈ కుమారుడి యొక్క 
గాత్ర = శరీరాన్ని 
పరిష్వంగ = కౌగిలించుకోవడం వల్ల కలిగే 
సుఖంబు = హాయిని (సుఖాన్ని) 
చేసుకొనుము = స్వీకరింపుము
ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబున్‌
ముక్తాహార = ముత్యాల హారములున్నూ
కర్పూర, పరాగ = పచ్చ కర్పూరపు, దట్టమైన పొడి యొక్క
ప్రసరంబున్‌ = పూతయునూ (పచ్చ కర్పూరపు మై పూత అని భావం) 
చందనమున్‌ = మంచి గంధమునూ
చంద్ర జ్యోత్స్నయున్‌ = వెన్నెలయునూ 
జీవులకున్‌ = ప్రాణులకు
హృద్యంబే (హృద్యంబు + ఏ) = చల్లదనంగా ఉంటుందా? (ఉండదని భావం)


4. సుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటే సూనృత 
    వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటే నొక్క స 
    త్క్రతువది మేలు; తత్క్రతు శతంబునకంటే సుతుండు మేలు; త
   త్సుత శతకంబుకంటే నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్‌

ప్రతిపదార్థం
సూనృత వ్రత = నిజం మాట్లాడటమే నియమంగా గలవాడా!
నుతజల, పూరితంబులు + ఆగు = మంచినీటితో నిండినవైన
నూతులు = చేదతో నీరు తోడుకునే బావులు
నూఱిటి కంటెన్‌ = వంద కంటే 
ఒక బావి = ఒక దిగుడు బావి (మెట్లపై నుంచి కిందికి దిగి నీరు ముంచుకునే బావి)
మేలు = ఉత్తమమైంది
మఱి బావులు = మరి అలాంటి దిగుడు బావులు
నూఱిటి కంటెన్‌ = వంద కంటే
ఒక్క = ఒక
సత్క్రతువది (సత్‌ + క్రతువు + అది) = ఒక మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైంది
తత్‌క్రతుశతంబున కంటెన్‌  
తత్‌ = అలాంటి 
క్రతు శతంబున కంటెన్‌ = నూరు యజ్ఞాల కంటే
సుతుండు = కుమారుడు
మేలు = మంచిది (ఉత్తమును)
తత్సుత శతకంబు కంటెన్‌
తత్‌ = అలాంటి
సుత, శతకంబు కంటెన్‌ = కొడుకులు, నూరు మంది కంటే
చూడగన్‌ = పరిశీలించి చూడగా
ఒక సూనృత వాక్యం = ఒక సత్య వాక్యం
మేలు = ఉత్తమమైంది


5. వెలయంగ నశ్వమేధం
    బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
    దుల నిడి తూఁపఁగ సత్యము
    వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్‌

ప్రతిపదార్థం
తులన్‌ = త్రాసులో
వెలయంగన్‌ = ప్రకటమయ్యేలా
అశ్వమేధంబులు = అశ్వమేధ యాగాలు
వేయునున్‌ = వేయియునూ (వెయ్యి అశ్వమేధాలునూ)
ఒక సత్యమును = ఒక సత్యాన్ని
ఇరుగడలన్‌ = రెండు వైపులా
తులన్‌ = త్రాసులో
ఇడి = ఉంచి
తూపగన్‌ = తూచగా (త్రాసు యొక్క ఒక తక్కెడలో వేయి అశ్వమేధాలను, మరొక తక్కెడలో ఒక సత్య వాక్యాన్ని వేసి తూచగా)
గౌరవంబున + పేర్మిన్‌ = బరువు యొక్క ఆధిక్యంతో
సత్యము వలనన = సత్య వాక్యం ఉన్న వైపునకే
ములు చూపున్‌ = ముల్లు చూపుతుంది (సత్య వాక్యం వేయి అశ్వమేధాల కంటే బరువైంది. కాబట్టి బరువు గల సత్యం ఉన్నవైపే ముల్లు చూపిస్తుంది. అంటే సత్యమే వేయి అశ్వమేధాల కంటే గొప్పదని నిరూపిస్తుంది)


6. తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ
    బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కొ!
    నుడువులు వేయి నింకేల? యిప్పాటి నోములు దొల్లి
    కడఁగి నోఁచితిని గాకేమి యనుచును గందె డెందమున

ప్రతిపదార్థం
పుట్టిననాడ (పుట్టిన నాడు + అ) = నేను పుట్టినరోజుననే
తడయక = ఆలస్యం చేయకుండా
తల్లిచేన్‌ = తల్లి చేతనూ (తల్లి అయిన మేనక చేతనూ)
తండ్రిచేన్‌ = తండ్రి చేతనూ (విశ్వామిత్రుడి చేతనూ)
విడువఁబడితిన్‌ (విడువన్‌ + పడితిన్‌) = వదిలి పెట్టబడ్డాను
ఇప్పుడు = ఇప్పుడు
పతి చేతను = భర్త చేత కూడా (దుష్యంతుడి చేత కూడా)
విడువబడియెద నొక్కొ (విడువ బడియెదన్‌ + ఒక్కొ) = వదిలి పెట్టబడతానో ఏమో!
నుడుములు వేయున్‌ = వేయి మాటలు (పెక్కు మాటలు)
ఇంకేల (ఇంకన్‌ + ఏల) = మరింక ఎందుకు
ఇప్పాటి (ఈ + పాటి) = ఇంతటి ఫలాన్ని ఇచ్చే
నోములు = నోములు (పూజలు)
తొల్లి = పూర్వం
కడగి = పూనుకొని
నోచితిని = నోచుకున్నాను
కాకేమి (కాక + ఏమి) = కాకపోతే ఏమిటి?
అనుచును = అనుకుంటూ
డెందమునన్‌ = (తన) హృదయంలో
కందెన్‌ = బాధ పడింది

7. గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
   కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
   ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
   వినిచే ధరాధినాథునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్‌

ప్రతిపదార్థం
గొనకొని = అతిశయించి
వీడు = ఇతడు (ఈ భరతుడు)
నీకును = నీకునూ (దుష్యంతుడికీ)
శకుంతలకున్‌ = శకుంతలకూ
ప్రియనందనుండు = (పుట్టిన) ముద్దు బిడ్డడు
ఈతనిన్‌ = ఈ పుత్రుడిని
చేకొని = స్వీకరించి
భరియింపుము = పోషించుము
సాధ్వి = ఇల్లాలునూ
సద్వినుత (సత్‌ + వినుత) = ఉత్తములతో కీర్తింపబడిన
మహా పతివ్రత = గొప్ప పతివ్రతయునూ (అయిన) శకుంతల
వివేకముతోన్‌ = తెలివితో
సత్యము వల్కెన్‌ (సత్యము + వల్కెన్‌) = నిజం చెప్పింది
అని = అని
తత్సభాసదుల్‌ = ఆ సభలో ఉన్నవారు
విస్మయమందఁగన్‌ (విస్మయము + అందగన్‌) = ఆశ్చర్యపడేలా
దివ్యవాణి = దేవతా సంబంధమైన వాణి (ఆకాశవాణి)
ధరాధినాథునకున్‌ (ధరా + అధినాథునకున్‌) = భూపతియైన దుష్యంతుడికి
వినిచెన్‌ = వినిపించింది


6 మార్కుల ప్రశ్నలు
1. గృహస్థ ధర్మం గొప్పదనం, గృహిణి ప్రాధాన్యాం గురించి శకుంతల తెలిపిన తీరును వివరించండి. 
జ: గృహస్థ ధర్మం గొప్పదనం 
గృహస్థుడైన భర్త పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూడరాదు. అలా భార్యను అవజ్ఞా దృష్టితో చూస్తే ఆ భర్తకు ఇహపర సుఖాలు రెండూ ఉండవు. అనుకూలవతియైన భార్య గల గృహస్థుడు కర్మలు ఆచరించగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు అవుతాడు. పుత్ర సంతానాన్ని పొందుతాడు. గార్హన్థ్య ధర్మాన్ని నిత్యం ఆచరించే గృహస్థు పొందే ఫలాన్నంతటినీ అతడు పొందగలుగుతాడు.
గృహిణి గొప్పదనం (భార్య గొప్పదనం)
భార్య ధర్మార్థ కామములను సాధించడానికి తగిన సాధనం. ఆమె గృహిణీతి విద్యకు నిలయం. నిర్మల శీలాన్ని బోధించే గురువు.  వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర. ఆమె గౌరవానికి ముఖ్య కారణం. భార్య ఉన్నత, స్థిరమైన మంచి గుణాలకు నెలవు. హృదయానికి ఆనందాన్ని కలిగించేది. భర్తకు భార్య కంటే ప్రియమైంది లేదు. భార్య భర్తలో సగభాగం. భార్య భర్త కంటే ముందే చనిపోతే పరలోకంలో ఆమె తన భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందు చనిపోతే భార్య వెనువెంటనే తాను కూడా మరణించి ఆయన వెంట వెళ్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మ విరుద్ధం. భార్యా పుత్రులను ఆప్యాయంగా చూసే భర్తకు ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఆపదలోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ పోతాయి.
గృహస్థ ధర్మంలో పుత్రుడి ప్రాధాన్యం:
భర్త భార్యలో ప్రవేశించి, గర్భంలో నివసించి పుత్రుడై జన్మిస్తాడు. తండ్రీ కొడుకులకు భేదం లేదని వేదం కూడా చెబుతోంది. పురుషుడు నీటిలో తన నీడను తాను చూసినట్లు పుత్రుడు తల్లిదండ్రుల రెండు వంశాల వారిని ఉద్ధరిస్తాడు. ఈ విధంగా గృహస్థాశ్రమ ధర్మానికి భర్త, భార్య, పుత్రుడు, సత్యం అనేవి మూల స్తంభాలు.


2. సత్య ప్రాశస్త్యాన్ని గురించి శకుంతల ఏమని పలికింది?
జ: సత్యవాక్య ప్రాశస్త్యం
శకుంతల తన భర్త దుష్యంతుడితో సత్యం గొప్పదనాన్ని ఇలా వివరించింది.
మంచినీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడు బావి మేలు. అలాంటి నూరు బావుల కంటే ఒక మంచి యజ్ఞం  మేలు. నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. నూరు మంది పుత్రుల కంటే ఒక సత్య వాక్యం మేలు.
* ఒక త్రాసులో వేయి అశ్వమేధాలను ఒక వైపు, ఒక సత్య వాక్యాన్ని మరొక వైపు ఉంచి తూస్తే సత్యవాక్యం ఉన్నవైపుకే ముల్లు చూపిస్తుంది. అంటే వెయ్యి అశ్వమేధాల కంటే సత్యవాక్యమే గొప్పదని దీన్ని బట్టి తెలుస్తుంది.
పుణ్యతీర్థాలకు వెళ్లడం, వేదాలను అధ్యయనం చేయడం అనేవి ఒక్క సత్యవాక్యంతో సమం కావు. ధర్మం బాగా తెలిసిన రుషులు అన్ని ధర్మాల కంటే సత్యవాక్యమే గొప్పదని అంటారు. కాబట్టి సత్యవాక్యం గొప్పదని గుర్తించి కణ్వాశ్రమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు. నీ కుమారుడిని దయతో చూడు.


3 మార్కుల ప్రశ్నలు
1. ధుర్మతి కిహముం బరముఁగలదె
జ: కవి పరచియం: ఈ వాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన సత్య ప్రాశస్త్యం అనే పద్యభాగ పాఠంలోనిది.
సందర్భం: శకుంతల కుమారుడు భరతుడిని వెంట పెట్టుకొని దుష్యంతుడి వద్దకు వచ్చి ఇచ్చిన మాట ప్రకారం కుమారుడిని, తనను స్వీకరించమని కోరింది. దుష్యంతుడు ఆమెను ఎరుగనని చెప్పాడు. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార దృష్టితో చూసి అవమానించిన దుర్భుద్ధికి ఇహ పర సుఖాలు ఉండవని శకుంతల దుష్యంతుడితో చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య: యోగ్యురాలైన భార్యను అవమానించి తిరస్కరిస్తే ఆ భర్తకు ఈ లోకంలో, పరలోకంలో సుఖం ఉండదని శకుంతల గుర్తు చేసింది.


2. జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే
జ: కవి పరిచయం: ఈ వాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన సత్య ప్రాశస్త్యం అనే పద్యభాగ పాఠంలోనిది.
సందర్భం: శకుంతల పుత్రుడి ప్రాశస్త్యాన్ని గురించి దుష్యంతుడికి వివరించి చెప్పింది. దుష్యంతుడు శకుంతలను, భరతుడిని స్వీకరించడానికి తిరస్కరించాడు. అప్పుడు విరుద్ధమైన మాటలు మాట్లాడకు. నీ పుత్రుడి కౌగిలింత వల్ల కలిగే సౌఖ్యాన్ని అనుభవించు. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు దట్టమైన మైపూత, మంచి గంధం, వెన్నెల అనే చల్లని వస్తువులు కూడా జీవులకు పుత్రుడి కౌగిలింతలా మనసుకు సుఖాన్ని, చల్లదనాన్ని ఇవ్వలేవని శకుంతల దుష్యంతుడికి చెప్పిన సందర్భంలోనిది.
వ్యాఖ్య: కొడుకును కౌగిలించుకుంటే ప్రాణులకు సుఖం, చల్లదనం కలుగుతాయని శకుంతల పుత్ర ప్రాధాన్యాన్ని దుష్యంతుడికి వివరంగా చెప్పింది.


3. ఒక సూనృత వాక్యము మేలు సూడఁగన్‌
జ: కవి పరిచయం: ఈ వాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన సత్య ప్రాశస్త్యం అనే పద్యభాగ పాఠంలోనిది.
సందర్భం: దుష్యంతుడు తన వద్దకు వచ్చిన శకుంతలను లోకాపవాద భయంతో తిరస్కరించాడు. అప్పుడు సత్యం యొక్క గొప్పదనాన్ని గురించి శకుంతల దుష్యంతుడికి గుర్తు చేసింది. ‘నూరు మంచి నీరు గల నూతుల కంటే ఒక దిగుడు బావి మంచిది. నూరు దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మంచిది. నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. నూరు మంది కుమారుల కంటే ఒక సత్యవాక్యం మేలైంది’ అని సత్యవాక్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ శకుంతల దుష్యంతుడితో చెప్పిన సందర్భంలోనిది.
వాఖ్య: నూరు నూతులు, నూరు బావులు, నూరు యజ్ఞాలు, వంద మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం గొప్పదని, అబద్ధమాడరాదని శకుంతల దుష్యంతుడికి గుర్తు చేసింది.


4. ఇట్టుల సత్య భాషణం బుచితంటె
జ: కవి పరిచయం: ఈ వాక్యం నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన సత్య ప్రాశస్త్యం అనే పద్యభాగ పాఠంలోనిది.
సందర్భం: శకుంతల సత్యవాక్యం యొక్క ప్రాశస్త్యాన్ని దుష్యంతుడికి వివరంగా చెప్పింది. కణ్వాశ్రమంలో తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కొడుకును ఆదరించమని చెప్పింది. తాను మేనకా విశ్వామిత్రుల కుమార్తెనని అధర్మాపరురాలిని కాదని  గుర్తు చేసింది. అప్పుడు నేనెక్కడ? నీవు ఎక్కడ, కుమారుడు ఎక్కడ? నేను నిన్ను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఆడవారు అబద్ధాలాడతారు అని పేరు వచ్చేలా ఇలా అబద్ధాలాడటం నీకు తగదని దుష్యంతుడు శకుంతలను మందలించిన సందర్భంలోనిది.
వ్యాఖ్య: తనకు, శకుంతలకు ఏ సంబంధం లేదని, ఇంతకు ముందెప్పుడూ ఆమెను చూడనేలేదని, అబద్ధాలాడటం మంచిది కాదని,  ఆడవారు అబద్ధాలు చెబుతారని పేరు వస్తుందని దుష్యంతుడు శకుంతలను మందలించాడు.


1 మార్కు ప్రశ్నలు
1. నన్నయకు గల బిరుదులేవి? 
జ: నన్నయకు ఆదికవి, శబ్ద శాసనుడు (వాగమ శాసనుడు) అనే బిరుదులు ఉన్నాయి.
2. నన్నయ్య ఎవరి ఆస్థాన కవి?
జ: నన్నయ, చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి.
3. శకుంతలను పెంచిన తండ్రి ఎవరు?
జ: శకుంతలను పెంచిన తండ్రి కణ్వ మహర్షి.
4. శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు?
జ: దుష్యంతుడు శకుంతలను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు.
5. శకుంతలకు, దుష్యంతుడికి జన్మించినవారు?
జ: శకుంతలా దుష్యంతులకు భరతుడు అనే కుమారుడు జన్మించాడు.
6. నన్నయ రచించిన వ్యాకరణ గ్రంథం పేరేమిటి?
జ: నన్నయ ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు.


అదనపు ప్రశ్నలు (3 మార్కులు)
1. పురుషుడి కార్యాలను ఎల్లప్పుడూ చూసేది?
2. భార్యను ఎలా గౌరవించాలని శకుంతల పేర్కొంది?
3. సత్యవాక్యం వేటి కంటే గొప్పది?
4. శకుంతల బాధ పడిన విధం ఎలాంటిది?
 

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు 

Posted Date : 12-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌