• facebook
  • twitter
  • whatsapp
  • telegram

2. శాంతి కాంక్ష

6 మార్కుల ప్రశ్నలు

1. భట్టు రాయబారానికి వచ్చిన కారణాన్ని వివరించండి.
జ: ఇది ఆంధ్రభూమిలో పల్నాటి సీమలో 12వ శతాబ్దంలో జరిగిన చారిత్రక గాథ. నలగామరాజు, మలిదేవరాజు అన్నదమ్ములు. నాయకురాలిగా పేరు పొందిన నాగమ్మ నలగామరాజుకు మంత్రి. బ్రహ్మనాయుడు మలిదేవరాజుకు మంత్రి. నాగమ్మ శైవ మతస్థురాలు, బ్రహ్మనాయుడు వైష్ణవ మతస్థుడు. బ్రహ్మనాయకుడికి, నాగమ్మకు మధ్య పుట్టిన ఈర్ష్య, అసూయలే పల్నాటి మతద్వేషానికి కారణమై వారి మధ్య యుద్ధానికి దారితీశాయి. వీరిద్దరి మధ్య జరిగిన కోడి పందెంలో బ్రహ్మనాయుడికి చెందిన కోడి ఓడిపోయింది. ఒప్పందం ప్రకారం కోడి పందెంలో ఓడిపోయినవారు అయిదేళ్లు వనవాసం చేయాలి. ఆ ఒప్పందం ప్రకారం బ్రహ్మనాయుడి ప్రభువైన మలిదేవరాజు అయిదేళ్లు వనవాసానికి వెళ్లాడు.
     వనవాసం మూడేళ్లు పూర్తయ్యింది. మరో రెండు సంవత్సరాల్లో వనవాసం పూర్తవుతుంది కాబట్టి మలిదేవరాజు తన రాజ్య భాగం ఇమ్మని అలరాజును నలగామరాజు వద్దకు రాయబారం పంపాడు. ఏ కుట్ర జరిగిందో రాయబారిగా వెళ్లిన అలరాజు చంపబడ్డాడు. ఈ విషయం తెలిసిన మలిదేవరాజు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మలిదేవరాజు తమ్ముడు, బంధువులు, అతడి సైన్యంలోని వీర నాయకులు గొప్ప పరాక్రమ వైభవంతో నలగామరాజు మీదికి దండయాత్రకు వెళ్లారు.
      రాయబారిగా వెళ్లి చంపబడిన అలరాజుతో పాటే మేము కూడా మరణిస్తామంటూ గట్టి పట్టుదల, కోపంతో వీర నాయకులందరూ శ్రీశైల భూమిలో ప్రసిద్ధమైన కారెయపూడి యుద్ధభూమికి చేరుకున్నారు. వీరులంతా యుద్ధ సన్నాహంలో ఉన్నారు. మలిదేవరాజు మాత్రం వీరులను శాంతింపజేశాడు. అలరాజును చంపిన హత్యా నేరాన్ని క్షమించి యుద్ధం జరగకుండా ఎలాగైన శాంతిని చేకూర్చాలనే కోరికతో భట్టును నలగామరాజు వద్దకు రాయబారిగా పంపాడు. 


2. శాంతి కాంక్ష పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి.
జ: మలిదేవరాజు భట్టును నలగామరాజు వద్దకు రాయబారిగా పంపాడు. భట్టు నలగామరాజు వద్దకు వచ్చి వినయంగా ఆయన ఎదుట నిలిచి ఘనంగా కీర్తించాడు.
భట్టు తెలిపిన వృత్తాంతం: ఓ నలగామరాజా! మీరు రాయబారిగా వచ్చిన అలరాజును చంపించారు. దానితో మలిదేవరాజుకు కోపం వచ్చి తన వారందరితో కలిసి కారెయపూడి యుద్ధ రంగానికి చేరాడని రాయబారిగా వచ్చిన భట్టు తెలిపాడు. వీరులంతా అలరాజుతో పాటే తాము కూడా యుద్ధం చేసి మరణిస్తామంటూ యుద్ధానికి తొందర పడుతున్నారు. మలిదేవరాజు మాత్రం మీ నేరాన్ని క్షమించి నన్ను మీ దగ్గరికి రాయబారిగా పంపాడు.
రాయబార వృత్తాంతం: లోకంలో పగను పెంచే దుష్టులే ఉంటారు. కానీ పగను అణిచేవారు ఉండరు. మీరు నరసింగరాజును మలిదేవరాజు వద్దకు పంపండి. పగలు - ప్రతీకారాలు మరిచి అందరూ కలిసి మిమ్మల్ని ఎదిరించేవారు లేకుండా సుఖంగా పల్నాడును పాలించండి. లోకంలో ఎప్పటికీ యుద్ధం మంచిది కాదు. దాని వల్ల దేశం నాశనమవుతుంది. భాండాగారంలో ధనం ఉండదు. సైన్యం బలం తగ్గుతుంది. పనివారు జీతాలు ఇవ్వమని కోరుతారు. రాజు, బంటు అనే హద్దు పోతుంది. శత్రువులు మన రాజ్యాన్ని ఆక్రమించడానికి సిద్ధపడతారు. మీలో మీరే పోరాడుకుంటే చూసేవారికి చులకన అవుతుంది. శత్రువులు మీ రహస్యాలను తెలుసుకుంటారు. దుష్టులు మీ దగ్గరకు వచ్చి చెడు మాటలు చెప్పి పగలను పెంచుతారు. దానితో మీ కీర్తి బలం, రాజ్యం చెడిపోతాయి. మీ రాజ్యం ఇతరుల అధీనంలోకి వెళుతుంది.
స్వాతంత్య్ర హీనుల కష్టాలు: స్వతంత్రత లేనివారి కష్టాలు శివుడికి కూడా చెప్పడం అశక్యం. స్వాతంత్య్రం లేకపోతే పంజరంలో పక్షుల్లా, పాములవాడి బుట్టలో పాముల్లా, గంగిరెద్దుల్లా, బోనులో పులిలా పడి ఉండాలి. మన వాక్కు, శరీరం బంధితమవుతాయి. మనసులో పుట్టిన మంచి ఆలోచనలు ఆచరణలో పెట్టడం శక్యం కాదు. అలాంటప్పుడు వారు బతికినా ఫలం ఉండదు. ఎంతో దుర్లభమైన నరజన్మ దూషితం అవుతుంది. ఇలాంటి అస్వతంత్రత శత్రువులకు సైతం వద్దు. స్వతంత్రత లేకపోతే కీర్తి నశించి అపకీర్తి అధికమవుతుంది.
ఉభయ పక్షాల ఐక్యత వల్ల లాభాలు: మీ రెండు వర్గాలు ఒకటిగా ఉంటే అన్ని కార్యాలూ నెరవేరుతాయి. ప్రజలకు మంచి జరుగుతుంది. పంటలు పండుతాయి. ధనం మీ వద్ద ఉంటే సేవకులు మిమ్మల్ని కాపాడతారు. మీరు శత్రురాజులను జయించి ధనం సంపాదించవచ్చు. మీకు కీర్తి వస్తుంది. పూర్వం కౌరవులు కలహం పెంచుకొని పడిన కష్టాలు మనం వినలేదా! కాబట్టి పగ పెంచుకోవడం తగదు. నాకు మీ రెండు పక్షాల వారు ఒకటే. కాబట్టి నీతియుక్తంగా చెప్పాను. నా మాట వినండి అని భట్టు రాయబారం చేశాడు. 


3 మార్కుల ప్రశ్నలు

1. పోరు మంచిది గాదు భూమినెక్కడను
జ: కవి పరిచయం: ఈ వాక్యం శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర నుంచి గ్రహించిన శాంతి కాంక్ష అనే పద్యభాగంలోనిది.
సందర్భం: మలిదేవరాజు భట్టును నలగామరాజు వద్దకు రాయబారిగా పంపాడు. పగను పెంచే దుష్టులే కానీ అణిచేవారు లోకంలో ఎవరూ లేరు. నరసింగరాజును మలిదేవరాజు వద్దకు పంపండి. మీరందరూ ఏకమై పల్నాటి రాజ్యాన్ని పాలించుకోండి. లోకంలో ఎప్పుడూ యుద్ధం మంచిది కాదు అంటూ నలగామరాజుకు భట్టు హితవు చెప్పిన సందర్భంలోనిది.
అర్థం: లోకంలో ఎప్పుడూ, ఎక్కడ యుద్ధం మంచిది కాదు.
వ్యాఖ్య: మలిదేవరాజు వద్దకు నరసింగరాజును పంపితే వారికి మంచి జరుగుతుందని, లోకంలో ఎప్పుడూ యుద్ధం వల్ల మంచి జరగదని భట్టు అభిప్రాయం.


2. చెప్పంగనలవియే శివునకునైన
జ: కవిపరిచయం: ఈ వాక్యం శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర నుంచి గ్రహించిన శాంతి కాంక్ష అనే పద్యభాగంలోనిది.
సందర్భం: మలిదేవరాజు భట్టును నలగామరాజు వద్దకు రాయబారిగా పంపాడు. మీలో మీరు శత్రుత్వాలను పెంచుకొని పోరాడితే చూసేవారికి చులకన అవుతుంది. మీరు కలిసుంటే రాజ్యం ఇతర రాజులకు శక్యం కాదు అంటూ స్వాతంత్య్ర హీనుల కష్టాలను భట్టు నలగామరాజుకు చెప్పిన సందర్భంలోనిది.
అర్థం: ఈశ్వరుడంతటి వాడికి కూడా చెప్పడానికి శక్యం కాదని భావం.
వ్యాఖ్య: స్వాతంత్య్రాన్ని పోగొట్టుకొని బానిసలుగా ఇతర రాజులకు లొంగి ఉండటం వల్ల కలిగే కష్టాలను ఈశ్వరుడు సైతం చెప్పలేడని భావం.


3. జన్మఫలంబేమి చచ్చుటే మేలు
జ: కవి పరిచయం: ఈ వాక్యం శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర నుంచి గ్రహించిన శాంతి కాంక్ష అనే పద్యభాగంలోనిది.
సందర్భం: నలగామరాజు వద్దకు మలిదేవరాజు భట్టును రాయబారిగా పంపాడు. మనిషి తన మనసులో పుట్టిన ఆలోచనలను ఆచరించగలగాలి. తనకు కలిగిన తలంపులను ఆచరణలో పెట్టడానికి శక్యం కాకపోతే అలాంటి వ్యక్తి జన్మకు ఫలం ఉండదు. ఆ వ్యక్తి బతకడం కంటే చావడమే మంచిదని భట్టు నలగామరాజునకు చెప్పిన సందర్భంలోనిది.
అర్థం: ఆ వ్యక్తి పుట్టుకకు ఫలం ఉండదు. అతడు మరణించడమే మంచిదని భావం.
వ్యాఖ్య: తన మనసులో పుట్టిన మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టలేని వాడి జన్మకు ఫలితం ఉండదని వాడు మరణించడమే మేలని భావం.


4. కౌరవులెల్ల గతిచెడి పడినట్టి కష్టముల్‌ వినమె
జ: కవి పరిచయం: ఈ వ్యాఖ్య శ్రీనాథుడు రచించిన పల్నాటి వీరచరిత్ర నుంచి గ్రహించిన శాంతి కాంక్ష అనే పద్యభాగంలోనిది.
సందర్భం: ఇది ఆంధ్రభూమిలో పల్నాటి సీమలో 12వ శతాబ్దంలో జరిగిన చారిత్రక గాథమలిదేవరాజు నలగామరాజు వద్దకు పంపిన రాయబారి భట్టు స్వాత్రంత్య హీనత వల్ల కలిగే కష్టాలను రాజుకు వివరించి చెప్పాడు. రెండు పక్షాల వారూ ఒకటిగా ఐకమత్యంతో ఉంటే కలిగే మేలును కూడా వివరించాడు. అలాకాకుండా వీరిద్దరూ కలహించుకుంటే కౌరవుల్లా గతి చెడి కష్టపడతారని సోదాహరణంగా భట్టు నలగామరాజుకు చెప్పిన సందర్భంలోనిది. పూర్వం కౌరవులంతా దుర్గతి పాలై వారు పడిన కష్టాలు మనం వినలేదా?
అర్థం: పూర్వం కౌరవులంతా దుర్గతి పాలై వారు పడిన కష్టాలు మనం వినలేదా?
వ్యాఖ్య: అన్నదమ్ములైన పాండవులతో విరోధం పెట్టుకొని కౌరవులు సర్వనాశనమైన విషయం మనకు తెలిసిందే కాబట్టి సోదరులైన మీరు కలహించి కౌరవుల్లా సర్వనాశనం కావద్దని నలగామరాజుకు భట్టు హితం చెప్పాడు.

5. శ్రీనాథుడి గురించి రాయండి. 
జ: శ్రీనాథుడు తెలుగులో పురాణ ప్రబంధ యుగాలకు వారధిగా నిలిచిన మహాకవి. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. శ్రీనాథుడి తల్లి భీమాంబిక, తండ్రి మారయ. ఈయన బాల్యంలోనే మరుత్తరాట్చరిత్రంను రచించారు. శ్రీనాథుడు సకల విద్యాసనాథుడు. బ్రాహ్మీ దత్త వరప్రసాదుడు. ఈశ్వరార్చన కళాశీలుడు. కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానకవి, విద్యాధికారి. ఈయన ప్రౌఢ దేవరాయల సభలో గౌఢ డిండిమ భట్టును ఓడించి అతడి కంచుఢక్కను పగుల గొట్టి ప్రౌఢదేవరాయల కనకాభిషేకాన్ని పొందాడు.
       శ్రీనాథుడు శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, భీమ ఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర గ్రంథాలను రచించాడు. శ్రీనాథుడికి ‘కవి సార్వభౌముడు’ అనే బిరుదు ఉంది. చివరి రోజుల్లో ఈయనను పోషించే రాజులు లేకపోయారు. కృష్ణా తీరంలోని బొడ్డుపల్లె అనే గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు.


1 మార్కు ప్రశ్నలు

1. శాంతి కాంక్ష పాఠ్యభాగ రచయిత ఎవరు?
జ: శాంతి కాంక్ష పాఠ్యభాగ రచయిత శ్రీనాథుడు.
2. శ్రీనాథుడికి ఎవరు కనకాభిషేకం చేశారు?
జ: ప్రౌఢ దేవరాయలు శ్రీనాథుడికి కనకాభిషేకం చేశాడు.
3. నలగామరాజు తల్లి పేరేమిటి?
జ: నలగామరాజు తల్లి పేరు మైలమ్మ.
4. రాయబారానికి వచ్చి వధించబడినవారు?
జ: రాయబారానికి వచ్చి వధించబడినవారు అలరాజు.
5. ఖర దూషణాదులు హతమైన చోటేది?
జ: ఖర దూషణాదులు హతమైన చోటు శ్రీశైలం ప్రాంతంలోని కారెయపురి అంటే కారెంపూడి.
6. బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి?
జ: బ్రహ్మనాయుడు మలిదేవరాజు మంత్రి.
7. నాయకురాలిగా ప్రసిద్ధి చెందినవారు?
జ: నాయకురాలిగా ప్రసిద్ధి చెందినవారు నాగమ్మ.
8. అన్ని జన్మల్లోకెల్లా దుర్లభమైంది ఏది?
జ: అన్ని జన్మల్లో దుర్లభమైంది నరజన్మ.
 

అదనపు ప్రశ్నలు (3 మార్కులు)
1. 
భట్టు నలగామరాజును ఏమని స్తుతించాడు?
2. స్వాతంత్య్ర హీనులు ఎలా ఉంటారని భట్టు ఉపమించాడు?
3. జన్మఫలంగా భట్టు ఏమని చెప్పాడు?
 

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు 

Posted Date : 12-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌