• facebook
  • twitter
  • whatsapp
  • telegram

3. హనుమత్సందేశము

ప్రతిపదార్థాలు - తాత్పర్యాలు

1. ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
    డున్నాఁడిదె కపులఁ గూడి, యురుగతి రానై
    యున్నాఁడు, నిన్నుఁ గొని పో
    నున్నాఁడిది నిజము నమ్ము ముర్వీ తనయా!
ప్రతిపదార్థం
    ఉర్వీ తనయా = భూదేవికి పుత్రికవైన ఓ సీతాదేవీ!
    రాఘవుడు = రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముడు
    లెస్స = క్షేమంగా
    ఉన్నాడు = ఉన్నాడు
    ఇదె = ఇదిగో    
    కపులఁ గూడి (కపులన్‌ + కూడి) = వానరులతో కలిసి (వానర సైన్యంతో కలిసి)
    ఉన్నాడు = ఉన్నాడు
    ఉరు గతిన్‌ = శ్రేష్ఠమైన నడకతో (వేగంగా)
    రానైయున్నాడు = ఇక్కడికి రాబోతున్నాడు
    నిన్నున్‌ = నిన్ను
    కొని = తీసుకొని (ఇక్కడి నుంచి తీసుకొని)
    పోనున్నాడు (పోన్‌ + ఉన్నాడు) = వెళ్లబోతున్నాడు
    ఇది నిజం = నేను చెప్పే ఈ విషయం సత్యమైంది
    నమ్ముము = (నా మాటలు) నమ్ము  
తాత్పర్యం: భూపుత్రికవైన ఓ సీతా! రాముడు క్షేమంగా ఉన్నాడు. ఇదిగో వానరులతో కలిసి  వేగంగా రానున్నాడు. నిన్ను తీసికొని వెళ్లబోతున్నాడు. నేను చెప్పేది సత్యం. నా మాటలు నమ్ము అని హనుమ సీతతో అన్నాడు.


2. తమ్ముని గూడి పుణ్య గుణ ధాముఁడు, రాముఁడు వచ్చి మాల్యవం
    తమ్మున సైన్య సంఘము ముదంబునఁ గొల్వంగ నుండి భూమిపై
    మిమ్ములఁజూచి రండనుచు మేటి కపీంద్రులఁ బుచ్చి, యందు మొ
    త్తమ్ముగ మమ్ముఁ గొందఱను దక్షిణ భాగము చూడఁ బంపుచున్‌
ప్రతిపదార్థం
     పుణ్యగుణ, ధాముడు
    పుణ్యగుణ = పవిత్రమైన గుణాలకు
    ధాముడు = నిలయమైన వాడగు
    రాముడు = శ్రీరాముడు
    తమ్మునిగూడి = తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి
    వచ్చి = వచ్చి
    మాల్యవంతమ్మునన్‌ = మాల్యవంతం అనే పర్వతం పైన
    సైన్య సంఘము = సైనికుల సమూహం (వానర సైన్యం)
    ముదంబునన్‌ = సంతోషంతో
    కొల్వగన్‌ = సేవిస్తుండగా
    ఉండి = ఉండి
    భూమిపైన్‌ = భూమండలంపైన
    మిమ్ములన్‌ = విమ్మల్ని (సీతా మహాదేవిని)
    చూచి రండనుచున్‌ (చూచి, రండు + అనుచున్‌) = చూసి రండి అంటూ
    మేటి కపీంద్రులన్‌  
    మేటి = శ్రేష్ఠులైన (గొప్పవారైన)
    కపీంద్రులన్‌ (కపి + ఇంద్రులన్‌) = వానర శ్రేష్ఠులను
    పుచ్చి = పంపి
    అందున్‌ = ఆ వానర వీరుల్లో 
    మొత్తమ్ముగన్‌ = గుంపుగా
    మమ్మున్‌ = మమ్మల్ని
    కొందఱను = కొంత మందిని
    దక్షిణ భాగము = దక్షిణ దిశ భాగాన్ని  
    చూడన్‌ = వెతికి చూడటానికి
    పంపుచున్‌ = పంపుతూ
తాత్పర్యం: పుణ్య గుణరాశియైన రాముడు తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వచ్చి మాల్యదత్పర్వతం పై సైనికుల సమూహం సంతోషంతో సేవిస్తుండగా అక్కడ ఉన్నాడు. భూమండలంలో మిమ్మల్ని చూసి రమ్మని గొప్ప వానర శ్రేష్ఠులను పంపాడు. అందులో మాలో కొంతమందిని దక్షిణ దిశా భాగం చూడటానికి పంపుతూ (రాముడు నాతో ఇలా అన్నాడు).


3.  రాముని డాఁగురించి, నిను రావణుఁ డెత్తుక వచ్చువేళ, నీ
    హేమ విభూషణావళుల నేర్పడ ఋశ్య మహాద్రి వైచినన్‌
    మే మవి తీసి దాఁచితిమి, మీ పతి యచ్చటి కేఁగుదేరగాఁ
    దామరసాప్త నందనుండు తా నవి సూపినఁ జూచి మెచ్చుచున్‌
ప్రతిపదార్థం
    రావణుడు = రావణాసురుడు
    రామునిన్‌ = శ్రీరాముడిని
    డాఁగురించి = మోసగించి
    నినున్‌ = నిన్ను (అంటే సీతవైన నిన్ను)
    ఎత్తుక వచ్చువేళన్‌ = (దొంగిలించి) తీసుకొని వచ్చే సమయంలో
    నీ హేమవిభూషణావళునన్‌
    నీ = నీ యొక్క
    హేమ = బంగారపు
    విభూషణ + ఆవళులన్‌ = ఆభరణాల సమూహాన్ని 
    ఏర్పడన్‌ = (స్పష్టంగా) కనిపించేలా 
    ఋశ్య మహాద్రిన్‌ = ఋశ్యమూకం అనే గొప్ప పర్వతంపై
    వైచినన్‌ = (నీవు) గిరాటు వేయగా (విసిరి వేయగా)
    మేము = మేము (అంటే వానరులమైన మేము)
    తీసి దాచితిమి = (వాటిని) తీసి దాచాం 
    మీ పతి = మీ భర్త శ్రీరాముడు
    అచ్చటికిన్‌ = ఆ ఋశ్యమూక పర్వతం వద్దకు 
    ఏగుదేరగా = రాగా
    తామరసాప్త నందనుడు (తామరస + ఆప్త, నందనుడు)
    తామరస + ఆప్త = తామర పద్మాలకు హితుడైన సూర్యుడి యొక్క
    నందనుడు = కుమారుడైన సుగ్రీవుడు
    తాను = తాను
    అవి + చూపినన్‌ = నీవు పారవేసిన నగలను చూపించగా
    చూచి = (వాటిని రాముడు) చూసి
    మెచ్చుచున్‌ = మెచ్చుకుంటూ
తాత్పర్యం: రాముడిని మోసగించి రావణుడు నిన్ను ఎత్తుకొని తీసుకువచ్చే సమయంలో నీవు నీ బంగారు నగలను ఋశ్యమహాపర్వతంపై గిరాటు వేశావు. అప్పుడు మేము వాటిని తీసి దాచాం. నీ భర్త రాముడు ఆ పర్వతం వద్దకు వచ్చినప్పుడు సూర్యపుత్రుడైన మా ప్రభువు సుగ్రీవుడు ఆ నగలను రాముడికి చూపించాడు. వాటిని చూసి రాముడు మెచ్చుకుంటూ (ముందు పద్యంతో అన్వయం) 


4.  ఉరుతరాటవిలోన మహోగ్రతపము
     వాయుదేవుని గుఱియించి వరుసఁజేసి
     యంజనా దేవి గనియె నన్నర్థితోడ
     నర్కజుని మంత్రి హనుమంతుఁడనెడువాఁడ  
ప్రతిపదార్థం
    అంజనాదేవి = (మా అమ్మ) అంజనాదేవి
    ఉరుతరాటవిలోనన్‌ (ఉరు, తర + అటవి లోనన్‌) = మిక్కిలి గొప్పదైన అడవిలో
    మహోగ్రతపమున్‌ (మహా + ఉగ్రతపమున్‌) = మిక్కిలి భయంకరమైన తపస్సును
    వాయుదేవుని గుఱియించి = వాయుదేవుడిని ఉద్దేశించి
    వరుసఁజేసి (వరుసన్‌ + చేసి) = ఎడతెగకుండా చేసి (నిరంతరంగా చేసి)
    నన్నున్‌ = నన్ను
    అర్థితోడన్‌ = కోరికతో (కోరుకొని)
    కనియెన్‌ = కనినది (కన్నది)
    అర్కజూని = సూర్యపుత్రుడైన సుగ్రీవుడిని
    మంత్రిన్‌ = మంత్రిని
    హనుమంతుడు = హనుమంతుడు
    అనెడువాడన్‌ = అని పిలిచే వాడిని
తాత్పర్యం: మా అమ్మ అంజనాదేవి వాయుదేవుడిని ఉద్దేశించి మిక్కిలి పెద్ద అడవిలో గొప్ప భయంకరమైన తపస్సును ఎడ తెగకుండా చేసి నన్ను కోరి కన్నది. నేను సుగ్రీవుడి మంత్రిని. నన్ను హనుమంతుడు అని పిలుస్తారు.


5.  జనకుని భంగి రామ నృపచంద్రుని, ననున్ను దల్లిమాఱుగాఁ
    గని, కొలువంగ నేర్చు గుణ గణ్యుని, లక్ష్మణ నీతి పారగున్‌
    వినఁ గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
    వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా
ప్రతిపదార్థం    
    రామనృపచంద్రుని
    రామ = రాముడు అనే
    నృపచంద్రుని = రాజుల్లో చంద్రుడి లాంటి వాడిని
    జనకుని భంగిన్‌ = తండ్రిలా 
    నన్నునున్‌ = నన్ను (అంటే సీతమ్మనైన నన్ను)
    తల్లి మాఱుగాన్‌ = తల్లికి బదులుగా (అంటే తల్లిలా)
    కని = చూచి
    కొలువంగన్‌ = సేవించడానికి 
    నేర్చు = ఇష్టపడే
    గుణగణ్యునిన్‌ = సద్గుణాలతో కొనియాడదగిన వాడు 
    నీతి పారగున్‌ = నీతిలో మిక్కిలి నేర్పరియైన 
    లక్ష్మణున్‌ = లక్ష్మణుడిని
    అవివేకము చేతను = తెలివి తక్కువ తనంతో
    వినఁగనరాని = అరుదైన (వినడానికి అయోగ్యమైన)
    పల్కులు = మాటలు
    పల్కినట్టి = మాట్లాడినట్టి
    ఆ వినుత మహాఫలంబు
    ఆ = ఆ
    వినుత = ప్రసిద్ధమైన
    మహాఫలంబు = గొప్ప ఫలితాన్ని (ఆ గొప్ప పాప ఫలితాన్ని)
    అనుభవించితిన్‌ = నేను అనుభవించాను
    అని = అని
    చాటి చెప్పుమా = స్పష్టంగా చెప్పు (డప్పు కొట్టి చాటించేలా గట్టిగా చెప్పు)
తాత్పర్యం: శ్రీరామచంద్రుడిని తండ్రిగా, నన్ను తల్లికి బదులుగా చూసి మమ్మల్ని సేవించడానికి ఇష్టపడే గుణవంతుడు, నీతిమంతుడైన లక్ష్మణుడిని అవివేకంతో అనరాని, వినరాని, కనరాని మాటలు మాట్లాడినట్టి గొప్ప పాప ఫలితాన్ని నేను అనుభవించానని స్పష్టంగా చెప్పు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు 
1.   సీతాదేవితో హనుమ ఏమని పలికాడు?
జ:
 శింశుపా వృక్షంపై నుంచి హనుమ సీతతో పలికిన పలుకులు: సీతాదేవి! రాముడు క్షేమంగా వానరులతో కలిసి ఉన్నాడు. త్వరలో ఇక్కడకు వచ్చి నిన్ను తీసుకువెళతాడు. ఇది నిజం. నమ్ము అని హనుమంతుడు తెలిపాడు.
కొమ్మపై నుంచి దూకి హనుమ సీతతో అన్న మాటలు: ‘అమ్మా! సీతా! పుణ్యాత్ముడైన రాముడు మాల్యవంత పర్వతంపై తమ్ముడు, సైన్యంతో కలిసి ఉన్నాడు. నిన్ను వెతకమని వానరవీరులను అన్ని దిక్కులకూ పంపాడు. మాలో కొందరిని ఈ దక్షిణ దిశకు పంపాడు. నేను సమర్థుడిని అని గుర్తించి నీకు ఇవ్వడానికి రాముడు నాతో తన ఉంగరాన్ని పంపాడు. ఇదిగో తీసుకో’ అని హనుమ సీతకు ఉంగరాన్ని ఇచ్చాడు.
సీతకు నమ్మకం కలగడానికి హనుమ చెప్పిన మాటలు: ‘సీతమ్మా! రావణుడు రాముడిని మోసగించి నిన్ను ఎత్తుకొని వెళ్లేటప్పుడు నీవు నీ బంగారు నగలను ఋశ్యమూక పర్వతంపై విసిరావు. వాటిని మేము దాచి రాముడు అక్కడికి వచ్చినప్పుడు సుగ్రీవుడు ఆ నగలను చూపించాడు. 
రాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. దుందుభి అనే రాక్షసుడి శరీరాన్ని దూరంగా తన్నాడు. వాలిని చంపాడు. అంగదుడిని యువరాజును చేశాడు. రాముడు ఇప్పుడు వానర సైన్యంతో మాల్యవంత పర్వతంపై ఉన్నాడు. నిన్ను వెతకడానికి మేము అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిశకు వచ్చాం. నేను సముద్రాన్ని దాటి లంకలో వెతుకుతూ నిన్ను ఇక్కడ చూశాను. నీతో రావణుడు క్రూరంగా మాట్లాడేటప్పుడు నేను ఈ చెట్టు మీద ఉన్నాను’.
హనుమ రామలక్ష్మణుల రూపాన్ని గురించి చెప్పడం: సీతమ్మా రాముడు నీల మేఘం లాంటి శరీర రంగు కలిగినవాడు. రాముడు పద్మపు రేకుల లాంటి కళ్లు, శంఖంలా ఉండే కంఠం, బలిష్ఠమైన శరీరాకృతి కలిగినవాడు. ఆజానుబాహుడైన రాముడి చేతులు, పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి. రాముడు సత్యం మాట్లాడతాడు. లక్ష్మణుడు కూడా రాముడిలా ఉంటాడు. కానీ  లక్ష్మణుడు బంగారు రంగు శరీరం గలవాడు.   
హనుమ ఆత్మ వృత్తాంతం:
 ‘అమ్మా! సీతా! మా అమ్మ అంజనాదేవి వాయుదేవుడి గురించి తపస్సు చేసి నన్ను కన్నది. నేను సుగ్రీవుడి మంత్రిని. నా పేరు హనుమంతుడు’ అని సీతకు  తన కథను చెప్పాడు.
సీత శిరోరత్నాన్ని ఇమ్మని హనుమ కోరడం: ‘అమ్మా! నీకు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఇచ్చాను. దూత ఖాళీ చేతులతో వెళ్లకూడదు. నేను నిన్ను చూశానని రాముడికి నమ్మకం కలగడానికి నీవు నీ శిరోరత్నాన్ని ఇవ్వు’ అని హనుమ  సీతను కోరాడు.
సీత చెప్పిన సందేశాన్ని విని హనుమ పలుకులు: ‘అమ్మా! సీతా సూర్యోదయం కావడానికి ముందే సముద్రాన్ని దాటి నేను నిన్ను రాముడి వద్దకు తీసుకువెళతాను. నా వీపుపై కూర్చో’ అని హనుమ సీతను కోరాడు.
రాముడిని లంకకు తీసుకు రమ్మన్న సీతతో హనుమ పలికిన మాటలు: ‘అమ్మా! సీతా! నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవుడు, సుషేణుడు, వానర సైన్యంతో లంకకు వచ్చి రావణుడిని యుద్ధంలో చంపి నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు. ఈ మాట నిజం నమ్ము’ అని హనుమ సీతాదేవితో పలికాడు.

2. సీతాదేవి తన సందేశాన్ని హనుమతో ఏమని వివరించింది.
జ:
సీతాదేవి హనుమంతుడిని భూమండలంలో బ్రహ్మ కల్పముల కాలం వర్ధిల్లు అని దీవించి, తన సందేశాన్ని ఈవిధంగా చెప్పింది.
సీతా సందేశం: ‘ఓ వాయుపుత్రా! పుణ్యాత్మా! నా మనసులో ఎప్పుడూ శ్రీరాముడి పాదాలే విడువకుండా ఉంటాయని రాముడికి చెప్పు. ఇప్పుడు రావణుడు వచ్చి గర్వంతో నన్ను ఎన్ని పరుష వాక్యాలు మాట్లాడాడో అవన్నీ నీవు చెవులారా విన్నావు. ఆ మాటలన్నింటినీ రాముడికి నాపై దయ కలిగేలా చెప్పు’.
సీత తపస్సు - రాముడి ప్రత్యక్షం కమ్మని ప్రార్థన: ‘ఓ బలశాలీ! హనుమా! నా పొడవైన తల వెంట్రుకలు జడలుగా కట్టి, మలిన వస్త్రాన్ని ధరించి, నేలపై దుమ్మును విభూతిగా ధరించి, రాముడిని మనసులో నిలిపి, రామ మంత్రాన్ని జపిస్తూ, దుష్టమృగాల లాంటి రాక్షసుల మధ్య ఉపవాసంతో నిద్రమాని, నేలపై పడుకొని శత్రువుల లంకా ద్వీపం అనే అరణ్యంలో రాముడి గురించి నేను తపస్సు చేస్తున్నాను. రాముడిని నాకు ప్రత్యక్షమవమని దయతో నీవు చెప్పు’.
లక్ష్మణుడికి సీత సందేశం: ‘ఓ మహా సాహసం గల హనుమా! లక్ష్మణుడు రాముడిని తండ్రిలా, నన్ను తల్లిలా సేవించే గుణశాలి. లక్ష్మణుడు నీతిమంతుడు. అలాంటి లక్ష్మణుడిని నేను అవివేకంతో అనరాని, వినరాని, కనరాని మాటలు అన్నాను. అలా మాట్లాడటం వల్ల కలిగిన మహా పాప ఫలాన్ని నేను అనుభవించానని లక్ష్మణుడితో చెప్పు. నేను అప్పుడు అన్న అవివేకపు మాటలను తన మనసులో ఉంచుకోకుండా నా మానాన్ని రక్షించమని రాముడి తమ్ముడైన లక్ష్మణుడికి దయతో చెప్పు’ అని సీత హనుమకు చెప్పింది.
రాముడి దగ్గరకు తీసుకువెళతానన్న హనుమకు సీత చెప్పిన సందేశం:
‘హనుమా! నీతో నేను వస్తే రాముడికి అపకీర్తి వస్తుంది. నేను రాముడిని తప్ప ఇతరులను ముట్టుకోను. నన్ను దొంగిలించి తెచ్చిన రావణుడిని, అతడి మిత్రులను యుద్ధంలో చంపకుండా దొంగతనంగా తీసుకువెళ్లడం రాజులకు తగదు.
     రాముడు ముల్లోకాల్లో మహావీరుడు. తన భార్యను మోసంతో తెచ్చిన రావణుడిని యుద్ధంలో చంపి నన్ను తీసుకొనివెళ్లడమే రాముడికి ధర్మం. నీవు రాముడికి పుత్రుడితో సమానుడవు. ఆయనకు నమ్మిన బంటువు. నేను నీతో రావడం తప్పు కాదు. అయినా పగ తీర్చుకోకుండా నీతో రావడం సముచితం కాదు. కాబట్టి నీవు రాముడికి ఈ విషయాలన్నీ చెప్పి తొందరగా లంకకు ఆయనను తీసుకురా’ అని సీత హనుమకు తన సందేశాన్ని వివరించింది.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు
1. శ్రీరాముడి రూపాన్ని హనుమ ఏమని వర్ణించాడు?
జ:
‘శ్రీరాముడు నీల మేఘం కాంతిని పోలిన శరీరం గలవాడు. తెల్లటి పద్మపు రేకుల లాంటి కళ్లు ఉన్నవాడు. శంఖం లాంటి కంఠం, చక్కని శరీర సౌష్ఠవం, పొడవైన బాహువులు గలవాడు. రాముడు గొప్ప దుందుభి లాంటి కంఠ ధ్వని గలవాడు. ఆయన పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి. రాముడికి అందమైన గుల్ఫాలు ఉన్నాయి. రాముడు మోసం తెలియనివాడు. సత్యాన్నే మాట్లాడతాడు, శుభ లక్షణాలు గలవాడు’ అని హనుమ శ్రీరాముడి రూపాన్ని వర్ణించాడు.


2.  శ్రీరాముడి ముద్రికను చూసి సీత హనుమతో ఏమన్నది?
జ:
రాముడు పంపిన ముద్రికను హనుమంతుడు సీతకు తెచ్చి ఇచ్చాడు. సీత హనుమంతుడు తనకు ఇచ్చిన ఉంగరాన్ని చూసి అది రాముడి చేతి ముద్రిక అని గుర్తించింది. సీత తనలో తాను హనుమంతుడిని బాగా మెచ్చుకొంది. అయినా వచ్చిన వానరుడైన హనుమంతుడిని నమ్మలేక  ఈవిధంగా చెప్పింది.
సీత హనుమతో పలికిన మాటలు:  
‘ఓ వానరా! నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ ఉద్దేశాన్ని గురించి నాకు చెప్పు. నా ప్రభువైన శ్రీరాముడి రూప లక్షణాన్ని స్పష్టంగా నాకు వెంటనే తెలిసేలా, నమ్మకం కలిగేలా చెప్పు. నేను నిన్ను నమ్మలేను. నీ పుట్టుపూర్వాల గురించి నాకు వినిపించు. అలాగే నా ప్రభువు శ్రీరాముడి గురించి వివరంగా చెప్పు’ అని సీత హనుమంతుడిని అడిగింది.


3.  సీతాదేవి హనుమంతుడిని ఏమని దీవించింది?
జ:
హనుమంతుడు సీతాదేవిని చూసినందుకు గుర్తుగా రాముడికి చూపించడానికి సీతాదేవిని ఆమె ధరించే శిరోరత్నాన్ని ఇవ్వమన్నాడు. సీత హనుమకు తన శిరో రత్నాన్ని ఇచ్చి హనుమంతుడిని ఈవిధంగా దీవించింది.
సీత దీవెన: ‘ఓ హనుమా! నేను నీ వల్ల ఈ రోజున సూర్యవంశం అనే సముద్రానికి చంద్రుడిలా ఆనందాన్ని కలిగించే శ్రీరాముడి క్షేమాన్ని గురించి వివరంగా విన్నాను. నేను పడిన అనేక కష్టాలను శ్రీరాముడికి తెలిసేలా చెప్పగలిగాను. నీవు నాకు చేసిన ఉపకారానికి సమానమైన ఉపకారాన్ని నేను చేయలేను. నీవు బ్రహ్మకల్పముల పాటు ఈ భూమండలంలో వర్ధిల్లు’ అంటూ సీత హనుమంతుడిని దీవించింది.


4.  మొల్ల గురించి రాయండి. 
జ:
 తెలుగులో రామాయణాన్ని రచించిన మొల్ల 16వ శతాబ్దానికి చెందినవారు. ఈమె గొప్ప కవయిత్రి. పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె తండ్రి ఆతుకూరి కేసన. మొల్ల గోపవరపు శ్రీకంఠమల్లేశుడి వరం వల్ల కవిత్వం చెప్పడం నేర్చుకుంది. ఈమె పోతనలా తన రామాయణాన్ని శ్రీరామచంద్రుడికే అంకింతం ఇచ్చింది. మొల్ల రామాయణం రాశిలో చిన్నదైనా వాసిలో మిన్న. ఈ రామాయణంలో మొత్తం 869 గద్య పద్యాలు ఉన్నాయి.
తెలుగులో చాలా రామాయణాలు రచించారు. తెలుగులో ఉన్న రామాయణాలన్నింటిలో ఎక్కువ జనాధరణ పొందేలా మొల్ల తన రామాయణాన్ని రచించింది. తేనె నోటికి తగలగానే నోరు ఏ విధంగా తియ్యగా అవుతుందో ఆ విధంగానే పద్యం చదవగానే వెంటనే అర్థం తెలిసేలా తేట తెలుగు మాటలతో మొల్ల రామాయణాన్ని రచించింది.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు
1. మొల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితమిచ్చింది?
జ: 
మొల్ల తన రామాయణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చింది.
 

2. హనుమత్సందేశం అనే పాఠ్యభాగాన్ని దేని నుంచి గ్రహించారు?
జ: 
హనుమత్సందేశం అనే పాఠ్యభాగాన్ని మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించారు. 
 

3. అర్క సంభవుడు అంటే ఎవరు?
జ: 
అర్క సంభవుడు అంటే సూర్యుడి కుమారుడైన సుగ్రీవుడు.
 

4. రాముడి గుర్తుగా సీతాదేవికి ఇవ్వడానికి హనుమంతుడు ఏం తెచ్చాడు?
జ: 
రాముడి గుర్తుగా సీతాదేవికి ఇవ్వడానికి హనుమంతుడు రత్నాంగుళీయకాన్ని తెచ్చాడు.
 

5. తన గుర్తుగా సీతాదేవి హనుమకు ఏం ఇచ్చింది?
జ: 
తన గుర్తుగా సీతాదేవి హనుమకు తన శిరోరత్నాన్ని ఇచ్చింది.
 

6. శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి?
జ: 
శ్రీరాముడు ఉన్న పర్వతం పేరు మాల్యవంతం.
 

7. హనుమంతుడి తల్లి పేరేమిటి?
జ: 
హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి.

సందర్భ సహిత వ్యాఖ్యలు
1. వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు
పరిచయం:
ఈ వాక్యం మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించిన హనుమత్సందేశం అనే పద్యభాగంలోనిది.
సందర్భం: రాముడు ఎలా ఉంటాడో చెప్పమని సీత హనుమంతుడిని అడిగింది. అప్పుడు హనుమంతుడు రాముడి రూపాన్ని సువివరంగా వర్ణించి చెప్పాడు. లక్ష్మణుడు కూడా రూప లక్షణాల్లో అన్ని విధాలా రాముడిలా ఉంటాడని, శరీర రంగు మాత్రం బంగారు వర్ణంలో ఉంటుందని హనుమంతుడు సీతాదేవికి చెప్పిన సందర్భంలోనిది.
అర్థం: లక్ష్మణుడు పోలికకు బంగారు వర్ణంలో ఉంటాడు.
వ్యాఖ్య: రాముడు నీల మేఘచ్ఛాయ గలవాడు. లక్ష్మణుడు మాత్రం బంగారపు రంగులో ఉంటాడని హనుమ సీతకు చెప్పాడు.
 

2.  సుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్‌
పరిచయం:
ఈ వాక్యం మొల్ల రచించిన రామయణంలోని సుందరకాండ నుంచి గ్రహించిన హనుమత్సందేశం అనే పద్యభాగంలోనిది.
సందర్భం: సీతకు హనుమంతుడు రాముడి వృత్తాంతాన్ని, రామలక్ష్మణుల రూపురేఖలను వర్ణించి చెప్పాడు. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకు ఇచ్చి తన వృత్తాంతాన్ని గురించి తెలిపాడు. దానితో సీత హనుమంతుడిని దీవించింది. హనుమంతుడి వల్లే రాముడి క్షేమాన్ని తెలుసుకొని తాను పడ్డ బాధలను చెప్పగలిగింది. ఇంత పెద్ద ఉపకారం చేసిన హనుమంతుడికి తాను ప్రత్యుపకారం చేయలేనని ఈ భూమండలంపై పెక్కు బ్రహ్మకల్పాల పాటు వర్ధిల్లాలని సీత దీవించిన సందర్భంలోనిది.
అర్థం: ఈ భూమిపై బ్రహ్మకల్పాల పాటు జీవించు. 
వ్యాఖ్య: హనుమంతుడు చేసిన ఉపకారానికి బదులు తీర్చగల శక్తి తనకు లేదని హనుమంతుడిని చాలాకాలం భూమండలంలో జీవించమని సీత దీవించింది.
 

3. విన్నవింపుము సత్త్వ సంపన్న! నీవు
పరిచయం:
ఈ వాక్యం మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించిన హనుమత్సందేశం అనే పద్యభాగంలోనిది. 
సందర్భం: సీతాదేవి తాను రాముడిని ఉద్దేశించి లంకాద్వీపం అనే అరణ్య సీమలో తపస్సు చేస్తున్నాని, ఆ విషయం రాముడికి చెప్పమని హనుమంతుడిని కోరింది. తన తపస్సును మెచ్చి రాముడిని ప్రత్యక్షం కావాలని చెప్పమని సీత హనుమంతుడిని కోరిన సందర్భంలోనిది.
అర్థం: ఓ బలం గల హనుమా! నీవు రాముడికి దయతో చెప్పు అని అర్థం. 
వ్యాఖ్య: సీత తాను ఘోర తపస్సు చేస్తున్నానని, కరుణించి తనకు దర్శనం ఇచ్చేలా రాముడికి చెప్పమని బలశాలియైన హనుమంతుడిని వేడుకుంది.
 

4. సౌమిత్రికిఁ జెప్పవయ్య సాహసి వర్యా!
పరిచయం:
ఈ వాక్యం మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించిన హనుమత్సందేశం అనే పద్యభాగంలోనిది.
సందర్భం: లక్ష్మణుడు వనవాస కాలంలో రాముడిని తండ్రిగా, సీతను తల్లిగా సేవించేవాడు. లక్ష్మణుడు గుణవంతుడు, నీతికోవిదుడు. అలాంటి లక్ష్మణుడిని సీత అవివేకంతో అనరాని మాటలు అన్నది. ఆ మాటలను మనసులో పెట్టుకోవద్దని, తన మానాన్ని కాపాడమని లక్ష్మణుడికి చెప్పమని సీత హనుమంతుడిని కోరిన సందర్భంలోనిది.
అర్థం: సాహసం గలవారిలో గొప్పవాడా! ఓ హనుమా! దయతో లక్ష్మణుడికి చెప్పు.
వ్యాఖ్య: లక్ష్మణుడు వినయ గుణాలు గలవాడు. లక్ష్మణుడిని అవివేకంతో అనరాని మాటలు అన్నానని బాధ పడింది. ఆ మాటలను పట్టించుకోకుండా తనను రక్షించమని లక్ష్మణుడికి చెప్పమని సీత హనుమంతుడిని వేడుకుంది.
 

5. దొంగిలి కొనిపోవదగునె దొరలకు నెందున్‌
పరిచయం:
ఈ వాక్యం మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ నుంచి గ్రహించిన హనుమంత్సందేశం అనే పద్యభాగంలోనిది.
సందర్భం: హనుమంతుడు సీతను తన వీపుపై కూర్చోబెట్టుకొని సూర్యుడు ఉదయించడానికి ముందే రాముడి వద్దకు తీసుకువెళతానని చెప్పాడు. కానీ సీత అందుకు అంగీకరించలేదు. రావణుడు తనను దొంగతనంగా లంకకు తెచ్చాడు. అలాంటి రావణుడిని, అతడి మిత్రులను సాహసంతో యుద్ధరంగంలో చంపకుండా దొంగిలించి తీసుకువెళ్లడం రాజులకు తగదని సీత హనుమంతుడికి చెప్పిన సందర్భంలోనిది.
అర్థం: దొంగిలించి తీసుకువెళ్లడం ఎక్కడైనా రాజులకు తగదు కదా అని అర్థం.
వ్యాఖ్య: రాజులు యుద్ధంలో శత్రువులను చంపి పగ తీర్చుకోవాలి. అంతేకాని దొంగతనంగా తీసుకువెళ్లడం తగదని సీత భావం.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

 

Posted Date : 13-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌