• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నా జీవిత యాత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు


1. రావూరి భరద్వాజ బాల్యం గురించి తెలపండి.
జ: రావూరి భరద్వాజ 1927లో కృష్ణా జిల్లా మోగులూరు గ్రామంలో మల్లికాంబ, కోటయ్య దంపతులకు జన్మించారు. భరద్వాజకు అయిదో ఏటనే కొల్లిపర కోటయ్య అక్షరాభ్యాసం చేశారు.
చదువు మానివేయడం: 1942లో భరద్వాజ ఎనిమిదో తరగతిలో చదువు మానేశాడు. దానికి ప్రత్యక్ష కారణం ఆ స్కూల్‌ హెడ్‌మాస్టారు అయితే పరోక్ష కారణం వారి కుటుంబ దరిద్రం అని చెప్పాలి. స్కూలు ఇన్‌స్పెక్టర్‌ తనిఖీకి వచ్చిన రోజు చిరిగిన బట్టలు తొడుక్కున్నాడని భరద్వాజను ఆ స్కూలు హెడ్‌మాస్టారు నిలబెట్టి, వంగోబెట్టి బెత్తంతో గొడ్డును కొట్టినట్లు కొట్టాడు. ఆ దెబ్బలను భరించలేక బెత్తాన్ని విరిచేసి, పుస్తకాల సంచిని గిరాటు వేసి, ఆ హెడ్‌మాస్టారును బండబూతులు తిట్టి స్కూలు నుంచి పారిపోయాడు. ఆ తర్వాత దేవాలయం రథంలో, గాలిగోపురం సందులో; చెరువు గట్లు, గుడిమెట్ల మీద దాక్కున్నాడు. చాలా కాలం తర్వాత గానీ ఇంటికి వెళ్లలేదు.
బాల్యంలో బతికిన తీరు: భరద్వాజ తిండి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా పనిచేశాడు. కో-ఆపరేటివ్‌ స్టోర్స్‌లో సరకులు అందించే కుర్రాడిగా, పొగాకు బారన్‌లో బొగ్గు వేసే కూలీగా, కలప అడితిలో రంపంలాగే కూలీగా పనిచేశాడు. కమ్మరి వద్ద తిత్తులు ఊది సమ్మెట వేశాడు. కొంతకాలం పేపర్‌ బాయ్‌గా పనిచేశాడు.
చదువుపై ఆసక్తి కలిగించిన సంఘటన: భరద్వాజకు చిన్నప్పుడు జరిగిన ఒక అవమానం అతడిని చదువు వైపు మళ్లించింది. భరద్వాజ కంటే చిన్న కుర్రాడు మనుచరిత్రలోని ఒక పద్యాన్ని అప్పజెప్పాడు. ఆ కుర్రాడిని గ్రామ లైబ్రరీ అరుగు మీద కూర్చున్న వారంతా మెచ్చుకున్నారు. భరద్వాజ తండ్రికి మిత్రుడైన శేషయ్య భరద్వాజను ఆ కుర్రాడితో పోలుస్తూ తిట్టారు. అప్పుడు చుట్టూ ఉన్నవారు నవ్వారు. ఆ నవ్వు భరద్వాజను గాయపరిచింది. ఆ గాయం ఆయనలో పట్టుదలను పెంచి చదువుపైకి దృష్టి మళ్లించింది.
బాల్యంలో భరద్వాజ చదువు కోసం పడిన పాట్లు: భరద్వాజ పగలంతా కూలీ పనులు చేసి రాత్రి  గ్రామంలోని శివాలయంలో ప్రమిద వెలుతురులో చదువుకునేవాడు. ఆ గ్రామంలోని లైబ్రరీ పుస్తకాలు సంవత్సర చందా మూడు రూపాయలు కట్టిన వారికే ఇంటికి ఇచ్చేవారు. కొల్లూరు వెంకటేశ్వర్లు ఆ చందా కట్టి భరద్వాజకు ఇంటికి పుస్తకాలు తీసుకెళ్లే సావకాశం కల్పించారు. ఈ విధంగా భరద్వాజ బాల్యదశ సాగింది.


2. రావూరి భరద్వాజ రచనా వ్యాసాంగాన్ని వివరించండి.
జ: 
రావూరి భరద్వాజ ముందుగా పద్యాలు రాశారు. అందులో గణ, యతిప్రాసలు తప్ప కవిత్వం ఉండేది కాదు. జీషన్‌ ప్రభాత్‌ అనే కథకుడి ప్రోత్సాహంతో కొవ్వలి, చలం, కుటుంబరావు, గోపీచంద్‌ లాంటి రచయితల పుస్తకాలను బాగా చదివారు. వారిలా కథలు రాయడం మొదలు పెట్టారు. వాక్యం తర్వాత వాక్యం వచ్చేది కాదు. అయినా కథలు రాసి పత్రికలకు పంపేవారు. వాటిలో కొన్ని తిరిగి వచ్చేవి.
ఇదం జగత్‌ నవల అంకితం: రాతకోతలకు కావాల్సిన వైలెట్‌ పెన్సిల్‌ను, ఒక దస్తా కాగితాలను భరద్వాజకు ఆయన స్నేహితుడు త్రిపురనేని శివరామ కృష్ణయ్య కొని ఇచ్చారు. అందుకే ‘ఇదం జగత్‌’ అనే నవలను భరద్వాజ శివరామ కృష్ణయ్య, వారి ధర్మపత్ని హర్షమ్మకు అంకితం ఇచ్చారు.
   భరద్వాజ రాసి అచ్చయిన తొలికథ ‘విమల’. ఈ కథ 1946లో ప్రజామిత్ర వారపత్రికలో అచ్చయ్యింది. ఆ తర్వాత చాలా కథలు అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. భరద్వాజ తండ్రి కోటయ్య రంగా గారికి చెప్పి ఆయనకు జమీన్‌ రైతు అనే వారపత్రికలో చిన్న ఉద్యోగం ఇప్పించారు. ఆ తర్వాత ఆయన దీనబంధు పత్రికలో పని చేశారు.
   భరద్వాజ 1956లో మద్రాసు వెళ్లారు. అక్కడ వందల మంది రచయితలు, కవులు, పత్రికా సిబ్బంది, సినిమా వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ ఆయన ఊహకు అందని అనేక సందర్భాలను చవి చూశారు. ఆ సంఘటనలు, వ్యక్తులను ఆధారంగా చేసుకొని భరద్వాజ ‘పాకుడు రాళ్లు’ నవలను రాశారు. ఆ నవలలోని అన్ని పాత్రలు భరద్వాజకు తెలిసిన వారి ప్రతిరూపాలే. ఈ నవలకు 2013లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది.
   భరద్వాజ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో 1959లో గ్రామస్థుల కార్యక్రమ విభాగంలో స్క్రిప్టు రైటర్‌గా ప్రవేశించి 1987లో ఉద్యోగ విరమణ చేశారు. ఈయన తొలి పుస్తకం ‘రాగిణి’ 1950లో అచ్చయ్యింది. ఈ కథా సంపుటానికి చలం పరిచయం రాశారు. రెండో పుస్తకం ‘కొత్త చిగుళ్లు’ కూడా 1950లోనే అచ్చయ్యింది. ఈ పుస్తకాన్ని భరద్వాజ చలం గారికి అంకితం ఇచ్చారు.
   భరద్వాజ పుస్తకాల్లో ఎక్కువ భాగం విజయవాడలోని ఆదర్శ గ్రంథ మండలి, మచిలీపట్నంలోని తెలుగు విద్యార్థి ప్రచురణలు ప్రచురించాయి. ఇప్పటి వరకు ఈయనవి 140 పుస్తకాలు ముద్రించబడ్డాయి. భరద్వాజ రాసిన కొన్ని పుస్తకాలు ఇంగ్లిషు, హిందీ, గుజరాతీ భాషల్లోనూ వచ్చాయి. మరికొన్ని పుస్తకాలు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఈయనకు మొదటిసారి 1956లో జ్యోతి పాఠకులు ఎంపిక చేసిన కథకు స్వర్ణపతకం లభించింది. 1968లో విజయవిలాసం అనే కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1983లో జీవన సమరం పుస్తకానికి కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
   భరద్వాజ తన జీవితకాలంలో 140 వరకు రచనలు చేశారు. అందులో వివిధ సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. వీరు 400కు పైగా కథలు రాశారు. ఈయన రచించిన లెక్కలేనన్ని నవలల్లో పాకుడు రాళ్లు, కాదంబరి, ఇదం జగత్, కరి మింగిన వెలగపండు లాంటివి బాగా ప్రాచుర్యం పొందాయి.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు


1. రావూరి భరద్వాజకు చదువుపట్ల ఆసక్తి కలిగించిన సంఘటనను తెలపండి. 
జ: రావూరి భరద్వాజకు చిన్నప్పుడు జరిగిన ఒక అవమానం ఆయనకు చదువుపై ఆసక్తి కలిగేలా చేసింది. భరద్వాజ కంటే చిన్నవాడైన ఒక కుర్రాడు మనుచరిత్రలో ఉండే పద్యాన్ని అప్పగించాడు. అప్పుడు ఆ ఊరి లైబ్రరీ అరుగు మీద కూర్చున్న వారందరూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు. భరద్వాజ తండ్రికి మిత్రుడైన శేషయ్య భరద్వాజను ఆ కుర్రాడితో పోలుస్తూ తిట్టడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. ఆ నవ్వు ఆయనను గాయపరిచింది. ఆ గాయం భరద్వాజలో ఒక పట్టుదలను పెంచింది.
   భరద్వాజ పగలంతా కూలీ పని చేసి, రాత్రిపూట గ్రామంలోని శివాలయంలో వెలిగించే ప్రమిద వెలుతురులో చదువుకునేవారు. ఈయన గ్రామ లైబ్రరీలోని పుస్తకాలు తీసుకొని ఇంటి వద్ద చదువుకోవడానికి కొల్లూరు వేంకటేశ్వర్లు అనే దాత చందా ఇచ్చారు. ఈ విధంగా భరద్వాజకు చదువుపై ఆసక్తి కలిగింది.


2. రావూరి భరద్వాజ పెళ్లి సంబంధ వృత్తాంతాన్ని తెలపండి.
జ: భరద్వాజకు 20 ఏళ్ల వయసు దాటింది. అప్పటికే ఆ ఈడు పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. భరద్వాజకు తొందరగా పెళ్లి  చేయాలని ఆయన తల్లిదండ్రులు నాలుగైదు సంబంధాలు చూశారు. కానీ ఆయనకు ఆస్తిపాస్తులు, ఉద్యోగం లేవని, ఏ పనీ చేతకాదని ఇలా వేర్వేరు కారణాలతో పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట.
   ఇంతలో మేడూరు మల్లయ్య అనే వ్యక్తి తన కూతురును చూడటానికి తోటరావులపాడుకు రమ్మని చెప్పారట. భరద్వాజ తల్లిదండ్రులు, మేనమామతో కలిసి ఆ ఊరికి వెళ్లారు. భరద్వాజకు పెళ్లి కాదేమో అనే భయంతో మేనమామ అతడి ఆస్తిపాస్తుల గురించి ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పారట. భరద్వాజ నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నాడని, నెలకు 60 రూపాయల జీతమని వగైరా వగైరా చెప్పారట.
   భరద్వాజ పెళ్లికూతురు తండ్రి మల్లయ్యను మామిడితోటలో కలిసి తనకు ఉద్యోగం, పొలం లేవని  రెండు ఇళ్లు మాత్రమే ఉన్నాయని అసలు నిజాన్ని చెప్పారట. అప్పుడు పెళ్లికూతురు తండ్రి తనకు ఆ సంగతులన్నీ మునిమాణిక్యం చెప్పారని నిజం చెప్పిన భరద్వాజను మెచ్చుకున్నారట. భరద్వాజ పెళ్లికూతురిని చూడకుండానే 1948 మే 28వ తేదీన మల్లయ్య రెండో కుమార్తె కాంతంను వివాహం చేసుకున్నాడట.


3. పాకుడు రాళ్లు నవల గురించి రాయండి.
జ: రావూరి భరద్వాజ 1956లో మద్రాసుకు వెళ్లారు. అక్కడి మనుషులు, వాతావరణం నుంచి ఆయన చాలా పాఠాలు నేర్చుకున్నారు. మద్రాసులో వందల మంది రచయితలు, కవులు, పత్రికా సిబ్బందితో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఊహకు అందని అనేక సందర్భాలను ఆయన అక్కడ చవిచూశారు. వాటి ఆధారంగా ‘పాకుడు రాళ్లు’ అనే నవలను రాశారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు బాగా తెలిసిన వారి ప్రతిరూపాలే. దానిలోని సంఘటనలన్నీ ఆయనకు తెలిసినవారి జీవితాల నుంచి గ్రహించినవే.
   మనకు తెలిసిన రంగుల సినిమా ప్రపంచం వెనుక తెలియని అనేక దృశ్యాలు ఎన్నో ఉంటాయి. వాటన్నింటినీ  సజీవంగా పాకుడు రాళ్లు నవలలో చిత్రించారు. ఈ నవల రచనకు గానూ భరద్వాజకు 2013లో జ్ఞానపీఠ్‌ అవార్డును ఇచ్చి సత్కరించారు. 1965లో ఈ నవలను బాల్యంలో తన కోసం బాలభారతి గ్రంథాలయానికి చందా చెల్లించిన కొల్లూరు వెంకటేశ్వర్లు అనే మహాదాతకు అంకితం ఇచ్చారు.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు


1. పాకుడు రాళ్లు నవల రచయిత ఎవరు?
జ: 
పాకుడు రాళ్లు నవలను రావూరి భరద్వాజ రాశారు.


2. రావూరి భరద్వాజ భార్య పేరేమిటి?
జ: రావూరి భరద్వాజ భార్య పేరు కాంతం.


3. రావూరి భరద్వాజ రచించిన మొదటి కథ ఏది?
జ: రావూరి భరద్వాజ రాసి అచ్చయిన మొదటి కథ విమల.


4. రావూరి భరద్వాజ ‘కొత్త చిగుళ్లు’ అనే పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు?
జ: రావూరి భరద్వాజ కొత్త చిగుళ్లు అనే పుస్తకాన్ని చలంగారికి అంకితం ఇచ్చారు.


5. పాకుడు రాళ్లు నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారం ఏది?
జ: పాకుడు రాళ్లు నవలకు గానూ భరద్వాజకు వచ్చిన అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ అవార్డు.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 23-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Special Stories

More

విద్యా ఉద్యోగ సమాచారం

More
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌